[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
~
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (10 సెప్టెంబరు 1895 – 18 అక్టోబరు 1976):
[dropcap]20[/dropcap]వ శతాబ్ది తెలుగు కవులలో అగ్రగణ్యలు విశ్వనాథ. ఆయన స్పృశించని ప్రక్రియ లేదు. కవిత్వం, నవలలు, నాటకాలు, కథలు, వ్యాసాలు, ప్రసంగాలు ఇలా అనేక ప్రక్రియలలో తలస్పర్శిగా రచనలు చేశారు. ఆయన డిక్టేట్ చేస్తుంటే ఆయన సోదరుడు ‘వేయిపడగలు’ నవలను (వేయి పుటలు) వ్రాశారు. తొలిసారిగా తెలుగులో విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి, 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వీరి ‘వేయిపడగలు’ నవలను పి.వి.నరసింహారావు ‘సహస్రఫణ్’ పేర హిందీలోకి అనువదించారు. ఆంగ్లంలో ‘Thousand Hoods’ పేర అనువదించబడింది.
వృత్తిపరంగా విశ్వనాథ విజయవాడ యస్.ఆర్.ఆర్ ప్రభుత్వ కళాశాలలో తెలుగు శాఖ ప్రధానోపన్యాసకులుగా, పిదప కరీంనగర్‌లో ప్రిన్సిపాల్‍గా వ్యవహరించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా 1970లో నియమితులయ్యారు. వీరి కుమారులు అచ్యుతదేవరాయలు దూరదర్శన్ చీఫ్ ఇంజనీరుగా ఢిల్లీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. విశ్వనాథ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి శిష్యులు. 1964లో ఆంధ్ర విశ్యవిద్యాలయం విశ్వనాథకు కళాప్రపూర్ణ ప్రదానం చేసింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించింది. 1962లో విశ్వనాధ ‘మధ్యాక్కరలు’ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
విశ్వనాథ ప్రముఖ రచనలు:
నవలలు:
వేయిపడగలు, చెలియలి కట్ట, ఏకవీర (సినిమా), తెఱచిరాజు, నేపాల రాజవంశ నవలలు ఆరు; కాశ్మీర రాజు వంశ నవలలు (ఆరు). పురాణవైర గ్రంథమాల (12 నవలలు).
పద్యకావ్యాలు:
రామాయణ కల్పవృక్షం, ఆంధ్ర ప్రశస్తి, ఋతుసంహారము, భ్రమరగీతలు, నా రాముడు, దమయంతీ స్వయంవరము, ఆంద్ర పౌరుషము, మా స్వామి.
నాటకాలు, విమర్శలు, శతకాలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెండ్లి – ఇలా శతాధిక గ్రంథాలు రచించారు. తనదైన శైలిలో ఎమెస్కో వారి ప్రబంధాల ప్రచురణలకు పీఠికలు వ్రాశారు. ఆయన ఒక యుగ పురుషుడు. ధీశాలి.
(1971లో ఎవరికి పద్మ భూషణ్ పురస్కారం రాలేదు).
ఏ. యస్. రావు (20 సెప్టెంబరు 1914 – 31 అక్టోబరు 2003):
అణు విజ్ఞానరంగంలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను పెంపొందించిన శాస్త్రవేత్తలలో అయ్యగారి సాంబశివరావు ప్రముఖులు. వీరికి 1972లో పద్మ భూషణ్ ప్రదానం చేశారు. హైదరాబాదులో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. పాఠశాల ఫీజు కట్టడానికి ఆయన తల్లి తన పెళ్లినాటి పట్టుచీరను 2 రూపాయలకు పాత చీరల దుకాణానికి అమ్మివేసింది. ఇక్కడ ప్రకాశం పంతులు తల్లి చేసిన ఇదే ఉదంతం గుర్తుకు వస్తుంది.
