తెలుగుజాతికి ‘భూషణాలు’-8

0
2

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

ఏడు దశాబ్దుల సమీక్ష (1954-2024):

పద్మ విభూషణ్ పురస్కారాల వివరాలలోకి వెళ్తే 1954లో ప్రారంభమైన పురస్కారాలు ఆ దశకంలో కేవలం 17 మందికి లభించాయి. అందులో ఒక్క జాకీర్ హుస్సేన్ గారికి మాత్రమే ఆ దశకంలో లభించింది. ఆ తర్వాతి దశాబ్ది 1960-69లో 27 మందికి ప్రకటించారు. అందులో నలుగురే తెలుగువారు – పద్మజానాయుడు, లక్ష్మణస్యామి మొదలియార్, మెహదీ నవాజ్ జంగ్, పి.వి.ఆర్. రావు. మూడో దశకంలో (1970-79)  సంఖ్య 53 కి పెరిగింది. అయినా తెలుగువారు ఐదుగురే. అందులో దంపతులు చింతామణీ దేశ్‍ముఖ్, దుర్గాబాయి దేశ్‍ముఖ్ లున్నారు. 1980-89లో 20 మందిలో ఒక్క తెలుగువారూ లేరు.

1991-99 లో 42 మందికి గాను, ఐదుగురే తెలుగువారు పొందారు. ఆ తరువాతి దశాబ్ది 2000 – 2009 వరకు అధిక సంఖ్యలో 86 మంది పొందగా తెలుగువారు ఐదుగురే ఉన్నారు.

2010- 2019 దశకంలో 62 మంది ఆ గౌరవం పొందగా పదిమంది దాకా ఆంధ్రులు చోటు చేసుకొన్నారు. 2020 – 2024 ఇదు సంవత్సరాల కాలంలో ఇప్పటికి ప్రకటించిన 24 మందిలో ముగ్గురు తెలుగువారు. సంఖ్యాపరంగా గాక వాసికెక్కిన ప్రముఖులు ఈ ఉన్నత పురస్కారం పొందడం విశేషం.

తొలి నాలుగు దశాబ్దులలో ముగ్గురు ముస్లిములు – జాకీర్ హుస్సేన్, మెహిదీ నవాజ్ జంగ్, ఆలి యావర్ జంగ్ ఉన్నారు. ఇద్దరు మహిళలు పద్మజానాయుడు, దుర్గాబాయ్ దేశముఖ్ ఉన్నారు.

సంగీత మేరు శిఖరం – బాలమురళి:

తొలిసారిగా తెలుగువాడైన సంగీత సమ్రాట్ డా. మంగళపల్లి బాలమురళీకృష్ణకు సంగీత విభాగంలో 1991లో పద్మ విభూషణ్ ప్రకటించారు. అంతకు ముందు 1975లోనే యం.యస్. సుబ్బులక్ష్మి గారికి ఆ గౌరవం లభించింది. ఆమెకు ‘భారత రత్న’ కూడా ప్రకటించారు. బాలమురళీకృష్ణ అభిమానులు కూడా ఆయనకూ ‘భారత రత్న’ లభిస్తుందని ఆశించారు. ఏవో కారణాల వల్ల అది దక్కలేదు.

8వ ఏట చిన్ననాటనే సంగీత ప్రపంచంలో తనకంటూ స్థానం సంపాదించుకున్న బాలమురళీకృష్ణ తనదైన బాణీలో మహోన్నత గిరిశిఖరంగా వెలుగొందారు. ఆకాశవాణిలో పనివేసినా, ప్రభుత్వ సంగీత కళాశాలలో పనిచేసినా, సినిమాలలో నటించినా ఆయన తన ప్రత్యేకతను నిలుపుకొన్నారు. త్యాగరాజస్వామి వంశీకుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద విజయవాడలో శిష్యరికం చేశారు. రామకష్ణయ్య శిష్యులు, బాలమురళి సహాధ్యాయి అయిన అన్నవరం రామస్వామికి ‘పద్మశ్రీ’ లభించింది.

బాలమురళీకృష్ణ (6 జూలై 1930 – 22 నవంబరు 2016) ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1939 నుండి కచేరీలు చేస్తూ వయోలిన్, మృదంగం, కంజీరా వాద్యనిపుణుడిగా పేరు తెచ్చుకొన్నారు. ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో నారదుడిగా, ‘సందెని సింధూరం’ అనే మలయాళ సినిమా లోను నటించారు. పలు చిత్రాలకు సంగీతం అందించారు. ప్రాన్స్ ప్రభుత్వం వారు చేవిలియర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ పురస్కారం (CHEVALIER AWARD) 2005లో ప్రకటించారు.

