[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
~
నాట్యమయూరి స్వప్నసుందరి:
స్వప్నసుందరి కూచిపూడి, భరతనాట్య నృత్య కళాకారిణి. ఈమె తల్లి ప్రసిద్ద గాయని వక్కలంక సరళ. స్వప్నసుందరి చెన్నైలో జన్మించారు. తెనాలి, కాకినాడలలో నివసించి ఢిల్లీలో స్థిరపడ్డారు. ఈమె భర్త అంశుమాన్ హర్యానా కేడర్ IAS ఆఫీసరు. వీరు సుష్మా స్వరాజ్ కేంద్ర సమాచార ప్రసారశాఖల మంత్రిగా వుండగా ఆమె వద్ద కార్యదర్శి.
స్వప్నసుందరి కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని పసుమర్తి సీతారామయ్య, వెంపటి చిన సత్యం వద్ద అభ్యసించారు. తల్లి సరళ ప్రముఖ సినీగాయని. స్వప్నసుందరి భరతనాట్యాన్ని కె.యస్. దక్షిణామూర్తి, అడయార్ లక్ష్మణ్ కళ్యాణ సుందరంల వద్ద నేర్చుకున్నారు. కర్నాటక సంగీతంలోను అపార జ్ఞానం సంపాదించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు టి. ముక్త వద్ద ‘పదములు’ ఆలపించడంలో శిక్షణ పొందారు.
ఆలయ సంప్రదాయ నృత్యాల మీద ఎంతో శ్రమతో పరిశోధనలు కొనసాగించారు. మరుగునపడిన విలాసినీ నృత్యాన్ని వెలికితీసి పునరుద్ధరించారు. ఈమె సోదరి వక్కలంక పద్మ ‘గోరింటాకు’ (1975) సినిమాలో నటించింది. స్వప్నసుందరి ప్రతి ఏటా తన తల్లి వక్కలంక సరళ స్మారకార్థం ఆగస్టు 8న ‘స్వరలహరి – కర్ణాటక సంగీత కచేరీ’ నిర్వహిస్తారు. యువ గాయనీ గాయకుల చేత సరళ గారు స్వరపరచిన పాటలను పాడిస్తారు.
స్వప్నసుందరికి 2003లో పద్మ భూషణ్ పురస్కారం లభించింది. అలానే సాహిత్య కళా పరిషత్, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు లభించాయి.
The World of Kuchipudi Dance; Tracing the Roots of the Classical Dance అనే పుస్తకాలు రచించారు. ఢిల్లీలో కూచిపూడి డాన్స్ సెంటర్ స్థాపించి ఎందరినో తయారు చేశారు. నృత్యదర్శకురాలుగా ప్రసిద్ధి, వాగ్గేయకారులలో గుర్తింపు పొందిన మహిళ ఆమ్రపాలి రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వ పురస్కారం వరించింది. మూడు నాట్యరీతుల సాధనకర్త. ఆమె నాట్యానికి స్వీయ గాత్ర సహకారం ఆమె ప్రత్యేకత.
ఆర్థిక శాస్త్రవేత్త సి. హనుమంతరావు (15 మే 1929):
డా. చెన్నమనేని హనుమంతరావు హైదరాబాదు రాష్ట్రంలోని సిరిసిల్లలో జన్మించారు. ఆయన నిజాం కాలేజీలో 1955లో బి.ఏ. చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1957లో ఎకనామిక్స్ ఎం.ఎ. చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1962లో ఎకనామిక్స్‌లో పిహెచ్.డి చేసి, 1966-67 మధ్య చికాగో విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టరల్ డిగ్రీ సంపాదించారు. వీరి సోదరులు రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. మరో సోదరుడు విద్యాసాగరరావు బి.జి.పిలో చేరి కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రిగా, మహారాష్ట్ర గవర్నరుగా వ్యవహరించారు.
ఉన్నత పదవులు:
హనుమంతరావు ఏడు, ఎనిమిది పంచవర్ష ప్రణాళికా సంఘాల సభ్యులు. ఆర్థిక సంఘం సభ్యులు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ సంస్థకు చైర్మన్. భారత ప్రభుత్వం వీరికి 2004లో పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది.
విద్యార్థిదశలోనే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్‌కు జనరల్ సెక్రటరీ. 1947-48 మధ్య నిజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. 1957లో రాజకీయాలను వదలి ఆర్థిక పరిశోధనా రంగంపై దృష్టి సారించారు. 1961లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఉద్యోగంలో చేరారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా 20 సూత్రాల సలహా కమిటీ చైర్మన్. 1990లో జాతీయ కార్మిక సంఘ చైర్మన్. ఆ తర్వాత రిజర్వు బ్యాంకు డైరక్టరు. సామాజిక, ఆర్థిక, వ్యవసాయరంగ పరిస్థితులపై పరిశోధనాత్మక గ్రంథాలు ప్రచురించారు. భారత ప్రభుత్వం జాతీయ సలహా మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు.
ప్రముఖ పురస్కారాలు:
- 1995 – ఫైనాన్సియల్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- 1991 – శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్
- 1998 – కాకతీయ విశ్వవిద్యాలను గౌరవ డాక్టరేట్
- 2013 – తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం.
ఆర్థిక శాస్త్రవేత్తగా హనుమంతరావు అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.
