[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
~
హోం శాఖ కార్యదర్శి కె. పద్మనాభయ్య (6 అక్టోబరు 1938):
పదవీ విరమణానంతరం 1997-2009 మధ్య నాగాలాండ్ సమస్య పరిష్కర్తగా (interlocutor) కేంద్ర ప్రభుత్వానికి సలహా సంప్రదింపు లందించారు. ఢిల్లీలోని సాంస్కృతిక సంస్థలకు సలహాదారుగా ఆంధ్రుల ఆదరాభిమానాలు చూరగొన్నారు.
వారు అందుకున్న పురస్కారాలు:
- జెయింట్స్ ఇంటర్నేషనల్ అవార్డు
- ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డు – 1996
- శిరోమణి ఇనిస్టిట్యూట్ అవార్డు – 1992
- పద్మ భూషణ్- 2008
కేంద్ర ప్రభుత్వం వీరిని పలు కమిటీలకు అధిపతిగా నియమించింది.
- పోలీసు సంస్కరణల కమిటీ 2000
- సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ పునర్నిర్మాణ కమిటీ
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‍మెంట్ సమీక్షా సంఘం
వీరు జమనాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‍మెంట్ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు. సౌమ్య హృదయులైన వీరి సతీమణి సత్యవతి ఆధ్యాత్మిక సంపన్నురాలు. ఢిల్లీలో ఈ దంపతులు ఏటా తమ గృహంలో శ్రీరామనవమి కల్యాణాలు దశాబ్ది పాటు నిర్వహించారు. సహస్రచంద్రదర్శనం చేసుకొన్న పద్మనాభయ్య నిత్యకృషీవలురు.
సినీనటులు జి. కృష్ణ (31 మే 1943 – 15 నవంబరు 2022):
‘మోసగాళ్లకు మోసగాడు’, ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాలు ఆయన కీర్తిని ఇనుమడింపజేశాయి. 1978-85 మధ్యకాలం కృష్ణ సినీ జీవితంలో ఉచ్చదశ. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి యన్.టి. రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడంతో కృష్ణకు రాజకీయ సంబంధాలు ఏర్పడ్డాయి. ఎన్నో సినిమాలు కమర్షియల్‌గా విజయవంతమయ్యాయి.
రాజకీయ రంగ ప్రవేశం:
యన్.టి. రామారావు రాజకీయాలతో ఉధృతంగా వున్న రోజుల్లో కాంగ్రెసు 1984లో కృష్ణను పార్టీలోకి ఆహ్వానించింది. 1991లో ఏలూరు లోక్‍సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి చనిపోశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుండి మిరమించుకున్నారు.
తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం ‘గూఢచారి 116’. సినిమారంగంలో స్టూడియో అధినేత, నిర్మాత, పంపిణీదారు, ఎగ్జిబిటర్ – ఇలా అన్ని దశలలోను స్వంతంగా అనుభవం సాధించారు. ప్రతి ఏటా సంక్రాంతులకు సినిమాల విడుదల విషయంలో కృష్ణ 21 సంవత్సరాలు వరుసగా విడుదల చేసి అక్కినేని, యన్.టి.ఆర్ – తర్వాత మూడో స్థానంలో నిలిచారు. ఆయన కుమారుడు మహేష్ బాబు సినీరంగంలో దూసుకెళ్తున్నాడు. కృష్ణకు భారత ప్రభుత్వం 2009లో పద్మ భూషణ్ ప్రకటించింది. విలక్షణ నటుడు కృష్ణ.
మహామహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ (14 ఆగస్టు 1923 – 11 జూలై 2013):
కర్ణాటక సంగీతంలో అధ్యయన అధ్యాపనాలలో ప్రఖ్యాతిగాంచిన నూకల చిన్న సత్యనారాయణ అనకాపల్లిలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. పదేళ్ల వయస్సులో బాలకృష్ణుడిగా రంగస్థలంపై నటించారు. మంగళంపల్లి పట్టాభిరామయ్య (విజయవాడ); ద్వారం వెంకటస్వామినాయుడు (విజయనగరం), డా. శ్రీపాద పినాకపాణి వీరి గురువులు. విజయనగరం సంగీత కళాశాలలో చదివారు.
యువకులలో సంగీతాభినివేశం కల్పించడానికి SPIC MACAY సొసైటీ వారికి వీరు సహకరించారు. కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలపై పట్టుగల వీరు విదేశీ పర్యటనలు చేసి కచేరీలు చేశారు. విదేశీ విశ్వవిద్యాలయాలైన కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, లండన్ విశ్వవిద్యాలయాలలో డెమాన్‌స్ట్రేషన్ లెక్చర్లు పలుమార్లు ఇచ్చారు.
