Site icon Sanchika

తెలుగుజాతికి ‘భూషణాలు’-7

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

[dropcap]ప[/dropcap]ద్మ విభూషణ్ పురస్కారాన్ని 1954 నుండి 2024 వరకు గత 70 సంవత్సరాలలో భారతదేశంలో పొందిన వారి సంఖ్య పరిశీలిద్దాం.

దశకం పురస్కార గ్రహీతల సంఖ్య
1954-59 17
1960-69 27
1970-79 53
1980-89 20
1990-1999 42
2000-2009 86
2010-2019 62
2020- 24

ఈ సంఖ్యను పరిశీలిస్తే 21వ శతాబ్దంలో పద్మ విభూషణ్‍లు విరివిగా ఇవ్వడం మొదలైంది. ఆయా రంగాలకు చెందిన వ్యక్తులు గత 70 సంవత్సరాలలో ఇలా వున్నారు: కళలు- 64; సివిల్ సర్వీసు – 53; సాహిత్యం, విద్య 42; వైద్యం -15, ఇతరాలు-8; ప్రజాసేవ -78; శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు – 37; సమాజసేవ-18; క్రీడలు-4; పరిశ్రమ 12. ఇటీవలి కాలంలో సివిల్ సర్వీసుకు చెందినవారికి బాగా తగ్గించారు. మారుమూల పల్లెల్లోని విస్మృత కళాకారులను వెదికి పట్టి ‘పద్మశ్రీ’ ప్రకటించడం హర్షదాయకం.

దుర్గాబాయ్ దేశముఖ్ దంపతులు:

1975లో చించామణ్ దేశముఖ్, దుర్గాబాయ్ దేశముఖ్ ఇరువురికీ పద్మ విభూషణ్‍ పురస్కారం ప్రకటించారు.

చింతమణి ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ (14 జనవరి 1896 – 2 అక్టోబరు 1982):

చింతామణి ప్రముఖ స్వాతంత్య్ర యోధురాలైన దుర్గాబాయిని 1953లో వివాహామాడారు. I.C.S అధికారి అయిన చింతామణికి 1939 నుండి రిజర్వు బ్యాంకుతో అనుబంధం. 1941లో డిప్యూటీ గవర్నరుగా బ్రిటీషు ప్రభుత్వం నియమింది. 1943లో మూడవ గవర్నరుగా బాధ్యతలు స్వీకరించారు. IMF లోను, ప్రపంచబ్యాంకులోను బోర్డ్ ఆఫ్ గవర్నరుగా పదేళ్లు పనిచేశారు. 1943 ఆగష్ట్ నుండి 1949 జూన్ వరకు ఆయన రిజర్వు బ్యాంకు గవర్నరు. స్వతంత్ర భారత RBI గవర్నరు ఆయనే. ఆ తరువాత 1949లో నెహ్రూ మంత్రివర్గంలో ఆర్థికమంత్రి అయ్యారు. 1956లో విధానపరమైన విభేదాలతో రాజీనామా చేశారు.

1956-61 మధ్య యు.జి.సి. అధ్యక్షులు. 1962-67 మద్య డిల్లీ విశ్వ విద్యాలయ 10వ ఉపాద్యక్షులు. 1945 -64 మధ్య ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‍స్టిట్యూట్ అధ్యక్షులు. 1957-60 మధ్య నేషనల్ బుక్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు. 1959లో ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపించి జీవితకాల అధ్యక్షులుగా ఉన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షులు.

మహారాష్ట్రకు చెందిన చింతామణి 1918లో లండన్‍లో జరిగిన ICS పరీక్షలలో సర్వప్రథములుగా నిలిచారు. 1920లో భారతదేశానికి వచ్చి ప్రభుత్వంలో వివిధ హోదాలలో పని చేసి ఆర్థిక, PWD శాఖల కార్యదర్శి హోదా సంపాదించారు. జాన్ మెనార్డ్ కీన్స్ – చింతామణి లోని ‘dignity, ability and reasonableness’ ను బహుధా ప్రశంసించారు. 1950లో ప్రణాళికా సంఘం ఏర్పడినప్పుడు చింతామణి సభ్యులు. జాన్ మత్తయ్ రాజీనామా తర్వాత ఆర్థికశాఖ మంత్రి అయ్యారు. బొంబాయి రాష్ట్రంలోని కొలాబా నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. బొంబాయి రాష్ట్రాన్ని గుజరాత్, మహారాష్ట్రలుగా విభజించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి నిరసనగా చింతామణి మంత్రి పదనికి రాజీనామా చేశారు. ఆయన ఆరు బడ్జెట్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1969లో స్వతంత్ర పార్టీ, జన సంఘ్ పక్షాన రాష్ట్రపతి పదవికి పోటీపడి మూడో అభ్యర్థిగా నిలిచారు. వి. వి.గిరి అధ్యక్షుడయ్యారు. సంజీవరెడ్డి ద్వితీయస్థానంలో ఉన్నారు. చింతామణి తన ఆత్మకథ- ‘The Course of My Life’ 1974లో ప్రచురించారు. 1959 రామన్ మేగ్‍సేసే అవార్డును సంయుక్తంగా ఫిలిఫ్పైన్స్‌కు చెందిన జోస్‌తో పంచుకున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చింతామణి ఆంధ్రుల అల్లుడు.

