[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
~
[జనతా ప్రభుత్వ హయాంలో 1978, 1979, 1980 సంవత్సరాలలో పద్మ పురస్కారాలు ప్రకటించలేదు. 1981లో తెలుగువారికి పద్మ భూషణ్ దక్కలేదు. 1982 నుండి అందిన వివరాలివి.]
రైతు పెద్ద గొట్టిపాటి బ్రహ్మయ్య (3 డిసెంబరు 1889-19 జూలై 1984):
కృష్ణాజిల్లా చినకళ్ళేపల్లిలో రైతు కుటుంబంలో బ్రహ్మయ్య జన్మించారు. అదే గ్రామంలో ప్రసిద్ధ సాహితీవేత్త వేటూరి ప్రభాకరశాస్త్రి కూడా పుట్టారు. గ్రంథాలయోద్యమంపై ఆసక్తి చూపి 1917లో బ్రహ్మయ్య గ్రంథాలయాల వ్యాప్తికి తోడ్పడ్డారు. ఆదే రీతిలో వయోజన విద్య ద్వారా నిరక్షరాస్యతకు శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా 1922-23 మధ్య వ్యవహరించి స్వాతంత్రోద్యమంలో కృషి చేశారు. ఖాదీ వస్త్రధారణకు గాంధీజీ అందించిన పిలుపు నందుకొని ఖాదీ వ్యాప్తి కోసం 1923-29 మధ్య కృష్ణాజిల్లా ఖాదీ బోర్డు అధ్యక్షులుగా ప్రచారం చేశారు.
యన్.జి.రంగా చేపట్టిన – జీమీందారీ రైతు ఉద్యమంలో బ్రహ్మయ్య పాల్గొన్నారు. గాంధీజీ పిలుపునందుకొని సైమన్ కమీషన్ బహిష్కరణ ఉద్యమంలోను, ఉప్పు సత్యాగ్రహగంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను క్రియాశీలకంగా పనిచేశారు. ఫలితంగా జైలు శిక్షలనుభవించారు.
బ్రిటీషు గవర్నరు రాకకు నిరసన తెలిపినందుకు ఒకటిన్నర సంవత్సరం జైలు శిక్షను మచిలీపట్నంలో అనుభవించారు. అలానే రాజమండ్రి, బరంపురం, బళ్లారి, మదరాసు, కడలూరు జైళ్లలో గడిపారు. 1933లో ఘంటసాలలో దళితుల ఆలయు ప్రవేశానికి నడుం కట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు వెల్లూరు, తంజావూరు రైళ్లలో ఉన్నారు.
పదవీ బాధ్యతలు:
- 1962లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షత
- 1964 జూలై- 1968 జూన్ వరకు – ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షత
ఆయన ఆత్మకథ ‘నా జీవననౌక’ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. వారి జీవితచరిత్రను గొర్రెపాటి వెంకట సుబ్బయ్య రచించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణతో సత్కరించారు. 1982లో పద్మ భూషణ్ లభించింది.
[1983లో పద్మ భూషణ్ తెలుగు వారికి రాలేదు. 1984లో ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తికి, డా. శ్రీపాద పినాకపాణికి లభించింది. సచ్చిదానందమూర్తి వివరాలు 2001లో పద్మ విభూషణ్ సందర్భంగా ప్రస్తావించాను.]
సంగీత శిఖరం డా. శ్రీపాద పినాకపాణి (3 ఆగస్టు 1913 – 11 మార్చి 2013):
వృత్తి రీత్యా పినాకపాణి వైద్యులు. వైద్య కళాశాల ప్రొఫెసర్‍గా కర్నూలులో ఎందరో వైద్యులను తయారు చేశారు. తమిళనాడులో వలె తెలుగునాట సంగీత పరిమళాలు గుబాళించని రోజుల్లో ఎందరో శిష్యులను కర్ణాటక సంగీతంలో ఉద్దండులుగా తీర్చిదిర్చిన ఘనులు. నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన్న సత్యనారాయణ, వోలేటి వెంకటేశ్వరులు వంటి సంగీతజ్ఞులకు ఆయన గురుదేవులు.
