Site icon Sanchika

తెల్లకోటు – నల్ల మరక

[box type=’note’ fontsize=’16’] అద్భుతమైన ప్రతీకలతో అనంతమైన ఆలోచనలను కలిగిస్తూ సమకాలీన సామాజిక వ్యవస్థలో మనిషి ‘మనీ’ తప్ప మనిషిగా మిగలడం లేదన్న సత్యాన్ని ప్రదర్శించే సలీం గల్పిక ‘తెల్లకోటు – నల్ల మరక’. [/box]

నేను అతీంద్రియ శక్తుల్ని నమ్మను. కానీ ఓరోజు అనుకోకుండా నాలో ఓ శక్తి ఉందని అర్థమైంది. మనసుని కేంద్రీకరించి నా ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తే చాలు… అతని శరీరంలోని అంతర్భాగాలైన గుండె, వూపిరితిత్తులు, కాలేయం లాంటివి స్పష్టంగా కన్పిస్తాయి. ఈ విషయం నా మిత్రుడు ప్రకాష్‌ని కలిసినప్పుడు మొదటిసారిగా నాకు అవగతమైంది.
ప్రకాష్ మావూళ్ళో బాగా పేరున్న టైలర్. ఓ రోజు పిచ్చాపాటి మాట్లాడుకోవటం అయ్యాక, “నెలకు పైగా కడుపునొప్పితో బాధపడ్తున్నారా. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు” అన్నాడు.
“కడుపునొప్పా” అంటూ యథాలాపంగా అతని కడుపువైపు చూశాను. ఆశ్చర్యం… నా కళ్ళకు అతని జీర్ణాశయం, కాలేయం, పాంక్రియాస్… అన్నీ కన్పించాయి. కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ప్రకాష్‌కి కూడా… చెప్పినా నేను జోక్ చేస్తున్నానని కొట్టి పడేస్తారు తప్ప నమ్మరని తెలుసు.
“మంచి డాక్టర్‌కి చూపించుకోరా” అన్నాను నా విస్మయాన్ని నాలోనే దాచుకుంటూ.
“అందుకే రేపు హైద్రాబాద్ వెళ్తున్నారా. సాయంత్రం బస్‌కి… అక్కడ మన యాద్గిరి ఉన్నాడుగా. పెద్దాసుపత్రికి పిల్చుకెళ్ళి చూపిస్తానన్నాడు”
చాలా మంచి నిర్ణయమనిపించింది. యాద్గిరి నాలుగేళ్ళుగా హైద్రాబాద్‌లో పండ్లవ్యాపారం చేస్తున్నాడు. సిటీలో అతనికి పరిచయాలు బాగానే ఉన్నాయి.
హైద్రాబాద్ వెళ్ళిన ప్రకాష్ వారం తర్వాత తిరిగొచ్చాడని తెల్సింది. పనుల వత్తిడివల్ల అతన్ని వెంటనే కల్సుకోవటం కుదరలేదు. మూడు వారాలు పోయాక అతనింటికెళ్ళాను.
మనిషి బక్కగా… నీర్సంగా ఉన్నాడు. హైద్రాబాద్ వెళ్ళక ముందే నయం. ఇపుడు మరీ అధ్వాన్నంగా ఉన్నాడు… జబ్బు పడ్డవాడిలా…
“ఏంట్రా ఇలా అయిపోయావ్?”అన్నాను ఆశ్చర్యంగా.
“ఏదో చిన్న ఆపరేషన్ చేస్తే నయమౌతుందన్నారు. సరేనని చేయించుకున్నా. కానీ నొప్పి తగ్గలేదురా. నిస్సత్తువ… ప్రాణం అస్సలు బాగోలేదురా” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
పొట్ట దగ్గర నాలుగంగుళాలమేర కోసి కుట్లు వేశారట. చూపించాడు… కొద్దిగా నిశితంగా చూశా. కడుపులోని అవయవాలు కన్పించసాగాయి. నిశ్చేష్టుడినై చూస్తూ ఉండిపోయా… రెండు కిడ్నీలు ఉండాల్సిన చోట ఒకే కిడ్నీ ఉంది.
అతనికీ విషయం చెప్పకుండా డాక్టర్ దగ్గరకు పిల్చుకెళ్ళా. స్కానింగ్ చేసి ఒకే కిడ్నీ ఉందనీ, మరో కిడ్నీ మాయమైందని చెప్పారు.
