Site icon Sanchika

తెలికడలి సుడులలో – 3

[box type=’note’ fontsize=’16’] విశ్వనాథ విరచిత రామాయణ కల్పవృక్ష కావ్యంలోని కొన్ని పద్యాల పరిచయం డా. మైథిలి అబ్బరాజు సాహిత్య వ్యాసం “తెలికడలి సుడులలో-3“. [/box]

[కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీ మద్రామాయణ కల్పవృక్షం నుంచి నా శక్తి మేరకు ఎంచుకొని తలచుకొంటున్న కొన్ని పద్యాలు. సులువు చేసేందుకు గాను కొన్ని చోట్ల విసంధి చేసి వ్రాయటం వలన గణ, యతి భంగాలు ఉండగలవు, మన్నించాలి.]

”[dropcap]నా[/dropcap] చేత వ్రాయించిన నా రాముడికి తెలుగు వచ్చునా?” అని చమత్కరించుకున్నారు విశ్వనాథ. రాముడికే కాదు, వాళ్ళ నాన్న దశరథుడికీ బ్రహ్మేంద్రాది దేవతలందరికీ తెలుగు వచ్చు. బ్రహ్మాండమైన తెలుగు. గుండెలుప్పొంగే నుడికారపు తెలుగు.

***

జటాయువు వచ్చాడట యజ్ఞానికి. దశరథుడికీ ఆయనకూ ఎప్పటిదో, గాఢ స్నేహం. ఎంత సంతోషించాడో, చూసి.

”నువ్వు జటాయువు వి, కాదూ? రా, రా ! ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నేను గుర్తొచ్చాను… నీకూ కబురు చెప్పారన్నమాట అయితే –  దిగి రా ఆకాశం నుంచి!! నువ్వు వచ్చావు, నా యజ్ఞం సఫలమైపోయింది. సుమంత్రుడే చెప్పి పంపి ఉంటాడు – సు ‘మంత్రుడు’ కదా!”

శా.

ఎన్నన్ నీవు జటాయువా ? సఖుడ ! రా ! యెన్నాళ్ళకెన్నాళ్ళకీ
నన్నున్ లోన దలంచినావు, కబురందజేసిరా నీకునున్
మిన్నున్ డిగ్గుము నీవు వచ్చితివి నా మేధంబు సాఫల్యమం
దు న్నీకున్ కబురంపుటన్ తగు సుమంత్రుండున్ సుమంత్రుండుగా.

పక్కనే దశరథుడు కూర్చుని భోజనం చేయిస్తాడు.

జటాయువు  అంటాడు – ”ఈ  వంక బెట్టి వచ్చానులే, ఎం… తదూరం మరి – నిన్ను చూడాలంటే! నీకు కొడుకులు పుడతారులే, నాకు కనిపిస్తారా? నన్ను వాళ్ళు గుర్తు పడతారా?” – ముక్కు కాస్త కిందికి వంచి  నవ్వుకున్నాడు.

మునికూనలు అన్నది ఇక్కడి సంబోధన. దశరథుడికి వయసు మీరిన తర్వాత పుట్టబోయే బిడ్డలు – వాళ్ళు తనను చూడవచ్చేప్పటికి తానింకా ముసలివాడవుతాడు … ఏం వస్తారో, ఏం గుర్తు పడతారో. అలా అనుకోవటమొక ముద్దు. (ముని వేషాల తోనే కద, కనిపించబోయేది)

ఉ.

ఈ మిష వెట్టి వచ్చితిని ఎంతటికెంతటి కెంత దూరమీ
భూమి నినున్ కనుంగొనగ , పుత్త్రులు కల్గుదురయ్య నీకు నే
నా మునుకూనలన్ కందునా ? ననుగొన్నను గుర్తుపట్టువా
రే!మఱి నీ కుమారులని ఇంచుక చంచువు వాల్చి నవ్వుచున్.

ఉండమని ఎంత బతిమిలాడినా వినలేదట. అసలు నేను రావటమే మీకు బరువు, ఇంకా ఉండటం కూడానా అని వెళ్ళిపోయాడట. రాజుకు కూడా కళ్ళనీళ్ళ పర్యంతమైందట. ‘కూడా’. జటాయువు కన్నులు ముందరే తడిసినట్లున్నాయి.

