[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
తొలి రాష్ట్రపతి:
ఉపరాష్ట్రపతిగా వుండగానే రాధాకృష్ణన్‌కు తొలి జాబితాలోనే 1954లో ‘భారత రత్న’ లభించింది. రాజేంద్ర ప్రసాద్ తాను రాష్ట్రపతిగా వుంటూ తానే ప్రకటించుకోవడం భావ్యం కాదని భావించి వుండవచ్చు. ప్రధానిగా వుండగానే 1955లో రెండో సంవత్సరం జవహర్‍లాల్ నెహ్రూకి ‘భారత రత్న’ ప్రకటించారు.
తర్వాతి కాలంలో 1967లో రాష్ట్రపతి అయినా, 1963లోనే డా. జాకీర్ హుస్సేన్ – బీహార్ గవర్నర్‌గా ‘భారత రత్న’ అందుకొన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రికి మరణానంతరం అందుకున్న తొలి వ్యక్తిగా ‘భారత రత్న’ 1966లో లభించింది. ఇందిరాగాంధీ 1971లో ప్రధానిగా వుంటూ ‘భారత రత్న’ అందుకొన్నారు. రాష్ట్రపతిగా కాక కార్మిక నాయకుడిగా వి.వి.గిరిని ఆ పురస్కారం వరించింది. మరణానంతరం రాజీవ్ గాంధీకి ప్రకటించారు. మొరార్జీ దేశాయ్ పదవీ విరమణానంతరం పొందారు. తాత్కాలిక ప్రధానిగా రెండుమార్లు వ్యవహారించిన సీనియర్ రాజకీయ నాయకుడు గుల్జారీలాల్ నందాకు 1997లో ప్రకటించారు. అదే సంవత్సరం రక్షణరంగ నిపుణులుగా డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం అందుకున్నారు. తరువాత 2002-2007 మధ్య రాష్ట్రపతి పదవి నధిష్ఠించారు. పదవీ విరమణానంతరం చాలా కాలానికి గాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఆ గౌరవం లభించలేదు (2015). రాష్ట్రపతిగా పదవీ విరమణానంతరం 2019లో ప్రణబ్ ముఖర్జీకి ‘భారత రత్న’ పురస్కారాన్ని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ప్రధానులు పి.వి.నరసింహరావు, చరణ్ సింగ్‍లకు; ఉపప్రధాని అద్వానీకి 2024లో ఒకేసారి ప్రకటించడం విశేషం. ‘భారత రత్న’ అందుకొన్న అతి పిన్నవయస్కుడు, రాజకీయేతరుడు – సచిన్ టెండూల్కర్ (40 సం). శతాధిక వయస్సులో దోండో కేశవ్ కార్వే అందుకొన్నారు.
అపార మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య:
విశ్వేశ్వరయ్య (15 సెప్టెంబరు 1861) మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1881లో బి.ఏ. డిగ్రీ చేశారు. పూనా లోని సైన్స్ కళాశాల నుండి సివిల్ ఇంజనీర్ పట్టా పొందారు. ఉద్యోగపర్వంలో తొలిసారిగా 23వ ఏట బొంబాయి రాష్ట్ర పి.డబ్ల్యూ.డి శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా ప్రవేశించారు. తర్వాత కేంద్రంలోని సెంట్రల్ వాటర్ కమీషన్ వారి ఆహ్వనం అందుకొని ఇంజనీరుగా చేరారు. దక్కన్ ప్రాంతంలో చక్కని నీటి పారుదల వ్యవస్థకు మూల పురుషులయ్యారు. వరదనీటిని నిల్వ చేయగల ఆటోమేటిక్ గేట్ల నిర్మాణానికి ఆయన ఆధ్యులు.
