[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
~
నిరాడంబర జీవి వావిలాల గోపాలకృష్ణయ్య (17 సెప్టెంబరు 1906 – 29 ఏప్రిల్ 2003):
స్వాతంత్ర సమర యోధుడు, గాంధేయవాది అయిన గోపాలకృష్ణ అసలు సిసలైన గాంధేయవాది. ముతక ఖద్దరు వస్త్రాలు, చంకలో ఒక జత బట్టల ఖాదీ సంచి – ఇదీ ఆయన స్వరూపం. మాట్లాడడం మొదలెడితే గణాంకాలతో సహా గంటల తరబడి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వగల సమర్థులు. విజయవాడలో రేడియో ఇంటర్వ్యూ చేసినపుడు నేను ఆయన జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోయాను.
1952లో ఉమ్మడి మదరాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. 1955, 1962, 1967 సంవత్సరాలలో సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి గెలుపొందారు. ఆంధ్రా గాంధీగా పలువురు పిలిచేవారు. 1974-77 మధ్య ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు. 1992లో ‘పద్మ భూషణ్’ పురస్కారం వరించింది. తెలుగులో 45, ఆంగ్లంలో 10 పుస్తకాలు రచించారు. 1922లో తొలి రచన ‘శివాజీ’ ప్రచురించారు. శాసనసభలో ఆయన ప్రసంగాలను అధికారపక్ష సభ్యులు ఆసక్తిగా వినేవారు. అజాతశత్రువు, ఆజన్మబ్రహ్మచారి. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా స్వాతంత్ర సిద్ధి కోసం అహరహం కృషి చేశారు. శ్వాసకోశ వ్యాధితో హైదరాబాదు నిమ్స్‌లో వైద్యం చేయించుకొని తుది శ్వాస వదిలారు.
1992లో నలుగురు తెలుగువారికి ‘పద్మ భూషణ్’ ప్రకటించారు. వావిలాల, జగ్గయ్య, ఏ.ఆర్.కృష్ణ, సి. నారాయణరెడ్డి.
కళా వాచస్పతి కొంగర జగ్గయ్య 1 31 డిసెంబర్ 1926 – 5 మార్చి 2004):
“ఆకాశవాణి – తెలుగులో వార్తలు చదువుతోంది కొంగర జగ్గయ్య” అని తన కంచుకంఠంతో ఢిల్లీ నుండి 1947 ప్రాంతాలలో వార్తలు చదివారు జగయ్య. మేఘ గంభీరమైన కంఠస్వరం ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరం. తెనాలికి సమీపంలోని మోరంపూడి అనే గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించారు. 11 సంవత్సరాల వయసులో ‘సీత’ అనే హిందీ నాటకంలో ‘లవుడి’ పాత్ర పోషించారు. విద్యార్థిగానే కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొన్నారు.
త్రిపురనేని గోపీచంద్ తీసిన ‘ప్రియురాలు’ సినిమాతో సినీరంగ ప్రవేశం జరిగింది. 1950 నుండి 70ల వరకు చిత్రసీమలో కథానాయకుడిగా, సహాయ నటుడిగా, విలన్‍గా నటించారు. దాదాపు 500 చిత్రాలలో పాత్ర పోషణ చేసి ప్రేక్షకాదరణ పొందారు. వందకు పైగా సినిమాలలో డబ్బింగు చెప్పారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో రూథర్‌ఫర్డ్ పాత్ర సంభాషణలు గగుర్పాటు కలిగించాయి. ఆయన నిర్మించిన ‘పదండి ముందుకు’ సినిమా 1962లో రాష్ట్ర ప్రభుత్వ సబ్సీడీని పొందిన తొలి చిత్రం. ఈ సినిమాని రష్యాలో తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
రాజకీయ జీవితం:
చిన్నతనం నుండి కాంగ్రెసులో పనిచేసినా, జయప్రకాష్ నారాయణ స్థాపించిన సోషలిస్టు పార్టీలో చేరారు. 1956లో నెహ్రూ గారి పిలుపునందుకుని కాంగ్రెసులో చేరారు. 1967లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి 80 వేల ఓట్ల మెజారిటీటో గెలుపొందారు. ఒంగోలు కమ్యూనిస్టుల కంచుకోట. అయినా కంచుకంఠం జయించింది. జగ్గయ్య రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించారు. రవీంద్రుని నాటకాన్ని ‘బలిదానం’గా తెలుగులోకి తెచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, ఢిల్లీ సంస్కృత విశ్వవిద్యాలయం కళా వాచస్పతి, కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ (1992), ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, తమళనాడు ప్రభుత్వం కలైమామణి – బిరుదులు ఆయనకు లభించాయి. 1995 డిసెంబరు 1న ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకలు విజయవాడలో జరిపినపుడు నా ఆహ్వానం మన్నించి జగ్గయ్య ఆ సభలో పాల్గొని మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడం మరపురాని సంఘటన.
