[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
~
రాజనీతిశాస్త్రవేత్త ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య (1889 జనవరి 8 – 1981 జనవరి 13):
ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతిశాస్త్రవేత్త అయిన మామిడిపూడి వెంకటరంగయ్యకు 1968లో పద్మ భూషణ్ పురస్కారం లభించింది. తిక్కన జన్మించిన నెల్లూరు జిల్లాలో పురిణి గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బాల్యంలో సంస్కృతాంధ్ర భాషలను అభ్యసించారు. మదరాసు పచ్చయప్ప కళాశాలలో చేరి 1907లో బి.ఏ. పరీక్షలో మదరాసు విశ్వవిద్యాలయంలో సర్వ ప్రథములుగా పాసయ్యారు. వెంటనే తాను చదివిన పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకత్వం వహిస్తూ చరిత్ర, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పూర్తి చేశారు. విద్యార్థిగానే స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
తమకంటే చిన్నవారైనా ప్రసంగిస్తుంటే ఆసక్తిగా వినేవారు. చివరి శ్వాస పీల్చేవరకూ వ్రాస్తూనే కాలం గడిపారు. ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డికి ఆయన సన్నిహితులు, ఆంధ్రజ్యోతి దినపత్రికను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రెస్ బిల్ ప్రవేశపెట్టారు. ఆ బిల్లును వెంకటరంగయ్య తీవ్రంగా విమర్శించగా బిల్లును మూలన పడేశారు.
‘ఆంధ్రలో స్వాతంత్ర సమరం’ అనే గ్రంథాన్ని నరిశెట్టి ఇన్నయ్యతో కలిసి తెలుగులో 1972లో ప్రచురించారు. అది సర్వీస్ కమిషన్ పరీక్షలకు పాఠ్య గ్రంథం. సోక్రటీసు భారతదేశంలోని ఒక గ్రామంలో తిరుగాడితే ఎలా ఉంటుందో కల్పన చేసి నెల్లూరు జిల్లా గ్రామంగా మలిచారు. వీరి మనుమరాలు శాంతా సిన్హా మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ స్థాపించి అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించి సేవ చేస్తున్నారు. ఆమెకు పద్మశ్రీ లభించింది. 1989లో రంగయ్య శతజయంతి జరిపారు. వారు ఆకాశవాణి విద్యాప్రసారాల సలహాదారుగా వున్నారు. బొంబాయి విశ్వవిద్యాలయ రాజనీతిశాస్త్రాధ్యక్షులుగా మంచి పేరు. ప్రాచీన రుషులవలె ఆయన జీవితాన్ని గడిపారు. ఆయన కుమారుడు ఆనందం రాజ్యసభ సభ్యులుగా వ్యవహారించారు.
చారిత్రక పరిశోధకులు షేర్వాణీ (1891-1980)
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర, ఆర్థికశాస్త్ర ఉపన్యాసకులుగా ఆయనకు కీర్తి లభించింది. 1945-46 మధ్య నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. 1947-48 మధ్య ఢిల్లీలోని ఆంగ్లో- అరబిక్ కళాశాల ప్రిన్సిపాల్ పదవి వరించింది. ఆచార్య షేర్వాణి ఉర్దూ, హిందీ, అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచి, పర్షియన్ భాషలలో ప్రవీణులు. డక్కన్ చరిత్ర పరిశోధకులలో అగ్రగణ్యులు.
ఆయన విశిష్టత:
- అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్, 1976
- లండన్ లోని రాయల్ ఏషియాటిక్ సొసైన ఫెలోషిప్, 1978
- ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, మధ్యయుగ విభాగం – అధ్యక్షత, 1943
- ఇండియన్ పొలిటికల్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షత, అలీఘర్, 1952
- లాహోరులో జరిగిన కామన్వెల్త్ కాంగ్రెసు ప్రాతినిధ్య వర్గం సభ్యత్వం 1953
- పూనాలో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ వజ్రోత్సవ సభాధ్యక్షత 1963
- రాజ్యాంగాన్ని ఉర్దూలోకి అనువదించే కమిటీ సభ్యత్వం
వారి ప్రముఖ రచనలు:
- Muslim Political Thought and Administration –
- The Bahamanis of Deccan – 1985
- Studies in the Foreign Relations of India – 1975
- Cultural Trends in Medieval India – 1968
- History of Medieval Deccan (1295-1724) 1973
- History of Qutub Shahi Dynasty – 1974
ఇలా ఇరవై దాకా గ్రంథాలు ప్రామాణికంగా ప్రచురించిన ఘనులు షేర్వాణీ.
1970 సంవత్సరం పద్మ భూషణాల పంట:
తెలుగు నేలకు చెందిన ఐదుగురికి ఒకే సంవత్సరం పద్మ భూషణాలు లభించడం అరుదైన సన్నివేశం. సివిల్ సర్వీసుల విభాగంలో యం.ఆర్. బ్రహ్మం, గైనడి ఏ. నరసింహారావులను వరించింది. తెలుగు సాహిత్య చక్రవర్తులైన విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషవాలకు యిదే సంవత్సరం వచ్బింది. సయ్యద్ అబ్దుల్ లతీఫ్ ఆంగ్ల సాహిత్యంలో దిట్ట.
