Site icon Sanchika

తెలుగుజాతికి ‘భూషణాలు’-32

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

పారిశ్రామికవేత్త జి.వి.కె.రెడ్డి (22 మార్చి 1937):

[dropcap]గు[/dropcap]నుపాటి వెంకట కృష్ణారెడ్డి నెల్లూరీయుడు. 2011లో ఇద్దరు నెల్లూరీయులకు పద్మ భూషణ్ లభించడం విశేషం. రెండో వ్యక్తి యస్.పి. బాల సుబ్రమణ్యం. జి.వి.కె. గ్రూపు వ్యవస్థాపక ఛైర్మన్ జి.వి.కె.రెడ్డి. హైదరాబాదులో ప్రముఖ మాలిక సదుపాయాల గ్రూపు అది. భారతదేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర విద్యుత్ ప్లాంట్‌ను 1997లోనే ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి సాపించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిన మొదటి వ్యక్తి రెడ్డి.

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండవ ఐకానిక్ టెర్మినల్ నిర్మించి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత ప్రారంబింపజేశారు. మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు చెందిన ఏడువేలకు పైగా కళాఖండాలు అందులో ఏర్పరచారు. బెంగుళూరు కెంపెగౌడ విమానాశ్రయం కూడా ఆయన విజయ పరంపరలో భాగం.

అమెరికాలోని హార్వర్డ్ బిజినెన్ మేనేజ్‌మెంట్ స్కూల్ నుండి మేనేజిమెంట్ కోర్సు చేశారు. హైదరాబాదులోని జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరు ప్రదానం చేసింది (2018).

ప్రజాసేవలో నిరంతరం గుర్తుండిపోయేలా 108 ఎమర్జెన్సీ సేవలను 15 రాష్ట్రాలలో విస్తృతపరచి అసంఖ్యాక ప్రజానీకానికి అత్యవసర సేవలు అందించేలా రూపకల్పన చేశారు. దీనిని 2016లో తొలుత శ్రీలంకలో  ప్రయోగాత్మకంగా మొదలెట్టారు. జి.వి.కె. ఫౌండేషన్ ద్వారా విద్యారంగంలో, గృహవసతి, త్రాగునీటి సౌకర్య రంగంలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలో ఎంపిక చేసిన గ్రామాలలో సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులతో జీవితం ఆరంభించిన రెడ్డి విమానాశ్రయాలు, ఇంధన రంగం, ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాలు, పట్టణాభివృద్ధి రంగంలో తనదైన ముద్రవేశారు. జి.వి.కె గ్రూపు సంస్థల చైర్మన్‍గా జి.వి.కె.రెడ్డి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.

న్యాయకోవిదులు పి.సి.రావు (22 ఏప్రిల్ 1936 – 11 అక్టోబరు 2018):

1963 సంవత్సరంలో భారత ప్రభుత్వం న్యాయవిభాగంలో ఆఫీసర్ల నియామక ప్రక్రియ చేపట్టింది. ఆ సంవత్సరం ఇద్దరు తెలుగువారు ఎంపికయ్యారు. జి. వి. జి. కృష్ణమూర్తి; వి.యస్. రమాదేవి. ఇద్దరూ వివిధ కాలాలలో న్యాయశాఖ కార్యదర్శులయ్యారు. అంతకు ముందు ఆర్. వి. పేరి శాస్త్రి న్యాయశాఖ కార్యదర్శిగా ఉండి ఎన్నికల కమీషనర్‌గా నియమించబడ్డారు.

