తెలుగు దంపతులు

1
3

[dropcap]నా[/dropcap]కు అధ్యాత్మికత అంటే ఏం తెలియదు. కాని ఎందుకో ఈ పూజలు, పునస్కారాలు, ప్రవచనాలు, గురువులు, అవి నిర్వహించే సంస్థలు అంటే ఇష్టం. ఆ ఇష్టాన్నీ సేవగా మార్చుకున్నాను. దానినే ఉపాధిగా మలుచుకున్నాను. ఎక్కడ ఏ అధ్యాత్మిక సంస్థకు కేటరింగ్ కావాలన్నా, ఏ భజన ట్రూప్ వాళ్ళకి ఎరేంజ్ చేయాలన్నా, ఇతరత్రా ఏ అవసరలకయినా సుమారుగా నన్ను సంప్రదించే గుడ్‌విల్ సంపాదించుకున్నాను. అందుకే చాలా మంది భక్తులకు, సేవా సంస్థలకు దేవాలయాలకు నేను తెలుసు. అది నాకు ఆనందం కలిగించే విషయం. నా అదృష్టంగా కూడా భావిస్తాను. అంతరాంతరాళ్లో ఎక్కడో నాకు కూడా భక్తి ఉంది. ఆ భక్తిని ప్రకటించడం ఈ విధంగా చేసుకొమ్మని దేవుడు నిర్ణయించి ఉంటాడు.

నాంపల్లిలో క్రిష్ణాష్టమి రోజు ఇస్కాన్ పక్క సందులోంచి నడిచి వస్తుండగా విజయలక్ష్మి, నారాయణరావు దంపతులు కనిపించారు.

“నమస్తే సార్ బాగున్నారా?”

“బాగున్నాం. నువ్వు బాబు?” అడిగాడు నారాయణరావు.

“నాకేంటి సార్. ఆ కృష్ణుడి దయవలన అంతా ఓ.కె”

“అందరిని ఆ పరమాత్మే చూడాలి.”

“ప్రసాదం తీసుకున్నారా? వెళ్లిపోతున్నారు!”

“తీసుకున్నాం ప్రసాద్. మరి నువ్వో”

“నాకు ఇంకా టైముంది. వేరే చోటుకి వెళ్లాలి”

“సరే బాబు. వస్తాం” అంటూ వెళ్లిపోయారు వాళ్లు.

అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు వీళ్లు. ఒకసారి పరిచయమైన తరువాత ఎవరినైనా పలుకరించకుండా ఉండలేను. నేను పరిచయమైన తరువాత వాళ్లు నన్ను పలుకరించకుండా ఉండరు. ఇటీవల కాలంలో భక్తి బాగా పెరిగింది. భక్తులు పెరిగారు. కాని కష్టాలు ఎంతవరకు తీరుతున్నాయో ఆ దేవుడికే తెలియాలి.

***

దసరాకి కనకదుర్గమ్మ ఉత్సవానికి విజయవాడ వెళ్లాను. అక్కడ మా బంధువు ఒకాయన ఉన్నాడు. పేరు రామారావు. అతడు కూడా నాలాగే అధ్యాత్మిక సేవలో ఉంటాడు. నా కంటే ఎక్కువ పని చేస్తాడు. నా కంటే ఎక్కువ భక్తిగా ఉంటాడు. అన్నదానాల విషయంలో సేవ చేయడానికి రమ్మంటే వెళ్లాను. చాలా బాగా ఉత్సవాలు జరిగాయి. రామారావు సంపాదించిన దాంట్లో నాకూ కొంత ఇచ్చాడు. ఈ అధ్యాత్మికత సేవ జీవనోపాధిగా జరుగుతున్నాయి.

“వస్తానన్నా.. ఈ సారి ఏదైనా అవసరముంటే ఫోను చెయ్యి” అని బయల్దేరుతూ చెప్పాను.

“అలాగే ప్రసాద్. చాలా సహాయం చేసావు. అమ్మవారి అనురాగం దొరికింది మనకు” అన్నాడు రామారావు ఆనందంగా.

