[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
~
తెలుగువారి ఠీవి- ముప్పవరపు వెంకయ్య నాయుడు (1 జూలై 1949):
[dropcap]మా[/dropcap]తృభాష పట్ల అపారమైన ప్రేమాభిమానాలుగల ముప్పవరపు వెంకయ్య నాయుడు విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమంలో సాగినప్పటికీ స్వయంకృషితో మాతృభాషతో బాటు హిందీ, ఇంగ్లీషు భాషలలో అనర్గళంగా అంత్యప్రాసలతో, సామెతలు, నుడికారాలతో ఆలోచనాత్మకమైన ప్రసంగాల చేయడం ఆయనకే చెల్లు. దక్షిణాది నుంచి రాజకీయంగా ఎదిగినా ఉత్తరాది నాయకులతో సరి సమానంగా ఎదిగి దేశ రాజధానిలో గుర్తింపు పొందిన ధీశాలి. అలుపు సొలుపు లేకుండా నిరంతర రాజకీయ వ్యాసంగంలో చిన్న వయసులోనే 1978లో ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులయ్యారు. బుచ్చిరెడ్డి ఫాళెం హైస్కూలు, నెలూరు వి.ఆర్. కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేసి విశాఖపట్టణం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘లా’ కోర్సులో చేరడం ఆయన జీవితంలో పెద్ద మలుపు, 1978-85 మధ్య శాసన సభ్యులు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షత, జాతీయ స్థాయిలో బిజెపి అధ్యక్షత ఆయన కీర్తికిరీటంలో తురాయిలు. రాజ్యసభకు పలుమార్లు ఎన్నికై కేంద్రంలో గ్రామాభివృద్ధిశాఖ, పట్టణాభివృద్ధి శాఖ, సమాచార ప్రసార మాతత్వశాఖల మంత్రిగా గణనీయమైన కృషి వేశారు. దేశంలోని అన్ని జిల్లాలు విస్తృతంగా పర్యటించి ప్రజాసమస్యలను ఆకళింపుజేసుకున్నారు. చిన్నతనంలో మూడవ ఏటనే మాతృమూర్తిని కోల్పోయానని తరచు ప్రసంగాలలో బాధపడేవారు. పార్టీ కార్యకర్త మొదలు జాతీయ నాయకుల వరకు పేరు పేరునా పలకరించగల జ్ఞాపకశక్తి ఆయనది. వాజపేయి, అద్వానీలకు ప్రియతముడిగా పేరు తెచ్చుకొన్నారు.
మంత్రిత్వశాఖలకు మార్గదర్శకత్వం:
1998 నుండి రాజ్యసభ సభ్యులుగా 2019 వరకు కొనసాగిన వెంకయ్య నాయుడు కేంద్రంలో ప్రతిష్ఠాత్మకమైన మూడు మంత్రిత్వశాఖలు నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్‍పేయ్ మంత్రివర్గంలో తానే ఎంచుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 2000 సెప్టెంబరు నుంచి 2002 జూలై వరకు వ్యవహరించారు. గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించడానికి కేంద్ర మంత్రివర్గం చేత ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలుపరచేలా చేశారు. కేవలం పట్టణాలకే కాక గ్రామీణ వ్యవస్థకు కూడా రహదారి ఏర్పాటు చేశారు.
నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 2014 మే నుండి 2017 జూలై వరకు పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. దానితో బాటు 2016-17 మధ్య కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా గణనీయమైన మార్పులు తెచ్చారు. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మంత్రిగా ఆంధ్ర ప్రదేశ్‌కు దేశంలోనే అత్యధికంగా పేదల ఇళ్లు మంజూరు చేసి స్వరాష్ట్రం పట్ల మమకారం చూపుకున్నారు. విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, కాకినాడలను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి అక్కడ మౌలిక వసతుల మెరుగుదలకు కేంద్ర నిధులు అందేలా చూశారు. విజయవాడ, గుంటూరు నగరంలో డ్రైనేజీల మెరుగుదల, అమరావతీ నగర మౌలిక సదుపాయలకు 1500 కోట్లు మంజూరు చేయించారు. సమాచారశాఖ మంత్రిగా నెల్లూరులో ఎఫ్.ఎం. రేడియో ప్రారంభోత్సవం చేశారు.
2024లో పద్మ విభూషణ్ శోభితులైన వెంకయ్య నాయుడు చిన్నతనంలో ఆర్.యన్.యస్. కార్యకర్తగా పని చేసి, జన సంఘ్, బి.జె.పి పార్టీలలో పట్టు సాధించి, తన అకుంఠిత దీక్షా దక్షతలతో జాతీయస్థాయికి ఎదిగి దేశంలో రెండవ అత్యున్నత స్థానమైన ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల కాలంలో (2017 ఆగస్టు – 2022 ఆగస్టు) అనేక ప్రాంతాలలో పర్యటించి విశ్వవిద్యాలయ విద్యార్థులకు, యువతకు మార్గదర్శనం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించారు.
వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ ప్రజాసేవా రంగంలో స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా నెల్లూరు, విజయవాడ, హైదరాబాదులలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉపాధి కల్పన చేసి లక్షలాది మందికి చేయూతనందిస్తున్నారు. విశ్రాంత జీవితంలో కూడా వెంకయ్య నాయుడు సాంస్కృతిక, విద్యారంగ సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం అభినందనీయం.
చిత్రసీమలో చిరంజీవి (22 ఆగస్ట్ 1955):
2024 సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారం పొందిన చిరంజీవి, వెంకయ్య నాయుడు – ఇద్దరూ నెల్లూరుతో సంబంధం గల వ్యక్తులు. చలనచిత్రసీమలో అగ్రశ్రేణి నటుడిగా, ప్రజారాజ్యం పార్టీ స్థాపకుడిగా, కేంద్రంలో సహాయ మంత్రిగా చిరంజీని ప్రసిద్ధులు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చిత్రసీమలో ‘చిరంజీవి’ గా ప్రవేశించారు. 150కి పైగా చిత్రాలలో నటించారు. మొగల్తూరులో 1955 ఆగష్టులో జన్మించారు. తండ్రి పోలీసు శాఖ ఉద్యోగరీత్యా నెల్లూరులో బాల్యం గడిపారు. నరసాపురంలో బికాం చేశారు.
సినీరంగం:
అన్నిటికీ మించి 1992లో ఆయన నటించిన ‘ఘరానా మొగుడు’ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలై 10 కోట్ల రూపాయల స్థూల వసూళ్లు సాధించింది. దానిని 1993లో అంతర్జాతీయ చలనచిత్సవంలో మెయిన్‌స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించారు. పారితోషికం విషయంలో ఆయనకే అగ్రతాంబూలం. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించి పురస్కారం పొందారు.
చిరంజీవి చలనచిత్ర ప్రస్థానాన్ని విశ్లేషకులు ఐదు విభాగాలుగా పేర్కొన్నారు:
- 1978-1981 చిత్రసీమలో తొలి అడుగులు.
- 1982-1986 కథానాయక పాత్రలు
- 1987-2007 వ్యాపారాత్మక విజయ పరంపర
- 2008-2016 – నటనకు విరామం
- 2017- సినీరంగ పునః ప్రవేశం
రాజకీయ రంగప్రవేశం:
సినీరంగంలో సుప్రతిష్ఠులై 2008 ఆగస్టులో రాజకీయాల వైపు మొగ్గు చూపారు. పేదలకు సేవ చేసే విధానాలు, సామాజిక న్యాయం అనే ఆశయంతో మదర్ థెరెసా జన్మదినాన 2008 ఆగస్ట్ 25న తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. రాజకీయాలలో పూర్తికాలం వినియోగిస్తానని నటనకు విరామం ప్రకటించారు. 2009లో ఆంధ్ర ప్రదేశ శాసనసభకు ప్రజారాజ్యం పార్టీ 294 స్థానాలకు పోటీ చేసింది, కేవలం 18 స్థానాలు గెలుచుకుంది. చిరంజీవి తిరుపతి నుంచి గెలిచారు. తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు.
రాజ్యసభ సభ్యుడిగా 2012 ఏప్రిల్- 2018 ఏప్రిల్ మధ్య వ్యవహరించి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 2012 అక్టోబరులో కేంద్రంలో పర్యాటక శాఖామంత్రిగా ఇండిపెండెంట్ ఛార్జ్ పదవి పొందారు. 2014 మే వరకు ఆ హోదాలో భారతదేశంలో విస్త్రతంగా పర్యటించారు. ఆ తర్వాత రాజకీయాలకు విరామం యిచ్చి సినీరంగంలో పునః ప్రవేశించారు.
సేవా కార్యక్రమాలు:
1998 అక్టోబరులో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ప్రజాసేవలో పాల్గొంటున్నారు. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో అత్యధికంగా రక్తదానాలు, నేత్రదానాలు చేస్తూ పేరుపొందాయి. తన అభిమానుల ఉత్సాహమే ఊపిరిగా సేవా దృక్పథంతో ఈ ట్రస్టులు నడుస్తున్నాయి. రక్తదానం ద్వారా అనేక వేలమంది, నేత్రదానం వలన వెయ్యిమంది లబ్ధి పొందారని 2007 నాటికే అంచనా. దాదాపు నాలుగు లక్షల నుంది తమ మరణానంతరం నేత్రదానం చేశారు.
సత్కారాలు:
2022లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. 2006లో అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ‘పద్మ భూషణ్’ పురస్కారం అందుకొన్నారు. 2024లో ‘పద్మ విభూషణ్’ ప్రకటించారు. 2006 నవంబరులో ఆంధ్ర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ పొందారు. చలన చిత్రసీమలో ఆయన చిరంజీవి.
గమనిక:
32 మంది తెలుగువారు పద్మ విభూషణ్ పురస్కారం పొందిన విశేషాలను మీతో పంచుకున్నాను. వచ్చే సంచిక నుంచి పద్మ భూషణుల జీవనరేఖలు ధారావాహికంగా అందిస్తాను.
Images source: Internet
(మళ్ళీ కలుద్దాం)