గీ.

ఉండుమని ఎంత బలవంతమో పొనర్చి
రాజు, మీ మానవులకు నా రాక యొకడె
వ్రేగు, నిలుచుట కాదని వెడలె నతడు
రాజునకును కన్నీళ్ళ పర్యంతమయ్యె.

ప్రాణమిచ్చి స్నేహం చేయటం విశ్వనాథ వారి ప్రవృత్తి. ఇందులోకి వచ్చింది.

***

యజ్ఞం పూర్తయింది. ఇక హోమాలో మరొకటో మిగిలాయి.అప్పటి దశరథుడి మనస్సు.

అదొక దినుసు – సుఖానికీ దుఃఖానికీ మధ్యది. ఆశకీ నిరాశకీ మధ్యది. ఆ భావం చేత గుండె కదలిపోయింది, కనుకొలకులలో నీరు నిండింది.

క.

ఒక దినుసుది సుఖ దుఃఖము
లకు మఱి ఆశా నిరాశలకు నడిమి ఒకా
నొక భావము చే పతి గుండె
కదలి కనుగొన కలంకు నిండె జలముచేన్.

ఋష్యశృంగుడు పుత్రకామేష్టిని ప్రారంభింపజేశాడు. అదీ సలక్షణంగా ముగిసింది. అగ్నిలోంచి, పాయస పాత్రతో ప్రాజాపత్య పురుషుడు ప్రత్యక్షమైనాడు-  ధగధగమంటూ.

 ఆ వెలుగు దిశలంతా నిండింది. అగ్ని ని మించి ప్రకాశించింది. దుఃఖానికి అంతమై, సర్వసుఖాలకూ నెలవై – చూసేవారి కన్నులకు మిరుమిట్లైంది.

క.

అంతట నవ్వెలుగు దిశా
క్రాంతమ్మై, అగ్ని కంటె కాంతమ్మై,
దుఃఖాంతమ్మై సర్వసుఖ
ప్రాంతమ్మై సర్వ దృగ్ధురాపటువయ్యెన్

[ సంక్రాంతము : వ్యాపించినది

 కాంతము : ప్రకాశము

 సర్వ దృక్ : అందరి చూపులకు

 ధుర : బరువు

 పటువు : శక్తివంతమైనది ]

***

ఇది ఇలా ఉండగా –

యజ్ఞపు హవిస్సులో తన భాగం కోసం విష్ణు మూర్తి దిగివచ్చాడు. తాపసి వేషంలో. శార్జ్ఞ్గ ధనువును ధరించి.

ధనుస్సు ను చీటికీ మాటికీ స్వామి పిలవడట-లక్ష్మీ దేవి  పైనే ధ్యాసతో ఉండిపోతాడట.

కౌమోదకీ నందక సుదర్శనాయుధాలు – ఏ పని పడినా ముందే చేసిపెట్టేస్తాయట.

అల్పులైన రాక్షసుల పని పట్టేందుకు తాను అవసరం కాలేదు – మరింకేదీ చేయలేని దానికే , తాను.

“ఎవడో మించిపోయిన రొష్టు కల్పించాడు, నన్నందుకే రమ్మని ఉంటాడు” అని గబగబా ఖంగుఖంగున మ్రోగుతూ కదలివచ్చిందట, స్వామి భుజానికి సరిగ్గా అమరేలాగా.

సీ.

కౌమోదకీ నందక సుదర్శనాయుధమ్ములు పనిదీర్చును ముందె పోయి
చీటికి మాటికి శ్రీ వరారోహా నివిష్ట చిత్తుడు తన్ను పిల్వ బోడు
అల్పదానవులు మున్నర్థించినట్టి వరంబులు తనదాక ప్రాకలేదు
తానన్న ఇతరాయుధములు చాలని అవసరముల కగు మహా సత్త్వశాలి

గీ.

