తెలుగుజాతికి ‘భూషణాలు’-42

0
2

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

వైద్య పద్మాలు:

దాదాపు 20 మంది తెలుగు వైద్యులకు ‘పద్మ శ్రీ’లు లభించాయి.

డా. హిల్డా మేరీ లాజరస్ (1890 జనవరి- 1978 జనవరి):

విశాఖపట్టణంలో జన్మించారు. మదరాసు విశ్వవిద్యాలయం నుండి 1916లో యం.బి.బి.యస్ చదివారు. బ్రిటీష్ ప్రభుత్వం స్త్రీల వైద్యసేవల నిమిత్తం ఈమెను లండన్ నుండి భారతదేశంలో తొలి వైద్యురాలిగా నియమించారు. కలకత్తా, సూరత్ లలో పనిచేసి విశాఖ ‘డఫెరిన్’ వైద్యాలయంలో చేరారు. ప్రసూతి శిక్షణా కేంద్రాన్ని స్థాపించి తెలుగులో బోధనకు అంకురార్పణ చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ వైద్య సేవా విభాగంలో అసిస్టెంట్ డైరక్టర్ జనరల్ బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయ వైద్యురాలు. విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో MLC గా వున్నారు. 1961లో ‘పద్మ శ్రీ’ వరించింది.

యుద్ధ సమయంలో పని చేసిన డా. మహంకాళి సీతారామారావుకు 1962లో ‘పద్మ భూషణ్’ లభించింది. అలానే డా. పెరుగు శివారెడ్డికి (1982) లభించింది. డా. డి. నాగేశ్వరరెడ్డి, డా. ప్రతాప్ సి.రెడ్డిలను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వరించాయి.

హృద్రోగ నిపుణులు డా. బి. కె. నాయక్ (అక్టోబరు 1921 – సెప్టెంబరు 2001):

1976లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. ఆయన బొంబాయి విశ్వవిద్యాలయంలోను లండన్ స్కూల్ లోని ట్రాపికల్ మెడిసిన్ లోను వైద్యవిద్య నభ్యసించారు. ఉస్మానియా వైద్యకళాశాలలో తొలిసారిగా హృద్రోగ విభాగాన్ని 1960లో నెలకొల్పారు. కుశాల్ భాయ్ నాయక్ అదే కళాశాలలో పలు పదవులధిష్టించారు. 1973లో కార్టియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సుకు అద్యక్షులుగా ఎన్నికయ్యారు. ప్రముఖంగా ఆయన మధుమేహం, బి.పి.లపై పట్టు సాధించిన వైద్యనిపుణులు. తద్వారా హృద్రోగ నివారణకు ప్రయత్నించారు.

డా. కాకర్ల సుబ్బారావు (జనవరి 1925- ఏప్రిల్ 2021):

హైదరాబాదులోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సారథిగా ప్రముఖులు. ఆయన రేడియాలజిస్టు. 2000 సంవత్సరంలో ‘పద్మ శ్రీ’ అందుకున్నారు. నిమ్స్ సంస్థకు తొలి డైరక్టరు. సాధారణ కుటుంబంలో జన్మించి విశాఖపట్టణం ఆంధ్రా మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్ర పట్టభద్రులయ్యారు, న్యూయార్క్ విశ్వవిద్యాలయం రేడియోలజీ విభాగంలో M.S. చేశారు. ఎన్.టి. రామారావు ప్రోత్సాహంతో భారతదేశానికి వచ్చి నిమ్స్ ఆధునికీకరణకు మార్గదర్శి అయ్యారు. రేడియాలజీ మీద పలు గ్రంథాలు వ్రాశారు. వైద్య పత్రికల సంపాదకత్వం వహించారు.

డా. దాసరి ప్రసాదరావు (జనవరి 1950):

ప్రముఖ హృద్రోగ శస్త్ర చికిత్స నిపుణులు. ఆంధ్రప్రదేశ్‍లో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన ఘనులు. వైద్యం ఖర్చులను తక్కువ చేయడానికి ప్రయత్నించారు. విజయవాడ, గుంటూరులలో వైద్యశాస్త్రం చదివారు. ఢిల్లీలోని AIIMS లో 1979 లో ఎం.సి.హెచ్ చేశారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ వెళ్లి ఉన్నత విద్య ద్వారా శస్త్రచికిత్సలో ప్రావీణ్యం సంపాదించారు. ఆక్లాండ్‌లో శిక్షణ పొందారు. NIMS లో తొలి హృద్రోగ శస్త్ర చికిత్సలో బైపాస్ తొలిసారిగా చేసి విజయులయ్యారు. నిజాం వైద్య సంస్థ డైరక్టర్‍గా 2004లో నియమితులయ్యారు. ఆసుపత్రిలో పడకల సంఖ్యను 960 నుండి 2000 వరకు పెంచారు. క్లినికల్ పరిశోధనారంగంలో కృషి చేసి 2009లో Speaking Book in Telugu for Clinical Trial Participation ప్రచురించారు. 2001లో ‘పద్మ శ్రీ’ అందుకున్నారు.