“అంతేలే అన్నా. ఎక్కడకదే సంతోషం. వస్తా” అంటూ ఆలయంలోంచి వస్తూ బయటకు అడుగు పెట్టాను. ఎదురుగా చూసిన ముఖాలు… ఎవరా అనుకుంటే

“ఏం ప్రసాద్? ఎప్పుడొచ్చావు?” అంటూ నారాయణ రావు పలుకరించాడు.

“బాగున్నావా?” అని విజయలక్ష్మి గారు.

“బాగున్నాను మేడమ్.. మీరు ఎప్పుడొచ్చారు!”

“ఈ వారం రోజులు ఇక్కడే ఉన్నాం. ఈ దగ్గర్లోనే మా స్వంత ఉరు ఉంది.”

“అలాగా.. అయితే అక్కడే ఉంటున్నారా?”

“లేదు. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు.”

“మరెక్కడ ఉంటున్నారు”

“ఇక్కడ ఆలయం దగ్గర్లోనే రూము తీసుకున్నాం”

“మంచిది. మాడకు ఉంటున్నారా?”

“ఈ రోజు రాత్రికే బయల్దేరుతున్నాం”

“నే నిప్పుడే బస్సుకు బయల్దేరుతున్నాను”

“అయితే హైద్రాబాదులో కలుసుకుందాం”

“అలాగే సార్. వస్తా” అనుకుంటూ బయల్దేరి పోయాను.

భక్తులకు భగవంతుడు ఎలా తిప్పుకుంటుంటాడో ఆశ్చర్యం. నిజంగా మనసు దేవుడు మీద మళ్లిన వాళ్లకి ఈ తీర్థయాత్రలు పూజలు తప్ప ఇంకొక ముఖ్యమైన విషయం ఉంటుందా? వీళ్ళు అలాగే కనిపిస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో పంథా.

***

కార్తీక మాసం…

శివారాధన జరుగుతోంది. శివాలయాలు కిట కిటలాడి పోతున్నాయి. ఎక్కడ చూసినా శివభక్తులే. శివుడు ఆనందంగా శివతాండవం చేస్తున్నాడని పూజారులు రుద్రాభిషేకం చేస్తున్నారు. పంచాక్షరి జపిస్తున్నారు. శివస్తోత్రం చేస్తున్నారు.

మాకు ఖాళీ లేదు. ఎక్కడ చూసినా అన్న సమారాధము. నిత్య అన్నదానాలు. నగరమంతా భక్త జన సందోహం. నాలుగు రూపాయలు వచ్చే సమయం. నేను అటూ ఇటూ, తిరుగుతూ అష్టావధానం చేస్తూ ఉన్నాను.

నేను సికింద్రాబాదు దగ్గర శివాలయంలో భక్తులకు ప్రసాదం పంచుతుండగా కుర్చీలో కూర్చుని కనిపించారు నారాయణరావు, విజయలక్ష్మిగార్లు.

“ప్రసాద్! మళ్లీ కలిసామయ్యా! వెరీ గుడ్. నీ చేతి ప్రసాదం లేకుండా ఆలయం లేనట్లుంది” అన్నాడు నారాయణరావు.

“రుద్రాభిషేకం చేయించారా?” అడిగాను నేను.

“లేదు మామూలు పూజే చేయించాం”

“అలాగా. సంతోషం”

“భక్తులు రాన్రాను పెరిగి పోతున్నారు. పొద్దున వచ్చాం. ఇప్పటికి పూజ అయింది. మరి రుద్రాభిషేకం సంగతి చూడాలి”

“మధ్యాహ్నం రెండు గంటలు దాటుతుంది చూడండి”

“అంతే. అంతే”

“వస్తాం బాబు. మళ్లీ కలుద్దాం” అంటూ వాళ్లు వెళ్లిపోయారు. నా పనిలో నేను పడిపోయాను.

***

బ్రహ్మకుమారీస్ వారి ఓంశాంతి కేంద్రం గచ్చిబౌలిలో చాలా గొప్పగా ఉంటుంది. ఎంతో మంది అక్కయ్యలు అన్నయ్యలు అక్కడకు వచ్చి ఓంశాంతి ధ్యానం చేస్తారు. పచ్చటి చెట్ల మధ్య పెద్ద పెద్ద భవనాలలో పెద్ద ఆడిటోరియంలో ఇతరత్రా ఏర్పాట్లలో సందర్శకులు వస్తూ ఉంటారు.. వెళ్తూ ఉంటారు.

