[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
~
గులాం యాజ్దానీ (1885 మార్చి 22 – 1962 నవంబరు 13):
(1958 సంవత్సరంలో తెలుగువారికి పద్మ భూషణ్ రాలేదు)
1959లో పద్మభూషణ్ అందుకొన్న గులాం యాజ్దానీ గొప్ప పురావస్తు శాస్త్రవేత్త. నిజాం పరిపాలనా కాలంలో పురావస్తుశాఖ వ్యవస్థాపన చేసిన వారిలో ప్రథములు. యాజ్దానీ 1885లో ఢిల్లీలో జన్మించారు. యువకుడిగా ఉన్నపుడు మౌల్వీ మహ్మద్ ఇషాక్, మౌల్వీ నజీర్ అహమ్మద్‌ల వద్ద శిక్షణ పొందారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్‍లో ప్రథమ స్థానం పొందారు. 1905లో డిగ్రీలో మూడు స్వర్ణ పతకాలు లభించాయి.
1914లో జాన్ మార్షల్ సిఫారసుపై నిజాం ప్రభుత్వ ఆర్కియలాజికల్ శాఖను వ్యవస్థీకరించడానికి డిప్యుటేషన్‍పై హైదరాబాదు పాలనలో చేరి 1943లో పదవీ విరమణ వరకు మూడు దశాబ్దులు, డైరక్టరుగా పని చేశారు. ఆ శాఖ వార్షిక నివేదికలను రూపొందించారు. 1915లో తొలిసారిగా యాజ్దానీ బీదర్ సందర్శించి అక్కడి తవ్వకాల ద్వారా పురాతన సంస్కృతికి చెందిన ఎల్లోరా, అజంతా, బీదర్‌ల లోని పురా సంపదను కాపాడే కృషి చేశారు. అమెరికా, యూరోప్ దేశాలలో ఈ కృషి ప్రశంసలకు లోనైంది.
అజంతా, ఎల్లోరా గుహలకు సంబంధించి ప్రామాణికమైన గ్రంథాలు ఆయన ప్రచురించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రారంభ దశ నుండి ఆయన సలహా సంప్రదింపులు కొనసాగాయి. పెక్కు విదేశీ సంస్థలు – రాయల్ ఏసియాటిక్ సొసైటీ, భండార్కర్ ఓరియంటల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, 1936లో బ్రిటీష్ సామ్రాజ్య ప్రశస్త ‘డిస్టింగ్విష్డ్ ఆర్డరు’ ఆయన కీర్తికిరీణంలో మణులు. పెక్కు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‍లు ప్రదానం చేశాయి. డా. షేర్వాణి వంటి రెండో తరం శాస్త్రవేత్తలను ఆయన తీర్చిదిద్దారు. పురాతత్వ శాస్త్రవేత్తగా యాజ్దానీ చిరస్మరణీయుడు.
అయ్యదేవర కాళేశ్వరరావు (1882 జనవరి 22 – 1962 ఫిబ్రవరి 23):
ఆంధ్రప్రదేశ్ శాసన సభకు తొలి స్పీకరు అయిన అయ్యదేవర కాళేశ్వరరావుకు 1960లో అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్మ భూషణ్ పురస్కారం అందించారు. ఆయన కృష్ణాజిల్లా నందిగామలో జన్మించారు. ఆయన కుటుంబం రెవిన్యూ కలెక్టర్లకు పేరు గాంచినది. కాళేశ్వరరావు మచిలీపట్టణంలోని నోబుల్ కళాశాలలో ఎఫ్.ఏ. చదివే రోజుల్లో రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆయనకు గురుదేవులు.
గ్రంథాలయాల ద్వారా విద్యావికాసం కలిగించాలనే సంకల్ప బలంతో కాళేశ్వరరావు, ఆయన మిత్రబృందం విజయవాడలో 1911లో రామమోహన గ్రంథాలయం స్థాపించి ఆంధ్ర గ్రంథాలయోద్యమానికి పునాదులు వేశారు. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలికి ప్రోత్సాహమిచ్చి కార్యదర్శిగా తెలుగు సాహిత్యసేవకు దోహదం చేశారు. యూరోపియన్ భాషల నుండి అనువాదాలకు పునాదులు వేశారు.
న్యాయవాదిగా:
శాసన సభాపతి:
1956లో ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు కలసి విశాలాంద్రలా ఏర్పడినపుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాళేశ్వరరావు స్పీకరుగా ఎన్నికై 1962 వరకు కొనసాగారు. ‘నవ్రాంధ్రము- నా జీవితకథ’ ఆయన ఆత్మకథ. ఆయన స్మారకార్థం విజయవాడ నడిబొడిన ఉన్న మార్కెటుకు కాళేశ్వరరావు మార్కెటుగా నామకరణం చేశారు. ఇంజనీరు కావాలనుకున్న కాళేశ్వరరావు లాయర్ అయ్యారు. 1926, 1937, 1966, 1955 – సంవత్సరాలలో విజయవాడ నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1939లో విజయవాడ, బందరులకు అవిభక్త మదరాసు రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించారు. రాజగోపాలచారి ప్రధాన మంత్రి (ముఖ్యమంత్రి) గా ఉండగా ఆయన వద్ద కార్యదర్శి అయ్యారు. 1946లో ఆయన ప్రకాశం పంతులు పార్టీలో చేరారు. జైలులో ఉన్నపుడు ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర, తరుష్క ప్రజాస్వామికం, చీనా జాతీయోద్యమ చరిత్ర, ఈరిప్టు చరిత్ర గ్రంథాలు రచించారు. ఆయన ధన్యజీవి.