మించిపోయిన రొష్టు కల్పించెనెవడు
స్వామికని అల్లెత్రాట వంచనిది కూడ
ఖంగు ఖంగున మ్రోగుచు కదలివచ్చె
స్వామి భుజలంబ మానమై శార్జ్గ  ధనువు.

[ వరారోహ : ఉత్తమ స్త్రీ

 నివిష్టము : లగ్నమైనది ]

ఆ తాపసి రూపమూ ఆ ధనుస్సూ రెండూ రాబోయేకాలపు దనుజవిజయాలకు అవసర సంకేతాలు.

చ.

తన బహుకల్పనిత్యమగు తాపసిరూపునవచ్చియున్న
శార్జ్ఞ్గిని తొలివెల్గుబొడ్డు బదరీవనిలో
ముదిచెట్టు క్రింది పచ్చనివెలుగౌచు
వచ్చుటను శార్జ్ఞ్గధనుశ్చటులోగ్ర
శృంగగుంఫనములులేనిచోగురుతు
పట్టియయుండరు సర్వదేవతల్.

వెనకటికెప్పుడో బదరీవనంలో పురాతనమైన రేగిచెట్టు కిందని పచ్చని వెలుగుగా – సరిగ్గా ఇట్లాగే , ఎన్నోకల్పాలనుండీ ఎప్పుడూ ఉండేరూపునతాపసిగా నారాయణ మహర్షి ని చూసి ఉండకపోతే, ఈ శార్ఞ్గధనువు సంరంభం కూడా ఇక్కడలేకపోతే – దేవతలకూగుర్తు తెలిసేదే కాదు.

యాగసం రక్షణ తనకు దీక్ష అయిన తొలి బ్రహ్మచారి వచ్చాడు. మొట్టమొదటి వేలుపు తాను వైకుంఠరాజ్యాన్ని వదలి మునిగా వచ్చాడు – లక్ష్మీపతి అయిన వాడు శివాకృతిని ఇష్టం గా ధరించి వచ్చాడు. అయినా మహాలంకార మూర్తి గానే వచ్చాడు, వరమిచ్చేందుకు దిగి ఇట్లా – ధర్మాన్నే చంకతాళి [ మునులు బుజానికి తగిలించుకొనే మూట ] గా ధరించి, ఆ ఎద పైన మహాలక్ష్మి లేకుండా వచ్చాడు.

అది తాపసి వేషం కనుక మహాలక్ష్మి లేదు. ముందు ముందు ఆవిడ ఉండకపోవటమూ  ఉంటుంది.

పచ్చలుపొదిగిన వైకుంఠ నగరపు గోడల కాంతుల నీడలలో ఇప్పుడు గనుక తననుతాను చూసుకుంటే – తనను తానైనా తెలుసుకోగలడా ? ఆ(మారు) వేషం అంత బాగా కుదిరింది.

శ్రీరామచంద్రుడికి తానెవరో తెలుసో, తెలియదో – దేవతలు గుర్తుపడతారుగాని.

అనురూప ‘మెసక మెసగె’లో – ధ్వనిగా ‘మసక మసక’ వినిపిస్తోందా..

సీ.

యాగ సం రక్ష దీక్షా గురు మూర్తి ఆ తొలి బ్రహ్మచారి ఉద్ధురత వచ్చె
మునిరూపమంది ఈ మొదటి వేలుపు దిట్ట వైకుంఠరాజ్యమ్ము వదలివచ్చె
ఈ శ్రీశమూర్తి ఆదృత శివాకృతి మౌని వరమహాలంకారి అరుగుదెంచె
ధర్మంబునే చంకతాళి గా గొని స్వామి ఎడద మహాలక్ష్మి విడుపు గాంచె.

గీ.

శ్రీ వికుంఠమహానగరీ మరకత
నిభృతకుడ్యాంశువుల తన నీడ జూచి
యిప్పుడీస్వామి తన్ను తానెరుగగలడొ
ఎరుంగ జాలడొ అనురూపమెసక మెసగె

[ ఉద్ధురత ; దిట్టతనము, నిలకడతనము

 నిభృతము : తీర్పబడినది

 అంశువు : కాంతి, కిరణము ]

***

ఆయనను చూసి అక్కడ చేరిన దేవతలకు ప్రాణాలు లేచి వచ్చాయి.