డా. చిత్తూరు మహమ్మద్ హబీబుల్లా (1937 – జూలై 2010):

గుంటూరు వైద్యకళాశాల నుండి MBBS, విశాఖపట్టణం ఆంధ్రా మెడికల్ కాలేజి నుండి మాస్టర్స్ డిగ్రీ, చండీఘడ్ నుండి యం.డి. పట్టాలు పొందారు. ఉస్మానియా వైద్యకళాశాలలో గాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో 1973 నుండి 1992 వరకు వివిధ హోదాలో పని చేశారు. హైదరాబాదులో డక్కన్ మెడికల్ కాలేజీలో రీసెర్చ్ విభాగం డైరక్టరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ విద్యా విభాగ డైరక్టర్‌గా పనిచేశారు. 2001లో ‘పద్మ శ్రీ’ స్వీకరించారు. నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోషిప్ (2003) లభించింది. అంతర్జాతీయ పురస్కారం 1997లో లభించింది

ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డా. గుళ్లపల్లి నాగేశ్వరరావు:

కృష్ణాజిల్లా చోడవరంలో జన్మించారు. గుంటూరు వైద్యకళాశాలలో MBBS చేసి ఢిల్లీలోని AIIMS లో నేత్రవైద్యంలో ఉన్నత విద్య అభ్యసించాక అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. విదేశాలలో కూడా శిక్షణనిస్తున్నారు. హైదరాబాదులో యల్.వి.ప్రసాద్ నేత్ర వైద్యశాల అధిపతి. ఆస్ట్రేలియా, యుకె, భారతదేశాల గౌరవ డాక్టరేట్‌లు లభించాయి. 2012లో ‘పద్మ శ్రీ’ అందుకున్నారు. నేత్రరోగ నివారణలో దీక్షాబద్ధ కంకణులై వేలాది మందికి నేత్రదానం చేశారు. అరవింద హాస్పిటల్, మదరాసులో నేత్రవైద్యనిపుణులు గోవిందప్ప వెంకటస్వామి ఈయనకు స్ఫూర్తిప్రదాత.

డా. కుటికుప్పల సూర్యారావు (అక్టోబరు 1950):

డా. సూర్యారావు శ్రీకాకుళం జిల్లా కింతలిలో జన్మించారు. విశాఖపట్టణం ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి MBBS చేశారు. కొలంబో విశ్వవిద్యాలయం నుండి యం.డి, నెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నుండి డాక్టరల్ ఫెలోషిప్ సాధించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి – ‘Ethical challenges involved in the treatment of HIV/AIDS’ మీద పరిశోధన చేసి PhD పొందారు. ఆయన తన జీవితమంతా AIDS నిరోధక సేవలో గడుపుతున్నారు. విశాఖలో స్థిరపడి, ఎయిడ్స్ వ్యాధి ప్రచారంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. లండన్ లోని House of Lords లో మహాత్మాగాంధీ ప్రవాసీసమ్మాన్ (2015) పొందారు. 1989లో WHO అవార్డు, 2008లో ‘పద్మ శ్రీ’ ఆయనకు లభించాయి, జాతీయ స్థాయిలో ఎయిడ్స్ నిరోధక సంస్థలో సభ్యత్యం లభించింది. పలు గ్రంథాల రచయిత. సృజనాత్మక సాహిత్యం పట్ల ఆసక్తి మెండు.

నేత్ర వైద్య నిపుణులు డా. అలంపూర్ సాయిబాబాగౌడ్:

తెలంగాణాకు చెందినవారు. అంధులకు సహకారంగా ఒక స్వచ్చంద సంస్థను నెలకొల్ప సేవ చేస్తున్నారు. హైదరాబాదులో ఉస్మానియా మెడికల్ కళాశాలలో నేత్రవైద్య విభాగాధిపతి. క్రియశీలక డాక్టరుగా అంధత్వ నివారణకు ‘దేవనర్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’ స్థాపించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని అంధుల క్రికెట్ అసోసియేషన్ చైర్మన్. అంధులకు గృహవసతి, పాఠశాలలు, వృత్తివిద్యాకోర్సులు, కంప్యూటర్ శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విదేశాలలోని GE, DELL, ORACLE కంపెనీలు వీరి ఆశయాలకు దోహదం చేశాయి. 2009లో ‘పద్మ శ్రీ’ వరించింది.