శివరాత్రి రోజు కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. నేను క్రమం తప్పకుండా అన్ని ప్రదేశాలకు వెళ్తున్నట్లే అక్కడికి వెళ్తాను. మురళి సందేశం ఎవరో అన్నయ్య వినిపిస్తే వింటాను. కొంచెంసేపు ధ్యాన చేసుకుంటాను. అక్కడ కూడా నాకు ఏదైనా సేవ చేసే అవకాశం లభిస్తే వదులుకోను.

ఆ రోజు నేను ధ్యాన మందిరం నుంచి బయటకు వస్తుండగా ఒక కారు వచ్చి ఆగింది. నాకు దగ్గర్లోనే. అందులోంచి దిగారు ఇద్దరు. వాళ్లు నారాయణ రావు, విజయలక్ష్మి గార్లు.

వాళ్లని చూడగానే నవ్వుతూ “నమస్తే సార్” అన్నాను.

“నమస్తే ప్రసాద్. ఏంటి వెళ్లిపోతున్నావా?”

“ఇంత వరకు ఉన్నాను. మీరు ఆలస్యం అయినట్లున్నారు”

“కూకట్‌పల్లి నుంచి రావాలి, ట్రాఫిక్ కదా!”

“అవును ట్రాఫిక్‌లో చాలా కష్టం”

“నువుంటావా? ఇప్పుడే వెళ్లి పోతావా?”

“కొంచెం సేపు ఉంటాను”

“నీ కేటరింగ్ అదీ లేదా?”

“లేదండి. వాళ్లకి స్వయంగా కిచెన్ అదీ ఉంది”

“అలా అయితే అవసరం లేదు”

“కాని అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటే అన్నయ్య పిలుస్తారు”

“సరే. మేం వచ్చేవరకు ఉంటే కార్లో వెళ్లిపోదాం.. ఉంటావా?”

“లేదండీ. నేను వెళ్తాను”

“సరే. నీ ఇష్టం”

“ఓకె. మేడమ్. నమస్తే”

అక్కడ నుంచి బయల్దేరాను. ఎవరి తాపత్రయం వాళ్లది. ఏదో సాధిద్దామని. ఈ అధ్యాత్మికతలో ఎంతవరకు ఏం ముఖ్యమో తెలియదు కాని తిరుగుళ్ళు మాత్రమే ఎక్కువయి పోయాయి. ఎక్కడో ఒక దగ్గర ఉండాలని ఎవరూ అనుకోరు. ఏదో ఒక పద్ధతి అనుకుని, దానిని పట్టుకుని ఉండరు. అటు ఇటు తిరుగుతారు. ఈ నారాయణరావుగారు ఆయన వైఫ్ అలాగే కనిపిస్తున్నారు.

***

తిరుమల కొండ మీద వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న రామ్ బగీచా అతిధి గృహంలో మా స్నేహితులకి రూము ఇచ్చారు. వాళ్ళు దర్శనంకు వస్తుంటే నన్ను తీసుకొచ్చారు. రమ్మనమని బలవంతం పెడుతుంటే వచ్చాను.

నేను ఎప్పుడు తిరుపతి వచ్చినా గుండు తీయించుకోకుండా వెళ్లను. గంటన్నర క్యూలో నిలుచుని శిరోముండనం చేయించుకున్నాను. తరువాత స్నానం చేసి, రూము బయటకు వచ్చాను. ఖాళీ కడుపుతో దర్శనానికి వెళ్లాను. ఏమైనా తిని వెళదామని రెస్టారెంటులోకి దూరాను. టిఫిన్ అయిపోయి బయటకు వస్తుంటే నారాయణరావు దంపతులు కనిపించారు.

“ఏంటి ప్రసాదు. నువ్వు తిరుపతికి వస్తున్నట్లు మాకు చెప్పలేదే” అన్నారు.