వింత వింతల విన్నపాలు మొదలు పెట్టారు.

మొదట ఇంద్రుడు.

”ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ రాకడ ను మర్చిపోలేను. ఉప్పెన గాలికి ఊడిపడినట్లు, కత్తి పిడితో స్వర్గపురి తలుపులను, తుప్పుపట్టి ఉన్నవాటిని లాగా పెడద్రోసి , నా సభ సుధర్మ లో చొచ్చి ఏం అల్లరి చేశాడనీ , త్రివిక్రమా!”

(ఇంద్రుడు చేసిన ఈ సంబోధనకు ఒక ఔచిత్యం ఉంది, ముందు తెలుస్తుంది)

”అప్పుడూ అప్పుడూ  శివతాండవాన్ని చూసి ఉండిన తెలివి అంతా తాను  చూపిస్తాడే, ఆ తీరు ఏం వెగటు పుట్టించిందని- పైపెచ్చు పది మొహాల్లోనూ పది రకాల నవ్వులు ! కోపమా  రాదు, నవ్వూ రాదాయెను , వాడట్లా వింతపశువు లాగా కదులుతూంటే .- ‘’

రావణుడి అఘాయిత్యాలన్నీ ఏకరువు పెడతాడు

ఉ.

ఇప్పుడటంచు కాదు కద ఎప్పటికిన్ స్మృతి నుండి పోద నాకు
ఉప్పెనగాలికి ఊడిపడెనో అన స్వర్గపురీ కవాటముల్
త్రుప్పుగ చేతికత్తి పిడితో పెడత్రోసి, సుధర్మ చొచ్చి, వాడు
అప్పుడు చేసినట్టిదగు అల్లరి చూడవలెన్ త్రివిక్రమా!

ఉ.

రేపులు మాపులున్ శివుని నృత్యము చూచిన తెల్వి అంతయున్
చూపుచు నిల్చును ఆ వెగటు చొక్కులున్ సురలోకనాథ పక్షా!
పదిమోములన్ పది రకంబుల నవ్వులు కాంచి నాకు అహో
కోపము రాదు నవ్వును ఒనగూడదు వింత మృగాకృతిన్ చనన్.

ఆఖరికి అంటాడు –

”ఈ చేత్తో నేను యజ్ఞభాగం తీసుకోలేను. తమ్ముడా, ఆ రాక్షసుల తలలు తెగవేస్తానని మాట ఇస్తే తప్ప”

వామనుడై పుట్టిన నాటి అగ్రజత్వాన్ని ఆపాదించుకొని దబాయించటం అన్నమాట.

క.

ఈచేత యజ్ఞభాగము
నా చేతను కాదు, కొనగ నా తమ్ముడ! నీ వా
చెనటి రక్కసు తలల్
రాచెదనని మాట ఇమ్ము రాజీవాక్షా!

[ చెనటి : కుత్సితుడు, క్రూరుడు ]

తక్కిన దేవతలూ గోలు గోలున మొర పెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మ వచ్చి క్షమాపణగా చెప్పుకుంటాడు – ”తత్ తపస్సునకు ఏను ఈయను పో వరములు అనగా చూడు, ఇంత వీలున్నదే?”

అయినా, వానరులూ నరులూ వరాల పరిధిలో లేరని గుర్తు చేస్తాడు. దశరథుడి కి కొడుకై పుట్టమంటాడు.

”ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పోడిమితో తళతళలాడుతూ కార్య నిర్వహణ చేస్తావు తండ్రీ, నీ సవరింపులు చూసి నేను చేయబోయే సృష్టిని చక్కదిద్దుకుంటాను”

క.

ఒక్కొక రూపంబున నీవు
ఒక్కొక బెళుకు సవరింతువు ఒగి కార్య విధా
ఫక్కిక పో ఈ సృజనన్
చక్కదనము నేర్తు నీదు సవరింపులలో.

[ ఒగి: క్రమముగా ]

అందరికీ ఉత్సాహం.

ఇంకేం !