శ్రీకాకుళం జిల్లా ప్రియ అగ్రహారంలో జన్మించిన పినాకపాణి కొద్ది నెలలు ద్వారం వెంకటస్వామి నాయుడు పాఠశాలలో వయోలిన్ అభ్యసించారు. 1932లో యం.బి.బి.యస్.లో చేరారు. విశాఖపట్టణం ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి 1945లో జనరల్ మెడిసన్ యం.డి. పట్టా సంపాదించారు. 1944-49 మధ్య మదరాసు మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర సర్వీసును ఎంచుకుని 1951లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1954 మే నుండి 1957 జనవరి వరకు ప్రొఫెసరుగా విశాఖపట్టణంలో వున్నారు. 1957 జనవరి నుండి 1968 ఆగస్టు వరకు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రొఫెసరు ఉండి రిటైరయ్యారు.
ప్రముఖ సంగీత విద్వాంసులు:
వివిధ ప్రాంతాలలో కర్ణాటక సంగీత కచేరీలు, సంగీతోత్సవాలలో చేశారు. మల్లాది సోదరులు వీరి వద్ద సంగీత శిక్షణ పొందారు. కర్ణాటక సంగీతం, గానకళాసర్వస్వం పలు సంపుటాలు ఆయన సంగీత రచనలు. 99 ఏళ్ళ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన మేధావి పినాకపాణి. ఆకాశవాణి ‘టాప్ గ్రేడ్’ ఆర్టిస్ట్‌గా కడప కేంద్రానికి వారి సతీమణితో విచ్చేసినప్పడు పలుమార్లు నేను రికార్డింగులు చేసే అవకాశం లభించింది. ఆయన 99వ జన్మదినోత్సవం నాడు 2012లో తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ‘గానవిద్యావారధి’ బిరుద ప్రదానం చేసింది. సంగీతకళానిధి, సంగీతకళాశిఖామణి, సంగీత నాటక అకాడమీ అవార్డు, 1977; ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, 1978; సంగీత నాటక అకాడమీ ఠాగూరు రత్న2011 – ఆయన కీర్తికిరీటంలో మణులు.
వీరి రచనలు:
- సంగీత సౌరభం (4 సంపుటాలు),
- సంగీత యాత్ర,
- మేళ రాగమాలిక
- మనోధర్మ సంగీతం
- పల్లవి గానసుధ
సంగీతమే జీవితంగా గడిపిన యశోధనుడు పినాకపాణి. శ్రీపాద చిన్మయి వారి మనుమరాలు. ఆమె సినీసంగీతం, 2500 పాటలకు సమకూర్చారు.
వేద పండితులు ఉప్పులూరి గణపతి శాస్త్రి (11 డిసెంబరు 1888 – 17 జులై 1989):
వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసార ప్రచారానికి కంకణం కట్టుకొని జీవితాంతం శ్రమించి 101 సంవత్సరాలు జీవించిన పూర్ణ పురుషులు ఉప్పులారి గణపతిశాస్త్రి. తూర్పుగోదావరి జిల్లాలో వేదశాస్త్ర పండితవంశంలో జన్మించారు. అత్యంత నైష్ఠిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా అంటరానినాన్ని పాటించలేదు. సత్యసాయిబాబా వీరి మీది గౌరవంలో తమ ప్రశాంతినిలయంలో యజ్ఞయాగాదులు వీరి చేత నిర్వహించేవారు.
తిరుమలలో 1982 ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి. వి. ఆర్. కె. ప్రసాద్ సూచన మేరకు గణపతి శాస్త్రి తిరుమలలో వరుణ యాగం జరిపించారు. తిరుమలలో కుంభవృష్టి కురిసింది.
పిఠాపురం సంస్థానంలో ఆస్థాన విద్వాంసుని పదవి వంశపారంపర్యంగా లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆస్థాన వేద పండితునిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్థాన వేద పండితునిగా సత్కరించింది. ఖండవల్లి లక్ష్మీ రంజనం సంపాదకత్వంలో వెలువడిన సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో గణపతిశాస్త్రి యజుర్వేద సమాచారాన్ని రచించారు.
హైదరాబాదు వెస్ట్ మారేడ్‌పల్లిలో నివాసముండేవారు. ప్రతి నిత్యం తన నివాసం నుండి చిక్కడపల్లిలోని వేద సంస్థలో జరిగే గణస్వస్తి కోసం 12 మైళ్లు వేదాలు వల్లిస్తూ శిష్యులతో కలిసి నడిచి వెళ్ళేవారు. కనీసం పాదరక్షలు కూడా ధరించలేదు. వేదంలోని తత్వాన్ని శిష్యులకు బోధించి తరించిన ప్రతిభామూర్తి. ‘వేదసారరత్నావళి’ అనే గ్రంథం రచించారు. 1988లో పద్మ భూషణ్ పురస్కారం లభించింది.