“అనుకోకుండా వచ్చాను సార్” అన్నాను నవ్వుతూ.

“మేం కూడా అలా అనుకుని అలా బయల్దేరాం. దర్శనానికి ఎంత సమయం పడుతుందో”

“పడుతుందిలెండి. వి.ఐ.పి. దర్శనాలు తగ్గించారు”

“అవును పేపర్లో చూసాం”

“టిఫిన్ తినడానికి వెళ్తున్నారా?”

“అవును. గుండులో నిన్ను గుర్తు పట్టడం కష్టమే”

“అందుకే మిమ్మల్ని చూసి ఆగాను”

“సరే దర్శనం తరువాత కలుద్దాం. ఎక్కుడుంటున్నావ్?”

“రామ్ బగీచా గెస్ట్ హౌస్ పక్కనే”

“మాది నారాయణాద్రి. ఇక్కడకు దూరం”

“వీలైతే కలుద్దాం సార్. వస్తా”

“సరే”

వాళ్లు రెస్టారెంటులోకి వెళ్లిపోయారు. నేను దర్శనానికి బయల్దేరాను. ఇలా నాకు వాళ్లు, వాళ్లకి నేను కన్పించడం విచిత్రం అనిపించినా సహజమే. ఒకే దృష్టి ఉన్న వాళ్లు ఎదురవుతూ ఉంటారు. నమ్మిన వాటికోసం తిరుగుతూ ఉంటారు.

***

“శిరిడిలో ద్వారకామాయి దగ్గరలో అఖండ నామ సంకీర్తన. మేం వెళుతున్నాం. నువు వస్తావా?” ఎవరో సాయి భక్తులు అడిగారు.

శిరిడి అంటే నాకు చాలా ఇష్టం. సాయిబాబా అంటే ప్రాణం. అందుకే వెంటనే చెప్పాను “వస్తాను..” అని.

గురు పూర్ణిమకు శిరిడిలో ఉన్నాను. ఏం వైభవం. ఎక్కడ చూసినా సాయికి సంబరాలే. అంబరాన్ని అంటే నామ సంకీర్తనలు, హారతులు. సాయి ప్రసాద్‌లో రూము ఇచ్చారు. ధూళి దర్శనం పూర్తి చేసుకున్నాను. అందరము కలిసి సాయంత్రం ద్వారకామాయి దగ్గర భజనలో పాల్గొనడానికి వెళ్తుంటే యథావిధిగా నారాయణరావు, విజయలక్ష్మి కనిపించారు.

“సాయిరాం సార్” పలుకరించాను.

“సాయిరాం. ఎప్పుడొచ్చావు ప్రసాద్?” అడిగారు నారాయణ రావు.

“ప్రతి సంవత్సరం గురుపూర్ణిమకు వస్తుంటాను”

“మేం కూడా వస్తుంటాం. కాని క్రిందటి సంవత్సరం రాలేక పోయాం. అమెరికాలో ఉండి పోయాం”

“అలాగా? అమెరికాలో మీ పిల్లలు ఉన్నారా?”

“అవునండి”

“హారతికి వెళ్లారా?”

“హారతి అవలేదు. దర్శనానికి వెళ్లాం. రాత్రి హారతికి వెళ్దామని అనుకుంటున్నాం”

“ఎక్కడుంటున్నారు?”

“నారాయణాశ్రమంలో రూమ్ తీసుకున్నాం”

“రాత్రి హారతికి నేనూ వస్తాను”

“పదండి భజనకి వెళ్దాం”

భజన మొదలైంది. అందరమూ భజనలో పాల్గొన్నాం. సాయి భజన ఎంతో భక్తిగా ఆనందంగా అద్భుతంగా జరిగింది.

***

ప్రముఖ జ్యోతిష్కుడు హరిహరశర్మ నాకు దూరపు బంధువు. అతడు చిక్కడపల్లిలో ఉంటాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కూతురుకి పెళ్ళి అవడం లేదు. ఏదో దోషం ఉందట. అది కనుక్కుందామని అతడిని అతడి కూతురిని తీసుకుని హరిహరశర్మ దగ్గరికి చిక్కడపల్లి వెళ్లాను.

