Site icon Sanchika

తెలుగుజాతికి ‘భూషణాలు’-5

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

[dropcap]ప[/dropcap]ద్మ పురస్కారాల జాబితాలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అత్యున్నతాలు. ‘భారత రత్న’ ఏటా ప్రకటించరు. పద్మ విభూషణ్ పురస్కారాన్ని తెలుగు రాష్ట్రాలతో అనుబంధమున్న 36 మంది 1954 – 2024 మధ్య 70 సంవత్సరాల వ్యవధిలో పొందారు. తొలి సంవత్సరం శ్రీ జాకీర్ హుసేన్ (ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి) పొందగా 2024లో ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన శ్రీ యం. వెంకయ్యనాయుడు పొందడం యాదృచ్ఛికం. ఆయా రంగాలకు చెందిన 31 మంది విశిష్ట వ్యక్తుల వివరాలు క్రమంగా:

సంవత్సరం ప్రముఖుల పేరు విశిష్ట రంగం
1 1954 డా. జాకీర్ హుసేన్ ప్రజా సేవా రంగం (హైదరాబాద్ జననం)
2 1962 శ్రీమతి పద్మజా నాయుడు ప్రజా సేవా రంగం (హైదరాబాద్ జననం)
3 1963 శ్రీ. ఏ. లక్ష్మణస్వామి మొదలియార్ వైద్యరంగం
4 1965 శ్రీ మోహిదీ నవాజ్ జంగ్ ప్రజా సేవ
5 1967 శ్రీ పి.వి.ఆర్. రావు సివిల్ సర్వీస్
6 1970 శ్రీ. ఏ. రామస్వామి మొదలియార్ సివిల్ సర్వీస్
7 1975 శ్రీ చింతామణీ దేశ్‍ముఖ్ ప్రజా సేవ
8 1975 శ్రీమతి దుర్గాబాయి దేశ్‍ముఖ్ సామాజిక సేవ
9 1977 శ్రీ అలీ యావర్ జంగ్ ప్రజా సేవ
10 1991 ఆచార్య ఎన్. జి. రంగా ప్రజా సేవ
11 1991 డా. యం. బాలమురళీకృష్ణ సంగీతం
12 1992 శ్రీ  కాళోజీ నారాయణరావు కళలు
13 1992 శ్రీ రావి నారాయణ రెడ్డి ప్రజా సేవ
14 2000 శ్రీ. యు. నరసింహం పరిశ్రమలు, వాణిజ్యం
15 2001 ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి సాహిత్యం, విద్య
16 2001 డా. సి. ఆర్. రావు శాస్త్రవేత్త
17 2006 శ్రీ సి. ఆర్. కృష్ణస్వామి రావు సివిల్ సర్వీస్
18 2007 శ్రీ వి. కృష్ణమూర్తి సివిల్ సర్వీస్
19 2010 శ్రీ ప్రతాప్ సి. రెడ్డి వైద్య రంగం
20 2010 డా. వై. వి. రెడ్డి సివిల్ సర్వీస్
21 2011 డా. పల్లె రామారావు శాస్త్రవేత్త
22 2011 డా. అక్కినేని నాగేశ్వరరావు కళలు
23 2012 శ్రీ. టి. వి. రాజేశ్వర్ సివిల్ సర్వీస్
24 2013 శ్రీ రొద్దం నరసింహ శాస్త్రవేత్త
25 2016 డా. యామినీ కృష్ణమూర్తి కళలు
26 2016 శ్రీ రామోజీ రావు సాహిత్యం, విద్య
27 2017 శ్రీ రజనీకాంత్ కళలు
28 2017 శ్రీ జగ్గీ వాసుదేవ్ ఇతరములు
29 2021 డా. యస్. పి. బాలసుబ్రహ్మణ్యం కళలు
30 2024 శ్రీ కె. చిరంజీవి కళలు
31 2024 శ్రీ యం. వెంకయ్యనాయుడు ప్రజా సేవ

గమనిక: ఆంధ్ర రాష్ట్ర గవర్నరుగా పనిచేసిన శ్రీ. సి. యం. త్రివేది (మధ్య ప్రదేశ్) 1956లోనూ, ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన శ్రీ సి. రంగరాజన్ 2002లో పద్మవిభూషణులయ్యారు.

~

జాకీర్ హుస్సేన్:

భారత రాష్ట్రపతిగా 1967 మే నుండి 1969 వరకు వ్యవహారించిన జాకీర్ హుస్సేన్ విద్యావేత్తగా ప్రముఖులు. పద్మ పురస్కారాలు ప్రారంభించిన తొలి సంవత్సరమే 1954లో తొలి పురస్కారం వారికి లభించింది. అప్పుడాయన రాజ్యసభ సభ్యులుగా (1952-57) నామినేట్ చేయబడివున్నారు. 60 ఏళ్లు కూడా నిండని వయస్సులో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం అందడం విద్యావేత్తగా ఆయనకున్న ప్రతిష్ఠకు నిదర్శనం. 29 ఏళ్లకే ఆయన ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వైస్ – ఛాన్సలర్ అయ్యారు. 1922 లోనే బెర్లిన్ విశ్వవిద్యాలయం (జర్మనీ) నుండి ఆర్థికశాస్త్రంలో పొందారు. 1956 వరకు ఆలీఘర్ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్‌గా వ్యవహరించారు. 1937లో బేసిక్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. 1962లో సాహిత్య అకాడెమీకి ఉపాద్యక్షులుగా నామినేట్ అయ్యారు. అప్పటివరకు ఆ పదనిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. రాష్ట్రపతి పదవికి హుస్సేన్ పోటీ చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీల తరఫున సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కోకా సుబ్బారావు ప్రత్యర్థిగా నిలబడి ఓడిపోయారు. ఆయన తొలి ముస్లిం రాష్ట్రపతి. ఆయన ఉర్దూలో విస్తృతంగా రచించారు. 1969 ఏప్రిల్ 26న అస్సాం పర్యటన నుండి ఢిల్లీ మార్గమధ్యంలో వుండగా ఆయనకు స్వల్పంగా హార్ట్ అటాక్ వచ్చింది. 1969 మే 3న రాష్ట్రపతిభవనంలో కన్నుమాశారు. ఉపరాష్ట్రపతిగా వున్న వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు. రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి.గిరి వరుసగా తెలుగు మూలాలు గలవారు వరుసగా ఉపరాష్ట్రపతులు, రాష్ట్రపతులుగా వుండటం విశేషం.