”సొగసుల పంట అయిన చక్కని చిక్కని రాజకుమారుడు గా చూస్తాము నిన్ను. నీ శరాలచే హతులైన శత్రువులనూ చూస్తాము…

అందరూ నిద్ర పోయేవేళ వచ్చి, వంతులేసుకొని నిన్ను ఎత్తుకు ముద్దాడతాము.మా మనసులన్నీ నీవే అయి ఉండి కూడా,  ఎంతసేపటికీ మా కష్టాలు చెప్పుకోవటమే గాని నీ అందాన్ని కన్నులారా చూసి ఉన్నదెప్పుడు! నీ ఒంటినీ

మోమునూ ముద్దిడుకొన్న భాగ్యం ఎక్కడ!”

క.

అన లేఖర్షభుడిట్లనె
నిను చూతుము సొగసుపంట నేలకొరగు
చిక్కని చక్కని రా కొమరుని
సునిశిత శరహతుల రిపుల చూతుమును హరీ!

[లేఖర్షభుడు : ఇంద్రుడు ]

ఉ.

అందఱు నిద్రపోవునపుడు ఆత్మపతీ! చనుదెంచి వంతులుం
పొందుచు ఎత్తుకొందుమును ముద్దిడుకొందుము మా యెదల్ నినున్
చెందియు, అక్కటా! వినతి చే సరిపోయినదెన్నొ యేండ్లు నీ
అందము కన్నులున్ తనువును ఆస్యము ముద్దిడ నోచుకొంటిమే?

[ఆస్యము:ముఖము]

సాయం చేసేందుకు వానరులు రావాలి.

వాలి వాళ్ళకు రాజు. ఒకనాడు వాలి రావణుడిని గెలిచి ఉన్నాడు, ఇప్పుడు ముందే శరణు జొచ్చితే రావణుడికి సాయం చేసే అవకాశం ఉంది – ఎట్లా?

సుగ్రీవుడున్నాడుగా. అతనికి మంత్రిగా –

అతడొక్కడూ చాలడా? ఒక వంద వాలి మేఘాలగుంపులను పవనుడై చెదరగొట్టగల పావని. రాక్షసులను ఎదిరించటంలో ఆ సత్బ్రహ్మచారి మనవైపే ఉంటాడు. సాక్షాత్ పరమేశ్వరుడు. అఖండమైన మేధ గలవాడు. తొమ్మిది వ్యాకరణాలూ చదువుకున్నవాడు, అధ్యయనపరులకు తలమానికమైనవాడు. పవిత్ర మనస్కుడు. మోక్షమనే అశోకాన్ని అన్వేషించగలవాడు… అమ్మవారి ఆవాసాన్ని, అశోకాన్ని – అన్వేషించటం మోక్షాన్ని వెతకటం. ఆ అధ్యయనంలో అందరికీ ఆయన చూడామణి – ఆవిడ నుంచి  చూడామణిని అందుకుంటాడు

చాలడూ?

క.

ఒక వంద వాలి మేఘ
ప్రకరములకు పవనుడైన పవనసుతుడు
తప్పక మనలచేరు దానవ
నికారమున బ్రహ్మచర్యనిష్ఠుడు ప్రభువై.

[ప్రకరము : సమూహము

 నికారము : తిరస్కారము ]

క.

ఆ కపి పరమేశ్వరుడు
అస్తోక మనీషా పయోధి శుద్ధిమతు నవ
వ్యాకరణ వేత్త మోక్షా
శోకాన్వేషణుడు అధీతి చూడామణియున్.

[ అస్తోకము : అనల్పము

 మనీష; మేధ

 అధీతి: అధ్యయనము, అధ్యయనము చేసినవాడు]

 అంతా ఏర్పాటవుతోంది.

