తెలుగుజాతికి ‘భూషణాలు’-15

0
1

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

~

గానగంధర్వుడు యస్.పి. బాలసుబ్రమణ్యం (1946 జూన్ 4 – 2020 సెప్టెంబరు 25):

[dropcap]ప్ర[/dropcap]ముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు అయిన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం నెల్లూరీయుడు. తండ్రి పండితులచే ఆరాధింపబడిన ప్రముఖ హరికథా విద్వాంసులు సాంబమూర్తి. కోనెటమ్మపేట వారి స్వస్థలం. తల్లి శకుంతలమ్మ. గాయని శైలజ, వసంత బాలు సోదరీమణులు. మదరాసులో ఎ.ఎం.ఇ.ఇ. చదవడానికి ముందు అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో కొంతకాలం చదివారు.

మదరాసులో సినీ రంగ ప్రవేశం 1966 డిసెంబరు 15న ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ సినిమా ద్వారా జరిగింది. సంగీత దర్శకులు యస్.పి. కోదండపాణి బాలు లోని ప్రజ్ఞను గుర్తించారు.

తెలుగు సినిమాలకే గాక తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల కెన్నింటికో ఆయన వేలాది పాటలు పాడారు. జాతీయ అవార్డుల పంట ఆయన ఇంట పండింది.

  • 1981 – ఏక్ దూజే కేలియే – జాతీయ అవార్డు.
  • 1983 – సాగర సంగమం – జాతీయ అవార్డు.
  • 1986 – స్వాతి ముత్యం – జాతీయ అవార్డు.
  • 1988- రుద్రవీణ – జాతీయ అవార్డు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అపార్డులు 29 సార్లు అందుకున్నారు. ఆరు జాతీయ అవార్డులు లభించాయి. 40 సంవత్సరాల సినీరంగ జీవితంలో 11 భాషలలో 40 వేల పాటలు పాడారు. ఒకే రోజులో ఏకబిగిన 17 గంటలు వివిధ కంపోజర్లకు పాడిన ఘనత ఆయనది. కన్నడంలో ఒక రోజు 21 కొత్త పాటలు పాడి రికార్డు  సృష్టించారు. 1992లో ‘రోజా’ సినిమాకు ఏ.ఆర్. రహమాన్ సంగీతం కూర్చిన శృంగారాత్మక పాటను పాడిన సంఘటన చరిత్రాత్మకం. భారత ప్రభుత్వం వారు పద్మ శ్రీ (2001), పద్మ భూషణ్ (2011), పద్మ విభూషణ్ (2021)లో అందించి సత్కరించారు. బాలీవుడ్‌లో పలు భాషలలో గానం చేసిన ఖ్యాతి ఆయనది. కోవిడ్ మృత్యువు ఆయనను కబళించింది. మదరాసు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి 2020 సెప్టెంబరు 25న బాలు కన్నుమూశారు.

స్వరసుధాకరుడు:

బాలుగా ప్రసిద్ధికెక్కిన బాలసుబ్రమణ్యం డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. ‘మన్మథలీలై’ చిత్రంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు లభించింది. కమలహాసన్, రజనీకాంత్, విష్ణువర్ధన్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమినీ గణేశన్, నగేశ్, కార్తీక్, రఘువరన్ ఇలా ఎందరో ప్రముఖ సినీనటులకు గాత్రదానం చేశారు బాలు.

పట్టిందల్లా బంగారం:

నటుడిగా 1969లో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ చిత్రం ద్వారా తన కెరీర్ ప్రారంభమైంది. ‘మిథునం’లో లక్ష్మి బాలు అనే రెండే రెండు పాత్రలు పండించిన నవరసాలు సినీరంగ చరిత్రలో చరిత్రాత్మకం. ఆయన నటించిన సినిమాలు కొన్ని – పక్కింటి అమ్మాయి, ప్రేమ, వివాహ భోజనం, కళ్లు, చెన్నపట్నం చిన్నోడు, ప్రేమికుడు, పవిత్రబంధం, దేవస్థానం, దేవదాసు (చివరగా). 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన ఘనుడు.

ఈ టివి పాడుతా తీయగా:

నటుడిగానే గాక సంగీత నేపథ్యంతో ‘పాడతా తీయగా’ ధారావాహికను ఏళ్ల తరబడి దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించి ఎందరో యువతీ యువకులలో దాగి వున్న సంగీత కళను ప్రోత్సహించారు. హోస్ట్‌గా ఆయన సమయస్ఫూర్తి అనన్యసాధ్యం. ఆయన తర్వాత ఆయన కుమారుడు చరణ్ ఈ ధారావాహికను కొనసాగిస్తున్నారు. చెల్లెలు శైలజ గాత్ర మాధుర్యం శ్రోతలకు పరిచితమే. కుమార్తె పల్లవి.

