[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]
~
[dropcap]గ[/dropcap]త వారం సినీరంగ పద్మశ్రీల ప్రస్తావన చేశాను. ఆ సందర్భంగా పద్మ భూషణ్ అందుకున్న సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో కొందరు అవి చేర్చలేదనుకొన్నారు. వారిని గూర్చి ముందుగా ప్రస్తావించాను. వారిలో – కొంగర జగ్గయ్య, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి (పద్మ విభూషణ్), దగ్గుబాటి రామానాయుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పి. సుశీల, బి. ఎన్. రెడ్డి అక్కినేని నాగేశ్వరరావు, డా. సి. నారాయణరెడ్డి, పి.లీల, యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రముఖులు. ‘పద్మ శ్రీ’ పొందిన మరికొందరి వివరాలు సంక్షిప్తంగా:
ఘంటసాల వెంకటేశ్వర రావు (డిసెంబర్ 1922 – ఫిబ్రవరి 1974):
సినీ నేపథ్య గాయకులలో మేటి ఘంటసాల. ఆయన గుడివాడ దగ్గర చౌటపల్లిలో జన్మించారు. విజయనగరం సంగీత కళాశాలలో శిక్షణ పొందారు. ‘స్వర్గసీమ’ సినిమాలో బి.ఎన్.రెడ్డి పాడటానికి అవకాశం కల్పించారు. 1951లో ‘పాతాళభైరవి’తో ఘంటసాల విజయం నలుదిశలా పాకింది. భగవద్గీత పాడి అజరామరుడయ్యారు. 1970లో ‘పద్మ శ్రీ’ వరించింది.
అల్లు రామలింగయ్య (అక్టోబర్ 1922 – జూలై 2004):
పాలకొల్లులో జన్మించిన రామలింగయ్య హాస్య నటులుగా సుప్రసిద్ధులు. 1952లో పుట్టిల్లు చిత్రంతో రంగప్రవేశం జరిగింది. సుమారు వేయికి పైగా సినిమాలలో నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‍లో నిర్మాతగా సినిమాలు తీశారు. కుటుంబమంతా సినీ రంగ ప్రముఖులే. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష పడింది. 1990లో ‘పద్మ శ్రీ’ అందుకున్న యశస్వి.
కె. విశ్వనాథ్ (1930 ఫిబ్రవరి 19 – 2023 ఫిబ్రవరి 02)
కాశీనాధుని విశ్వనాథ్ రేపల్లెలో జన్మించారు. దర్శకుడిగా విభిన్న చిత్రాలు అందించి, ‘శంకరాభరణం’తో జాతీయ ఖ్యాతి గడించారు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, ‘పద్మశ్రీ’ లభించాయి. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే ఆవార్డు దక్కింది. 1951 నుండి సినీ ప్రస్థానం మొదలయింది. ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకుడిగా పనిచేసి సూపర్ హిట్‍లు తీసిన ఘనుడు విశ్వనాథ్.
సాహితీ ప్రముఖులు:
గత 70 సంవత్సరాలలో సాహిత్యరంగము, పత్రికారంగానికి చెందిన 17 మంది ఆంధ్రులు ‘పద్మ శ్రీ’ పురస్కారం పొందారు. ముందుగా పత్రికా సంపాదకుల గూర్చి ప్రస్తావిస్తాను. నేషనల్ హెరాల్డ్ పత్రికా సంపాదకులైన యం.చలపతిరావుకు 1968లో ‘పద్మ భూషణ్’ ప్రకటించగా ఆయన తిరస్కరించారు.
తుర్లపాటి కుటుంబరావు (1933 ఆగస్ట్ – జనవరి 2021):
ప్రముఖ పత్రికాసంపాదకులు. 60 ఏళ్ళ పైబడిన పాత్రికేయ వృత్తిలో పేరు సంపాదించారు. 2002లో ‘పద్మ శ్రీ’ లభించింది. పామర్రు ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించారు. ఆంధ్రజ్యోతిలో చిరకాలం పనిచేశారు. జ్యోతిచిత్రకు సంపాదకులు. వక్తగా గిన్నిస్ బుక్ రికార్డులలో స్థానం సంపాదించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులయ్యారు.
సయ్యద్ అహమ్మదుల్లా ఖాద్రీ (1909 ఆగస్టు- అక్టోబరు 1985):
ఖాద్రీ స్వాతంత్రోద్యమ కార్యకర్త, పత్రికాసంపాదకులు, హైదరాబాదు జర్నలిస్టు సంఘాధ్యక్షులు, 1966లో వీరికి ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. SALTANAT అనే ఉర్దూ దినపత్రిక సంపాదకులు. సాహిత్యవిమర్శకులు. భారతదేశం అఖండంగా వుండాలని 1946లో వ్యాసం ప్రకటించిన తొలి పాత్రికేయుడు.
ఉర్దూ కవయిత్రి జిలానీ బానో (1936 జులై):
ఎనిమిదో ఏట నుండి ఉర్దూలో కవితలు ప్రచురించారు. ఆమె స్వీయ చరిత్ర ‘అఫ్జానా’ ప్రసిద్ధం. 2001లో ‘పద్మ శ్రీ’ లభించింది. సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు 1985లో అందుకున్నారు. మహిళా హక్కుల కోసం పోరాడే అస్మితకు అద్యక్షురాలు. యన్.టి.ఆర్ జాతియ పురస్కారం వరించింది (2016).
గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య (1890 జూలై – 1979 మార్చి):
తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఆంధ్రప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నిర్మించారు. విజయవాడలో రామమోహన గ్రంథాలయం (1911) స్థాపించారు. 1972 లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. Indian Library Journal 1924 లో అఖిల భారత పౌరగ్రంథాలయ సంఘం తరఫున ప్రారంభించారు.
తెలుగు కవులు:
యస్. టి. జ్ఞానానంద కవి (1922 జూలై – జనవరి 2011):
వీరు విజయనగరం జిల్లాలో జన్మించారు. తొమ్మిదవ ఏటనే కవితలు చెప్పసాగారు. కూలీ నుండి కళా ప్రపూర్ణ స్థాయి వరకు ఎదిగి ఒదిగిన కవి. కవికోకిల, కవిలోకవిభూషణ, సాహితీవల్లభాది బిరుదాలతో బాటు 2001లో ‘పద్మ శ్రీ’ లభించింది. వీరి కుమార్తె శరజ్యోత్స్నారాణి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా రిటైరయ్యారు. 1947లో ‘తరంగమాల’ రచనతో ప్రారంభించి జీవన పర్యంతం అనేక గ్రంథాలు ప్రచురించారు. క్రీస్తుచరిత్ర, క్రీస్తు ప్రబంధము ప్రముఖాలు. 1975లో ఆమ్రపాలి కావ్యానికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1983లో తెలుగు విశ్వవిద్యాలయం సత్కరించంది. 1974లో కాకినాడలో కనకాభిషేకం చేశారు. 1996లో డి.లిట్ ప్రదానం చేశారు. కాకినాడలో తెలుగు పండితులుగా పనిచేశారు.
ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు (1927 అక్టోబరు – 2015 జూన్):
ప్రఖ్యాత సంస్కత విద్యాంసులైన పుల్లెల వారు అమలాపురంలో జన్మించారు. తండ్రి వద్దనే పంచకావ్యాలు అభ్యసించారు. మద్రాసు మైలాపూర్‌లోని సంస్కృత కళాశాలలో వేదాంత శిరోమణి చదివారు. 1957లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి సంస్కృతం, ఆంగ్ల భాషలలో ఎం.ఎ. చదివారు. పండిత రాజ జగన్నాధ నుండి సంస్కృత ఛందస్సు అనే అంశంపై పి.హెచ్.డి సాధించారు. అమలాపురం కాలేజీలో లెక్చరర్‍గా చేశారు. 1960 నుండి ఐదేళ్లు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేశారు. 1965 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కత విభాగంలో వివిధ హోదాలలో పనిచేశారు. సంస్కృత అకడమీ డైరక్టర్‌గా 11 ఏళ్లున్నారు. సురభారతికి కార్యదర్శి, ఆపైన ఉపాధ్యక్షులు. శతాథిక గ్రంథాలు రచించారు. శ్రీ వాల్మీకి రామాయణానికి అనువాదాన్ని పది సంపుటాలుగా ప్రచురించారు. ఆంగ్లం, సంస్కృతం, తెలుగులో రచనలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయము, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ, గుప్తా ఫౌండేషన్, బిర్లా ఫౌండేషన్ అవార్డులు లభించాయి. 2011 లో ‘పద్మ శ్రీ’ వరించింది. అసాధారణ ప్రతిభాశాలి శ్రీరామచంద్రుడు.
డా. రాధికా జయకర్ (1938):
ప్రముఖ సంస్కత విద్వాంసురాలు. ఋషీ వ్యాలీ విద్యాసంస్థల డైరక్టర్‌గా ప్రముఖులు. ప్రపుల్ జయకర్ కూమర్తె. జిడ్డు కృష్ణమూర్తి, ఇందిరాగాంధీ జీవితచరిత్రులు ప్రచురించారు. టోరంటో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సంపాధించి ఋషీ వ్యాలీ విద్యాసంస్థలో చరిత్ర అధ్యాపకురాలిగా చేశారు. క్రమంగా డైరక్టర్ స్థాయికెదిగారు. 2013లో భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ పురస్కారంతో సత్కరించింది.
తెలుగు కవి పండితులు:
ఆచార్య కొలకలూరి ఇనాక్ (1939 జూలై):
గుంటూరు జిల్లా వేజెండ్లలో జన్మించిన ఇనాక్ 2015లో భారతీయ జ్ఞాన పీఠం వారి మూర్తి దేవి పురస్కారం అందుకున్నారు. 2014లో ‘పద్మ శ్రీ’ గ్రహించారు. ప్రభుత్వ కళాశాల ఉపన్యాసకులుగా జీవనగమనం ప్రారంభించి శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయ తెలుగుశాఖలో ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్‍గా వ్యవహరించారు. నవల, నాటకం, కథానిక, కవిత, విమర్శ, పరిశోధనా ప్రక్రియలలో దిట్ట, అజోవిభో, బొమ్మిడాల కృష్ణమూర్తి, జాషువా పురస్కారాలు లభించాయి. శతాధిక గ్రంథకర్త.