***

అప్పుడిక –

పురాతనపు పాము తనకు పానుపు కాగా, వందారే మౌనుల నడుమ  హాయిగా మైమరచి పవ్వళించేవాడు

వేదాలకు చిట్ట చివరన , రాక్షసులను పారద్రోలే కటారి

ప్రాచీనమైన మఱ్ఱి చెట్టు కింద వృద్ధులైన మునులచేత పాఠాలు చదివించే కుఱ్ఱవాడు

పాలకడలి అలల పైన వెల్లకిలా తేలుతూ తన కాలి వేలును  చీకే శిశువు

పచ్చనై పండి గాలికి రాలిపడిన నలుసు – నీవారపు ముల్లు అంత వెలుగు

స్థూలమై సమీపించి సూక్ష్మమైపోయి

రాజు చేతి పాయసం లో ప్రవేశించాడు.

సీ.

ముది పృదాకువు సెజ్జ మునులు జోదిళ్ళీయ హాళి మై కూర్కు సుమాళి ఒకడు
ప్రామిన్కు చిట్ట చివళ్ళలో అసురుల దోరించునట్టి కటారి ఒకడు
ప్రామఱ్ఱి క్రీనీడ పాఠమ్ము ముసలులౌ మునులచే చదివించు పోరడొకడు
పాలవెల్లి కరళ్ళపై వెలికింతలై కాలి వ్రేల్చీకేడు కందొకండు.

గీ.

పసిమియై గాలికి రాలిపడిన ఒక్క
నలుసు నివ్వరి ముల్లైన వెలుగొకండు
స్థూలమై వచ్చి వచ్చి సూక్ష్మమగుచు
జనపతి కరస్థమగు పాయసమున చొచ్చె.

[పృదాకువు: పాము

 జోదిళ్ళు: నమస్కారాలు

 హాళి: ఆనందము, ఉత్సాహము

 సుమాళము: పారవశ్యము , సుమాళి : పరవశించినవాడు

 ప్రామిన్కు: వేదము

 నివ్వరి ముల్లు: పరమాత్మను నీవార ధాన్యపు ముల్లు [నీవార శూకము] అంత సూక్ష్మమైనవాడుగా చెబుతారు.]

క్షీరసాగరతరంగాలో మహాలక్ష్మీ వక్షస్థలమో ఆదిశేషుడి దేహమో  – తూగే శయ్య …

చల్లని వెన్నెలల జాలో వ్యాపించే ఎండల వాలో భగ్గుమనే మంటల డాలో – చూపుల కాంతి..

వేదాల చివరలో అధికాధిక సృష్టికి  మొదలో అచ్చమైన జ్ఞానలహరులో – అసలు స్వరూపం..

దేవతల మీది మక్కువా  దైత్యులకు  గారడి నా  పూనుకొన్న లీలాహేలా –  రాక కు కారణం  …

వైకుంఠం లోనా మౌనీంద్ర హృదయాలలోనా తన దహరాకాశం లోనా – నివాసం …

చిత్ ను, ఆనందాన్ని మించిన సత్ – అతడు ( సత్త్వగుణరూపుడు )

రాజు చేతి పాయసం లో ప్రవేశించాడు.

సీ.

క్షీరాబ్ధి తరగలో శ్రీ పయోధరములో తొలిపాము పొలసులో, తూగు శయ్య
చలువ వెన్నెల చాలో మలయు ఎండలవాలొ అగ్గి మంటల డాలొ నిగ్గు చూపు
ప్రామింకుల చివళ్ళొ బహుళ సృష్టి మొదళ్ళొ అచ్చతెలివి కరళ్ళొ, అసలు మూర్తి
తెఱగంట్ల హాళికో దితిజాళి మోళికో పట్టిన కేళికో, వచ్చునటన.

గీ.

ఇల్లు వైకుంఠమందొ మౌనీంద్ర హృదయ
మందొ తన దహరాకాశమందొ ఐన
చిత్తును ఆ నందమును మించు సత్తొకండు
జనపతి కరస్థమగు పాయసమున చొచ్చె.

[తెఱగంట్లు: దేవతలు

హాళి : ఆసక్తి

మోళి : గారడి

వచ్చునటన : 1.వచ్చును + అటన

2.వచ్చు నటన

దహరాకాశము: హృదయ కమలంలో ఉన్న చిదాకాశం]

{బాల కాండము – ఇష్టి, అవతార ఖండాల నుంచి}

Exit mobile version