Site icon Sanchika

తెలుగుజాతికి ‘భూషణాలు’-23

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

~

నెల్లూరు గాంధీ – వెన్నెలకంటి రాఘవయ్య (1887 జూన్ 4- 1981 నవంబరు 24):

స్వాతంత్ర సమరయోధులు, గిరిజన సంక్షేమానికి అహరహం కృషి చేసి యానాది రాఘవయ్యగా పిలవబడ్డ వీరు ప్రముఖ న్యాయవాది. ఒక వినూత్న చరిత్రను సృష్టించి యానాదుల కోసం పోరాడిన వ్యక్తి. నెల్లూరు జిల్లా శింగపేటలో జన్మించారు. నెల్లూరు వెంకటగిరి రాజా పాఠశాలలో చదివి, మదరాసు పచ్చయప్ప కళాశాలలో 1918లో బి.ఏ. చేశారు. నెల్లూరు జిల్లా కాంగ్రెసు తొలి కార్యదర్శి. అక్కడి కార్యకర్తలను ప్రోత్సహించి ‘ స్వరాజ్య సంఘం’ స్థాపించారు. 1928లో బి.యల్ పట్టా రాగానే న్యాయవాదిగా పనిచేశారు.

వెంకటగిరి రాజుకు, రైతులకు మధ్య చెలరేగిన వివాదాలలో యన్.జి. రంగా పక్షాన నిలిచి రైతుల నాదుకున్నారు. టంగుటూరి ప్రకాశం పంతులుతో కలిసి స్వరాజ్యోద్యమంలో పాల్గొన్నారు. 1929లో ఆది-ఆంధ్ర ఉద్ధరణ సంఘం ఏర్పాటు చేసి హరిజన బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు ఏర్పాటు చేశారు. 1946లో ఉమ్మడి మదరాసు రాష్ట్ర శాసన సభకు నెల్లూరు నుండి ఎన్నికై 1947 వరకు ప్రకాశం పంతులుకు పార్లమెంటరీ కార్యదర్శిగా వున్నారు. సంచార ఆదిమ జాతుల వారిని గూర్చి పోరాడి వారి సమస్యలపై అనేక గ్రంథాలు వ్రాశారు. భారతీయ ఆదిమ జాతి సేవక్ సంఘంలో చురుకుగా పని చేశారు. సహాయ నిరాకరణోద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 21 నెలలు జైలు శిక్ష అనుభవించారు.

క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని 1952లో రద్దు చేయించిన సాహసికుడు. అమ్మే పనిమనుషులుగా గిరిజనులలో ఉన్న ఆచారాన్ని తుదముట్టించారు. రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి వీరి వియ్యంకులు. ఆంగ్లంలోను, తెలుగులతోను 35 గ్రంథాలు వ్రాశారు. ‘వెన్నెలకంటి రాఘవయ్య స్మృతి శకలాలు’ పేర వ్రాసిన ఆత్మకథను డా. కాళిదాసు పురుషోత్తం ప్రచురించారు. 1973లో రాఘవయ్యకు పద్మ భూషణ్ లభించింది. 84 ఏళ్ల జీవనాన్ని గిరిజనుల సంక్షేమం కోసమే వెచ్చించిన రాఘవయ్య ధన్యజీవి.

వకుళాభరణం లలిత రచించిన రాఘువయ్య జీవన చరిత్రను 2017లోఎమెస్కో ప్రచురించింది.

సినీదర్శకులు బి.యన్.రెడ్డి (1908 డిసెంబరు 2 – 1977 నవంబరు 8):

బి.యన్.రెడ్డిగా ప్రసిద్ధులైన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి కడపలో జన్మించారు. సినీ రంగంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, దర్శకుడిగా ఖ్యాతి గడించిన వీరికి 1974లో పద్మ భూషణ్ లభించింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు రెడ్డి. ఈయన సృష్టించిన ‘మల్లీశ్వరి’ చిత్రం ప్రజాదరణ పొందింది. వ్యాపారరీత్యా తండ్రి ఉల్లిపాయలను మదరాసు నుండి రంగూన్‌కు ఎగుమతి చేస్తుందంటంతో రెడ్డి మదరాసులో చదివారు. నాటకాలలో వేషాలు వేశారు. వరవిక్రయంలో ఆయన నటనను చూచి గాంధీజీ ప్రశంసించారు. స్వదేశ ఉద్యమ ప్రభావంతో తండ్రిగారి వ్యాపారాన్ని కాదని శాంతినికేతన్‌లో కొంత కాలం గడిపారు. రంగూన్‌లో ఉన్నపుడు వారి జానపద కళారూపాలను చూసి ఆకర్షితుడయ్యారు. మదరాసు తిరిగి వచ్చి చలన చిత్రరంగం వైపు దృష్టి మళ్ళించారు.

