[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]
ఆర్కాట్ సోదరులు:
[dropcap]ఆ[/dropcap]ర్కాట్ సోదరుల పేర ప్రసిద్దులైన ఆర్కాట్ రామస్వామి మొదలియార్, లక్ష్మణస్వామి మొదలియార్ కవలలుగా 1887 అక్టోబరు 14న జన్మించారు, వీరిద్దరు తొలినాళ్లలో కర్నూలు మునిసిపల్ ఉన్నత పారశాలలో చదువు కొనసాగించి 1903లో మద్రాస్ తరలి వెళ్లిపోయారు. అన్నదమ్ములిద్దరూ ప్రతిభామూర్తులు. అన్న లాయరుగా అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తే, తమ్ముడు డాక్టర్‌గా, విద్యావేత్తగా వెలుగొందారు, ఒక కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు పద్మ విభూషణ్ లభించడం ఒక ప్రత్యేకత.
రామస్వామి ముదలియార్:
- 1939-42: వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబరు (చక్రవర్తికి అనుబంధం)
- 1942-45: ఇంపీరియల్ యుద్ధ క్యాబినెట్లో సభ్యులు (చర్చిల్ ప్రధాని)
- 1946-47: యునెస్కో అధ్యక్షులు.
- 1947: మైసూరు రాజ్య దివాన్ (జయచామరాజ్ వడియార్ చక్రవర్తి)
భారత ప్రభుత్వం వీరికి 1954లో పద్మ భూషణ్, 1970లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందించింది. 1976 జూలై 17న 88వ ఏట కాలధర్మం చెందారు. రాజకీయపరంగా జస్టిస్ పార్టీలో కొనసాగారు. దివాన్ బహదూర్ గౌరవం లభించింది. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. భారత రాజ్యాంగ నిర్మాణ సమయంలో మైసూరు రాష్ట్ర ప్రతినిధిగా పాల్గొని ఫెడరల్ రాజ్యాంగ విధానాన్ని బలపరచారు.
లక్షణస్వామి మొదలియర్:
1959లో ఇండియన్ సైన్స్ కాంగ్రెసు జనరల్ ప్రెసిడెంట్‌గా ఎంపికైనారు. 1938లోనే వారు రచించిన CLINICAL OBSTETRICS గ్రంథం 10కి పైగా ప్రచురణలు పొందింది. 1945 బ్రిటీష్ ప్రభుత్వం నూతన సంవత్సర ‘నైట్‍హుడ్’ అందుకున్నారు.
వైద్య విద్యాబోధనలో లక్ష్మణ స్వామికి విశేష ఖ్యాతి లభించింది. 1934లో మదరాసు మెడికల్ కాలేజిలో ప్రసూతి వైద్యవిభాగంలో ప్రొఫసర్‌గా చేరిన ఆయన మదరాసు ప్రభుత్వ మహిళ-శిశువుల ఆసుపత్రిలో 25 సంవత్సరాలకు పైగా పని చేసి దేశాంతర ఖ్యాతి సంపాదించారు. ఆయన వద్ద వైద్యవిద్యలో లోతుపాతులు తెలుసుకొనేందుకు బర్మా, మలేషియా, చైనా దేశాలనుంచి స్నాతకోత్తర విద్యార్థులు వచ్చేవారు. కేవలం మార్కుల మీద ఆధారపడి గాక విద్యార్థుల ప్రతిభను అంచనా వేయాలని వాదించేవారు. సమర్థత ఉన్న విద్యార్థులకు కళాశాలలో సీట్లు ఇవ్వాలని నమ్మేవారు, సోదరులిద్దరూ అఖండ ప్రతిభామూర్తులు. అన్నగారితో పాటు 1954లో లక్షణస్వామి పద్మ భూషణ్ అందుకున్నారు. 1963లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అన్నదమ్ములిద్దరూ తొలి సంవత్సరమే పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం వారి ఖ్యాతికి నిదర్శనం.
మదరాసు విశ్వవిద్యాలయం సెనేట్ మెంబరుగా 1923లో, సిండికేట్ మెంబర్‍గా 1924లోను విద్యావ్యాప్తికి కృషిచేశారు. 1942-69 మధ్య 27 సంవత్సరాల సుదీర్ఘకాలం మదరాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా విద్యారంగంలో విశేష కృషి చేశారు. వివిధ విద్యారంగ సంస్థలతో అనుబంధం పెంచుకుని విశేష ఖ్యాతి గడించారు.
1936లో మదరాసులో అఖిల భారత కాంగ్రెసు మహాసభలు నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారు. మదరాసు శాసన మండలి సభ్యులుగా 25 సంవత్సరాలు క్రియాశీల రాజకీయాలలో పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశాయి. కొద్దిపాటి అస్వస్థతలో 1974 ఏప్రిల్ 15న మదరాసులో కన్నుమాశారు. ఇది వారి 50వ వర్థంతి సంవత్సరం.