కర్ణాటక సంగీతంలో గురుముఖంగా శిష్యరికం చేయకపోయినా ‘శంకరాభరణం’ వంటి సినిమాలలో ఆయన చూసిన ప్రతిభ అద్భుతం. విశ్వనాథ్ బంధుత్వం, దర్శకత్వం ఆయనకు వన్నె తెచ్చాయి. సుశీల, జానకి, తదితర గాయనీమణులతో కలిసి ఆయన ఎన్నో యుగళగీతాలు పాడారు. ఘంటసాలపై గురుత్వంతో ఆయన విగ్రహ ప్రతిష్ఠకు దోహదం చేశారు.

తండ్రిగారు సాంబమూర్తి గారు జీవించిన కాలంలో నెల్లూరులో ఉంఛవృత్తి – బిక్షాటన ద్వారా త్యాగరాజ ఆరాధనోత్సవములు నిర్వహించేవారు. వారి తర్వాత బాలూ కూడా నెల్లూరులో అదే రీతిలో ఉత్సవాలు నిర్వహించారు. తల్లిగారు మరణించిన తర్వాత నెల్లూరులోని తమ స్వంత ఇంటిని కంచి కామకోటి వారు వేద పాఠశాలను నిర్వహించడానికి దానం చేశారు. 2018లో తెలుగు సినిమా ‘చిలుకూరు బాలాజీ’ తో ఆయన అనుబంధం ఆయన సినీ జీవితంలో చివరి ఘట్టం. చివరి దాకా ఈ టివి షోలు నిర్వహిస్తు జీవనగమనం కొనసాగించిన బాలు చిరంజీవి, గాన గంధర్వుడు.

సద్గురు – యోగి – జగ్గీ వాసుదేవ్ (3 సెప్టెంబరు 1957):

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపనను కోయంబత్తూరులో నిర్వహిస్తూ మార్మికులుగా ప్రసిద్ధికెక్కన జగదీష్ వాసుదేవ్ – జగ్గీ వాసుదేవ్‍గా లోకానికి సుపరిచితులు. 2024 మార్చి నెలలో ఆకస్మాత్తుగా అస్వస్థతకు లోనై మెదడు భాగంలో ఆపరేషన్ చేయించుకుని కోలుకన్నారు. 1992లో ఆశ్రమాన్ని స్థాపించి విద్యా సంబంధమైన కార్యక్రములు, ఆధ్యాత్మిక శిక్షణ అందిస్తున్నారు. తెలుగు మూలాలు గల కుటుంబంలో మైసూరులో 1957లో వాసుదేవ్ జన్మించారు. తండ్రి పేరు వాసుదేవ్. ఐదుగురు సంతానంలో జగ్గీ అందరికంటే చిన్నవాడు. తండ్రి మైసూరులోని రైల్వే ఆసుపత్రిలో నేత్రవైద్య నిపుణులు.

జగ్గీ వాసుదేవ్ 1984లో విజయకుమారిని వివాహమాడారు. వారి ఏకైక సంతానం రాధే! జగ్గీ మైసూరు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఇంగ్లీషు ప్యాసయ్యారు. పై చదువులకు వెళ్లమని తల్లిదండ్రులు సూచించినా, ఆయన వ్యాపారం వైపు మొగ్గుచూపి మైసూరులో కోళ్లఫారం ప్రారంభించారు. ఆ రంగంలో ఎక్కువ ప్రశాంతతతో కూడిన కాలం తనకు లభిస్తుందని భావించారు. విరామ సమయంలో కవిత్వం వ్రాశారు. వ్యాపారంలో లాభాలు ఆర్జించారు. కోళ్ల పరిశ్రమ పెట్టడం కుటుంబ సభ్యులను నచ్చలేదు.

తర్వాతి కాలంలో నిర్మాణ పరిశ్రమకు చెందిన బిల్డ్ ఎయిడ్స్‌లో కాలు పెట్టారు. సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్న ఒక స్నేహితునితో కలిసి దీనిని ప్రారంభించారు. స్వయంగా తాను ఇంజనీరింగ్ శిక్షణ పొందక పోయినా అందులో 25 ఏట వరకు కొనసాగారు.