శ్రీ భాష్యం విజయసారథి (1931 మార్చి – 2022 డిసెంబర్):
వీరు కరీంనగర్ జిల్లా చేగుర్తిలో జన్మించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కత విద్యాపీఠంలోను, వరంగల్ శ్రీ విశ్వేశ్వర సంస్కృత కళాశాలలోను విద్యాభ్యాసం గావించారు. 2020లో ‘పద్మ శ్రీ’ వరించింది. విషాదలహరి, శబరీ పరివేదనం వీరి ఖండకావ్యాలు. స్వర్ణకంకణధారులు,
శ్రీ బి. రామకృష్ణా రెడ్డి (1942 ఆగస్ట్):
తెలంగాణా లోని రెంటలచేనులో జన్మించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశారు. ఎడింబరో విశ్వవిద్యాలయం నుండి ఎం.పిల్. చేశారు (1977). హైదరాబాదులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజస్ లోను (1970-1972), ఉస్మానియా విశ్వవిద్యాలయం లోను (1977-90), తెలుగు విశ్వవిద్యాలయంలోను ఆచార్యులుగా బోధించారు, భాషాశాస్త్రవేత్తగా 2023లో ‘పద్మ శ్రీ’ పురస్కారం దక్కింది. నిఘంటు నిర్మాణకర్త.
కూరెళ్ల విఠలాచార్య ( 1938 జూలై):
విఠలాచార్య తెలంగాంగాలు రామన్నపేటలో జన్మించారు. 1967లో బి.ఏ. ప్రైవేటుగా పూర్తి చేశారు. 1959 ఆగస్టులో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల మునిపాన్పులలో ఉపాధ్యాయుడిగా చేశారు. 9వ తరగతి చదివేటప్పుడే కుడ్య పత్రిక ‘ఉదయ’కు సంపాదకుడు. తెలంగాణ ఉద్యమం తొలిదశలోను, మలిదశలోను చురుకుగా పాల్గొన్నారు. 1955లోనే ఇల్లిల్లూ తిరిగి గ్రంథాలయం స్థాపించారు. రామన్నపేట మండలంలో నెల్లంకి గ్రామంలో రెండు లక్షల పుస్తకాలతో కూరెళ్ల గ్రంథాలయాన్ని రెండు కోట్ల రూపాయలలో నిర్మించిన భవనంలోకి గవర్నరు తమిళపై సౌందరరాజన్ 2024 ఫిబ్రవరిలో ప్రారంభించారు. 2204లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు.
అవధాన శిరోమణులు:
కవిగా తెలుగులో యస్.టి. జ్ఞానానందకవి 2001లో ‘పద్మ శ్రీ’ అందుకొన్నారు. అవధానిగా ఆశావాది ప్రకాశరావు 2021లో అందుకొన్నారు. ఆ తరువాతి సంవత్సరం గరికపాటి నరసింహారావు అందుకొన్నారు.
ఆశావాది ప్రకాశరావు (1944 ఆగస్టు – 2022 ఫిబ్రవరి):
ఆశావాది అనంతపురం కవి. నండూరి రామకృష్ణమాచార్యుల ప్రియ శిష్యులు. సి.వి. సుబ్బన్న శతావధాని అవధాన గురువు. ప్రభుత్వకశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పనిచేసి పెనుగొండ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్‍గా రిటైర్ అయ్యారు. 19వ ఏటనే 1963లో అవధాన అరంగేట్రం చేశారు. 170కిపైగా అష్టావధానాలు, ఒక ద్విగుణితావధానము చేశారు. విద్వత్కవి.
డా. గరికపాటి నరసింహా రావు (1958 సెప్టెంబరు):
ప్రవచనకారుడిగా ప్రఖ్యాతి గడించిన గరికపాటి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో జన్మించారు. తెలుగులో ఎం.ఎ. పి.హెచ్.డి. చేశారు. అధ్యాపక వృత్తిలో మూడు దశాబ్దాలు పని చేశారు. దాదాపు 275 అష్టావధానాలు, 8 శతావధానాలు, మహాసహస్రావధానం దిగ్విజయంగా చేశారు. దేశవిదేశాలలో ప్రవచన ప్రభంజనం సృష్టించారు. ‘సాగర ఘోష’ పద్యకావ్యం ప్రముఖం. దూరదర్శన్‍లో, వివిధ ఛానళ్లలో వీరి ప్రవచనాలు అమోఘం. 2017లో ‘పద్మ శ్రీ’ పురస్కారం వరించింది. భక్తి టి.వి. తదితర ఛానళ్లలో వీరి ప్రసంగాలను శ్రోతలు ఆస్వాదించారు. ఆయన ధారణా బ్రహ్మరాక్షసుడు. వీరి కుమారుల పేర్లు – శ్రీశ్రీ, గురజాడ. గరికపాటి హైదరాబాదులో స్థిరపడ్డారు.
(మళ్ళీ కలుద్దాం)