తెలికడలి సుడులలో

    3
    6

    [box type=’note’ fontsize=’16’] విశ్వనాథ విరచిత రామాయణ కల్పవృక్ష కావ్యంలోని కొన్ని పద్యాల పరిచయం డాక్టర్ మైథిలి అబ్బరాజు సాహిత్య వ్యాసం తెలికడలి సుడులలో… [/box]

    వేసిన మునకసలు  లోతుగానే  కాదు. ఇవతలికి వచ్చిపడటంలో లౌకికం పనిచేస్తూనే ఉంది. ఆ కాసింత తడవటాన్నీ  చెప్పేసుకోవటం – ఇదొక ఔత్సాహిక వ్యవహారమంతేకాని… ఇక్కడ పాండిత్యం లేదు, ప్రకర్ష అంతకన్నాలేదు.

    శ్రీమద్రామాయణకల్పవృక్షం అణువణువూ రసవంతమే, ఆసాంతం అమృతమే.  నా పరిమితబుద్ధిననుసరించి  కొన్ని పద్యాలని ఎంచుకుంటున్నాను.  ఈ నమూనాలని చూశాక  అసలు కావ్యాన్ని సమీపించే ఆసక్తి ఒకరికి కలిగినా నాకెంతో సంతోషం.

    పద్యాలను, సులువుగా అర్థమయేందుకు గాను – సంధులు  విడదీసి రాస్తున్నాను. మన్నించాలి.

    విశ్వనాథస్వామికి అనేకానేక నమస్కారాలు.

    ***

    దశరథుని పుత్రేషణ

    లోకమ్ము వీడి రసమ్ము లేదు’‘ అని ప్రకటించినదానికి అనుగుణంగానే, కల్పవృక్షంలో – బిడ్డలు లేని దశరథుడు మీరూ నేనూ ఎప్పుడో ఎక్కడో చూసి ఉన్న ఒకానొక గృహస్తుగా, సంతతికి మొహంవాచినవాడుగా – కనిపిస్తాడు.

    విహారానికి వెళ్ళినప్పుడు – ఆ భూపతి, అయోధ్యావీధులలో ఎవరి పసిబిడ్డ కనిపించినా ఆగిపోతాడు. ఆ వైపే చూస్తాడు, నవ్వుతాడు. వాత్సల్యంతో ఎత్తుకుంటాడు. తినటానికేదో తెచ్చి పెడతాడు. (ఆ బిడ్డ తన చేతిలో నిలవక ఏడుపు మొదలెడితే) లాలిస్తాడు- ఆ పైన ఒక్క నిట్టూర్పు.

    మహారాజంతవాడు తన చేతులతో ”ఏ భక్ష్యములో తెచ్చి ఇస్తాడా” -కాకపోవచ్చేమోగానీ  తెచ్చేది ఎవరైనా ఆయన పనుపునే, బిడ్డ చేతికో నోటికో అందేది ఆయననుంచే.

    అంగళ్ళలో అమ్మేందుకు ఉంచిన ఆట బొమ్మలు ఆయన కంటనే పడుతుంటాయి. ఎవరో కొనుక్కుని ఇంటికి పట్టుకెళుతూంటే ఏదారిలోనో ప్రత్యక్షమయే ఊయల తొట్లూ, చిన్న పిల్లలు నవ్వుతూన్నట్లు గీసిన చిత్రపటాల మెరుగూ –  ఆయనకే కనిపిస్తాయి. చంటిబిడ్డ ఏడుపు వినిపిస్తే ఆ వైపుకే చెవి ఒగ్గుతాడు- కదిలిపోతాడు.

    మంత్రులో సామంతులో ఎవరైనా కొడుకులను వెంటబెట్టుకొని కొలువుకు వచ్చారా – రాచకార్యాలను అవతల పెట్టి ఆ కుర్రవాళ్ళతోనే కాలక్షేపం చేస్తుంటాడు.