మోటూరి సత్యనారాయణ (1902 ఫిబ్రవరి 2 – 1995 మార్చి6):
దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తికి అవిరళ కృషి చేసిన సత్యనారాయణ కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. మచిలీపట్టణం ఆంధ్ర జాతీయ కళాశాలలో జాతీయశిక్షణలో భాగంగా హిందీ భాషపై పట్టు సాధించారు. ఆంగ్లం, తమిళ, కన్నడ, మలయాళాలు; మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషలు అభ్యసించారు. సాహిత్య సాంస్కతిక కార్యకలాపాలతో బాటు రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
హిందీ భాషాసేవ:
స్వాతంత్ర యోధులు:
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. 1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్‍కు మద్రాసు ప్రావిన్స్ నుండి ఎన్నికై భారత రాజ్యాంగ రచనలో రాజ్ భాషా కమిటీకి ఆధిపత్యం వహించారు. హిందీని రాజభాషగా ఆమోదింపచేయడానికి దోహదం చేశారు. 1950-52 మధ్య తొలి పార్లమెంటు సభ్యులు. 1952-54 మధ్య మదరాసు శాసనసభ సభ్యులు. 1952 నుండి 1966 వరకు 12 సం॥లు రాజ్యసభకు రాష్ట్రపతిచే నామినేట్ అయ్యారు. 1956లో రాజ్ బాషా కమీషన్ సభ్యులు.
వీరు తెలుగు భాషా సమితి స్థాపక కార్యదర్శిగా తెలుగు విజ్ఞాన సర్వస్వం 16 సంపుటాలు ప్రచురించారు. హిందీ వికాస సమితి ద్వారా ‘విశ్వవిజ్ఞాన సంహిత’ ప్రచురించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో బాటు ఇతర విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1958లో పద్మశ్రీ, 1962లో పద్మ భూషణ్ పురస్కారాలు వరించాయి. 1957లో రాష్ట్రపతి శ్రీ బాబు రాజేంద్రప్రసాద్ సారథ్యంలో వీరి అభినందన సభ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఆయన బహుభాషాకోవిదులు, 93 ఏళ్లు పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు.
డా. మహంకాళి సీతారామారావు (1906-1977):
వైద్యరంగంలో విశిష్ట సేవ లందించిన వారికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించడం ఆనవాయితీ. మహంకాళి సీతారామారావు FRCP గౌరవం పొందారు. భారతీయ వైద్యసేవలో 1936 లో వైద్యనిపుణులుగా చేరారు. దరిమిలా రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అందులో వైద్యసేవలందించాలని పర్షియా – ఇరాక్ సేవా విభాగంలో డాక్టరుగా చేరారు. క్షతగాత్రులైన యుద్ధవీరులకు సేవ చేయడం వారి విధి. జాతీయ పతాక నిర్మాత అయిన పింగళి వెంకయ్య కూడా సామాన్య సిపాయిగా చేరి యుద్ధరంగంలో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే విభాగంలో పని చేసిన విషయం గుర్తు తెచ్చుకోవాలి. సైన్య విభాగాలలో 20 సంవత్సరాలు సేవ చేసిన సీతారామారావు సైన్యం నుండి విడుదలయ్యారు.
1962లో ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ పురస్కారం వరించింది. 1964లో లండన్ లోని భారత హై కమీషనర్‌గా నియమితులయ్యారు. తిరిగి భారతదేశానికి విచ్చేసి ఆమరణాంతం వైద్య సేవలో తరించారు. 1962లో పద్మ భూషణ్ పొందిన ఇతర ప్రముఖులను పరిశీలించినపుడు సీతారామారావు ప్రఖ్యాతి తెలుస్తుంది. హెచ్. వి. ఆర్. అయ్యంగార్ (సివిల్ సర్వీస్), పద్మజా నాయుడు (ప్రజాసేవ), విజయలక్ష్మి పండిట్ (ప్రజాసేవ) లకు లభించింది.
తెలుగు వారైన మోటూరి సత్యనారాయణకు కూడా ఇదే సంవత్సరం లభించింది. ఆయన హిందీ భాషావ్యాప్తికి అవిరళ కృషి చేశారు.
Images Credit: Internet
(మళ్ళీ కలుద్దాం)