[dropcap]చి[/dropcap]నుకుల మిన్ను, మురిపెపు మన్ను
తటిల్లతల నల్లమబ్బు నీటి కుండల గగనం,
నవ్వినా ఏడ్చినా మనుగడ ప్రశ్నార్థకం
ఒక పుట్టుకలా మేఘం కరిగి నీరైనప్పడు
ఇప్పటకిప్పుడు కట్టగట్టుకొని ఆశాతీరం
చేరే నావల మౌతాం.
వదలని బుద్ధి, తరగని సిద్ధి
అంతర్మధన సందేహ సందోహం.
పచ్చని తివాచీపై ఎండుచెట్టులా
రైతు ఒక సజీవ చిత్రం.
నీలి తెరపై శ్వేతాంబుధం శూన్యపుష్పం
కంటిచుక్కల కొనగోటి క్రీడాబీజం.
ఆ చేతుల చెమట , ఆ పనితనపు
దరువులు పంటనిచ్చినప్పడు ,
అవనితనం అమ్మదనంలా ఆస్వాదిస్తూ
ఆకాశతేజాన్ని నాన్న ప్రేమగా ఆహ్వానిస్తూ,
గంతలు పక్కకుతీసి, మనోనేత్రాన్ని సారిస్తే, ఒక్క నిజం తోచు!
ఎప్పటికప్పుడు వారాంతాల విశ్రాంతులు ఎరుగక
సూరీడు ఒళ్ళువిరవక ముందే
తాను కళ్ళు తెరచి
పొద్దు చుక్కవోలె, కోడికూతవోలె
ఒక్కో దృశ్యాన్ని హృదయ సెజ్జలోనింపి
అస్త్ర శస్త్ర సమేతుడై పొలాల పొడిచే పొద్దవుతాడు.
ఒంటరితనాన్ని లెక్కచెయ్యని సైనికుడౌతాడు.
గంట గంట లెక్కింపుల జీతమెత్తని
భూపుత్రుడుగా కడుపులు నింపుతాడు.
ప్రాణంచావని ఎండుచెట్టులా కనిపించినా ,ధరణిమాత మొలకెత్తిన
ప్రతిసారి ధర్మజీవిగా దర్శనమిస్తాడు.
***
పత్తి ఎత్తుల తికమకలు విసిరేసి,
వరి గరి గీసుకున్నా దాటేసి, తెల్లమబ్బు
నవ్వవుతాడు.
అతని మనుగడే ప్రశ్నార్థకం అయినప్పుడు ,
సమస్తలోకం ఆకలితో అలమటించక తప్పదు.
అతడే లేని పక్షాన అమ్మలేని పాపాయిలా అవక తప్పదు!