పద్మశ్రీ, పద్మ భూషణ్, (1954) పద్మ విభూషణ్ – మూడు జాతీయ పురస్కారాలు లభించిన విశిష్ట వ్యక్తి. ప్రముఖ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. సినీ సంగీత దర్శకునిగా, సినీ గాయకుడిగా జాతీయ పురస్కారాలు లభించాయి. తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం వరించింది. కాళిదాస్ సమ్మాన్ (2000) ప్రముఖం. సంగీత కళానిధి, గాన గంధర్వ, నాద మహర్షి ఇత్యాది బిరుదులు అందుకొన్నారు.

మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి సిద్ధి – అనేకానేక కొత్త రాగాలను బాలమురళి సృజించారు. కొందరు సంగీతవేత్తలు విమర్శించారు. ఆయన సంక్షిప్త జీవితచరిత్ర – ‘మురళీమాధురి’ని బందా వెంకయ్య రచించారు. ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులుగా కొంతకాలం వ్యవరించారు. ఎన్.టి. రామారావు ప్రభుత్వం అకాడమీలను రద్దు చేసినందుకు నిరసనగా ఆంధ్రదేశంలో కచేరీలు చేయబోనని భీష్మించుకున్నారు తర్వాత, సంగీత రసికుల ప్రార్థన మేరకు సడలించుకున్నారు.

విదేశాలలో విస్తృతంగా పర్యటించి కచేరీలు చేశారు. భీమ్‍సేన్ జోషీతో కలిసి ముంబైలో జుగల్‍బందీ తరహా కచేరీ చేసి ఆ విధమైన కచేరీల రూపకర్త అయినారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్యాంసులు. తెలుగులోనే కాక, సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలో కూడా పాటలు పాడారు. ఆయన చివరలో కచేరీ చేసినది అనకాపల్లిలో 13 ఫిబ్రవరి 2016న.

శేషజీవితం చెన్నైలో గడుపులో 2016 నవంబరు 22న తన స్వగృహంలో మధ్యాహ్న భోజనానంతరం నిద్రలో అనాయస మరణం పొందారు. తూర్పుగోదావరి జిల్లా రాజాం తాలుకా శంకరగుప్తంలో జన్మించిన బాలమురళి కర్ణాటక సంగీత సంప్రదాయంలో తనదైన స్థానం కల్పించుకొని యశశ్శరీరులైనారు. ఆయనకు పలువురు శిష్యులున్నారు.

ఆచార్య యన్.జి. రంగా (7 నవంబరు 1900 – 9 జూన్ 1995):

యన్.జి.రంగాగా ప్రసిద్ధులైన గోగినేని రంగనాయకులు రైతునాయకులు. 1991లో వీరికి పద్మ విభూషణ్ ప్రకటించారు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన వ్యక్తి. భారత రైతాంగ పితగా పేర్కొంటారు. 1900 నవంబరులో గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన రంగనాయకులు గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి నుండి డిగ్రీ పొందారు. 1926లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో డి.లిట్ సంపాదించారు. 1927-30ల మధ్య మదరాసు పచ్చయప్ప కళాశాలలో ఆర్థికశాస్త్ర ఆచార్యులు. వీరి సతీమణి భారతీదేవి ఆదర్శవాది.

గాంధీజీ పిలుపునందుకొని 1930లో ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వాతంత్ర సంగ్రామంలోకి ఉరికారు. వెంకటగిరి రైతాంగ ఉద్యమ కాలంలో 1939లో ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది. రైతు ఉద్యమాలను స్వాతంత్రోద్యమ్యంలో భాగం చేశారు. 1933లో నిడుబ్రోలులో వయోజన రాజకీయ పాఠశాల ఆరంభించారు. సతీమణితో కలసి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1940, 41, 42 సంవత్సరాలలో జైలు శిక్షలు అనుభవించి 1944 లో విడుదలైనారు.

గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, రాజేంద్రప్రసాద్, రాజాజీ వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారు. 1930లో తొలిసారిగా ఢిల్లీ శాసనసభకు ఎన్నికైనారు. 1934-46 మధ్య కూడా శాసనసభ సభ్యులు. 1946లో భారత రాజ్యాంగ పరిషత్తుకు మదరాసు ప్రావిన్స్ నుండి ఎన్నికై రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. తొలి పార్లమెంటు 1950-52 లో ఆయన సభ్యులు.

ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షునిగా 1946-51 మధ్య పనిచేశారు. 1951లో కాంగ్రెను పార్టీని వదిలి కృషికార్ లోక్ పార్టీ స్థాపించారు. 1955లో ఆ పార్టీని నెహ్రూ కోరికపై కాంగ్రెసులో కలిసారు. 1957 ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థిగా లోక్‍సభకు ఎన్నికయ్యారు. నెహ్రు తన మంత్రివర్గంలో చేరమని రంగాను ఆహ్వనిస్తే సున్నితంగా తిరస్కరించారు. ప్రతిపక్షంలో కొనసాగడానికి నిర్ణయించుకున్నారు.

స్వతంత్ర పార్టీని రాజాజీతో కలిపి స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులైనారు. 1957 నుండి అవిచ్ఛినంగా (కొద్దికాలం మినహాయించి) లోక్‍సభ/రాజ్యసభలో సభ్యులై 60 ఏళ్ల ప్రజాప్రతినిధిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‍గా పురస్కారం లభించింది. ఎందరో ప్రజా నాయకులు- చంద్రబాబునాయుడు, కె.రోశయ్య ప్రభుతులు ఆయన శిష్యులు. ‘రైతు రంగా’గా ఆయన ప్రసిద్ధులు. 1995లో కాలధర్మం చెందారు.

రావి నారాయణరెడ్డి (5జూన్ 1908 – 7సెప్టెంబరు 1991):

తెలంగాణా పోరాట యోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన నారాయణరెడ్డికి 1992లో పద్మ విభూషణ్ ప్రకటించారు. పి.వి. ప్రధాని అయిన తొలి సంవత్సరం ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలలో తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మ విభూషణ్ అందడం గమనార్హం. నారాయణరెడ్డి ఉదార ప్రజాస్వామ్యవాది. సంఘ సంస్కర్త. ఆంద్ర మహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాట దిశగా పరివర్తన చేసిన నాయకుడు. సాయుధ పోరాటానికి ఆద్యుడు. భూస్వామ్య కుటంబంలో యాదాద్రి – భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బొల్లేపల్లిలో జన్మించారు.

తొలిదశలో ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జన సంఘం ఏర్పరచిన సాంస్కృతిక చైతన్య ప్రభావానికి లోనై పోరాటాన్ని ప్రారంభించారు. కాకినాడకు వెళ్ళి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1931లో హరిజన సేవాసంఘాన్ని స్థాపించి ప్రధాన కార్యదర్శిగా హైదరాబాదు రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించి రెండు వసతిగృహాలు నిర్మించారు. ఆచరణ ద్వారా ప్రజాస్వామికవాదిగా నిరూపించుకున్నారు. 1932లో హరిజన సేవక సంస్థ అధ్యక్షులు సరోజనీనాయుడు, కార్యదర్శి నారాయణరెడ్డి. తొలి సార్వత్రిక ఎన్నికలలో నల్గొండ లోక్‍సభ స్థానం నుంచి కాంగ్రెసు పై పోటీచేసి అత్యదిక ఓట్లు (మూడు లక్షలు) పొంది గెలిచారు. అది నెహ్రూ సాధించిన ఓట్ల కంటే అధికం. విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించారు. 1946-48 మధ్య హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకాన్ని, రజాకార్ల ఆగడాలను అరికట్టే దిశగా అజ్ఞాతంగా వుండి గెరిల్లా దళాలను ఏర్పాటు చేశారు.

ఆంధ్ర మహాసభ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం వల్ల తెలంగాణా ప్రాంతంలో కమ్యూనిస్టులు అనేక విజయాలను సాధించారు. 1941లో నల్గొండ జిల్లా చిలుకూరులో జరిగిన 8వ నిజామాంధ్ర మహా సభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షులు. భువనగిరి సమావేశాలలోనే ఆంధ్ర మహసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది. తెలంగాణ ముద్దుబిడ్డ నారాయణరెడ్డి. తన స్వంత భూమిని 200 ఎకరాలు దానం చేసిన వదాన్యులు, తన అస్థికలను గంగలో కలపవద్దనీ, పొలంలోనే చల్లాలని విల్లులో వ్రాశారు. 1939లో ఆయన CP1 పార్టీలో చేరి ఆంధ్రమహాసభ కార్యకలాపాలకు దిశానిర్ధేశం చేసిన ఘనుడు నారాయణరెడ్డి. 1957-62 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు. 1962-66 మధ్య నల్గొండ పార్లమెంటు సభ్యులు, గాంధీజీ ఆశయాలకు కొత్త నిర్వచనం కలిపి పోరాడిన యోధుడాయన.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here