అప్పట్లో సినిమారంగ వ్యక్తులకు గౌరవాదరాలు తక్కువ. 1952 వరకు సెన్సారింగ్ ఉండేది కాదు. బి.యన్.రెడ్డి మొదటినుండి చివరి వరకు ఉత్తమ ప్రమాణాలు గల సినిమాలే తీశారు. 1931లో తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదను హెచ్.యం.రెడ్డి దర్శకుడిగా, కన్నాంబ నటిగా తీశారు. 1938లో రోహిణి పిక్చర్స్ స్థాపించి రంగూన్ రౌడీ స్టేజి నాటకం ఆధారంగా ‘గృహలక్ష్మి’ సినిమా ప్రారంభించారు. దానికి బి.యన్.రెడ్డి సహాయ దర్శకుడు కాగా హెచ్.యం. రెడ్డి దర్శకుడు. ఆ సినిమా నిర్మాణ సమయంలో అసభ్య సన్నివేశాల చిత్రకరణను నిరసిస్తూ బి.యన్.రెడ్డి విడిపోయారు.

వాహిని పిక్చర్స్ స్థాపించి తెలుగు చలనచిత్రరంగంలో నూతనాధ్యాయం సృష్టించారు. ఆయన తీసిన తొలి చిత్రం ‘వందేమాతరం’ (1939). 1940లో ‘సుమంగళి’ చిత్రం తీశారు. 1941లో ‘దేవత’ చిత్రం విడుదలైంది. అది దక్షిణ భారతంలో సంచలనం సృష్టించింది. కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘భక్త పోతన’ (1942), ‘యోగి వేమన’ (1947) విడుదలయ్యాయి. 1945లో తీసిన ‘స్వర్గసీమ’ తొలిసారిగా వియత్నాం ఫిల్మ్ ఫెస్టివల్‍లో విదేశ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ‘మల్లీశ్వరి’ (1951) పెద్ద హిట్.

1938 నుండి 1966 వరకు ఆయన నిర్మాతగా, దర్శకుడిగా 14 సినిమాలకు పనిచేశారు. కలైమామణి, గౌరవ డాక్టరేట్ లభించాయి. శాసనమండలి సభ్యత్వం లభించింది. చలనచిత్ర రంగంలో ఆయన ధృవతార!

దేవులపల్లి కృష్ణశాస్త్రి (1 నవంబరు 1897 – 24 ఫిబ్రవరి 1980):

భావకవితారంగంలో వినూత్న ఒరవడిని సృష్టించి ఆధునిక కవులంతా వేషధారణలోను, గిరజాల జుట్టు తోను తిరుగాడేలా చేసిన కవి కృష్ణశాస్త్రి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపంలోని చంద్రపాలెంలో పండిత కుటుంబంలో జన్మించారు. పిఠాపురం పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి గురువులు దొరకడం తన అదృష్టంగా చెప్పేవారు.

1918లో నిజయనగరం కళాశాలలో డిగ్రీ చదివారు, వెంటనే పెద్దాపురం మిషన్ హైస్కూల్‍లో అధ్యాపకులయ్యారు. బ్రహ్మసమాజ ప్రభావంతో ఉద్యోగం మాని ఆ సంస్థ కార్యకలాపాలలో పాల్గొన్నారు. సాహితీ వ్యాసంగం కొనసాగింది. అనారోగ్యం రాగా వైద్య కోసం రైలులో బళ్ళారి బయలుదేరారు. ప్రకృతి ప్రేరణతో ‘కృష్ణ పక్షం’ రచించారు. అది ఆయనకు ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1922లో భార్యా వియోగ భారంతో విషాద కావ్యాలు వ్రాశారు. పిఠాపురంలోని హరిజన వసతిగృహంతో అనుబంధం పెంచుకొన్నందుకు బంధువులు ఆయనను వెలివేశారు. వేశ్యావివాహ సంస్థ ద్వారా ఎందరో కళావంతులకు వివాహాలు జరిపించారు. 1929లో ఠాగూరుతో పరిచయం ఏర్పడింది. 1933-41 మధ్య కాకినాడ పి.ఆర్. కళాశాలలో అధ్యాపకులయ్యారు.

1942లో బి.యన్.రెడ్డి ప్రోత్సాహంతో ‘మల్లీశ్వరి’ చిత్రానికి పాటలు వ్రాశారు. “ఆపాతమధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిది” అని శ్రీశ్రీ ప్రశంసించారు. సుకుమారంగా, లాలిత్యంతో కవితలు వ్రాశారు. ప్రణయ విరహ గీతాలకు ఆయనకు ప్రసిద్ధి. ‘ఊర్వశి’ కావ్యం ప్రశస్తం. 1957లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సాహిత్యవిభాగ ప్రొడ్యూసర్‍గా చేరారు. అనేక గేయాలు, రేడియో నాటకాలు, ప్రసంగాలు వ్రాశారు.