    మ. అసివాళ్ళేగుచు ధారణీపతి అయోధ్యావీధి నే వర్ణపున్

           శిశువైనం కనిపించినన్ నిలిచి వీక్షించున్ హసించున్ కృపా

           వశుడై వానిని తీసి ఎత్తికొని ఏ భక్ష్యమ్ములో తెచ్చి ఇ

           చ్చు సమాశ్వాసన సేయి అంతటన పుచ్చున్ దీర్ఘ నిశ్వాసమున్.

    [అసివారు: విహారం. సమాశ్వాసము: ఊరడించటం]

    సీ.       అంగళ్ళలోన క్రయ్యంబులై ఇడిన శిశుశ్రేణి ఆట వస్తువులు చూచి

                ఏరైన కొని ఇంటికేగుచో దారిలోతోతెంచుఉయ్యెలతొట్లుగాంచి

                చిత్రపటంబులన్చిన్నిపిల్లలునవ్వుచున్నట్లువ్రాసినఒఱపులరసి

                ఎందైనపసిపిల్లలేడ్చుచున్నట్లువినిపించినచెవియొగ్గివినిచలించి .……

    [క్రయ్యము: అమ్మకానికి ఉంచినది. తోతెంచు: ప్రత్యక్షమవు, ఒఱపు: సౌందర్యం, కాంతి]

    గీ.     రాజపూరుషామాత్య తనూజులెవ్వ

            రైన తండ్రులతో సభకరుగుదెంచి

           నపుడు పతి రాజకార్యములట్టెపెట్టి

            వారితో కూడి కాలయాపనము చేయు .

    ***

    రోజురోజుకీ ఆ చింత ఎక్కువైపోయింది . ఆయన పరధ్యానం చూస్తున్న  మంత్రులందరికీ మనస్తాపం – అంతా కలిసి, కనుక్కొమ్మని అర్థరాత్రి వేళ సుమంత్రుడిని పంపుతారు. వారిద్దరి మధ్యనా ఎంత దగ్గరితనం ఉందో అప్పటి పద్యాలు చెబుతాయి.

    రాజు – ” ఏమిటీ వేళప్పుడు?”

    మంత్రి – ”మాకేం కావలసినా ఏ వేళనైనా మీ దగ్గరికే కదా వస్తాము? ”

    రాజు : ” నీకు కావలసినదేదో తీసుకోగల, చేసుకోగల స్వాతంత్ర్యం నీకు లేదా? నాకు చెప్పాలా? ”

    మంత్రి : ”మాకేం కావాలి, మీ దిగులు చూస్తే మా అందరికీ దిగులు – అదే మానాలి మీరు”

    క.        అని మంత్రి పలుక భూపతి

                యును నీకొక్కండు వలయునో అది అడుగన్

                నను వలెనో? నీ వలసిన

                దనుక ఎదురుచూడమికి స్వతంత్రత లేదే?

    క.        నీకేది వలయునో అది

                కైకొమ్మన నాకునేమి కావలయును మీ

                రీ కరణి దిగులు పొందుచు

                మాకు దిగులు కలుగసేత మాన్పగ వలయున్.

    దశరథుడు కూర్చున్నవాడు వంగిపోతాడు. కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.

    తెలుగింటి మాటలు వినిపిస్తాయి మనకి  ఇట్లా –

    “నడికట్టు వేసుకున్న భార్య పొత్తిళ్ళలో బిడ్డని అందిస్తే అందుకొనేందుకు, తొట్టెలో బిడ్డను చిటిక వేసి పలకరించి ఆ బోసి నవ్వుల బుజ్జిసొగసు చూరుకోగలందుకు, రా బాబూ ఇట్లా అని నవ్వుతూ పిలిస్తే ఎదురు వచ్చే నవ్వు సిరులకు ఉప్పొంగేందుకు, ఇంటికి రాగానే అడ్డం వచ్చి మోకాళ్ళకు చుట్టుకొంటే మురిసిపోయేందుకు – లోకంలో దంపతులు ఏ పుణ్యం చేసుకుంటారో!!! నేనంత నోచుకోలేదు. కోసల్యా సుమిత్రా కైకేయీ నోచుకోలేదు.”

