తెలివైన పసుపుపచ్చ కోడిపిల్ల

0
2

[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గరచేయాలనే ఉద్దేశంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)

~ ~

పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box]

గ్రుడ్డు పై పెంకు అతితక్కువ స్థాయిలో శబ్దం చేస్తూ నెమ్మదిగా చిట్లుతూ ఉంది. తన చిట్టి తల బయటకు పెట్టి తొంగి చూస్తూ ఒక పసుపుపచ్చని కోడిపిల్ల గుడ్డులోనుంచి బయటకు దూకింది. దాని వెనుకనే మరో ఆరు కోడిపిల్లలు కూడా నెమ్మదిగా వాటి వాటి గుడ్లలో నుండి బయటకు వచ్చాయి. తల్లిపెట్ట తన ఏడుగురు బిడ్డలను చూసుకుని మురిసిపోయింది. తల్లిపెట్ట తన పిల్లలకు తిండి పెట్టేటప్పుడు, తిండికోసం బయటకు తీసుకువెళ్లేటప్పుడు కూడ ఎంతో జాగ్రత్తగా ఉండేది. పిల్లలను తమంతట తాముగా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దని పదే పదే చెబుతూ ఉండేది.

కోడిపిల్లలు అన్నింటిలో పసుపుపచ్చని పిల్ల చాలా నెమ్మదైనది, తెలివైనది; అంతేకాక, ఎప్పుడూ తల్లి మాట జవ దాటకుండా ఉండేది. అయితే మిగిలిన ఆరింటిలో ఒక కోడిపిల్ల చాలా తుంటరిది, అల్లరిది. అది ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉండేది. పసుపుపచ్చ కోడిపిల్ల ఆ తుంటరి పిల్లను అలా వెళ్ళవద్దని హెచ్చరిస్తూ ఉండేది. అప్పుడు తుంటరి పిల్ల ‘అమ్మతో చెప్పకు, సరేనా’ అంటూనే తాను వెళ్ళాలనుకున్న వైపు వెళ్తూనే ఉండేది! మిగిలిన పిల్లలన్నీ తల్లి వెనుకనే తిరుగుతూ ఏమి దొరికితే అది తింటూ ఉండేవి.

ఒకరోజు ఉన్నట్లుండి చాలా పక్షులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అరుస్తూ అటుగా వచ్చాయి. వాటి భయానికి కారణం ఒక గ్రద్ద అటుగా వచ్చింది. చిన్న పక్షులను ఎత్తుకుపోయి తినటం దాని అలవాటు కదా. మన తుంటరి కోడిపిల్లను అది చూడనే చూసింది. దాన్ని తన ముక్కున కరచుకొని ఎత్తుకు పోవాలని  ప్రయత్నించింది. కాని పక్షులు గోల చేయటం వల్ల దాన్ని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన తుంటరి కోడిపిల్ల అవస్థలు చూడాలి! పరుగు పరుగున వెళ్లి తన తల్లిని హత్తుకుని భయంతో బిగ్గరగా ఏడుపు మొదలు పెట్టింది. తల్లిపెట్ట ఎంతో జాగ్రత్తగా, ఆర్తిగా దాన్ని తీసుకువచ్చి మిగిలిన పిల్లల దగ్గర దింపి “ఒంటరిగా వెళ్ళొద్దన్నానా? ఇప్పుడేమీ భయంలేదులే” అని తుంటరి పిల్లను అనునయించి, “ఎప్పుడైనా సరే, మీరందరూ కలసి మెలసి ఉండాలి, సరేనా” అని మిగిలిన పిల్లలకు చెప్పింది. కాలం గడుస్తూ ఉన్నది. క్రమంగా కోడిపిల్లలన్నీ పెరిగి పెద్దవవుతూ ఉన్నాయి.

త్వరలోనే తల్లిపెట్ట మరికొన్ని గ్రుడ్లను పెట్టబోయే సమయం వచ్చింది. పెద్ద పిల్లలన్నీ తమ తమ్ముళ్లు, చెల్లాయిల కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నాయి. కోడిపెట్ట యజమాని పేరు శ్యామ్. ఒక రోజు వాళ్ళ ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు. తల్లిపెట్ట, పిల్లలు ఉన్నచోటికి శ్యామ్ వాళ్లను తీసుకువచ్చి చూపించాడు. వాళ్ళు ఆ తల్లిపెట్టను చేతుల్లోకి తీసుకుని కొంత దూరం వెళ్లి బాగా పరిశీలించారు. తరువాత శ్యామ్ గారి కోళ్ల షెడ్డు దగ్గరకు వచ్చి ఆ పెట్టను అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు.