ప్రకాష్ లబోదిబో మన్నాడు.
ఆ కిడ్నీ దొంగ ఎవరో కనుక్కుని పోలీసులకు పట్టిచ్చే వరకు విశ్రమించకూడదని ప్రతిజ్ఞ చేసి మరునాడు యిద్దరం హైద్రాబాద్ బయల్దేరాం. యాద్గిరిని కల్సుకుని అడిగితే “నాకేం సమఝౌత లేదుబయ్. గాంధీ దవాఖాన్ల షరీక్ చేసిన. జల్దీ రమ్మని ఫోనొస్తే నక్రేకల్ ఎల్లిన. తిరిగొచ్చి ఉరుక్కుంట దవాఖానకెల్లిన. గాడలేడని, ఏడ్కెళ్ళి ఏడో తెల్వదని చెప్పిండ్రు. గంతే” అన్నాడు.
ప్రకాష్ మొదట గాంధీ ఆస్పత్రిలో చేరాడట. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి “ఇక్కడైతే నీ జబ్బు నయం కాదు. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు. చిటికెలో నీ జబ్బు నయం చేస్తాడు” అని నమ్మించి, ఆటోలో పిల్చుకెళ్ళి మరో హాస్పిటల్లో చేర్పించాడట. ఆపరేషన్ కూడా అక్కడే చేశారని చెప్పాడు.
“ఆ ఆస్పత్రి పేరేమిటి?”
“ఏమో గుర్తు లేదు. ఎటొచ్చీ అది చాలా పెద్ద బిల్డింగ్ అని గుర్తుంది” అన్నాడు ప్రకాష్.
“డాక్టర్ ఎవరో తెలుసా?”
“తెలీదు”
చాలా పెద్ద బిల్డింగ్ అన్నాడు కాబట్టి అది తప్పకుండా కార్పొరేట్ ఆస్పత్రి అయి ఉంటుందనుకున్నా. ఓ ఆటో మాట్లాడుకుని హైద్రాబాద్ మహానగరంలో ఆ ఆస్పత్రి ఏదో వెదికి పట్టుకునే ప్రయత్నంలో మొదట బాగా పేరున్న ఓ కార్పొరేట్ హాస్పిటల్ కెళ్ళాం.
లోపలికెళ్ళాక “బాగా చూడు. గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించు. ఇదే ఆస్పత్రా… డాక్టర్లను కూడా జాగ్రత్తగా పరిశీలించు. ఎవరయినా గుర్తుపట్టగలవేమో” అన్నాను ప్రకాష్.
మాకెదురుగా ఓ డాక్టర్ వస్తూ కన్పించాడు. తెల్లటి దుస్తుల్లో… దేవదూతలా… అతనివైపు నిశితంగా చూశాను. చప్పున అతని శరీరంలోని అంతర్భాగాలు కన్పించసాగాయి. అతనికి గుండె ఉండాల్సిన చోట ఖాళీగా ఉంది. ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. గుండె లేకుండా ఈ డాక్టర్ ఎలా బతికి ఉన్నాడు? ప్రకాష్ కిడ్నీని ఎవరో దొంగిలించినట్లు ఇతని గుండెని కూడా ఎవరైనా దొంగిలించారేమో! పాపం ఈ డాక్టర్‌కి తెలుసో లేదో?
నాక్కనిపించిన ముగ్గురు నలుగురు డాక్టర్లదీ అదే పరిస్థితి. గుండె ఉండాల్సిన చోట ఖాళీ… అంటే ఇదేదో పెద్దఎత్తున జరుగుతున్న రాకెట్లా ఉంది. కిడ్నీ రాకెట్ గురించి పేపర్లలో చదివాను. కానీ గుండె… ఇంత మంది డాక్టర్ల గుండెలు దొంగిలించి ఏం చేసుకుంటారో… విదేశాలకి గుట్టు చప్పుడు కాకుండా గుండెల్ని ఎగుమతి చేస్తున్న ముఠా పనై ఉంటుంది.
“ఈ ఆస్పత్రి కాదనుకుంటాను” అన్నాడు ప్రకాష్
మరో ఆస్పత్రికెళ్ళాం. అక్కడా అంతే. నా కెదురుపడిన డాక్టర్లకు గుండె ఉండాల్సిన చోట ఖాళీగా ఉంది.