    సీ.       ఇడి పొత్తికల భార్య నడికట్టుతో వచ్చి అందీయ పసిపాప నందుకొనగ

                చిటిక తో పల్కరించిన తొట్టెలో బిడ్డ బోసినవ్వుల చిట్టి హౌసు మఱుగ

                రా బాబు నీవిట్లు రాయని నవ్వుచు చేసాచ మార్నవ్వు శ్రీల కుబుక

                గృహము జేరినయంతనే కాళ్ళకడ్డమ్ము వచ్చి మోకాళ్ళుల ప్రాక నుబ్బ

     గీ.       తతసుకృతమేమి చేయు దంపతులు ధాత్రి

                నోచుకొందురొ, నేనింత నోచలేదు

                అల్ల కౌసల్య నోచలేదా సుమిత్ర

                నోచలేదు కైకేయియు నోచలేదు .

    సుమంత్రుడు అంటాడు – ”మీరు పుణ్యం చేయకపోవటమేమిటి? త్రయీ విద్య అర్థనిర్ణయ విధి, మీమాంస – మీ వంశీయుల రూపంలో తిరిగి తిరిగి చెప్పబడినాయి. వేదవిజ్ఞాన మహా శక్తికి కొత్తగా కొంత తమది చేర్చిన వారు మీరు. ధర్మం ప్రకారం సంచరించేందుకు అవసరమైన వివేకసంపదను మళ్ళీ మళ్ళీ స్మరించుకొనే నియమబద్ధమైన బుద్ధులు మీవి. పరమాత్మభావనను మీ అంతరాలలో నిలుపుకొన్నపవిత్రులు మీరు. మీ ఏలుబడిలో ఈ త్రేతాయుగం కృతయుగం లాగా ప్రకాశిస్తూ ఉంది. ద్వాపరం కొంత గడిచిన తరువాతి కథలు వేరే, ఇప్పుడు మనకు వాటితో పనిలేదు – ఇప్పట్లో ధర్మానికి ఏ కొరతా లేదు.

    రేపు నా తో రా, అయోధ్య అంతా చూపిస్తాను. మీ చేసిన పుణ్యం ‘గోతాలకెత్తవచ్చు’ – ఇదివరకు రాజుల ఏలుబడిలో ఇదివరకిట్లా ఉండిందా, కోసలదేశపు ప్రభ ఇంత బాగా వెలిగిందా  అనిపిస్తూంటుంది నాకైతే…’

    సీ.       ఇక్ష్వాకునృపులు త్రయ్యర్థ నిర్ణయ విధా మీమాంసలకును ఆమ్రేడితములు

                కాకుత్థ్స రాజులాగమ మహావిజ్ఞానశక్తి కధ్యాహార సముదయములు

                రాఘవుల్ ధర్మచరణ చారణ వివేకనిధికి పౌనఃపున్య నియతమతులు

                మాంధాతృవంశ భూమండలేశులుపరంజ్యోతిరంతర్భావ  శుద్ధమతులు

     [ఆమ్రేడితము: రెండుమూడు మార్లు చెప్పబడినది.

      అధ్యాహారము: లేని పదాలు  కొన్నిటిని తెచ్చుకోవటం

      పౌనఃపున్యము: మరల మరల చెప్పబడినది]

    ఇక్ష్వాకులు, కాకుత్థ్సులు, రాఘవులు, మాంధాతృవంశ భూమండలేశులు – ఇట్లా ప్రతి పాదంలో ఒక పూర్వరాజుపరంగా సంబోధన ఉండటం ఆ  సద్గుణాలు వంశం మొత్తానికీ  వర్తించటాన్ని సూచిస్తుంది.