కష్టపడి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో యం.యస్.సి. ఫిజిక్స్ ఒంటిపూట భోజనంతో పూర్తిచేశారు. అమెరికా లోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలో యం.యస్. చేయాలని కోరిక. టాటా కంపెనీ వారి 40 వేల రూపాయాల ద్రవ్యసహాయం తోడ్పడింది. రావు మేధా సంపత్తిని అక్కడి అధ్యాపకులు మెచ్చుకొని 15వేల నెల జీతాన్ని ప్రతిపాదించారు. ఆయన సున్నితంగా తిరస్కరించి మాతృదేశ సేవకు విచ్చేశారు. టాటా కంపెనీ బొంబాయిలో నెలకు 300 రూపాయల జీతానికి కుదురుకున్నారు.
ఆయన భారతదేశ అణు రంగపు పితామహుడు. హోమీబాబా స్వయంగా బొంబాయి వెళ్లి రావు పరిశోధనను ప్రశంసించారు. ఆయన అంతర్జాతీయ సదస్సులో అణుశక్తిని శాంతియుత కార్యక్రమాలకే వినియోగించాలని వాదించారు. 1960లో పద్మ శ్రీ, 1965లో ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు, 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ లభించాయి. హైదరాబాదులో ఆయన పేర ఏ.యస్. రావ్ నగర్ ఏర్పడింది.
ఆయనలోని మానవత్వానికి ఉదాహరణగా ఒక సన్నివేశం ప్రచారంలో వుంది. 2003లో ఆయన ఆసుపత్రిలో (హైదరాబాదు) వెంటిలేటర్‌పై ఉన్నారు. ఒక డాక్టరు ఆయనకు ఆక్సిజన్ మాస్క్ తగిలించడానికి వచ్చారు. మరికొద్ది గంటలు మాత్రమే ఆయన జీవిస్తారని డాక్టరుకు తెలుసు. రావు మెల్లగా ఇలా అన్నారు:
“డాక్టర్, మీరు కుర్చీలోంచి లేచేటప్పుడు జాగ్రత్త! పైన ఉన్న మానిటర్ తలకు తగిలే అవకాశం ఉంది” అన్నారు పీల గొంతుతో. ఇతరుల కష్టాలను గుర్తెరిగి జీవించిన ఏ.యస్. రావు ధన్యజీవి. ఇప్పటికీ E.C.I.L. ఉద్యోగులు ఆయనను దైవసమానుడిగా గుర్తిస్తారు. 1972లో జియోఫిజిసిస్టు యం.బి. రామచంద్ర రావుకు కూడా పద్మ భూషణ్ లభించింది. ఆయన మైనూరువాసి.
సయ్యద్ హుస్సేన్ జాహీర్:
హైదరాబాదు లోని Indian Institute of Chemical Technology (I.I.C.T) రసాయనశాస్త్ర పరిశోధనలో గణనీయమైన కృషి చేసింది. R.R. లాబ్స్‌గా వ్యహరింపబడుతూ CSIR వారి అనుబంధ సంస్థగా పరిశోధనలు కొనసాగించింది. ఆ సంస్థ డైరక్టరుగా సయ్యద్ హుస్సేన్ జాహీర్ పని చేశారు. ఆయన ప్రతిభను గుర్తించి కేంద్రప్రభుత్వం CSIR (Council for Scientific and Industrial Research) డైరక్టర్ జనరల్‍గా నియమించింది. భారతదేశంలో శాస్త్రసాకేతిక రంగాల పురోభివృద్ధికి ఆయన కృషికి గుర్తింపుగా 1972లో పద్మ భూషణ్ ప్రకటించారు.
1951లో పరిశోధన చేసి ఆయన, ఇంద్రకిషోర్ కక్కర్‌తో కలిసి methaqualone సింథసైజ్ చేసే విధానాన్ని తొలిసారిగా కనుగొన్నారు. ఆయన పేర జాహీర్ ఫౌండేషన్ 2016 లో స్థాపించారు. కాన్పూరులోని I.I.T. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా – పదవీ విరమణానంతరం వ్యవహరించారు.