‘ఆంధ్రా షెల్లీ’ గా ఆయనకు పేరు. ఆయన 170 సినిమాలకు పాటలు వ్రాశారు. ఎందరో సినీ కవులు వచ్చినా కృష్ణశాస్త్రి బాణీ ప్రత్యేకం. 1963లో ఆయన గొంతు మూగపోయింది. కాగితాలపై వ్రాసి చూపేవారు. “అందమైన కందపద్యం పద్మనాభరావు” అని నన్ను చూడగానే కాగితం మీద వ్రాసి చూపారు. కృష్ణశాస్త్రి కుమారుడు బుజ్జాయి, మేనకోడళ్లు వింజమూరి సీతాదేవి (రేడియోలో ప్రొడ్యూసర్), అనసూయదేవి సోదరీమణులు. ‘ఆకులో ఆకుకై పూవులో పూవునై’ అని పలవరించిన కృష్ణశాస్త్రి ఆత్మాశ్రయ కవిత్వానికి పట్టం గట్టిన యశస్వి.

నేత్రవైద్య నిపుణులు డా. పి. శివారెడ్డి (12 సెప్టెంబరు 1920 – 6 సెప్టెంబర్ 2005):

నేత్ర వైద్యరంగంలో చరిత్రను సృష్టించిన పెరుగు శివారెడ్డి రాష్ట్రపతికి నేత్రవైద్య నిపుణులు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి 1946లో నేత్రవైద్యం ప్రత్యేకాంశంగా యం.బి.బి.యస్ సాధించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1952లో యం.యన్. సంపాదించారు. హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజిలో చేరారు. మెహెదీపట్నం లోని సరోజినీ దేని నేత్ర వైద్యశాల డైరక్టర్‌గా ఆమరణాంతం రోగుల సేవలు చేశారు.

భారతదేశంలో తొలిసారిగా 1964లో టి.యల్. కపాడియా ‘ఐ బ్యాంకు’ స్థాపించారు. పేదలకు సహాయపడేలా దాదాపు 500 నేత్రరోగ శిబిరాలు నిర్వహించారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలతో వాటిని ఏర్పాటు చేయడం విశేషం. అంతర్జాతీయ సదస్సులలో 200 పరిశోధనాపత్రాలు సమర్పించారు. కాటరాక్టు ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో కుట్లు లేకుండా సున్నితంగా చేయడంలో ఆయన నేర్పరి. వైద్య విద్యార్థుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారని ప్రతీతి.

మూడు లక్షల కాటరాక్టు ఆపరేషన్లు చేసిన ఒక డాక్టరుగా ప్రపంచ రికార్డు స్థాపించారు. 1990 లలో కర్నూలులో ఏర్పరిచిన ప్రభుత్వ నేత్ర వైద్యశాలకు ఆయన పేరు పెట్టారు. చిరంజీవి తాను స్థాపించ దలచిన ఐబ్యాంకు విషయంలో శివారెడ్డిని సంప్రదించి సలహా పొందారు. ఇప్పులడి ప్రజాసేవలో మేటి. రోగుల పట్ల ఆయన దయతో ప్రవర్తించేవారు.

శివారెడ్డిని వరించిన పురస్కారాలు:

  1. పద్మ శ్రీ, 1971
  2. పద్మ భూషణ్, 1977
  3. డా. బి. సి. రాయ్ అవార్డు, 1982
  4. ఏసియా పసిఫిక్ అకాడమీ అవార్డు 1985

హైదరాబాదులోని శివారెడ్డి నేత్రవైద్యశాల రోగుల పాలిట వరప్రసాదిని. సరోజినీ దేవి నేత్ర వైద్యశాల కీర్తి ప్రతిష్ఠలకు శివారెడ్డి కారకులు. కర్నూలు జిల్లా గిన్నెదేవరపాడులో జన్మించిన రెడ్డికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు గతించారు. తల్లి గ్లకోమాతో మరణించడం ఆయన నేత్రవైద్య విద్యకు దారితీసింది. తన బాల్య స్నేహితుడు, ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్యను ఒప్పించి సరోజినీ దేని ఆసుపత్రిని కేవలం కంటి వైద్యానికే పరిమితం చేయించారు. 1969లో రాష్ట్రపతి వి.వి.గిరి ద్వారా సరోజినీ నాయుడు విగ్రహాన్ని ఆసుపత్రి ఆవరణలో ఆవిష్కరింపజేశారు. ఆసుపత్రి ఆవరణలో రోగులకు సత్రం ఏర్పరచారు. ధన్యజీవి శివారెడ్డి.

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version