తెలుగు కథ – ఏరిaన ముత్యాలు 5

1
3

[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]

జీవితం పట్ల అలజడినీ, అనుకంపననీ కలిగించే జీవత్కథానిక శిరంశెట్టి కాంతారావు ‘అడవి లోపల… ‘:

[dropcap]త[/dropcap]న జీవితానుభవంతో, అధ్యయనశీలంతో కథానికకి విస్తృతినీ, గాఢతనీ, సాంద్రతనీ కూరుస్తు, ప్రయోగశీలంతో దానికి – ఇంతకు పూర్వం లేని authenticity ని కూరుస్తున్న ఒక గొప్ప కథకుడు – కాంతారావు. బతుకునీ, బతుకు రాపిడినీ, మనసు ఒరిపిడినీ ఆవిష్కరించటంలో భిన్నమైన ఒరవడుల్ని ఆవిష్కరిస్తున్నారు.

కథకుడు కాంతారావు గారు అత్యంత ప్రతిభామూర్తిగా గుర్తింపునీ, ప్రశంసల్నీ పొందిన వినయవంతుడు.

అతను అనితర సాధ్యమైన ఇతివృత్తాల్ని పట్టుకుంటాడు. ఇతిహాసపు చీకటి కోణాల్లోని ‘మనిషి’ని ఆవిష్కరిస్తాడు. కథానికని రాస్తూ పఠితకు కొత్త మనోనేత్రాల్ని అమరుస్తూ, ఉల్లిపొరల్ని విడదీసినట్లు బతుకు నిజాల్ని విడమరుస్తూ – సంవిధానాన్ని కూరుస్తాడు. ఇదీ కాంతారావు రచనలోని బలం, ప్రత్యేకత, ప్రత్యేక ముద్ర. ఇవన్నీ ఎంతో చిత్తశుద్ధి, కృషీ, తపన, చదువు, తపస్సు ఉంటే కానీ సొంతంకాని గుణాలూ, నైపుణ్యాలూ, కాంతారావు వీటన్నింటినీ సాధించుకున్న నిఖార్సయిన రచయిత.

కాంతారావు కథానికల ఇతివృత్తాలన్నీ సామాజికమైనవి. సమస్యాత్మకమైనవి. సంఘర్షణాత్మకమైనవి. సంక్లిష్టమైన పార్శ్వాల్ని స్పర్శించినవి, పరామర్శించినవి. పాఠకుల్లో ఆలోచనల్ని ప్రేరేపించగలిగినవి. మొత్తంగా ప్రగతిశీలమైన భావాలు కలిగినవి.

అడవి లోపల… కథ గిరిజన జీవన మూలాల చిత్రణ, విశ్లేషణ, వ్యాఖ్యానం కలిగిన అద్భుతమైన కథానిక. అమూల్యమైన వారి సంపద, శ్రమశక్తి ఏవిధంగా దళారీల పాలబడుతున్నదో – ఆర్తితో చిత్రీకరించిన రచన. వారి ఛిద్రజీవన విషాదాన్ని కథాత్మకంగా ఆవిష్కరించిన గొప్పరచన.

“అడవి లోపల…” కథలో “రాళ్ళమేకలు” అన్నమాట తెలుగు కథా సాహిత్యంలో తొలిసారి కొత్తగా కన్పిస్తుంది. కొందరు కొడిశ, పంచోది, ఏపెచెట్ల ఆకులను ఎండుతుమ్మ కాయలతో బాటు మేకల మేతకు వేస్తారు. ఆ కాయల గింజలను అన్నిటినీ అవి ఆరగించుకోలేవు. వాటిలో కొన్ని మేకల కడుపులో ఉండిపోయి రంగురాళ్ళలా తయారవుతాయట!

ఏమిటీ ప్రక్రియలోని ఆంతర్యాలూ, అంతరార్థాలూ?

“అదేందంటే ఏం జెప్పాల? సంకురాత్రి ముందల సీతకట్టుకు ఈనిన మేకపిల్లల్ని ఈసుట్టు, ముట్టు పదామడ తిరిగి కొనుక్కొచ్చి దొడ్లల్ల దోలరు. దొడ్డి ఒక్కింటికి నూరు, నూటే భై పిల్లల్ని కూడేస్తరు. తరువాత సుట్టూ నాలుగామెడ ఎటుగొట్టాలనుకుంటే అటు ముందుగాల కొంతమంది బొయ్యి చెట్లకున్న మండనంతా చెలిగి కిందబడేస్తరు. ఆ ఎనక మందల్ని మండగొట్టిన తావుకు దోలరు. మేకలు మండకాడికి బొయ్యేటప్పుడు ఏరే ఆకులు దింటే ఆటి కడుపుల్ల రాళ్ళు కరిగిపోతయని ఎక్కడ ఆగకుంట ఒక్కటే గెదుముడు గెదుముతరు. వాటికి తిన్నంత తుమ్మకాయ మేపుతరు.

ఆ తుమ్మకాయ మేసేటప్పుడు మేకపిల్లలన్నీ తుమ్మకాయను సప్ప, సప్ప నమిలి మింగుతై, అటెంక తీరుబడిగ పన్నంక నిమ్మలంగ నెమరు బెడతై. అగో అప్పుడు నూటికి తొంభై తొమ్మిది గింజల్ని బైటికి ఎల్లగాస్తే ఏ ఒకటో, అరో గింజ వాటి బోరిగలల్ల ఉండే ఓ తిత్తిల బడిపోతై. అగో అట్ల ఆ తిత్తిల్ల బడ్డ గింజలు అరిగిపోకుంట అట్లనే ఉంటై. ఇక ఆ మేకలను మేపే కొడిశ, పంచోది, ఏపి ఆకుల రసాయనమంతా ఆ గింజలకు బట్టి రంగురాళ్ళ మాదిరిగా ఏర్పడతై”.