కృష్ణాజిల్లా వీరులపాడులో జన్మించిన చంద్రశేఖర రావు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత పి.హెచ్.డి లను పొందారు. నల్సార్ విశ్వవిద్యాలయం నుండి యల్.యల్.డి లభించింది. భారత మాజీ దౌత్యవేత్త వి. కె. కృష్ణమీనన్ 1959లో ప్రారంభించిన Indian Society for International Law అనే సంస్థలో రీసెర్చి స్కాలర్‍గా 1963లో చేరి 1967 వరకు పనిచేశారు. 1967లో విదేశీ వ్యవహారాల శాఖలో చేరి తర్వాత న్యాయశాలకు బదలీ అయి కార్యదర్శిగా వ్యవహారించారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సముద్ర న్యాయవివాదాల ట్రిబ్యునల్ సభ్యులుగా 18 సంవత్సరాలు అనుభవమున్న ఏకైక వ్యక్తి చంద్రశేఖరరావు. 1972లో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత విభాగానికి న్యాయ సలహాదారు. ఆ తర్వాత కూడా కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖలో అనేక హోదాలు లభించాయి. 1995-96లో న్యూఢిల్లీలో ప్రత్యామ్నాయ వివాద కేంద్రానికి సెక్రటరీ జనరల్ గౌరవం లభించింది. 1996లో ఆయన నేతృత్వంలో ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం రూపుదాల్చింది.

భారతదేశంలో ముగ్గురు ప్రధానుల వద్ద ఆయన పనిచేశారు. సముద్ర చట్టాల ట్రిబ్యునల్ (International Tribunal for the Law of Sea) జడ్జ్‌గా 1996లో నియమింపబడ్డారు.

ఇటలీ, చైనా మధ్య సముద్రజలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం నెరపి పరిష్కారం చేశారు. 1994-2000 మధ్య ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా సంస్థ చైర్మన్. 2012లో పద్మ భూషణ్ వరించింది. న్యాయ శాస్త్రానికి సంబంధించి పలు ప్రామాణిక గ్రంథాలు ప్రచురించారు. తెలుగువారు గర్వించదగిన వ్యక్తి చంద్రశేఖరరావు.

సినీనిర్మాత డి. రామానాయుడు (6 జూన్ 1936-18 ఫిబ్రవరి 2015):

తెలుగు సినీరంగంలో శతాధిక చిత్ర నిర్మాతగా ప్రసిద్ధికెక్కిన దగ్గుబాటి రామానాయుడు ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 1964లో సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించి భారతదేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దారు. మూవీ మొగల్‌గా చిత్రపరిశ్రమలో ఆయనకు ఖ్యాతి. భారతీయ భాషలలో 150 పైగా చిత్రాలు నిర్మించారు.

1999-2004 మధ్య 13వ లోక్‌సభలో బాపట్ల నుండి గెలిచి పార్లమెంటు సభ్యులయ్యారు. రైతు కుటుంబంలో జన్మించిన నాయుడు చీరాల కళాశాలలోను, మదరాసు ప్రెసిడెన్సీ కళాశాల లోను విద్య నభ్యసించారు. జీవన ప్రారంభంలో రైసు మిల్లు ఓనరు. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టు రంగంలో కొంతకాలం పని చేశారు.

రామానాయుడు తండ్రి, మరొక బంధువు కలిసి 1958లో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి జంటగా ‘నమ్మినబంటు’ సినిమా తీశారు. అందులో రామానాయుడు నాగేశ్వరరావుకు ‘డూప్’గా వ్యవహరించాడు. అప్పుడు నాగేశ్వరరావు రామానాయుడిని మదరాసు వెళ్లి సినీ నిర్మాతలతో కలిసి పని చేయమని సలహా ఇచ్చారు. 1962లో నాయుడు రైసుమిల్లు మూసివేసి రకరకాల వ్యాపారాలు ప్రయత్నించారు. ‘ఆంధ్రా క్లబ్’కు తరచూ వెళ్లడంతో సినీరంగ మిత్రులు పరిచయమయ్యారు.

1964లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘రాముడు-భీముడు’ సినిమా తీశారు. 1971లో నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా ‘ప్రేమనగర్’ నిర్మించారు. అది బ్రహ్మండమైన సక్సెస్. అప్పట్లో  స్టూడియోలు అన్నీ మదరాసులో ఉండేవి. 1983లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాదులో రామానాయుడు స్టూడియో స్థాపించారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ చిత్ర నిర్మాణంలో ప్రవేశించారు. 13 భారతీయ భాషలలో 2015 నాటికి 130 సినిమాలు తీశారు. 2007లో ‘హోప్’ అనే సినిమాలో ప్రధానపాత్ర ధరించారు. జాతీయ చలన చిత్రోత్సవంలో బహుమతి లభించింది.