    గీ.       తమ కతంబున త్రేత కృతంబు వోలె

                నూత్న ఖట్వంబు దీధితి నూలుకొల్పు

               ద్వాపరము కొంత గడచునప్పటి కథాళి

               త్రవ్వెద విదేల దశరథ రాజమౌళి

    [ఖట్వము: పర్యంకము, నూలుకొలుపు: ప్రేరేపించు, దీధితి: వెలుగు]

    క.        నాతో రా ! రేప అయో

                ధ్యా తీర్థము సేసివత్తమట ధర్మి ! భవ

                చ్చేతము చేసిన పున్నెము

                గోతమ్ముల ఎత్తికోనగున్ నరపాలా !

    క.        తొలిరేండ్ల ఏలుబడి కో

                సలములు మీ ఏలుబడి చను ఒఱపులతో

                వెలసినవొ ? నాకు మాత్రము

                నలువుగ మున్నిట్టులుండెనా ? అనిపించున్.

    [నలువు: ఒప్పిదము]

    ***

    అలాగే వెళతారు మరునాడు. అయోధ్య కళకళలాడుతూ పరమరమణీయంగా కనిపిస్తుంది. ‘అసలు’ అనే మాటని పదే పదే వాడతారొక పద్యంలో… దశరథుడి పరంగా అదొక నమ్మలేనితనాన్ని, తబ్బిబ్బవటాన్ని చెప్పేందుకు.

    ఆ వీధులు అసలెప్పుడూ అట్లాగే తీర్చిదిద్దినట్లు ఉంటాయా, మహారాజు వచ్చాడని ఇప్పుడు వికసించి ఉన్నాయా? త్రోవంతా ఎప్పుడూ అట్లాగే ఉంటుందా, ఇవాళే పువ్వులూ ముత్యాలతో కళ్ళాపి చల్లారా? ఆ తోరణాలు, వాటి కవాటాలు అట్లాగే పనిచేస్తాయా ఇప్పుడు కొత్తగా నిర్మించారా? అటూ ఇటూ ఆ మేడలు ముందే ఎత్తైనవా, మహారాజు ను చూసి పెరిగినాయా?

    ఎవరిని చూసినా ఆ రాజ్యం తమదేనన్నంత ఉత్సాహంతో ఉన్నారు. దూరం నుంచి రాజును చూసి చేతు లుకట్టుకొని వంగి నమస్కరిస్తున్నారు.

    ”తాను సవ్యంగానే పరిపాలిస్తున్నాడు, ప్రజలు సుఖంగా ఉన్నారు” – రాజుకు ధైర్యం వచ్చింది.

    సీ.        అసలు చక్కగ తీర్చిరా వీథులవనిపుండరు దెంచె నని యుబ్బి విరిసెనొక్కొ

                అసలట్లె యుండునా ఆ త్రోవ కలయంపి చల్లి పూల్ముత్యముల్ సల్లిరొక్కొ

                రాచబాటలను తోరణకవాటములట్లె మెలగునా క్రొత్త నిర్మించిరొక్కొ

                అటునిటు సౌధమ్ములసలున్నతంబులా పృత్వీశు గని అట్టె పెరిగెనొక్కొ ….

    గీ.       ఎవని చూచిన ఆ రాజ్యమెల్ల తనది

                అన్నటుల ఉత్సహింతురందున్న ప్రజలు

                దూరమున రాజుగన భక్తితో కరములు

                కట్టుచు తలవంచి నతులు వెట్టుచుంద్రు .

    ***

    అశ్వమేధం, ఆ పైన పుత్రకామేష్టి – నిర్ణయమైనాయి.

    నారాయణుడే దిగి వచ్చి కౌసల్య కడుపున పుడతాడనే అభివ్యక్తి మహాపతివ్రత  అరుంధతి నుంచి వస్తుంది.