ఆంధ్రులకు మోక్ష ప్రసాది:
హైదరాబాదు నగరాన్ని మూసీ వరదల నుండి రక్షించడానికి ఆయన రూపొందించిన వ్యవస్థ అత్యద్భుతం, అదే రీతిలో విశాఖపట్టణం రేవును సముద్రపుకోత నుండి రక్షించిన ఘనుడు. ఆసియా ఖండం లోనే అతి పెద్దదైన కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆయన ప్రతిభకు నిదర్శనం, 1906-07 మధ్యకాలంలో భారత ప్రభుత్వ పక్షాన యెమెన్ లోని ఏడెన్ నీటి పారుదల వ్యవస్థను, మురుగు నీటి పారుదలను క్రమబద్ధం చేశారు.
మైసూరు సంస్థాన దివాన్:
విశ్వేశ్వరయ్య 1908లో 47వ ఏట పదవీ విరమణ చేశారు. మైసూరు మహారాజా వద్ద దివాన్‌గా చేరారు. కర్ణాటక పితామహులుగా అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, మైసూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్, మైసూరు సబ్బుల కర్మాగారం, భద్రావతిలో విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ ఆయన చొరవతో ఏర్పడ్డ సంస్థలే. ఆయన పేరు మీద బెల్గాంలో విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ నెలకొల్పారు. ఆయన జన్మదినాన్ని ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించారు. హైదరాబాదు నడికూడలిలో విశ్వేశ్వరయ్య విగ్రహ ప్రతిష్ఠ ఆయనకు నిజమైన శ్రద్ధాంజలి. ఆదే రీతిలో పూనాలో నిలునెత్తు విగ్రహం ప్రతిష్ఠించారు. నిరాడంబర జీవి అయిన విశ్వేశ్వరయ్య అసలుసిసలైన భారతరత్న.
తెలుగు మూలాలు గల రాష్ట్రపతులు:
స్వాతంత్ర్యానంతరం ప్రస్తుతం 17వ రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము వ్యవహారిస్తున్నారు. గతంలో పని చేసిన 16 మందిలో కేవలం ఆరుగురికి మాత్రమే ‘భారత రత్న’ లభించింది. తెలుగువారైన నీలం సంజీవరెడ్డికి ఆ పురస్కారం లభించలేదు. తెలుగు మూలాలు గల డా. జాకీర్ హుస్సేన్, శ్రీ వి.వి. గిరి లకు అది ప్రకటించారు. జాకీర్ హుస్సేన్ హైదరాబాదులో జన్మించి (1897 ఫిబ్రవరి 8) ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ వెళ్ళారు. వి.వి.గిరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని బరంపురానికి చెందినవారు, రక్షణశాఖలో DRDO లో ఏ.పి.జె. అబ్దుల్ కలాం తొలినాళ్లలో సైంటిస్ట్‌గా పని చేసి ఖ్యాతి గడించారు.
విద్యావేత్త జాకీర్ హుస్సేన్:
1956లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డారు, 1957లో బీహారు గవర్నరుగా నియుక్తులయ్యారు. ఐదేళ్ల తర్వాత 1962-67 మధ్య రాధాకృష్ణన్ పదవీ విరమణానంతరం భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. రాధాకృష్ణన్ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవిలో వుండగానే 1969 మే 3న హఠాత్తుగా మరణించారు. పదవిలో వుండి మరణించిన తొలి రాష్ట్రపతి. ఆయన తర్వాత పోటీలో నెగ్గి వి.వి.గిరి రాష్ట్రపతి అయ్యారు. వి.వి.గిరి తర్వాత వచ్చిన ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ కూడా పదవిలో వుండగా గతించారు.