ఆయన కుమారుల్లో పెద్దవాడు సురేష్ నిర్మాత. చిన్న కొడుకు వెంకటేష్ నటుడు. మనుమలు రానా, నాగచైతన్య సినీనటులుగా ప్రసిద్ధులు,

2012లో రామానాయుడు పద్మ భూషణ్ స్వీకరించారు. జాతీయ చలన చిత్ర అవార్డు (1999), దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2009), శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఆయన కిరీటంలో మెరిశాయి. 78 ఏళ్ళు జీవించిన రామానాయుడు ధన్యజీవి.

అంతరిక్ష శాస్త్రవేత్త అట్లూరి సత్యనాధం (7 అక్టోబర్ 1945 – 14 ఆగస్ట్ 2023):

కృష్ణాజిల్లా గుడివాడలో జన్మించిన అట్లూరి సత్యనాధం కాకినాడ ఇంజనీరింగు కాలేజిలో 1964లో ఇంజనీరింగు చేశారు. ఇండియన్ ఇనిస్టిటూట్ ఆఫ్ సైన్సెస్ (1966), మాస్చుసెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (1968) నుండి డాక్టరేట్ డిగ్రీ పొందారు. పలు విదేశీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.

1969లో అమెరికాలోని మాస్చుసెట్ ఇనిస్టిటూట్ ఆఫ్ టెక్నాలజీలో పరిశోధకుడిగా చేరి 1971-73 మద్య వాషింగ్టన్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫసర్‌గా చేరారు. 1973-79 మధ్య యువ ప్రొఫెసర్‍గా జార్జియా టెక్నాలజీ సంస్థలో పని చేశారు. 1979-98 మధ్య అక్కడే రెజెంట్స్ ప్రొఫసర్‌గా వ్యవహరించారు. 1991-98 మధ్య ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వారి నేషనల్ సెంటర్ డైరక్టరు. వివిధ ఆమెరికన్ విశ్వవిద్యాలయాలలో గౌరవ ప్రొఫెసర్‌గా పనిచేయడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

అమెరికన్ ప్రభుత్వానికి చెందిన వివిధ కమిటీల ఆధిపత్యం వారికి లభించింది. 2013 లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ లభించింది. వివిధ శాస్త్రీయ సంస్థల సభ్యత్యము, అవార్డులు ఆయన జీవనంలో మైలురాళ్ళు. 1966లోనే ఏరోస్సేస్ డిపార్టుమెంటు వారి గౌరవం – ఉత్తమ విద్యార్థిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో లభించింది. 1986లో అట్లూరి ICCES అనే శాస్త్రీయ సంఘాన్ని స్థాపించారు. వివిధ దేశాలలో వార్షిక సమావేశాలు తద్వారా నిర్వహించారు. అంతర్జాతీయ అవార్డులు సంస్థ ద్వారా ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌లో సెంటర్ ఫర్ ఎర్లీ ఎడ్యుకేషన్ సంస్థకు విరాళం అందించారు.

దాదాపు వందకుపైగా ప్రామాణిక పరిశోధనా గ్రంథాలకు మార్గదర్శి. వారి రచనలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా గుర్తింపు పొందాయి. దాదాపు 600మంది విద్యార్థులకు ఆయన డిగ్రీ, డాక్టరేట్‌లలో పర్యవేక్షకులు. భారతదేశం నుండి అమెరికా వెళ్లి స్థిరపడి అపార యశస్సును సాధించిన వ్యక్తి అట్లూరి. అదే గుడివాడ నుండి అమెరికా వెళ్లి చిత్ర కళా ప్రదర్శనలో అఖండ ఖ్యాతి సాధించిన యస్. వి. రామారావుకు 2000 లో ‘పద్మ శ్రీ’ పురస్కారం లభించింది.

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version