Site icon Sanchika

తెలుగుజాతికి ‘భూషణాలు’-9

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరి అనంతపద్మనాభరావు.]

~

ప్రజాకవి కాళోజీ (9 సెప్టెంబరు 1914 – 13 నవంబరు 2002):

[dropcap]కా[/dropcap]ళోజీ నారాయణరావు ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ప్రజావాదిగా ప్రజల నాడి పట్టుకొని ఉద్యమం నడిపిన ఘనుడు. ‘కాళన్న’గా సుపరిచితులు, పి.వి. నరసింహారావుగారికి సన్నిహితులు. తెలంగాణా జీవన చలన శీలి. తెలంగాణకే తన జీవన సర్వస్వం ధారబోసిన వైతాళికుడు. నిజామ్ ప్రభువు దమన నీతికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కలాన్ని ఆయుధంగా స్వీకరించారు. స్వాతంత్య్ర సమరంలోను, తెలంగాణ ఉద్యమం లోను పాల్గొన్నారు. కాళన్న జన్మదినాన్ని తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా భాషాదినోత్సవంగా ప్రకటించి ఏటా ఒక కవిని సత్కరిస్తోంది. వరంగల్ లోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టారు. 1992లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది.

కర్ణాటక రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లాలో రట్టిహళ్లిలో జన్మించారు. క్రమంగా వరంగల్ జిల్లాలోని మడికొండకు కాళోజీ కుటుంబం తరలివచ్చి స్థిరపడింది. 1939లో కాళోజీ హైదరాబాదు లా కాలేజి నుండి ‘లా’ పూర్తి చేశారు. 25వ ఏట సత్యాగ్రహోద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. తెలంగాణాలో ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం నెలకొల్పబడాలని ఆయన ఆకాంక్షించారు. అక్షరజ్యోతిని వ్యాపింపజేయడానికి హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపించిన ప్రముఖులలో కాళోజీ ఒకరు. 1945లో పరిషత్ ద్వితీయ మహాసభలలో రజాకార్ల దౌర్జన్యాన్ని ధైర్యంగా ప్రతిఘటించారు.

బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పి.వి. నరసింహారావు వంటి ప్రముఖులకు తలలో నాలుకగా కాళోజీ వ్యవహరించారు. అనేక ఉద్యమాలలో కలిసి పాల్గొన్నారు. వరంగల్ కోటపై జాతీయ పతాకావిష్కరణ ప్రయత్నానికిగా ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించారు. ‘సామాన్యుడే నా దేవుడు’ అని రాజ్యహింసను తప్పుబట్టిన ధైర్యశాలి. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి శాసన మండలికి ఎన్నికయ్యారు. రెండేళ్ళు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మంగళగిరి ఆదిత్య ప్రసాద్ సారథ్యంలో ముందుకు సాగుతున్న రోజుల్లో కాళోజీ తన కవితా ప్రసారాలతో పుష్ఠిని చేకూర్చారు. కాళోజీ బహు భాషా పండితులు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ భాషలలో పాండిత్యముంది. ఆయన రచనలలో ప్రసిద్ధాలివి: (1) అణా కధలు (1941) (2) నా భారతదేశ యాత్ర (1941) (3) పార్థివ వ్యయము (1946) (4) కాళోజీ కథలు (1943) (5) నా గొడవ (ఆత్మకథ) 1953 (6) జీవనగీత (1968) (7) తుది విజయం మనది (1962) (8) తెలంగాణా ఉద్యమ కవితలు (1969-70) (9) ఇదీ నా గొడవ (1975) (10) బాపూ! బాపూ! బాపూ! (1995)

ఆయన పూర్తి పేరు – రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజు కాళోజీ నారాయణరావు. ధర్మపత్ని- రుక్మిబాయి. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమహారం.

ఉద్యమమే ఆయన ఊపిరి.

“అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకారాధ్యుడు.”

తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు. 1952-61 మధ్యకాలంలో ‘గ్లోసరీ’ కమిటీ సభ్యులు. 1977లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు.