భారత ప్రభుత్వం 1963లోనే జాకీర్ హుస్సేన్‍కు ఉపరాష్ట్రపతిగా వున్న సమయంలో ‘భారత రత్న’ ప్రకటించింది. అంతకు ముందు కూడా ఉపరాష్ట్రపతిగా వున్న సర్వేపల్లి రాధాకృష్ణన్‍కు ఆ గౌరవం లభించింది. విద్యావేత్తలుగా ఇద్దరూ లబ్ధప్రతిష్ఠులే. “మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం” అని ప్రకటించిన జాకీర్ హుస్సేన్ జాతీయవాది. రాధాకృష్ణన్ గాని, జాకీర్ హుస్సేన్ గాని స్వాతంత్రోద్యమ సమయంలో ప్రత్యక్ష రాజకీయాలలో తీవ్రంగా పని చేయకపోవడం గమనార్హం. విద్యారంగానికి చెందిన ఈ ఇద్దరు ప్రముఖులు రెండవ, మూడవ రాష్ట్రపతులు గావడం భారతీయ రాజకీయ చింతనకు నిదర్శనం.
కార్మికోద్యమ నాయకుడు వి.వి.గిరి (1894 ఆగస్టు 10 – 1980 జూన్ 24):
భారతదేశ నాల్గవ రాష్ట్రపతి వి.వి.గిరి. మదరాసు ప్రెసిడెన్సీ లోని గంజాం జిల్లాకు చెందిన బరంపురంలో (ప్రస్తుత ఒడిస్సా రాష్ట్రం) వరాహగిరి వెంకటగిరి జన్మించారు. తండ్రి వెంకట జోగయ్య ప్రసిద్ధ న్యాయవాది. ఆయన తూర్పు గోదావరి జిల్లా చింతలపూడి నుండి బరంపురానికి వలస వెళ్ళారు. గిరి 1913లో న్యాయశాస్త్ర విద్యనభ్యసించడానికి డబ్లిన్ యూనివర్శిటీకి వెళ్లి ఐర్లండ్ లోని ఉద్యమంలో పాల్గొనడం వల్ల దేశ బహిష్కరణకు గురి అయ్యారు. అయితే విదేశీ రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడింది.
అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడిగా కార్మిక సంఘాలకు మార్గదర్శనం చేశారు. కోడి రామమూర్తి తన శారీరక బలంతో రైలును ఆపగలిగితే, వి.వి.గిరి తన కార్మిక సంఘ పోరాటం ద్వారా రైళ్ల నడకనూ ఆపగలిగారు.
స్వాతంత్ర్యానంతరం 1947-51 మధ్య సిలోన్ భారత ప్రభుత్వ తొలి హైకమీషనరు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల అనంతరం నెహ్రు మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రి. ప్రభుత్య కార్మిక విధానాలకు నిరసనగా 1954లో రాజీనామా చేశారు ఆయన సేవలను వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఆయనను 1957లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నరుగా నియమించింది. 1957-60 మధ్య ఉత్తర్ ప్రదేశ్ లోనూ, 1960-65 మధ్య కేరళ లోనూ, 1965-67 మధ్య కర్నాటక లోనూ ఆయన గవర్నరు.
మూడవ ఉపరాష్ట్రపతిగా 1967 మేలో గిరి పదవి స్వీకరించారు. 1969 మే లో జాకీర్ హుస్సేన్ మరణానంతరం సంప్రదాయానుసారం ఆయన రాష్ట్రపతిగా ఎంపిక కావలసి వుంది. కాని రాజకీయాలు అడ్డు వచ్చాయి. ఆయన తాత్కాలిక రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసి గెలుపొందారు. ఇందిరా గాంధీ ఇచ్చిన ఆత్మప్రబోధ నినాదం ఎన్నికలలో పని చేసింది. 1969-74 మధ్య రాష్ట్రపతిగా వ్యవహరించారు. వీరి పదవీ కాలంలో ‘రబ్బరు స్టాంపు రాష్ట్రపతి’ అనే అపవాదం బయలుదేరింది. 1975లో గిరిని ‘భారత రత్న’ పురస్కారంతో సత్కరించారు. కార్మికోద్యమ నాయకుడిగా ఆయనకు ఆ గౌరవం లభించింది.
Images source: Internet
(మళ్ళీ కలుద్దాం)