ఇంకో ఆస్పత్రికెళ్ళాం. ప్రకాష్ డాక్టర్ల మొహాలు గుర్తుపట్టే పనిలో బిజీగా ఉన్నాడు. నాకెదురుగా వస్తున్న ముసలి డాక్టర్ని నిశితంగా చూశాను. షరా మామూలే. గుండె లేదు. ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని అతన్ని ఆపి కబుర్లలోకి దింపాను.
“సార్. మీరు చాలా పెద్ద డాక్టర్లా ఉన్నారు” అన్నాను వినయంగా.
అతను హుందాగా నవ్వి”అవును. చాలా సీనియర్ డాక్టర్ని” అన్నాడు.
అతనితో చెప్పేముందు ఎందుకైనా మంచిదని నిర్ధారించుకోడానికి మరోసారి చూశాను. అనుమానం లేదు. గుండె గాయబ్…
“సార్. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మీకో విషయం చెప్పాలి” అన్నాను.
“పర్లేదు చెప్పు”
“మీ గుండె నెవరో దొంగిలించారు” ఏదో జోక్ విన్నట్లు పెద్దగా నవ్వాడతను.
నాకు తెలుసు… నామాటల్ని ఎవరూ నమ్మరని.
“నిజంసార్. మీ గుండెనే కాదు. నేను చూసిన కార్పొరేట్ హాస్పిటళ్ళలో నాక్కనిపించిన డాక్టర్లందరి గుండెలూ దొంగిలించబడ్డాయి. నమ్మండి సార్. వాళ్ళకు గుండె ఉండాల్సిన చోట గుండె లేదు సార్”
అతను మరోసారి పెద్దగా నవ్వి నా వైపు “ఓరి అమాయకుడా’ అన్నట్లు చూసాడు. “నాకు తెలుసు” అన్నాడు గంభీరంగా.
ఆశ్చర్యపోవటం నా వంతయింది. “తెలుసా? తెలిసీ ఎలా వూరున్నారు సార్? పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి. దొంగలెవరో తెలిసిపోతుంది” అన్నాను.
అతను విలాసంగా నవ్వాడు. “మేం డాక్టర్లం. కిడ్నీలు తీసేసినా, లివర్లు కోసేసినా అది మాకే సాధ్యం. మేం ఉండగా మా గుండెల్ని దొంగిలించేంత ధైర్యం ఎవరికుంది?”
“మరి మీ అందరి గుండెలు ఏమైపోయాయి?”
“మేమే పీకేసుకుని గోతిలో పాతిపెట్టేశాం”
“అలానా… ఎందుకు సార్?”
“ఎందుకేమిటి… పిచ్చోడిలా ఉన్నావే. హృదయం అనేది ఉంటే ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా డబ్బులెలా సంపాయించగలం? కార్పొరేట్ హాస్పిటళ్ళలో మా డాక్టర్లందరూ అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసి… అనవసరమైన టెస్టులన్నీ రాసి… చాంతాడంత మందుల చిట్టా చేతికిచ్చి… పేషంట్ల భయాన్ని సొమ్ము చేసుకుని… ఐసీయూ రూముల్ని ఎప్పుడూ నిండి ఉండేలా జాగ్రత్త పడ్తూ… రెండు చేతులా లక్షలకు లక్షలు సంపాయించ గలుగుతున్నామంటే ఆ గుండె లేకపోబట్టే కదా” అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
ప్రకాష్ తిరిగొచ్చి” డాక్టర్లందరూ ఒకేలా ఉన్నార్రా. ఇందులో నా కిడ్నీని దొంగిలించిందెవరో చెప్పటం కష్టం” అన్నాడు.
నాకు భయమేసి, ప్రకాష్ చేయి పట్టుకుని వేగంగా బైటపడ్డా. ఆటోలో కూచుని మా వూరేళ్ళే బస్ కోసం బస్టాండ్ వైపుకు వెళ్తున్నప్పుడు నన్ను నేను చూపుల్తో తడిమి చూసుకున్నా. నా గుండె, కిడ్నీలు నాదగ్గరే భద్రంగా ఉన్నాయి. ఎంతదృష్టం…

Exit mobile version