ఆ రాళ్ళను చూస్తే చిన్నపిల్లలు చప్పరించే రంగు, రంగుల చీక్‌లెట్లే కళ్ళముందు కదలాడుతుంటే, దాంతో ఈ రాళ్ళకి రంగులెట్లా వచ్చాయి? కుతూహలం! “మేకలకు మేపే ఆ మూడు రకాల ఆకుల్లో కొన్ని మేకలకు ఒక్కో రకం ఆకునె ఎక్కువగ మేపుతరు. అట్ల మేపటంవల్ల ఆ ఆకుకున్న రసాయనం, లోపటున్న గింజలమీద బాగా పేరుకొని ఒక్కోరంగు ఏర్పడుద్ది”. “సంకురాత్రికి మేకపిల్లల్ని కొని దొడ్లల్ల దోలితే, దసరాకల్లా రాల్లపంట తయారైద్ది. రాల్లు తయారైంది లేంది తెలుసుకుందికి మేకల అన్నం డొక్కల పైన మట్టచెయ్యితోని కొట్టి సూస్తే గలగలమని రాల్లసప్పుడు బైటికి ఇన్పిస్తది.

ఇగప్పుడు మేకల్ని లారీల్లకెక్కిచ్చి టౌన్లల్ల కటిక దుకాన్లకు తోలిస్తరు. ఆ కటికోల్లకు, ఈ మేకలు మార్కెట్లకొచ్చినయంటే సాలు కండ్లపంట, ఎందుకంటే? ఎంత పెద్దమేకైనా గుత్తలెక్కన ఐదొందలకే ఇస్తరు గాబట్టి.

తలకాయలు తప్పిచ్చినంక శాలీల లెక్కనుబట్టి రాళ్ళ బుద్ధుల్ని దెచ్చి బురాను సాయిబోల్లకు అప్పజెప్త సాలు. మిగిలిన మాంసం కిలోల్లెక్క అమ్ముకొని బొచ్చెడు పైసలు కల్లజూస్తరు”.

ఇక్కడే మలుపు!

“రాళ్ల మేకల సంగతి ఇల్లందుల కటిక దుకాణాలు నడిపే బురాను సాయెబుకు తెలిసింది. రాంగ రాంగ రంగురాళ్ళకోసమొచ్చే బేరగాళ్ళను మచ్చిక చేసుకుండు. ఆల్లు మాకాడికి రాకుంట మజ్జన జొర్రిండు. రాళ్ళ ఋతువు తెలుసుకొని మా కాడ తులం రూపాయల్గొంటె ఇళ్ళకు రొండు రూపయలకమ్మబట్టిండు. కాలా, చేతా పైసలు కూడబెట్టిండు. చివరాకరికి మేం అన్నలకు అన్నం బెడుతున్నమని, ఆల్లతోని రాసుక పూసుక తిరుగుతున్నమని జెప్పి పోలీసోల్లను మా మీదికి ఉసిగొలిపిండు, బాకీల పేరు జెప్పి మా మేకలు, దొడ్లు గుంజుకుండు. మమ్మల్ని గూడులేని పక్షులెక్కజేసి వదిలేసిండు. తిండికి, బట్టకు ఎల్లని మేం మల్లా ఎప్పట్లెక్కనే అడివి మీద బడి కాయో, గరో ఏరుకొచ్చి అమ్ముకుంట, మా మేకల దొడ్లల్ల మేమే జీతగాల్లమై ఎట్టి బతుకు బత్తున్నం” అంటూ చెప్పుకొచ్చారు ఆ దోపిడీకి గురై ఇక్కట్లపాలైన అడవిబిడ్డలు!

ఎక్కడ పచ్చగా వుంటే అక్కడ విస్తరిస్తుంది మాఫియా. ఏ దారిలో స్వప్రయోజనం నెరవేరుతుందో ఆ దారిలో పాగా వేస్తుంది స్వార్థం! ఇదీ వాస్తవ చిత్రం! ‘అడవి లోపల…’ కోయవాళ్ల, కోయగూడెం పరిసరాల నేపథ్య చిత్రణ, ఆ అడవిజనుల బతుకురీతీ ఆర్ఖంగా దృశ్యీకరించారు.

‘కుడిఎడమల దగాదగా’ మీద ఆనాటి నుండి చాలా కథలు వచ్చాయి, వస్తున్నాయి. చింతా దీక్షితులు గారి ‘సుగాలీ కుటుంబం’, బి.ఎస్.రాములు, సమ్మెట ఉమాదేవి, దిలావర్ వంటివారూ అద్భుతమైన కథల్ని అందించారు. అయితే ‘రాళ్లమేకలు’ అనే ఒక వింత, వినూత్న యథార్థాంశం ఇతివృత్తంగా వచ్చిన గొప్ప కథ ఈ ‘అడవి లోపల…’!! అందుకూ ఇది మన ఏరిన ముత్యం అయింది! కాంతారావుగారి ‘మట్టితాళ్ల వల’ సంపుటిలో ఉన్నది. అంతకుముందు ‘చినుకు’ మాస పత్రికలో బహుమతి పొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here