లోపల శర్మ ఎవరితో ఏవో విషయాలు చెబుతున్నారు. మేం బయట వెయిట్ చేస్తున్నాం. కొంత సేపైన తరువాత నారాయణరావు. విజయలక్ష్మి బయటకు వస్తూ కనిపించారు.

“ఏంటి మీరిక్కడ?” అడిగాడు నారాయణరావు ఆశ్చర్యపోతూ.

“హరిహరశర్మ నాకు కజిన్ బ్రదర్” అని చెప్పాను.

“అలాగా. మేం అప్పుడప్పుడు ఇక్కడకి వస్తుంటాం”

లోపలికి వెళ్లే హడావుడిలో ఉండటం వలన “సరే సార్. కలుద్దాం” అని చెప్పి లోపలికి వెళ్లాను.

నా పని అయిపోయాక “ఆ నారాయణ రావు, విజయలక్ష్మి గార్లు నాకు తెలుసు” అన్నాను నేను శర్మతో.

“తెలుసా? వాళ్లది ఓ విచిత్రమైన పరిస్థితి” అన్నాడు హరిహరశర్మ.

“ఏమిటి” అన్నాను నేను ఆశ్చర్యంగా.

“వాళ్లకి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. అక్కడ సెటిల్ అయిపోయారు. ఇంతకు ముందు వీళ్లు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు వెళ్లటం లేదు. వెళ్లే అవసరం లేదు అని వీళ్లు అంటూ ఉంటారు. మొదట్లో పురుళ్లు, పుణ్యాలకని వెళ్లేవారు. ఇప్పుడు వెళ్లటం లేదు. ఎందుకంటే ఇద్దరి కొడుకులకు సిటిజన్‌షిప్ వచ్చేసింది. అయితే వీళ్ల బాధంతా ఏమిటంటే వాళ్ల పిల్లలు, పిల్లల్ని పూర్తిగా తెలుగు తెలియకుండా మన సంస్కృతితో సంబంధం లేకుండా పెంచుతున్నారని. ఇంతకు ముందు కనీసం ఫోన్లోనయినా మాట్లాడేవారట. ఇప్పుడు ఆ పని కూడా చెయ్యటం లేదట. అసలు కొడుకులే వీళ్ళతో మాట్లాడటం తగ్గించేసారట. అమెరికా వచ్చేయమంటారట. అక్కడ మేం ఉండలేం అంటూంటారు వీళ్లు. వీళ్ల బాధంతా మనుమలు మనుమరాళ్ల గురించే. పుట్టిన భారత దేశం, తెలుగు గడ్డ మర్చిపోయి, తల్లిదండ్రులను వదిలిపెట్టి శాశ్వతంగా అక్కడే ఉండిపోవటం, తెలుగు మర్చిపోవటం వీళ్లకి బాధ కలిగిస్తోంది. వచ్చిన ప్రతిసారి కళ్ల నీళ్లు తిప్పుకుంటారు. మా జాతకాలు ఏమిటి ఇలా మారిపోయాయి? ఇంతేనా ఇక మేం అని వాపోతూ ఉంటారు. వాళ్లకి ఏం సమాధానం చెప్తాం? రాబోయే కాలం బాగుంటుందని ఒక ఆశాజనకమైన విధంగా నాలుగు మాటలు చెప్పి పంపిస్తూ ఉంటాను….”

“వాళ్లు చాలా ఆధ్యాత్మిక ప్రదేశాలకు తీర్థయాత్రలకు తిరుగుతుంటారు. మంచి భక్తులని నేను అనుకుంటున్నాను”

“మనశ్శాంతి లేక అలా తిరుగుతూ ఉంటారు. నిజానికి వాళ్లకి కావలసినది పిల్లల ఆదరణ. మనుమలు, మనుమరాలు తెలుగులో సంభాషించటం. అది ఇక ముందు సాధ్యపడవని వాళ్లకి తెలిసి పోయింది. ఈ రోజు వెక్కి వెక్కి ఏడ్చారు.”