నిజామ్ జమానాలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసంగా ఎదిరించి పోరాడిన వ్యక్తి. ఆర్య సమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెసు, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలలో భాగస్వామి. యువకుల్ని చైతన్యంలోకి మళ్లించారు. గాంధీజీ అహింసా మార్గాన్ని శిరసావహించినా అవసరమైనపుడు ప్రతిహింసను ఆహ్వానించారు. తన కవితలలో నిజామ్ పరిపాలనను తన సహజ శైలిలో తూర్పారబట్టారు. ఆయన ఉద్యమశీలి.

[విరామం: 1993- 1997 మధ్యకాలంలో భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలను తాత్కాలికంగా నిలిపివేసింది.]

డా. సర్వేపల్లి గోపాల్ (23 ఏప్రిల్ 1923 – 20 ఏప్రిల్ 2002):

1999లో భారత ప్రభుత్వం సర్వేపల్లి గోపాల్‌కు పద్మ విభూషణ్ ప్రకటించింది. భారత తొలి ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడాయన. తండ్రీ కొడుకులకు భారత రత్న – పద్మ విభూషణ్ పురస్కారాలు అందడం ఒక చరిత్ర.

చెన్నైలో జన్మించిన గోపాల్ – రాధాకృష్ణన్ శివకాముల ఏకైక పుత్రుడు. ఆయనకు ఐదుగురు సోదరీమణులు. గోపాల్ లండన్ లోని మిల్ హిల్ స్కూల్‌లోను, మదరాసు క్రైస్తవ కళాశాలలోను విద్యాభ్యాసం గానించారు. ఆక్స్‌ఫర్డ్ లోని BALLIOL COLLEGE లో డిగ్రీ చదివారు. అప్పుడు కర్జన్ బహమతి లభించింది. అదే విశ్వవిద్యాలయంలో 1951లో లార్డ్ రిప్పన్ వైన్‌రాయాలిటీ అనే అంశంపై పరిశోధన చేసి Ph.D. సంపాదించారు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1950లో భారత ప్రభుత్వ విదేశాంగశాఖలో డైరక్టరుగా నియమితులయ్యారు. ఆ కాలంలో ఆయన అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రుకి సన్నిహితులు. 1960లో ఆక్స్‌ఫర్డ్ సెయింట్ ఆంటోనీ కళాశాలలో భారతీయ చరిత్ర విభాగంలో రీడర్‍గా చేరారు.

శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి జవహర్‍లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్థాపించినపుడు అక్కడ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్‍గా గోపాల్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖను పటిష్ఠం చేసి చారిత్రక పరిశోధకుడిగా వన్నెకెక్కారు. ఆయన రచనలు:

చారిత్రక పరిశోధకుడిగా, విమర్శకుడిగా గోపాల్ ప్రసిద్ధులు. తన తండ్రి జీవిత చరిత్రలో ఎన్నో విశేషాంశాలను జోడించి ప్రచారంలోకి తెచ్చారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ జీవిత చరమదశను గడిపారు. 1970లో నేషనల్ బుక్ ట్రస్ట్ అధ్యక్షులుగా ఆ సంస్థ కార్యకలాపాల పురోగతికి దోహదం చేశారు.

రాష్ట్రపతి కుమారుడైనా ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు. విశేష గౌరవాదరాలు గల నియామకాలు వరించలేదు. చారిత్రక పరిశోధనపైనే దృష్టి పెట్టి 79వ ఏట మదరాసులో ఆనారోగ్యంలో కన్ను మూశారు. తండ్రి వైదుష్యానికి వారసుడిగా వేదాంత శాస్త్రాన్ని అభ్యపించక, చారిత్రక పరిశోధకుడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఆయన నిరాడంబర జీవి. ఆదర్శ ఉపాధ్యాయుడు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి ఎందరో చరిత్ర పరిశోధకులకు మార్గదర్శి.

Images source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version