వీరి తండ్రి గంగాధర శాస్త్రి వ్యాకరణశాస్త్రం, వేదాలు, శ్రౌతం, తర్క శాస్త్రాలలో గొప్ప పండితులు. వారి వద్ద గణపతి శాస్త్రి వేదాలు అభ్యసించారు. 18వ ఏటనే యజ్ఞంలో పాల్గొన్నారు. రెండో శతాబ్దులుగా వారి కుటుంబం వేదాలకు అంకితమైంది. కృష్ణ యజుర్వేదంలో ఆయన నిష్ణాతులు. దేవాలయంలో వేద పండితుల నియామకం ఆంధ్రప్రదేశ్‍లో జరగడానికి ఆయన మూలకారకులు. మహిళల అభ్యున్నతి గూర్చి ఆయన ప్రచారం చేశారు. రోజూ ప్రాతః కాలంలో 1.30 గంటలకు లేచి 2 గంటలు యోగాభ్యాసం చేసేవారు. పూజా పునస్కారాల తర్వాత వేదాధ్యాపనం చేసేవారు. శృంగేర పీఠాధిపతి వీరిని ‘వేదభాష్యాలంకార’ బిరుదంతో సత్కరించారు. రాష్ట్రవతి యస్. రాధాకృష్ణన్ వీరిని గౌరవించారు. మరునాడు గురుపూర్ణిమ అనగా ముందురోజు కాలధర్మం చేశారు. గురుపూర్ణిను సభకు యావదాంధ్ర దేశం నుండి విచ్చేసిన వేద పండితులు నివాళులు అర్పించారు
నోరి గోపాల కృష్ణమూర్తి: (16 ఫిబ్రవరి 1910 – 24 ఫిబ్రవరి 1995)
నోరి గోపాలకృష్ణ మూర్తి బాపట్ల బోర్డు స్కూల్లో 1924లో 14వ ఏట యస్. యస్. యల్. సి పూర్తి చేశారు. 1930లో మదరాసులోని గిండీ ఇంజనీరింగు కళాశాల నుండి సివిల్ ఇంజనీరింగు డిగ్రీ చదివారు. 1931 లో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇంజనీరింగు సర్వీసులో చేరారు.
మిలిటరీ సర్వీసు:
నోరి మధుసూదన విఠల్ గోపాలకృష్ణమూర్తికి 1972లో పద్మ భూషణ్ లభించింది. 1963 అక్టోబరు 7న ఆయన భారత వైమానిక దళాలలో చేరారు. 25వ బ్యాచ్ డి.ఇ.ఓ కోర్సు మిలిటరీలో చేశారు. 1998 మార్చి 31న పదవీ విరమణ చేశారు. ప్లాన్ ఆఫీసరుగా 1964 అక్టోబరులోను, ప్లయిట్ లెఫ్టినెంట్‍గా 1968 అక్టోబరులోను, వింగ్ కమాండర్‍గా 1984 నవంబరు లోనూ, 1994 మేలో గ్రూప్ కెప్టన్ గాను పదవీ బాధ్యతలు నిర్వహించారు.
బాపట్ల సమీపంలోని చిరు గ్రామంలో నోరి జన్మించారు. వీరి శిలా విగ్రహాన్ని బాపట్లలోని పటేల్ నగర్‌లో 2016 ఏప్రిల్‍లో ఆవిష్కరించారు. ఆయన ప్రముఖ హైడ్రో ఎలక్ట్రికల్ ఇంజనీరు. ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో చేరి గణనీయమైన కృషి చేసి ఖ్యాతి గడించారు. వీరికి 1963లో ‘పద్మ శ్రీ’ పురస్కారం లభించింది.
జి. రామానుజం:
ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా అదనపు బాధ్యతలు 1997 ఆగస్ట్ నుండి 3 నెలలు నిర్వహించిన ట్రేడ్ యూనియన్ నాయకులు జి. రామానుజానికి 1985లో పద్మ భూషణ్ ప్రకటించారు.
Images Credit: Internet
(మళ్ళీ కలుద్దాం)