వీరిలో యం.ఆర్. బ్రహ్మం గూర్చి, గైనడి ఏ. నరసింహారావు గూర్చిన వివరణలు నాకు లభించలేదు.
సయ్యద్ అబ్దుల్ లతీఫ్:
ఆంగ్ల సాహిత్యంలో ప్రతిభ కనబరచిన లతీఫ్ హైదరాబాదులో జన్మించారు. ముస్లిం సంస్కృతి, ఉర్దూ సాహిత్యాలపై పట్టు సాధించి అనేక గ్రంథాలు రచించారు. హైదరాబాదులోని ఇండో-మిడిల్ ఈస్ట్ కల్చరల్ స్టడీస్ అండ్ ఆకాడమీ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్ సంస్థకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆయన ప్రచురించిన గ్రంథాలు:
- The Mind Al-Qurʼan Builds
- Basic Concepts of Quran
- The Opening Chapter of Quran
- An Outline of the Cultural History of India
వీరి స్మారకార్థం హైదరాబాదులో డా. సయ్యద్ అబ్దుల్ లతీఫ్ ట్రస్టును ఖురాను తదితర సాంస్కతిక అధ్యయనాలకు నెలకొల్పారు. ఆ సంస్థ ద్వారా ఇస్లాంకు సంబంధించిన అనేక గ్రంథాలు ప్రచురించారు.
1960లో మద్రాసు విశ్వవిద్యాలయంలో పిబ్రవరి, మార్చి నెలల్లో లతీఫ్ చేసిన ప్రసంగాలను Principles of Islamic Culture పేర 1965లో మదరాసు విశ్వవిద్యాలయం ప్రచురించింది. “Was the prophet of Islam Unlettered?” అనే పేర 1964 డిసెంబరులో లతీఫ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన నాల్గవ ఇండియా ఇస్లామిక్ కాన్ఫరెన్స్‌లో ప్రామాణిక పరిశోధనా పత్రం సమర్పించారు. మహమ్మద్ ప్రవక్త నిరక్షరాస్యుడనే అపప్రథను ఆయన తొలగించారు.
నవయుగ కవితా చక్రవర్తి జాషువా (28 సెప్టంబరు 1885 -24 జూలై 1971)
గుర్రం జాషువా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక ప్రభంజనం. అస్పృశ్యతా కోరలలో నుండి బయటపడి విశ్వమానవ ప్రేమను తన కవితలలో చాటారు.
కాళిదాసు మేఘసందేశం వలె జాషువా గబ్బిలం ఒక నూత్న ఆలోచన. గబ్బిలం ఆలయ ప్రవేశానికి నోచుకోలేదు. తన బాధను పరమశివునకు గబ్బిలం ద్వారా కవి నివేదించారు. 1919 నుండి ఆయన రచనలు ప్రచురించారు. ఆంధ్రభోజుడు, కాందిశీకుడు, తెరచాటు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగరం, నా కథ; కోకిల, క్రీస్తు చరిత్ర ప్రసిద్ధాలు. 1964లో ‘క్రీస్తు చరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో జాషువాను శాసనమండలి సభ్యునిగా గవర్నరు కోటాలో నామినేట్ చేసింది. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా ప్రపూర్ణ బిరుద ప్రదానం చేశారు. ఆయన రచనలపై ఎండ్లూరి సుధాకర్ పరిశోధనా గ్రంథం ప్రచురించారు. తెలుగు అకాడమీ వారు జాషువా పరిశోధనా కేంద్రం నెలకొల్పి దళిత సాహిత్యంపై రచనలు చేసినవారికి జాషువా సాహిత్య విశిష్ట పురస్కారాలు అందిస్తున్నారు.
జాషువా రచించిన పద్యాలు సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటిసీనులో డి.వి.సుబ్బారావు వంటి ప్రముఖ నటులు బహుళ ప్రచారంలోకి తెచ్చారు. జాషువా కుమార్తె హేమలతా లవణం జాషువా ఫౌండేషన్ స్థాపించి ఏటా కవులకు పురస్కారం అందించింది. ఆయన తన ఆత్మకథను ‘నా కథ’ పేర పద్యకావ్యంగా ప్రచురించారు. ‘ఫిరదౌసీ’ ఖండకావ్యంలో ఒక కవి ఆవేదనని వ్యక్తం చేశారు. “నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయును” అని గర్జించిన మహాకవి జాషువా. కవికోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి – ఆయన బిరుదులు. ఆయన కవిత అజరామరంగా ప్రజల నాలుకపై నర్తిస్తూనే వుంటుంది.
Images Credit: Internet
(మళ్ళీ కలుద్దాం)