Site icon Sanchika

తెలుగైన స్వగతం

[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘తెలుగైన స్వగతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

తెలుగును ప్రేమిస్తాను
జీవన సహచరిగా భావిస్తాను
తేనెలొలుకు తెలుగు మాట్లాడుతాను
కమ్మని తెలుగు పాటలు పాడుతాను
తేట తెలుగు పదాల చిరు సవ్వడులు వింటాను
వాటిలో సరిగమల రాగాలు ఆవిష్కరిస్తాను
తెలుగులో కలలుకంటాను నవ్వుతాను దుఃఖిస్తాను
హాహాకారాలు చేస్తాను ప్రగల్భాలు పలుకుతాను
ఆలోచనలు ఆవేశాలు అనుభూతులు పంచుకుంటాను

తెలుగు చెయ్యి పట్టుకుని
మనుష్యుల మనస్సుల్లోకి తొంగి చూస్తాను
అంతరంగాలను అర్థం చేసుకుంటాను
తెలుగులో నన్ను నేను వెతుక్కుంటాను
నా సుఖదుఃఖాలను అన్వేషిస్తాను

తెలుగు సాహిత్యాన్ని అక్కున చేర్చుకుంటాను
మానవ జీవితాగాధాలను శోధిస్తాను
వైవిధ్యభరిత జీవితాలను చిత్రిస్తాను
ప్రపంచానికి దగ్గరవుతాను

తెలుగు నా తృష్ణ
తెలుగు నా ఊపిరి
జీవనానంద లహరి
పరుగులెత్తే సజీవ వాహిని
అనుబంధాల వెన్నెల వెలుగు

Exit mobile version