ఐ.ఎ.ఎస్. అధికారి టి. యల్. శంకర్ (1928-2018):
తిరువెంగడం లక్ష్మణ్ శంకర్ ఐ.ఎ.ఎస్. అధికారిగా లబ్ధప్రతిష్ఠులు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి ఫిజకల్ కెమిస్ట్రీలో యం.యస్.సి డిగ్రీ సంపాదించారు. విల్సన్ కాలేజి నుండి డెవలప్‍మెంట్ ఎకనామిక్స్‌లో ఎం.ఏ. చేశారు. ఆ తర్వాత IAS లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఎనర్జీ రంగంలో ఆయన విశేష ప్రతిభ కనబరిచారు. భారతదేశంలోని బొగ్గు రంగ సంస్కరణలపై టి.యల్. శంకర్ కమిటీకి అధ్యక్షత వహించి ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు.
శ్రీలంక, టాంజానియా, జమైకా, ఉత్తర కొరియా దేశాలకు యునైటెడ్ నేషన్స్ ప్రతినిదిగా సలహాలందించారు. ప్రణాళికా సంఘం పక్షాన ఎనర్జీ పాలసీపై ఏర్పడిన సంఘంలో సభ్యులు. భారత ప్రభుత్వం 2004లో పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ పాలసీ కమిటీ సెక్రటరీగా 1970-75 మధ్య పనిచేశారు. 1978-79 మధ్య ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విశిష్ట సేవలు ఆందించారు.
ఆసియా అభివృద్ధి బ్యాంకు నిర్వహించిన ఆసియా ఇంధన సర్వే విభాగానికి ఆధిపత్యం వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్‌కు, ఆంధ్రప్రదేశ్ టాన్స్‌మిషన్ కార్యారేషన్‌కు చైర్మన్‍గా విశేష కృషి చేశారు. 90 ఏళ్ల వయస్సులో హైదరాబాద్‌లో మరణించారు (27 డిసెంబరు 2018). పదవీ విరమణానంతరం 1993లో హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ప్రిన్సిపాల్‌గా చేరారు.
అధికార శక్తి సామర్థ్యాలకు మేధాసంపత్తిని జోడించి ఇంధన రంగంలో అపార పరిశోధనలు చేశారు. ప్రజల భాగస్వామ్యం గూర్చి ఆయన నిరంతరం ఆలోచించారు. హైదరాబాదులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డైరక్టరుగా మేధావివర్గం వారి ఆలోచనలను క్రియా రూపంలో అమలుపరచడానికి దోహదం చేశారు. అట్టి మేధా సంపత్తి గల శంకర్ ఎందరో యువ ఐఎఎస్ అధికారులకు మార్గదర్శి.
హృద్రోగ నిపుణులు డా. కె. శ్రీనాథరెడ్డి:
డా. కొల్లి శ్రీనాథరెడ్డి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హృద్రోగ నిపుణులు. భారత ప్రజారోగ్య సమాఖ్యకు అధ్యక్షులు. వరల్డ్ హెల్త్ ఫౌండేషన్ సంస్థకు ఆధిపత్యం వహించిన తొలి భారతీయడు. వీరికి 2005లో పద్మ భూషణ్ లభించింది. అదే సంవత్సరం కె. ఇ. వరప్రసాదరెడ్డికి కూడా లభించింది. ఇద్దరూ నెల్లూరీయులే. శ్రీనాథరెడ్డి తండ్రి కె. వి. రఘునాథరెడ్డి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కార్మికశాఖ సహాయమంత్రి. తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నరు. శ్రీనాథరెడ్డి ఉస్మానియా వైద్యకళాశాల నుండి యం.బి.బి.యస్ పట్టా పొందారు. తర్వాత ఢిల్లీలోని AIIMS నుండి మెడిసిన్‌లో యం.డి, కార్డియాలజీలో డి.యం. చేశారు.
AIIMS లో శ్రీనాథరెడ్డి కార్డియాలజీ విభాగాధిపతిగా ప్రతిష్ఠ సాధించారు. అంతర్జాతీయంగా ఆయన ప్రతిభ గుర్తించబడి హార్వర్డు స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం విజిటింగ్ ప్రొఫెసర్‌గా 2009-13 మధ్య; అదే సంస్థలో ఎపిడిమాలజీ విభాగంలో ప్రొఫెసర్‍గా 2014-23 మధ్య ఎన్నో పరిశోధనలకు దోహదం చేశారు. ప్రజారోగ్యం పట్ల దృష్టి సారించాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ స్థాపించారు.
రక్తపోటుకు సంబంధించి INTER SALT గ్లోబల్ స్టడీ చేశారు. అదే రీతిలో INTER HEART పైన పరిశోధనలు కొనసాగించారు. డా. రెడ్డి పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, విధాన నిర్ణేతగా, ప్రజారోగ్య కార్యకర్తగా జీవితమంతా వెచ్చించారు. ఒక దశాబ్ద కాలం National Medical Journal కు సంపాదకత్వం వహించారు.
WORLD HEART FOUNDATION అధిపతిగా 2013-14 మధ్య ప్రతిష్ఠాత్మక పదని నధిష్టించారు. వైద్యవిద్యకు సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ విద్యకు ఏర్పరిచిన National Board of Examinations అధిపతి.
పురస్కారాలు:
- స్కాట్లాండ్ విశ్వవిద్యలను డాక్టరేట్, 2011
- NTR విశ్వవిద్యాలయ డాక్టరేట్, 2011
- గ్లాస్గో విశ్వవిద్యాలయ డాక్టరేట్, 2013
- లండన్ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ 2014,
- WHO డైరక్టర్ జనరల్ ప్రతిష్ఠాత్మక అవార్డ -2003
ఇలా ఎన్నో పురస్కారాలందుకొన్న శ్రీనాథరెడ్డి నిగర్వి. ప్రధానమంత్రి శ్రీ పి.వి. నరసింహారావుకు వైద్య సలహాదారు.
Images Credit: Internet
(మళ్ళీ కలుద్దాం)