నాటకోద్యమ దిగ్దర్శకుడు ఏ. ఆర్. కృష్ణ (13 నవంబరు 1926 – 10 నవంబరు 1992)
ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి పునరుజ్జీవనం కల్పించిన వ్యక్తి ఏ.ఆర్. కృష్ణ (అడుసుమల్లి రాధాకృష్ణ శాస్త్రి). 1954లోనే హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం స్థాపించి నాటక రంగాభివృద్ధికి అవిరళ కృషి చేశారు. టిక్కెట్లు కొని నాటకానికి వెళ్లే ఆలవాటును ప్రవేశపెట్టి విజయం సాధించారు. గుంటూరు జిల్లా పెరవలిలో జన్మించి శ్రీకాకుళం, బెజవాడ, మచిలీపట్టణాలలో విద్యాభ్యాసం చేశారు. యల్.యం.ఇ. చదువుకై హైదరాబాదు వచ్చి, హైదరాబాదు విమోచనోద్యమంలో పాల్గొని అజ్ఞాతవాసంలో గడిపారు. బయటకు వచ్చి సోషలిస్ట్ పార్టీలో చేరారు. కానీ 1948 నాటికే రాజకీయాల నుండి విరమించారు.
‘రంగస్థల శాస్త్రం’ అనే అత్యద్భుత గ్రంధం రచించారు. కళాకారులకు వివిధ అంశాలలో శిక్షణ నిచ్చారు. రాష్ట్రేతర ప్రాంతాల నుండి నాటక సమాజాలను ఆహ్వానించి 15వ వార్షికోత్సవ సందర్భంగా 33 రోజులపాటు ప్రదర్శనలు ఇప్పించారు 1974లో ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన ‘మాలపల్లి’ నవలను నాటకీకరించి వందమంది కళాకారులతో సహజ సెట్టింగులతో నాటక ప్రదర్శన జరిపారు. ఒకే వేదికపై వరుసగా 33 సార్లు ప్రదర్శనలిచ్చారు. భారతదేశమంతా తిరిగి వంద ప్రదర్శన లివ్వకం విశేషం. జానపద కళాస్వరూపమైన తోలుబొమ్మలాటును ప్రోత్సహించారు. ‘నాట్యమిత్ర పథకం’ ప్రవేశపెట్టి నాటకాభిమానులను సభ్యులుగా చేర్చారు. 1971లో రంగస్థల కళాకారుల సంఘం స్థాపించడం ఆయన చొరవ వలన సాధ్యపడింది. యక్షగానానికి రంగస్థలంపై ప్రాణప్రతిష్ఠ చేసిన విశిష్ట వ్యక్తి కృష్ణ. 1992లో ఏ.ఆర్. కృష్ణకు, సి.నారాయణరెడ్డికి పద్మ భూషణ్ పురస్కారం లభించింది. నాటకానికి, థియేటర్‌కు ఉన్న అనుబంధాన్ని పరిశోధనాత్మకంగా పరిశీలించిన ఘనుడు ఏ.ఆర్. కృష్ణ.
తెలుగు జ్ఞానపేటి – సి. నారాయణరెడ్డి (29 జులై 1931 – 12 జూన్ 2017)
సి.నా.రె.గా సుప్రతిష్ఠిలైన సింగిరెడ్డి నారాయణరెడ్డి అదృష్ట జాతకుడు. ఆయనను పదవులు వరించి వచ్చాయి. తెలంగాణలోని మారుమూల గ్రామం హనుమాజీపేటలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. సినీ రచయితగా ప్రసిద్ధికెక్కారు. తాను చదువుకొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే అధ్యాపకుడిగా చేరి తెలుగులో ఆచార్యుడిగా ఎందరో వర్ధిష్ణులకు మార్గదర్శి అయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా మంచి పేరు. రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రపతిచే 1997లో నామినేట్ చేయబడి అనేకాంశాలను సభలో ప్రస్తావించారు. ఆయన రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత ఈ పురస్కారం పొందిన రెండవ తెలుగు వ్యక్తి ఆయనే.
పద్యకావ్యాలు, గేయకావ్యాలు, వచనకవితలు, గద్యకావ్యాలు, యాత్రాకథనాలు సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, గజళ్లు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు – ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలలో తలస్పర్శిగా రచనలు చేశారు. రామప్ప సంగీత రూపకం అన్ని భారతీయ భాషలలోకి అనువదించబడింది. ఆయన పరిశోధనా గ్రంథం – ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’ ప్రామాణిక గ్రంథం. వీరి రచనలను ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, మలయాళం, ఉర్దూ, కన్నడ, ఫ్రెంచ్ భాషలలోకి అనువదించారు. ఆయన పలు విదేశాలలో పర్యటించి ఉపన్యసించారు. స్రవంతి మాసపత్రికకు ప్రధాన సంపాదకులు.
పురస్కారాల పంట:
- జ్ఞానపీఠ పురస్కారం,
- ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారు.
- భారతీయ భాషా పరిషత్ పురస్కారం
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
- రాజా – లక్ష్మీ పురస్కారం
- సోవియెట్ నెహ్ర పురస్కారం
- పద్మ శ్రీ, పద్మ భూషణ్ (1992)
Images Credit: Internet
(మళ్ళీ కలుద్దాం)