తెలుగమ్మాయి

1
1

[dropcap]ఒ[/dropcap]కానొక పల్లెటూరులో కోటయ్య, వర్ధనమ్మ అనే దంపతులుండేవారు. వారు చాలాకాలం పాటు పిల్లల కోసం పూజలు చేస్తూ పరితపించిపోయారు. వారికి పెళ్ళయిన పదమూడేళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. మధ్యతరగతి కుటుంబీకులైన వారు తమ పిల్లలకు శ్రీలక్ష్మి, చంద్ర అని పేర్లు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.

చంద్ర చిన్నపిల్ల వాడు కావడంతో గారాబంగా చూసుకునేవారు. పదేళ్ళ వయసు వచ్చేంతవరకు అతనికి తల్లిపాలు ఇచ్చింది వర్ధనమ్మ. పిల్లలిద్దరు చక్కగా చదువుకునేవారు. శ్రీలక్ష్మి ఐదవ తరగతికి వచ్చింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావుగారు ఐదవ తరగతి చదివే పదకొండు మంది పిల్లలను నవోదయ పరీక్షకు ఎంపిక చేసి సిద్ధం చేశారు. వారిలో శ్రీలక్ష్మి కూడా ఉంది. ఎప్పుడూ శ్రీలక్ష్మికే ఎక్కువ మార్కులు వచ్చేవి. గణితం బాగా వచ్చిన శ్రీహరికి, శ్రీలక్ష్మికి పోటీ జరుగుతూనే ఉండేది. దాంతో ఉపాధ్యాయులందరు వీరిద్దరికి నవోదయ ప్రవేశం దొరుకుతుందని భావించేవారు.

కానీ శ్రీలక్ష్మికి మాత్రమే నవోదయలో ప్రవేశం లభించింది. దాంతో తనని నవోదయ పాఠశాలలో చేర్పించారు తల్లిదండ్రులు. కానీ తను అమ్మానాన్నలకు దూరంగా ఉండవలసి రావడంతో దిగులు పెట్టుకుంది. అమ్మానాన్నలపై బెంగ, తోటి వారితో సరిగా కలుపుగోలుగా ఉండడం అలవాటు లేకపోవడంతో చదువులో వెనుకబడింది. దానికి తోడు ఆంగ్లమాధ్యమం కూడా కష్టంగా తోచేది తనకి. దాంతో పదవ తరగతిలో రెండవశ్రేణి ఉత్తీర్ణతను మాత్రమే పొందగలిగింది.

ఆ పాఠశాలలో విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన చదువు ఉండేది. కావున శ్రీలక్ష్మిని మరో జిల్లా నవోదయకు పంపుతామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. తమ కుమార్తెను మరో జిల్లాకు చదువుకోసం పంపడం ఇష్టంలేక కోటయ్య దంపతులు తమ కుమర్తెను తమ ఊరికి తీసుకొచ్చుకొని తమ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించారు. అక్కడ ఆంగ్ల మాధ్యమం లేకపోవడంతో శ్రీలక్ష్మి తన చదువును తెలుగు మాధ్యమంలోనే కొనసాగించింది. జూనియర్ కళాశాలలోని ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు మంచి మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది.

ఆ తర్వాత ఆమెకు పెళ్ళిచేసి అత్తవారింటికి పంపించేశారు. అంతటితో తన చదువుకు అంతరాయం ఏర్పడింది. జీవితంలో ఏర్పడ్డ ఈ మార్పుకు శ్రీలక్ష్మి తలవంచింది. కానీ ఆమెలో చదువుకోవాలనే కోరిక మాత్రం తగ్గలేదు. కానీ దైనందిన జీవితానికి అత్తారింట్లో ఒదిగిపోయింది. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. వారిని చక్కగా చూసుకుంటూ తన ఆశను తనలోనే దాచుకుంది.

వారిరువురిని పాఠశాలలో చేర్పించాక శ్రీలక్ష్మికి బోలెడంత ఖాళీ సమయం దొరికింది. తన భర్త సహకారంతో దూరవిద్యలో చదువు కొనసాగించింది. తెలుగు పండిట్ కావాలనే కోరికతో పరీక్ష వ్రాసి రాష్ట్రంలోనే పదకొండవ స్థానంలో నిలిచింది. దాంతో ఆమెకు ప్రభుత్వ కళాశాలలో సులువుగా ప్రవేశం దొరికింది. ఒక సంవత్సరం పాటు అక్కడ తెలుగు పండిట్ శిక్షణ పొంది తెలుగు ఉపాధ్యాయురాలు అగుటకు అర్హత సాధించింది. వెనువెంటనే ప్రకటించబడిన ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి జరిగిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా ఎంపికయింది. ఆమె కల నెరవేరింది.

ఎందరో బీద విధ్యార్ధులకు చదువు చెప్పే అవకాశాన్ని, వారిని తీర్చిదిద్దడంలో ఉండే సంతృప్తినీ ఆమె పొందుతోంది. చిన్నవయసులోనే పెళ్ళయి బాధ్యతలు నెత్తిన పడ్డప్పటికీ తన కోరికను విడిచిపెట్టకుండా కష్టపడి చదువుకుని తనకు నచ్చినట్టుగా తెలుగు పండిట్‍గా సేవలందిస్తోంది శ్రీలక్ష్మి.

ఆమె సారధ్యంలో మరెందరో తెలుగమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకుని ఎందరికో స్ఫూర్తిదాతలవుతారని ఆశిద్దాం! మన తెలుగు భాష తియ్యదనాన్ని మన చిన్నారులందరికీ పంచిపెడదాం! తెలుగులో వ్రాయడం, చదవడం మన పిల్లలందరూ నేర్చుకునేలా మాతృభాష ప్రాముఖ్యాన్ని చాటి చెపుదాం. జై తెలుగు తల్లి అని ఎలుగెత్తి చాటుదాం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here