శ్రీమతి పద్మజానాయుడు (1900 నవంబరు – 1973 మే):

1962లో పద్మవిభూషణ్ పురస్కారం పొందిన పద్మజానాయుడు స్వాతంత్ర సమరయోధురాలు. కవయిత్రి. ప్రముఖ కవయిత్రి సరోజన నాయుడు, ముత్యాల గోవిందరాజులు నాయుడు కుమార్తె. హైదరాబాదులో 1900 నవంబరు 17 న జన్మించారు. మహాబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో 4 సంవత్సరాలు మాత్రమే చదివారు. బాల్యంలో తరచు అనారోగ్యం పాలుకావడం వల్ల చదువు కొనసాగలేదు. కాని, ఆమె తల్లి నివసించిన గోల్డన్ త్రెషోల్డ్ (అబిడ్స్, హైదరాబాదు) నివాసానికి విచ్చేసిన పలువురు ప్రముఖుల సాన్నిహిత్యమే ఆమె జ్ఞాన సంపదను పెంచింది.

సమాజ సేవ:

Indian Council of Social Work శాఖను హైదరాబాదులో ఏర్పాటు చేసి అనేక రకాలైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆమె ప్రత్యేకత.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆమె ఎందరో ముస్లిం స్త్రీలను సభ్యులుగా చేసి ప్లేగు రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేశారు. జాగిర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరావటానికి ‘స్వదేశీ లీగ్’ అనే సంస్థను స్థాపించి అధ్యక్షరాలిగా పనిచేశారు. ఆ సంస్థ పక్షాన తాను సంపాదకురాలిగా ‘One World’ అనే పత్రిక నడిపారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో కొందరు ఉస్మానియా విద్యార్ధులు సామ్యవాద సిద్దాంతాల పట్ల ప్రభావితులై కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభించినపుడు పద్మజానాయుడు వారికి ఇతోధికంగా సహకరించారు.

1935లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినపుడు రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు హైదరాబాదు సహాయక సంఘం అద్యక్షురాలిగా ఎనలేని సేవలు చేశారు. అనేక ప్రాంతాలు పర్యటించి బాధితులకు తక్షణ సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళారు. అప్పట్లో మహిళలకు ప్రత్యేక కారాగారాలు లేవు. ఆమె పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందినది కావడం వల్ల ఆమె హయత్‌నగర్ లోని బేగం గారి దేవిడీలో సకల సౌకర్యాలు గల రాజభవనంలో నిర్భందించారు. ఆమె తనతోబాటు అరెస్టయిన తక్కిన స్త్రీలకు కూడా ఆ వసతులు కల్పించాలని పోరాడారు. చైనా యుద్ధ సమయంలో ఆమె తనకున్న విలువైన బంగారు ఆభరణాలను జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందించారు.

పదవీబాధ్యతలు:

1950లో పద్మజానాయుడు భారత రాజ్యాంగ సభకు ఎన్నికైనారు. స్వాతంత్రోద్యమ సమయంలో తల్లితో బాటు పనిచేసిన పద్మజ 21 ఏళ్ళ వయసులోనే హైదరాబాదులో భారత జాతీయ కాంగ్రెసు సహవ్యవస్థాపకురాలైనారు. 1956లో పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియమితులై గవర్నరుగా పేరు తెచ్చుకొన్నారు. అంతకు ముందుగా గవర్నరులుగా రాజగోపాలాచారి, కైలాసనాథ కట్జు, హెచ్.సి ముఖర్జీ వంటి ప్రముఖులు పని చేశారు. 1960 లో రష్యా అధ్యక్షులు కృశ్చేవ్ కలకత్తా విచ్చేసినపుడు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేయడం చరిత్రాత్మకం.

భారత రెడ్ క్రాస్ అద్యక్షరాలిగా 1971-72 మధ్య బంగ్లాదేశ్ శరణార్థుల సహాయ చర్యలకు తోడ్పడ్డారు. భారత్ సేవక్ సమాజ్, అఖిల భారత హస్త కళలూ, నెహ్రూ స్మారక నిధి వంటి సంస్థలతో ఆమెకు అనుబంధం వుంది. 1975- మే నెలలో మరణించేంత వరకూ తీన్ మూర్తి భవన్ ఎస్టేట్ సమీపంలోని గృహంలో ఆమె నివసించారు. జవహర్‍లాల్ నెహ్రూ కమలా నెహ్రు మరణానంతరం కొంత కాలానికి పద్మజానాయుడిని వివాహమాడాలని ఆలోచించినట్లు చరిత్రకారులు రచించారు. 1975లో డార్జిలింగ్ లోని జంతు ప్రదర్శనశాలను ‘పద్మజా నాయుడు హిమాలయ జంతు ప్రదర్శనశాల’గా ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ప్రారంభించారు. సుదీర్ఘ కాలం గవర్నరుగా (11సంవత్సరాలు) పనిచేసిన ఖ్యాతి పద్మజా నాయుడుకు ఉంది.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version