[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
‘పద్మ’ పురస్కారాలు:
[dropcap]భా[/dropcap]రత ప్రభుత్వం 1954 జనవరిలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు గుర్తింపుగా పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించే విధానాన్ని ప్రారంభించింది.
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా జనవరి 26వ తేదీన రాష్ట్రపతి ఈ అవార్డులు ప్రకటిస్తారు. ‘భారత రత్న’ విడిగా ప్రకటిస్తారు. భారత ప్రభుత్వ గెజిట్‌లో వీటిని ప్రచురిస్తారు. ఒక ఫలకము (Medal), రాష్ట్రపతి సంతకం చేసిన ఒక పత్రము వ్యక్తులు – రాష్ట్రపతి భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా మార్చి ఏప్రిల్ మాసాలలో అందుకుంటారు. ఏ విధమైన ఆర్థిక పారితోషకం వుండదు. కాని ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి పద్మశ్రీలు లభించిన తెలుగురాష్ట్రాలకు చెందిన ఆరుగురికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల పారితోషకం, ప్రతి నెలా 2 వేల రూపాయల పెన్షన్ ప్రకటించి ఒక సత్సంప్రదాయం నెలకొల్పారు.
‘పద్మ’ పురస్కారాల ఎంపిక ప్రక్రియ 8 నెలల ముందుగానే ఆరంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వ హోం శాఖ వారు ఈ పురస్కారాలకు నామినేషన్లు ఆహ్వానిస్తారు.
హోం శాఖ రూపొందించిన అప్లికేషన్ పూర్తి చేసి వ్యక్తులు/సంస్థలు నామినేషన్లు భారత ప్రభుత్వానికి పంపవచ్చు. రాష్ట్ర ప్రభత్యాలు, వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు పేర్లు ఏటా పంపుతారు. వీటిని నవంబరు మాసంలో ఒక కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. చివరగా రాష్ట్రపతి ఆమోదం పొంది జనవరి 25 సాయంకాలం పత్రికలకు, ప్రసార మాధ్యమాలకు చేరతాయి. 26 ఉదయానికి ప్రకటన వెలువడుతుంది.
~
1955 జనవరిలో మూడు అంచెల పురస్కారాలు ఆమోదంచబడ్డాయి. మరణానంతరం పురస్కారాలకు కూడా చోటు కల్పించారు. తొట్ట తొలి సంవత్సరం 1954లో 23 అవార్డులు ప్రకటించారు. 1955లో 12, 1956లో 13, 1957లో 16, 1958లో 16, 1959 లో 14 ప్రకటింపబడి తొలి దశకంలోని ఆరు సంవత్సరాలలో మొత్తం 94 మంది పురస్కారాలు గ్రహించారు. అందులో ఒక విదేశీయుడున్నారు. అందులో 26 మంది సాహిత్యము, విద్యారంగాలకు చెందిన వారు, 17 మంది సివిల్ సర్వీసులకు చెందినవారు, 12 మంది కళారంగానికి, పదిమంది శాస్త్రసాంకేతిక రంగాలకు, పదిమంది సమాజసేవకు, 8 మంది ప్రజాసేవకు, ఆరుగురు వైద్యశాస్త్ర విభాగానికి చెందినవారు కాగా, నలుగురు శ్రీడాకారులు ఉన్నారు. 2024 నాటికి పద్మ పురస్కారాల సంఖ్య 132కి పెరిగింది. అందులో ఐదుగురికి పద్మవిభూషణ్ ప్రకటించారు.
- శ్రీమతి వైజయంతీ మాల బాలి – కళారంగం-తమిళనాడు
- శ్రీ కె. చిరంజీవి – కళారంగం – ఆంధ్ర ప్రదేశ్
- శ్రీ. యం. వెంకయ్యనాయడు – ప్రజాసేవారంగం – ఆంధ్ర ప్రదేశ్
- శ్రీ బిందేశ్వర పాఠక్ – సామాజికసేవ – బీహారు (మరణాంనంతరం)
- శ్రీమతి పద్మ సుబ్రమణ్యం – కళారంగం – తమిళనాడు
ఇదే సంవత్సరం 23 జనవరి న బీహారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కర్పూరీ ఠాకూర్ భారత రత్నతో గుర్తింపు పొందారు.
17 మందికి పద్మభూషణ్ లభించింది. అందులో తెలుగువారు లేరు. 110 మంది పద్మ శ్రీ విభూషితులయ్యారు. అందులో ఆరుగురు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. తెలంగాణకు చెందిన శ్రీ ఏ. వేలు ఆనందాచారి (కళ); శ్రీ దాసరి కొండప్ప (కళ) శ్రీ గడ్డం సమ్మయ్య (కళ), శ్రీ కేతావత్ సోమలాల్ (సాహిత్యం, విద్య), శ్రీ కూరెళ్ల విఠలాచార్య (సాహిత్యం) ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి డి.ఉమామహేశ్వరికి పద్మ శ్రీ లభించింది. ఈ శీర్షికలో కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారినే ప్రస్తావిస్తున్నాను,
భారత రత్నలు:
అత్యన్నత పౌర పురస్కారం భారత రత్న. 1954 నుండి 2024 వరకు 70 సంవత్సరాలలో 53 మందిని భారతరత్న వరించింది. ఒక సంవత్సరంలో ముగ్గురికి మించి యివ్వకూడదనే పరిమితి ఉంది. 1954లో ముగ్గురికి లభించింది. వీరు శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి (తొలి గవర్నరు జనరల్); శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ (అప్పటి ఉపరాష్ట్రపతి); ప్రముఖ శాస్త్రవేత్త సి.వి.రామన్. ఆ మరుసటి సంవత్సరం మరో ముగ్గురు – డా. భగవాన్ దాస్, డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, పండిట్ జవహార్ లాల్ నెహ్రూ. తిరిగి 1991 వరకు ముగ్గురిని ఎంపిక చేయలేదు.