25 ఏళ్ల వయస్సులో జగ్గీ వాసుదేవ్‍కు ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. వ్యాపారాన్ని కట్టి పెట్టి విస్తృతంగా పర్యటించి యోగా బోధన 1983లో తొలిసారిగా మైసూరులో చేశారు. ఆ తర్వాత ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో మోటారు సైకిల్ పై పర్యటించి తనదైన బాణీలో యోగా క్లాసులు – సహజస్థితి – యోగలో కొనసాగించారు. అంతకు ముందు వ్యాపారాలలో మిగిలిన ధనం, విద్యార్థుల చందాలతో అది ముందుకు నడిచింది. చాముండీ హిల్స్ పై 1982 సెప్టెంబరు 23న ఒక రాతిపై కూర్చునప్పుడు తొలిసారిగా ఆయనకు ఆధ్యాత్మికానుభవం కలిగింది. తర్వాత కాలంలో ఇంట్లోనే అలాంటి అనుభూతి కలిగింది. సంవత్సరం తర్వాత ద్యానంపై దృష్టి మళ్ళించి తన ఆంతరంగిక అనుభవాలను లోకంతో పంచుకునే ప్రయత్నం చేశారు.

ఆధ్యాత్మిక భావ సంపద:

మోటారు సైకిల్ చాముండీ హిల్సు‌కు తరచు వెళ్లడం వాసుదేవ్‍కు సరదా. ఒక్కొక్కసారి అది సుదూర ప్రాంతమైన నేపాల్ వరకు కొనసాగేది. ఆయన శాకాహార భక్షణాన్ని ప్రచారం చేశారు. నిత్యం 40 నిముషాలు సూర్యనమస్కారాలు చేయడం దినచర్యలో భాగం. 1992లో ఆయన ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్యాసంబంధ కార్యకలాపాలు కొనసాగించడానికిగా ‘ఈషా ఫౌండేషన్’ సంస్థకై ఆలోచన చేశారు. యోగా తరగతులు నిర్వహించడానికి అనువైన ప్రదేశం కోసం ఆయన ప్రయత్నాలు కొనసాగించారు. 1994లో కోయంబత్తూరు లోని వేలైంగిరి పర్వతాల వద్ద సంస్థను – ఈషా యోగా సెంటర్‍ – ప్రారంభించారు. తొలి నాళ్ల నుండి ఈషా ఫౌండేషన్‍కు ఆయనే అధిపతి. స్వచ్ఛంద కార్యకర్తలే సంస్థను నడుపుతారు. ‘ఈషా యోగా’ నేర్పడం ప్రధాన విధి. ఈ విద్య ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉత్తమ విద్యావ్యాప్తి చేయడం వీరి ఆశయం.

పర్యావరణ పరిరక్షణ:

‘ప్రాజెక్ట్ గ్రీన్‌హ్యాండ్స్’ పేర వాసుదేవ్ పర్యావరణ పరిరక్షణ, సంరక్షణ కార్యకలాపాలు విస్తృతంగా చేపట్టారు. తమళనాడులోని నీరు, భూసార సమస్యల పరిష్కారానికి కృషి దేశారు. 2019లో ‘కావేరీ కాలింగ్’ అనే ఉద్యమం ద్వారా కావేరీ నది పొడవునా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. ‘ర్యాలీ ఆఫ్ రివర్స్’ అనే పేర జల సంరక్షణ ప్రయత్నాలు కొనసాగించారు. ఆ ఉద్యమ ప్రచారంలో భాగంగా లండన్ నుండి భారతదేశానికి వంద రోజుల మోటారు సైకిల్ యాత్ర చేశారు. 2022 లో 193 దేశాలకు చెందిన నాయకుల సభలో భూ సంరక్షణ గూర్చి ఉద్బోధించారు.

సద్గురు 30 గ్రంథాలు ప్రచురించారు. ‘న్యూయార్క్ టైమ్స్’ గ్రంథం బహుళ ప్రచారం పొందింది. బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ప్రసంగించిన ఘనత వీరిది. 310 మీటర్లు (112 అడుగుల) ఎత్తు గల ఆదియోగి శివ విగ్రహాన్ని 2017లో ఆవిష్కరించి గిన్నిస్ బుక్‍లో స్థానం సంపాదించారు. 2019లో భారత ప్రభుత్వం జగ్గీ వాసుదేవ్‌ను ‘పద్మ విభూషణ్’ తో సత్కరించింది. 2014లో ఇండియా టుడే పత్రిక నిర్వహించిన సర్వేలో భారతదేశంలోని ప్రతిభావంతులలో ఆయన 40వ స్థానం సంపాదించారు. ఈషా యోగ విధానం ద్వారా ఆయన ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here