Site icon Sanchika

తెలుగు కథా సాహిత్యంలో మనమూ భాగస్థులమే – సదస్సు – ఆహ్వానం

[dropcap]సా[/dropcap]హిత్యం కొత్తగా పుట్టలేదు. నూరేళ్ళ క్రితమే ఎందఱో మహానుభావుల కరకమలాల నుంచి వెలువడిన సాహితీ పుప్పొడి, సమాజాన్ని సుగంధభరితం చేసింది. ఈ రోజు సమాజం ఇలా అభివృద్ధి చెందడానికి సగం బాధ్యత రచయితలే తీసుకున్నారు. వారి అక్షరాస్త్రాలతో మూఢనమ్మకాలు, దురాచారాలు, దుస్సంప్రదాయాలు, కుల, మత ద్వేషాలు, అసమానతలు, అంటరానితనం, మొదలైన ఎన్నో అంశాలను తుడిచివేసారు. స్త్రీ విద్య, బాల్యవివాహాలు, స్త్రీ,పురుషభేదాలు ఇలా ఎన్నో అసమానతలపైన విప్లవజ్వాలలు రగిలించారు. ఒక కందుకూరి, ఒక గురజాడ, ఒక ఉన్నవ లక్ష్మినారాయణ, ఒక రాజారామ్మోహన్ రాయ్ మొదలైనవారు చేసిన పోరాటంలో ఎక్కడా రక్తపాతం లేదు, జన నష్టం, ప్రాణ నష్టం జరగలేదు.. ఎవరి మనసులు గాయపడలేదు.. ఎవరితోనూ విభేదించలేదు.. ఎవరినీ అవమానించలేదు. నిశ్శబ్దంగా సాహిత్యం సృష్టించి అక్షరాల ద్వారా ప్రజల గుండెల్లోకి దూసుకువెళ్ళి నేటికీ చెదరని ముద్రవేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. తమ భావజాలం అనుసరించని వాళ్ళను అంటరానివాళ్లుగా చిత్రించి, వందేళ్లుగా పాటిస్తున్న సామాజిక, కుటుంబ విలువలను పాదాల క్రింద నలిపి నేల మట్టం చేసే తీవ్రవాద భావజాలం సాహిత్యంలో చేరింది. సమాజానికి ఏం కావాలి? మన బాధ్యత ఏమిటి అని విస్మరించి, విదేశీ సంస్కృతిని మన సంస్కృతిగా దత్తత చేసుకుని, అదే అందరూ పాటించాలి అని శాసించే నియంతలు సాహిత్యంలో పుట్టుకొస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో అటు సమాజానికి, ఇటు కుటుంబ సంబంధాలకు విలువనిస్తూ, భారతీయ జీవన ప్రమాణాలు నిలబెట్టే విధంగా సాహిత్యాన్ని సృష్టిస్తూ ఉన్న రచయితల పరిస్థితి ఏమిటి? తెలుగు సాహిత్యంలో వస్తున్న కొత్త, కొత్త విపరీత పోకడలు ఎంతవరకు సమర్థనీయం! సమాజానికి మార్గదర్శకం చేయాల్సిన రచయితలు ఎక్కడ? తాము చెప్పిందే వేదం అని నొక్కిచెబుతూ, సాహిత్యానికి పునాదిరాళ్ళు అయిన రచయితలు రచయితలు కాదు అనేవాళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలి? గత ముప్ఫై, నలభై ఏళ్లుగా అటు కథా ప్రపంచాన్ని, ఇటు నవలా ప్రపంచాన్ని ఏలినవారు ఎవరు? అందుకే ఎవరు రచయితలు? ఎవరు కాదు.. ఏది మంచి కథ? ఏది కాదు.. తెలుసుకుందాం.. అభిప్రాయాలు పంచుకుందాం.

తెలుగు కథా సాహిత్యంలో మనమూ భాగస్థులమే అని చాటుదాం.. మన స్వరం వినిపిద్దాం. రండి.. మీ స్వరం విప్పండి..

2024 మార్చ్ 14వ తేదీ గురువారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సాయంత్రం 6.00 నుంచి చర్చాకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయండి.

Exit mobile version