    అప్పటి దశరథుడికి మహదానందం. కౌసల్యను వైభవంగా అలంకరించుకొని కనిపించమని చెప్పే ఆరాటం గొప్ప  విచిత్రంగా ఉంటుంది. హవిస్సును ప్రదానం చేసే వేళ ఆవిడ అదితీ దేవి లాగా దర్శనమిస్తే  శ్రీహరి ఆ తల్లి పైని లోభంతో అక్కడ నిలచిపోయి తమ కడుపున పుడతాడని. ఇటువంటి ఊహ విశ్వనాథ వారికి తప్ప మరొకరికి రాదు.

     ఉ. కన్నుల నత్తరుల్ కాటుక బెట్టుము ; పైడి చీరలె

          న్నెన్నియొ పెట్టె తీసి ధరియింపుము;నచ్చినవానినెల్ల క్రొం

         చెన్నుల భూషణాళి కయి సేయుము ; పూత హవిః ప్రదానవే

         ళ న్నిను చూడగా అదితి లాగున శ్రీహరి ఎంచగావలెన్

    క.       ఇపుడేమఱకుము హరి లో

                భపెట్టవలయు మనకడుపు పంట కతని రా

                క పదింతలు ఫలమిచ్చెడు

                సుపరీక్షిత మార్గమెల్ల చూడగవలయున్.

    ***

    యాగం నిమిత్తమై ఋష్యశృంగుడిని  తీసుకువచ్చే ఏర్పాట్లు మొదలైనాయి- అప్పటి చందమామను విశ్వనాథ వర్ణిస్తారు… మొత్తమంతా పసిపిల్లల పరంగా. ఆఖర్న, తెల్ల బట్టలు తొడిగిన రాజకుమారుడితో పోల్చి రాబోయే ఫలాన్ని రూఢి చేస్తారు. చంటిపిల్లల ముచ్చటా ఎదిగే పిల్లల అల్లరీ విశ్వనాథ వారికి ఎంత తెలుసో, ఎంత ఇష్టమో ..

    నీళ్ళుపోసి ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టిన పాపాయిలాగా, వీధుల్లో పడితిరిగి ఒళ్ళంతా బూడిద జల్లుకొని పరుగులు పెట్టే పసివాడిలాగా, అన్నం తింటూ తింటూ మొహమంతా పెరుగన్నం పూసుకున్న చిన్నారి లాగా , తలంటి పోస్తానంటే అందకుండా పారిపోయే తుంటరి లాగా, తెల్ల దుస్తులు కట్టి షికారుకు తీసుకొచ్చిన రాజ కుమారుడిలాగా – ఆకాశం మధ్యలోంచి జాబిల్లి – మహారాజు కళ్ళలోకి వెన్నెలలు పండించి  పోశాడు. పసిపిల్లల చంచలత్వపు సోయగమంతా, నింగిలో ఒక చోట నిలవని ఆ సుధాకరుడికి  ఆపాదించటం  ఇక్కడ. ఆ పైన జల్లుకున్న బూడిద – మబ్బులు కాబోలు.

    సీ.   ఒనర బోర్కాడించి ఉయ్యెలతొట్టెలో పండబెట్టిన పసిపాపవోలె

           వీధులంబడి తిర్గి బూదియ మైజల్లు కొని పర్వులంబెట్టు కుఱ్ఱ వోలె

           అన్నమ్ముతించుమోమంతబెరుగన్నమునుచేసికొన్నట్టిబొట్టెవోలె

           చిట్టి!తలంటిపోసెదనన్నఅందకతొలగిపర్వులుపెట్టుఉలిపివోలె

    గీ.        వెల్ల దుస్తులు కట్టించి వీధులన్ షి

                కారు పంపిన రాజకుమారువోలె

                మింట నడుచక్కి జాబిల్లి మేదినీశు

                నేత్రములకును చలువ పండించి పోసె.

    [బోర్కాడించు: (పసిపిల్లలకు) స్నానం చేయించు, ఉలిపి: తుంటరి]

    (బాల కాండము – ఇష్టి ఖండము)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here