“చాలా మంది పరిస్థితి అలాగే ఉంది కదా”

“కొందరు ఏదో విధంగా జీవితాన్ని నెట్టుకొస్తారు. వీళ్లు నెట్టుకోలేక పోతున్నారు. నారాయణరావు జీవితాంతం శ్రమించి బిడ్డలని అమెరికా పంపించాడు. చదివించాడు. ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అక్కడే ఉండిపోయారు. తల్లిదండ్రులు, భారత దేశం అవసరం లేదనే స్థితికి వచ్చారు. ఈ పరిస్థితి వీళ్లకి మింగుడు పడటం లేదు. వృద్ధాప్యంలో కన్నబిడ్డలతో సత్సంబంధాలు లేకపోతే ఇంతే మరి.”

“ఈ విషయం నీకు తెలుసా. ఇప్పుడు వీళ్లు కాశీ వెళ్తున్నారు”

“వెళ్లనీ. ఇలా తిరగటం వాళ్లకి అలవాటే కదా”

“అది నిజమే. కాని వాళ్లు కాశీ నుంచి రారట”

“అంటే కాశీలో ఉండిపోతారా?”

“కాశీ విశ్వేశ్వరుడిలో కలిసి పోదామనుకుంటున్నారు. వాళ్ల మాటలని బట్టి నేను గ్రహించాను”

“అయ్యొయ్యో! ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లు కదా. ఏదో విధంగా జీవించడం మంచిది కదా. చాలా మంది అమెరికాలో ఉన్న పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉంది కదా. ఈ విధంగా వాళ్లు నిర్ణయించుకోవటం కరెక్టు అంటావా?”

“కరెక్టు కాదు అని మనకు అనిపిస్తోంది. వాళ్ల కోణంలో ఆలోచిస్తే అది సబబేమేమో అన్పించవచ్చు కదా”

“వీళ్లు ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకుని, కాశీ వెళ్ళి అక్కడ చనిపోతే వాళ్ల పిల్లలు బాధపడరా? ఎంత పరువు నష్టం?”

“ఆ బాధేదో వాళ్ల పిల్లలు పడి పశ్చాత్తప పడాలని వీళ్ల ఉద్దేశం. కాకపోతే ఈ నిర్ణయానికి రారు.”

“ఏది ఏమైనా వాళ్ల ఆలోచనలో లోపముందనిపిస్తోంది.”

“మనమేం చేస్తాం?”

“తెలిసిన వాళ్లకది బాధకలుగుతోంది”

‘కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు కదా” హరిహరశర్మ వేదాంత ధోరణిలో మాట్లాడాడు.

నేను మాటరాక స్థాణువులా ఉండి పోయాను.

***

కొన్ని రోజుల తరువాత..

నారాయణరావు దగ్గరి బంధువు ఒకాయన కనిపిస్తే వాళ్ల క్షేమసమాచారం అడిగాను.

“వాళ్లు ఇక్కడ లేరు” అని ఆయన చెప్పాడు.

“అవును. కాశీ వెళ్తామని చెప్పారు” అని వెంటనే అన్నాను నేను.

“వెళ్లారు”

“రాలేదా? ఏం జరిగింది?” ఆతృతగా అడిగాను నేను.

“ వచ్చారు. ఇప్పుడక్కడ లేరు” కూల్‌గా చెప్పాడాయన.

“ఎక్కడికి వెళ్లారు?”

“ఇండియాలోనే లేరు”

“ఎక్కడికి వెళ్లారు?”

“వాళ్ల పిల్లలదగ్గరికి. అమెరికా”

“అమెరికా వెళ్లనని అన్నారే”

“ముందు అలాగే అన్నారు.. అనుకున్నారు. కాని వెళ్లక తప్పలేదు.”

“ఏం జరిగింది?”

“నారాయణరావు పెద్దకొడుకుకి అనుకోకుండా ఏదో ప్రాణాంతకమైన జబ్బు వచ్చిపడిందట. ఆమాట వినగానే ఉరకలు పరుగుల మీద అమెరికా వెళ్ళిపోయారు.”

“హమ్మయ్య. సంతోషం. ఇంకేదో ఊహించుకుని భయపడిపోయాను” అనుకుని ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాను. నిజమైన తెలుగు దంపతులు అన్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here