డా. సి.వి.యస్. రామ్:

డా. రామ్ ప్రముఖ వైద్యులు. నిజాం కళాశాలలోను, ఉస్మానియా మెడికల్ కాలేజీలోను చదివి MBBS చేశారు. అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చేశారు. అమెరికాలో వివిధ ఆసుపత్రాలలో మూడు దశాబ్దాలు వైద్య నిపుణులుగా HYPER TENSION పై పరిశోధనలు చేశారు. హైదరాబాదులో ఉత్తమ డాక్టర్ అవార్డు 2015లో అందుకున్నారు. 2015లో ‘పద్మ శ్రీ’ స్వీకరించారు. హైదరాబాదులో మెడిసిటీ స్థాపించారు. ఆసుపత్రి, వైద్యవిజ్ఞాన సంస్థల ద్వారా సేవ చేస్తున్నారు. అంతర్జాతీయ పత్రికలలో పరిశోధనా పత్రాలు ప్రచురించారు రామ్.

హృద్రోగ శస్త్రచికిత్స నిపుణలు డా. యస్. సహారయ్య (1945 ఏప్రిల్):

అస్సాంలోని మంగళదాయం గ్రామంలో జన్మించారు. 1967లో గౌహతి మెడికల్ కాలేజ్ నుండి MBBS చేశారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతికి చెందిన వీరికి అస్సాం ప్రభుత్వం స్కాలర్‌షిప్ మంజూరు చేసింది. చండీఘర్ లోని ప్రసిద్ధ వైద్యకళాశాలలో గుండె మార్పిడి శస్త్రచికిత్సలో ప్రావీణ్యం సంపాదించారు. 1981లో ఉస్మానియా వైద్య కళాశాలలో Organ Transplantation Centre అధిపతిగా చేరారు. అదే సంవత్సరం ఆయన నిమ్స్‌లో Renal Transplantation వ్యవస్థను అభివృద్ధి చేశారు. దిబ్రూగర్, గౌహతి ఆసుపత్రులలో మూడు సంవత్సరాలు (1992-95) సేవలందించారు. 2010లో గౌహతిలో అంతర్జాతయ హాస్పిటల్ ప్రారంభించారు. ఆంధ్రదేశం లోను, ఇతరత్రా, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలెన్నో చేసి 2014లో ‘పద్మ శ్రీ’ పొందారు

డా. ఏ. మంజుల, డా. జి. రఘురామ్ లకు 2015లో పద్మ శ్రీప్రకటించారు.

డా. అనగాని మంజుల గాంధీ వైద్య కళాశాల నుండి MBBS, ఉస్మానియా వైద్య కళాశాల నుండి యం.డి. పొందారు. వంధ్యత్యం నివారణ శిక్షణ పొందారు. మహిళల ఆరోగ్యం గూర్చి ప్రచారం చేయడానికి ప్రత్యూష అనే ఎన్.జి.వో.ని స్థాపించారు. 2016లో ఒక ఆపరేషన్‌లో అత్యధిక సంఖ్యలో గర్భాశయ ఫైబ్రాయిడ్లు తొలగించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు.

డా. పి. రఘురామ్ గుంటూరులో పెరిగారు. రొమ్ముక్యాన్సర్ మీద పరిశోధనలు చేశారు. లండన్‌లో శిక్షణ పొంది భారతదేశానికి వచ్చి వైద్యసేవలు చేశారు. సేవాదృక్పథంతో పని చేశారు. తల్లి స్మారకంగా, విశాలాక్షి బ్రెస్ట్ కాన్సర్ ఆసుపత్రి స్థాపించారు.

డా. ఎస్. వి. ఆదినారాయణ రావు (జాన్ 1930):

భీమవరంలో జన్మించారు. విశాఖపట్టణం ఆంధ్రా మెడికల్ కాలేజిలో యం.బి.బియస్ (l966), యం.యస్ (1970) చేశారు. కింగ్ జార్జి ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేశారు. రాణి చంద్రమణి దేవి ఆసుపత్రి సూపరింటిండెంట్‌గా పని చేశారు. పోలియో వ్యాధి సర్జరీ గురించి పుస్తకం వ్రాశారు. ఐదున్నర దశాబ్దాల కాలంలో మూడు లక్షల పోలియో ఆపరేషన్లు చేశారు. వెయ్యి శిబిరాలను నిర్వహించారు. 2022లో ‘పద్మ శ్రీ’ దక్కింది.

శిశువైద్య నిపుణులు డా. పసుపులేటి హనుమంతరావు:

డా. హనుమంతరావు గారికి 2023లో ‘పద్మ శ్రీ’ లభించింది. సామాజిక సేవలో నిమగ్నమై స్వీకార్ గ్రూప్ నెలకొల్పారు (1977). వికలాంగులైన పిల్లలకు పునరావాసం కల్పించే విధానం రూపొందించారు. ఈ విధానంలో వారికి ప్రత్యేక విద్య, మాటలు పలికే శిక్షణ, మానసిక ఆరోగ్యం గురించి శిక్షణ యిస్తున్నారు. 1996లో అంతర్జాతీయ ఆసియా అవార్డు, 1984లో బి.సి.రాయ్ అవార్డు లభించాయి.

ఈ రీతిగా ప్రముఖ వైద్యులు పలువురు ‘పద్మ’ పురస్కార గ్రహీలయ్యారు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here