శ్రీమతి దుర్గాబాయ్ దేశముఖ్ (15 జూలై 1909 – 9 మే 1981):

భార్యాభర్తలిద్దరూ 1975లో పద్మ విభూషణ్ పురస్కారం అందుకోడవడం విశేషం. రాజమండ్రిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దుర్గాబాయికి 8 ఏండ్ల వయసులో మేనమామ సుబ్బారావుతో వివాహమైంది. తరువాత కాలంలో ఆమె ఆ బాల్య వివాహాన్ని వ్యతిరేకించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పొలిటికల్ చేశారు. 1942లో యల్. యల్. బి. పూర్తి చేసి మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టారు.

మహాత్మాగాంధీ ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు తన 12వ ఏట దుర్గాబాయ్ విరాళాలు సేకరించి అందించడమేగాక తన చేతి బంగారు గాజులను దానం చేశారు. 1923లో కాకినాడ కాంగ్రెసు మహాసభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ ప్రశంసలందుకున్నారు. మహాత్ముని ప్రసంగాలను హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు అయ్యారు. ప్రఖ్యాత క్రిమినల్ లాయర్‍గా పేరుగడించారు.

1937లో చెన్నపట్టణంలో ఆంధ్రమహిళా సభను స్థాపించి స్త్రీల ప్రగతికి దోహదపడ్డారు. 1941లో ‘ఆంధ్ర మహిళ’ పత్రికను స్థాపించారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళాసభ స్థాపించారు. 1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశముఖ్‌ని వివాహమాడారు. 1946 నుండి 1950 వరకు రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు. 1952 నుండి ప్రణాళికా సంఘం సభ్యురాలు. 1953 ఆగస్టులో కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు అధ్యక్షురాలు. ఢిల్లీ లోని Blind Relief Organisation అధ్యక్షులు.

1971లో ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు గౌరన డాక్టరేట్ ప్రధానం చేశారు. మదరాసు రాష్ట్రం నుండి 1946లో రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా ఎన్నుకోబడి రాజ్యాంగ నిర్మాణంలో పలు సూచనలు అందించారు. చర్చలలో చురుకుగా పాల్గొంటూ జాతీయభాష, న్యాయవ్యవస్థ స్వతంత్రత వంటి అంశాలపై పోరాడారు. 1958లో బాలికలు, మహిళల విద్యావ్యాప్తికి ఏర్పడిన జాతీయ కమిటీకి అధ్యక్షురాలై సామాజిక సేవ చేశారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు ఆమె స్మారకార్థం ఏటా ఒక పురస్కారం ప్రసిద్దులకు అందిస్తోంది. 1981 మే 9న దుర్గాబాయ్ హైదరాబాదులో కన్నుమూశారు. స్వాతంత్ర సమర యోధురాలిగా, పోరాటశీలిగా ఆమెకు ఘనకీర్తి.

అలీ యావర్ జంగ్ (1906 ఫిబ్రవరి – 1976 డిసెంబర్ 11):

మరణానంతరం 1977లో పద్మవిభూషణ్ పురస్కారం లభించిన అలీ యావర్ జంగ్ హైదరాబాదులో ప్రముఖ విద్యావేత్తలు పరిపాలకులు, పండితుల కుటుంబంలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ లోని క్వీన్స్ కళాశాల నుండి చరిత్రలో డిగ్రీ సంపాదించారు. రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా ఆయన ప్రసిద్దులు.

ఆయన అధిష్ఠించిన పదవులు:

ఆయనకు 1959లో పద్మ భూషణ్, 1977లో పద్మవిభూషణ్ (మరణాంతరం) లభించాయి. నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండీక్యాప్డ్ – ఆయన పేరు మీద నిర్మించారు. బొంబాయిలోని Western Express Highway కు ఆయన పేర నామకరణం చేశారు. బొంబాయి రాజభవన్‌లో 70వ సంవత్సరంలో 1976 డిసెంబరు 11న ఆయన కన్నుమూశారు. ఆయన తర్వాత మహారాష్ట్ర గవర్నరుగా శ్రీ కోన ప్రభాకర రావు నియుక్తులయ్యారు.

అలీ యావర్ జంగ్ అల్లుడు ఇద్రిస్ హాసన్ లతీఫ్ భారతదేశ 10వ ఎయిర్ చీఫ్ మార్షల్‍గా పని చేశారు. దౌత్యవేత్తగా పలుదేశాలలో పని చేసిన అలీ యావర్ జంగ్ ఆయా దేశాల ప్రముఖులతో సత్యసంబంధాలు నెలకొల్పి దేశపటిష్టతకు తోడ్పడ్డారు. 1978-79 మధ్య జనతా ప్రభుత్వ హయంలో ‘పద్మ’ పురస్కారాలు నిలిపివేశారు. 1980-89 దశకంలో కేవలం 20 మందికి మాత్రమే పద్మ విభూషణ్ లభించింది. ఆ దశకంలో తెలుగువారికి ఒక్కరికీ లభించలేదు.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version