వీరికి మహామహోపాధ్యాయ బిరుదం సముచితం. లాభాపేక్ష లేని నూకల విశ్వకళా పరిషత్ స్థాపించి ప్రతిభావంతులైన యువ సంగీతజ్ఞులను ప్రోత్సహించారు. భారత ప్రభుత్వం 2010లో పద్మ భూషణ్ పురస్కారం అందించింది
వీరి గ్రంథాలు:
- సంగీత సుధ (ఆంగ్లం, తెలుగు)
- రాగలక్షణ సంగ్రహం
- త్యాగరాజ పంచరత్న కృతులు (మోనోగ్రాఫ్)
- దీక్షితుల నవగ్రహ, కమలాంబా కీర్తనలు (ఇంగ్లీషు, తెలుగు)
- శ్రీ త్యాగరాజ సంగీత సర్వస్యం
- సంగీత శాస్త్ర సుధార్ణము
- వాగ్గేయకార కృతిసాగరం
90 సంవత్సరాల పూర్ణ జీవితం గడిపిన నూకల ధన్యజీవి.
ఫార్మా దిగ్గజం కె. అంజిరెడ్డి (1 ఫిబ్రవరి 1939 – 15 మార్చి 2013):
రెడ్డీస్ ల్యాబ్స్ స్థాపించి దేశవిదేశాలలో ఫార్మారంగంలో కీర్తి ప్రతిష్ఠలు సాధించిన కల్లం అంజిరెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో జన్మించారు. 1984లో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాదులో రెడ్డీస్ ల్యాబ్స్ స్థాపించి భారతదేశంలోని వందమంది సంపన్నుల జాబితాలో 65వ స్థానం సంపాదించారు. ప్రధానమంత్రి ఏర్పరచిన వాణిజ్య పరిశ్రమల కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు. గుంటూరు ఏ.సి. కాలేజీలో 1958లో బి.యస్.సి పూర్తి చేశారు. ఆ తర్వాత బొంబాయిలోని కెమికల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ నుండి పార్మా రసాయన విభాగంలో బి.యన్.సి.టెక్ సాధించారు. 1969లో పూనా లోని జాతీయ రసాయన లేబొరేటరీ నుండి పి.హెచ్.డి పొందారు.
ఆయన నిరంతర పరిశ్రమ వల్ల భారతదేశంలోని ఐదు మిలియన్ల అభాగ్యుల జీవితాలలో వెలుగులు ఆరోగ్యపదమైనాయి. పేదరిక నిర్ములనలో భాగంగా భారత ప్రభుత్వంతో కలిసి 1998లో నాంది ఫౌండేషన్ స్థాపించారు. వివిధ రాష్ట్రాలలో పరిశుభ్రమైన త్రాగునీరు అందించే పథకాలు దాని ద్వారా చేపట్టారు. క్షేమకరమైన మాతృత్వము, శిశు సంరక్షణ అనే లక్ష్యాలు గల రెడ్డి మాతాశిశు సంరక్షణ దిశగా NICE ఫౌండేషన్ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పనిచేసి పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం కల్పించారు. జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 2001 లో పద్మ శ్రీ, 2011లో పద్మ భూషణ్ పురస్కారాలు లభించాయి. 73 ఏళ్ల వయస్సులో మరణించారు.
షుగర్ వ్యాధికి, హృద్రోగ సంబంధ వ్యాధులకు, అంటువ్యాధులకు కొత్త మందులు కనిపెట్టిన దార్శనికుడు అంజిరెడ్డి. IDPL లో చేస్తున్న ఉద్యోగం వదులుకొని 1976లో స్టాండర్డ్ ఆర్గానిక్స్ ప్రారంభించారు. ఈ సంస్థ 1984లో 25 లక్షల డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‍గా రూపాంతరం చెంది వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. క్రమేణ విదేశీ సంస్థలైన ఫైజర్, జి.యస్.కె. వంటి ఫార్మా కంపెనీలకు గట్టి పోటీగా రెడ్డీస్ ల్యాబ్ నిలబడి ఏడు వేల కోట్ల రూపాయల టర్నోవర్ స్థాయికి ఎదిగింది. ఆయన కుమారుడు సతీష్ రెడ్డి సంస్థను నడుపుతున్నారు.
Images Credit: Internet
(మళ్ళీ కలుద్దాం)