డా. జాహీర్ CSIR డైరక్టర్ జనరల్‍గా సెప్టెంబరు 1962 నుండి 1966 సెప్టెంబరు వరకు నాలుగేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డా. ఆత్మారామ్ ఆ పదవిని అలంకరించారు. 1995 నుండి 2006 వరకు డైరక్టర్ జనరల్‍గా పనిచేసిన ఆర్.ఏ. మషేల్కర్ హయాంలో ఈ సంస్థ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. డా. వై. నాయుడమ్మ (1971-77); ప్రొఫసర్ యం.జి.కె. మీనన్ (1978-81) ఈ సంస్థ కీర్తికిరీటాలు.
హైదరాబాద్లో IICT డైరక్టర్‌గా పనిచేసిన డా. యన్. చంద్రశేఖర్ (2020-2021) పదోన్నతిపై కేంద్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శిగా చేరారు.
హరీంద్రనాథ చటోపాధ్యాయ (1898 ఏప్రిల్ 2 – 1990 జూన్ 23):
బెంగాలీ, ఆంగ్లకవి, హిందీ సినిమా నటుడు హరీంద్రనాథ చటోపాధ్యాయ ఆంధ్రులకు సన్నిహితుడు. సరోజినీ నాయుడు ఈయన సోదరి. రవీంద్రనాధ్ ఠాగూరు ఈయనను తన సాహిత్య వారసుడిగా ప్రకటించారు. గాయకుడు, నటుడు, వక్త, నాటక రచయితగా, సృజనాత్మక వ్యక్తిగా ప్రసిద్ధులు. ఈయన అఘోరనాథ చటోపాధ్యాయ, వరదసుందరీదేవి దంపతులకు హైదరాబాదులో జన్మించారు. హైదరాబాదులో సెయింట్ జార్జి గ్రామర్ స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. స్వాతంత్రోద్యమంలో బొంబాయిలో ఉండగా జైలుకెళ్లారు.
1941లో బందరులో వున్నప్పుడు ఆయన అభినయించిన ‘కర్డ్ సెల్లర్’ వ్యంగ్య విమర్శనాత్మక రచన. వామపక్ష భావజాలం గల ఆయన ఆంధ్రప్రదేశ్ లోని అభ్యుదయ రచయితల సంఘానికి సన్నిహితులయ్యారు. విశ్వనాథ, విష్ణుశాస్త్రి, శ్రీశ్రీ, అబ్బూరి వంటి కవులతో స్నేహం బలపడింది. కమ్యూనిస్టులపై ఆంధ్రలో జరిగిన పోలీసు దౌర్జన్యాన్ని నిరసించి యలమర్రు – కాటూరుల్లో పోలీసులు గాంధీ విగ్రహం చుట్టూ ప్రజలను బట్టలు విప్పి ప్రదర్శించినపుడు హరీంద్రనాథ్ గొంతెత్తి ఖండించి ప్రజలను పొదువుకున్నారు.
1940లో సునీతా ఆర్ట్ సెంటర్ అనే ప్రదర్శనా బృందాన్ని ఏర్పరచారు. అభ్యుదయ గీతాలు రచించారు. టి.వి. సీరియళ్లలో (అడోస్-పడోస్) నటించారు. 1952లో విజయవాడ నియోజకవర్గం నుండి వామపక్ష పార్టీల మద్దతుతో స్వతంత్రుడిగా లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. ఆంధ్రులకు ఆత్మీయుడిగా నిలిచిపోయాడు. 1973లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ ప్రకటించింది. కమలాదేవి చటోపాధ్యాయతో కలిసి ‘అబూహసన్’ నాటకంలో నటించారు. ఫిలింస్ డివిజన్ వారు ఆయన జీవితంపై ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల చేశారు.
ఆయన వ్రాసిన ‘షురూ హువా హై జంగ్ హమారా’ అనే పాటను బ్రిటీషు ప్రభుత్వం నిషేధించి, ఆయనను జైలుకు పంపింది. మెహబూబా, ఆశీర్వాద్, సోనార్ కెల్లా – సినిమాలలో నటించారు. కొన్ని సినిమాలకు పాటలు వ్రాశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి హరంద్రనాథ్ చటోపాధ్యాయ.
Images Credit: Internet
(మళ్ళీ కలుద్దాం)