1991లో శ్రీ రాజీవ్ గాంధీ (మరణానంతరం), శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం), శ్రీ మొరార్జీ దేశాయి ఈ పురస్కారం పొందారు. 1992లో మరణానంతరం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జె. ఆర్. డి. టాటా; శ్రీ సత్యజిత రాయ్ ఎంపికయ్యారు. 1997లో గుల్జారీ లాల్ నందా, అరుణా అసఫ్ అలీ (మరణానంతరం), డా. ఏ. పి.కె. అబ్దుల్ కలాం ఈ గౌరవం పొందరు. 1995లో జయప్రకాష్ నారాయణ్, ఆచార్య అమర్త్య సేన్, లోక్ ప్రియ గోపీనాథ్ బర్దోలీ (మరణానంతరం); పండిత్ రవిశంకర్ – నలుగురిని ఎంపిక చేశారు. 2024లో ఐదుగురు.
తిరిగి 2019లో నానాజీ దేశ్‌ముఖ్, డా. భూపేన్ హజారికా, శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. 2024లో శ్రీ కర్పూరీ ఠాకూర్ (మరణానంతరం); శ్రీ యల్. కె. అద్వాణీ ఈ పురస్కార గ్రహీతలు. ఒక్కసారి ఈ పురస్కారాలను విశ్లేషిస్తే ఇందులో తొలి భారత గవర్నర్ జనరల్ శ్రీ చక్రవర్తి రాజగోపాలాచారి ప్రథములు.
భారతరత్న పొందిన రాష్ట్రపతులు:
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ – 1954
- డా. రాజేంద్రప్రసాద్ – 1962
- డా. జాకీర్ హుస్సేన్ – 1963
- శ్రీ వి.వి.గిరి – 1973
- శ్రీ. ఏ.పి.జె. అబ్దుల్ కలాం – 1997
- శ్రీ ప్రణబ్ ముఖర్జీ –
రాజేంద్ర ప్రసాదకు పదవీ విరమణ సమయంలో లభించింది. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‍కు ఉపరాష్ట్రపతి హోదాలో దక్కింది.
అదే రీతిలో భారత రత్న పురస్కారం పొందిన ప్రధాన మంత్రుల వివరాలివి:
- శ్రీ జవహర్ లాల్ నెహ్రూ – 1955
- శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి – 1966 (మరణానంతరం)
- శ్రీమతి ఇందిరా గాంధీ – 1971
- శ్రీ రాజీవ్ గాంధీ – 1991 (మరణానంతరం)
- శ్రీ మొరార్జీ దేశాయి – 1991
- శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి – 2015
- శ్రీ గుల్జారీ లాల్ నందా – 1997 (తాత్కాలిక ప్రధానిగా రెండు మార్లు)
- శ్రీ యల్.కె. అద్వాణీ – 2024 – (ఉప ప్రధాని)
- సర్దార్ వల్లబాయ్ పటేల్ – 1991 (మరణాంతరం)
- శ్రీ పి.వి. నరసింహరావు – 2024 (మరణాంతరం)
- శ్రీ చరణ్ సింగ్ – 2024 (మరణాంతరం)
భారత రత్న ప్రకటించిన ముఖ్యమంత్రులు/కేంద్రమంత్రులు:
- శ్రీ కె. కామరాజ్ – 1976 (మరణానంతరం) – తమిళనాడు
- శ్రీ ఎం. జి. రామచంద్రన్ – 1988 (మరణానంతరం) – తమిళనాడు
- శ్రీ సి. సుబ్రహ్మణ్యం – 1998 (మరణానంతరం) – తమిళనాడు
- శ్రీ కర్పూరీ ఠాకూర్ – 2024 (మరణానంతరం) బీహారు
విదేశీయులు: మదర్ తెరెస్సా – 1980, నెల్సన్ మండేలా 1990.
సంగీత విద్వాంసులు:
- శ్రీమతి యం.యస్. సుబ్బులక్ష్మి – 1998
- శ్రీ పండిట్ రవిశంకర్ -1999
- లతా మంగేష్కర్ – 2001
- శ్రీ బిస్మిల్లాఖాన్ – 2001
- పండిట్ భీమ్‌సేన్ జోషి – 2009
- శ్రీ భూపేన్ హజారికా – 2019 (మరణానంతరం)
క్రీడారంగం: శ్రీ సచిన్ టెండూల్కర్ – 2014
వ్యవసాయ రంగ శాస్త్రవేత్త: డా. యం.యస్. స్వామినాథన్ – 2024 (భారతరత్న)
~
శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు తదితరులు ఈ పురస్కారాన్ని పొందిన మహనీయులు.
సుప్రసిద్ధ పండితులు డా. పి. వి. కాణే, మదన్ మోహన్ మాలవ్యా చిరస్మరణీయులు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్, ఉద్యమశీలి జయ ప్రకాష్ నారాయణ్ ప్రముఖులు. సినీ దర్శకులు సత్యజిత్ రే, విద్యావేత్త మౌలానా అబ్దుల్ కలాం, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆర్థిక శాస్త్రవేత్త డా. అమర్త్య సేన్, భూదాన ఉద్యమ నేత శ్రీ వినోబా భావే, సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ప్రభృతులు భారత రత్నలుగా ప్రకాశిస్తూనే ఉంటారు.
వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల జీవనరేఖలు యథావిధిగా పరిశీలిద్దాం.
(మళ్ళీ కలుద్దాం)