తల్లి కోడిపెట్టకు ఇది చాలా దుఃఖం కలిగించింది. మన పసుపుపచ్చ కోడిపిల్ల తల్లి దిగులుగా ఉండటం గమనించి కారణమేమిటని తల్లిని అడిగింది. తల్లిపెట్ట “ఇప్పుడు వచ్చిన వాళ్ళు రెండు రోజులలో నన్ను ఇక్కడి నుంచి తీసుకు వెళ్లిపోతారు. ఇంక ఆ తరువాత నేను మిమ్మల్ని ఎవరినీ చూడలేను కదా” అని జవాబిచ్చింది. అయితే పిల్లలు ఎవరికీ కూడా వచ్చిన వాళ్ళు ఎవరో, తమ తల్లిని వాళ్లు ఎందుకు తీసుకువెళ్తారో అర్థం కాలేదు.

తల్లిపెట్టకు ఆ రాత్రంతా నిద్రే లేదు. మరునాటి ఉదయం మన పసుపుపచ్చ కోడిపిల్ల శ్యామ్ గారి భుజం పై ఎక్కి కూర్చుని తమ తల్లిని ఇక్కడి నుండి ఎందుకు పంపించి వేయాలని అనుకుంటున్నారో చెబుతారా అని అడిగింది. దానికి జవాబుగా శ్యామ్ “ఈ మధ్యకాలంలో మీ అమ్మ మంచి గ్రుడ్లను పెట్టటమే లేదు. అలా నాణ్యత లేని గ్రుడ్లను ఎవరూ కొనటానికి ఇష్టపడరు కదా! అందుకే మీ అమ్మను నేను వేరే వాళ్లకు అమ్మివేస్తున్నాను” అని చెప్పాడు.

శ్యామ్ చెప్పిన మాట విన్న పసుపుపచ్చ కోడిపిల్ల కొంతసేపు ఆలోచనలో పడిపోయింది. అంతలో శ్యామ్‌ని పిలిచి ఇలా అన్నది – “మా అమ్మ శరీరంలో క్యాల్షియం(సున్నం) చాలా తక్కువగా ఉన్నది. అందుకే ఆమె మంచి గ్రుడ్లను పెట్టలేక పోతున్నది. మీరు కనుక ఆమెకు క్యాల్షియం మాత్రలు తెచ్చి తినిపిస్తే త్వరలోనే ఆమె పుష్టికరమైన మంచి గ్రుడ్లను పెట్టగలదు. ఏమంటారు?” ఈ మాటలు విన్న శ్యామ్ ఎంతో సంతోషించి తల్లిపెట్టకు క్యాల్షియం పూరక మాత్రలు ఇవ్వడానికి అంగీకరించాడు.

తల్లిపెట్ట తన పసుపుపచ్చ కోడిపిల్లను చూసి దాని సమయస్ఫూర్తికి, తెలివితేటలకు ఎంతగానో గర్వపడింది. శ్యామ్ తెచ్చి ఇచ్చిన క్యాల్షియం పూరక మేతను తింటూ తల్లిపెట్ట త్వరలోనే ఆరోగ్యం పుంజుకుని మంచి నాణ్యమైన గ్రుడ్లు పెట్టసాగింది. అలా ఆ కోడిపెట్ట తన పిల్లలతో సంతోషంగా కలసిమెలసి సుఖజీవనం సాగించింది.

ఇలా పసుపుపచ్చ కోడిపిల్ల తన తెలివితేటలతో తల్లిని కాపాడింది.

గమనిక:- మన పసుపుపచ్చ కోడిపిల్ల సహజంగా చాలా చురుకుదనం, తెలివితేటలు కలది.  అందుకే వాళ్ళ అమ్మను అది ఎప్పుడూ ఏవేవో ప్రశ్నలు అడుగుతూ, తన సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఉండేది.  ఆ ప్రశ్నలు ఎలాంటివంటే – ఈ ప్రపంచం ఎందుకింత పెద్దదిగా ఉంది? భూమి గుండ్రంగా ఉంటుందా? మనం ఎందుకు ప్రపంచమంతా తిరిగి రావాలి? – ఇలాంటి ప్రశ్నలు అడిగేది.

అంతేకాదు పసుపుపచ్చ కోడిపిల్లకు మంచి ధారణ శక్తి కూడా ఉన్నది. ఒకరోజు అది తమ పక్క ఇంటివాళ్లు వాళ్ళ నాయనమ్మకు బలం కోసం, ఆరోగ్యంగా తిరగడానికి క్యాల్షియంతో నిండిన ఆహార పదార్థాలను పెట్టటం గమనించింది. అప్పుడే దానికి తన తల్లికి కూడా క్యాల్షియం భరిత ఆహారం పెడితే ఆమె ఆరోగ్యం కుదుటపడి శక్తిమంతురాలై మంచి బలమైన గ్రుడ్లను పెట్టగలదన్న ఆలోచన తట్టిందన్న మాట. చూశారా!  తెలివితేటలతో పసుపుపచ్చ కోడిపిల్ల తల్లిని ఏ విధంగా కాపాడగలిగిందో?

మూలం: ఉమయవన్ రామసామి

తెలుగు: వల్లూరు లీలావతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here