నవాబ్ మెహిదీ నవాజ్ జంగ్ (23 మే 1894- 28 జూన్ 1967):
ఆయన నివాసస్థానం కోహిస్తాన్. హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో రామణీయక వాతావరణంలో నిర్మించుకొన్నారు. మెహిదీ నవాజ్ డిగ్రీ పూర్తి కాగానే హైదరాబాద్ రాష్ట్ర రెవెన్యూ డిపార్టుమెంటుకు సివిల్ సర్వీసుల ద్వారా ఎంపికయ్యారు. బళ్ళారి, గుల్బర్గా, నల్గొండ జిల్లాలలో పనిచేశారు. 1926లో మహారాజా కిషన్ ప్రసాద్ నిజామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‍లో ప్రధాని కాగానే మోహిదీ నవాజ్ కార్యదర్శిగా నియమితులై 11 ఏళ్ళు (1926-37) పనిచేశారు. ఆయనకు ‘జంగ్’ బిరుదు ప్రదానం చేశారు.
బంజారా హిల్స్ నిర్మాత:
బంజారాహిల్స్ పూరాతన కాలంలో ఖాళీ స్థలంగా పడివుండేది. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం మెయిన్ యార్ జంగ్ వద్ద నుండి 200 ఎకరాల బంజరుభూమిని మోహిదీ నవాజ్ కొన్నారు. అందులో ఒక ‘గుహ’ వంటి గృహాన్ని నిర్మించుకొని 1930లో ప్రవేశించారు. ఆ ప్రాంతాన్ని తన స్నేహితులకు చౌకధరకు అమ్మి గృహనిర్మాణానికి ప్రోత్సహించారు. 1932లో రవీంద్రనాథ్ ఠాగూరు హైదరాబాద్ వచ్చినపుడు మెహిదీ నవాజ్ జంగ్ నివాసంలో విడిది చేశారు. ‘శాంతినికేతన్’ బాధ్యతలు లేకపోతే నేనిక్కడే స్థిరనివాసం చేసేవాడినని ఠాగూరు పేర్కోంటూ –
‘From the distance thou didst appear
barricaded in rocky aloofness,
Timidly I crossed the rugged path
to find here all of a sudden.’
అంటూ ఒక గీతం రాశారు.
అప్పటి నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ ప్రాంతాన్ని మెహిదీ నవాబ్ పేర అభివృద్ధి చేయాలని సూచించారు. కాని, ఆ ప్రాంతం బంజారాలకు నెలవు గాబట్టి దీనిని బంజారా హిల్స్‌గా మెహిదీ నవాబ్ నామకరణం చేసి అభివృద్ధి చేశారు.
1937 నుండి ఐదేళ్లపాటు హైదరాబాదు మునిసిపాలిటీ కమీషనర్‌గా వున్న మెహిదీ నవాబ్ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కుష్ఠురోగుల సదనం కల్పించారు. ఆ తర్వాత ఆయనను వాణిజ్యం, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా నియమించారు. తర్వాత బేరారు ప్రాంతానికి నిజామ్ ప్రతినిదిగా ఏజంట్ జనరల్‍గా నియుక్తులయ్యారు. 1947-48 మధ్యకాలంలో రజాకార్ల ఉద్యమ సమయంలో ఆయన సుదీర్ఘకాలం సెలవు పై వెళ్ళారు. 1949లో పదవీ విరమణ చేశారు.
35 లక్షల విరాళలతో 1953లో నిలోఫర్ ఆసుపత్రిని, 18 లక్షలలో 1955లో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. మౌలానా అబుల్ కలాం అజాద్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్‍కు ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. 1967 జూన్‍లో కన్ను మూశారు.
పి.వి.ఆర్. రావు:
1967లో పద్మ విభూషణ్ పురస్కృతులైన పి. వెంకన్న రాఘవేంద్ర రావు భారత సివిల్ సర్వీసు అధికారి. 1962లో ఇండో-చైనా యుద్ధం పూర్తి అయిన తర్వాత 21 నవంబరులో ఆయన భారతదేశ ఆరవ రక్షణ శాఖ కార్యదర్శిగా నియుక్తులై మూడేళ్లు కొనసాగారు. ఆయన రచించిన మూడు గ్రంథాలు ప్రామాణికం.
- India’s defence and organisation since Independence
- Defence without drift.
- Red tape and white cap.
పి.వి. ఆర్. రావుకు ముందు మరో ఆంధ్రులైన O.పుల్లారెడ్డి రక్షణశాఖ కార్యదర్శి. తరువాత కాలంలో బి.ఆర్. ప్రసాద్ అదే శాఖ కార్యదర్శి. ప్రస్తుతం ఏ. గిరిధర్ రక్షణ శాఖకు కార్యదర్శి.
ప్రభుత్వంలో ‘రెడ్ టేప్’ ఒక జాడ్యం. సివిల్ సర్వీసు అధికారులు దానికి బాధ్యులు. పి.వి. ఆర్. రావు 345 పుటల గ్రంథం ‘Red tape and white cap’ గ్రంథాన్ని 1970లో ఓరియంట్ లాంగ్‍మన్ ప్రచురించింది. ఈ గ్రంథంలో స్వాతంత్య్రానికి పూర్వం సివిల్ సర్వీసుల స్థితిగతులు వివరించారు. వీరిని ఎంపిక చేసే ప్రక్రియ, వారికిచ్చే శిక్షణ వివరాలున్నారు. సివిల్ సర్వీసుల నేటి స్థితికి కారణాలు చర్చించారు. ప్రతిష్ఠాత్మకమైన రక్షణశాఖ కార్యదర్శి పదవిని ఆంధ్రులు పలువురు అధిష్టించడం గర్వకారణం.
Images source: Internet
(మళ్ళీ కలుద్దాం)