Site icon Sanchika

తెలుగు కథకు ‘బంగారు మురుగు’ తొడిగిన శ్రీరమణ

[ప్రముఖ రచయిత, సంపాదకులు శ్రీరమణ గారికి ఈ రచన ద్వారా నివాళి అర్పిస్తున్నారు ప్రొఫెసర్ సిహెచ్. సుశీలమ్మ.]

[dropcap]అ[/dropcap]ర్ధ శతాబ్దం పాటు అలుపూ, అదుపూ లేకుండా స్వైరవిహారం చేసిన పేరడీ గారడీలు ఇప్పుడు పేలవంగా పడివున్నాయి.

విట్టూ, సెటైరూ, ఫన్ను గన్నూ, హ్యూమరు హ్యామరూ, పట్టపగ్గాలు లేని చెణుకులు చురకలూ, మెరుపుల్లాటి వాక్య విరుపులూ మూగబోయాయి.

వ్వె వ్వె వ్వే అంటూ వెక్కిరిస్తునే నవ్వించే ‘కాలమ్స్’ కలం పాళీ విరిగిపోయింది. ఒకోసారి తిన్నగా, ఒకోసారి తిక్కగా.,. ఏదేమైనా చక్కగా రాస్తున్న పెన్ను నిబ్బు నిలిచిపోయింది.

అవును. శ్రీరమణ పెన్ను మూసారు. జులై 19 న ఉదయాన్నే అస్తమించారు.

పుట్టినప్పుడు పుట్టిన పేరు ‘వంకమామిడి రాధాకృష్ణ’ అంటే ఎవరికీ తెలీకపోవచ్చు. మాతామహులకు దత్తత వెళ్ళినప్పుడు పెట్టిన పేరు ‘కామరాజు రామారావు’ అంటేనూ తెలీకపోవచ్చు. ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలపై మక్కువతో, రమణమహర్షి పై విశ్వాసంతో, మళ్ళీ ‘నేను నేనే’ అనే పొగరు వగరుతో తనకు తానే ‘శ్రీరమణ’ అని పేరెట్టేసుకుని కథన కుతూహలంతో పత్రికా రంగంలో కాలెట్టేసారు. మొదటి షాట్ తోనే ముచ్చట పడిపోయిన నండూరి రామమోహనరావు గారు ‘కాలమ్’ రాయమని కబురెట్టేసారు. రచన ఆయన సరదా, ఇష్టం, వృత్తి.. ఇంకా మాట్లాడితే ఒక వ్యసనం (బ్రెయిన్ స్ట్రోక్స్‌తో, తీవ్రమైన అనారోగ్యంతో మంచంలో ఉన్నా దాదాపు చివరి రోజుల వరకూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు).

చిన్ననాడే, హైస్కూల్ రోజుల్లోనే అబ్బిన వ్యాసరచనల పోటీల్లో పాల్గొనే అలవాటది.

17 ఏళ్ల వయసులో రామకృష్ణ మిషన్ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి మిషన్ వారి అతిథిగా శ్రీరమణ గారు హిమాలయాలకు వెళ్లి వచ్చారు. చిన్నప్పటి నుంచి వ్యాసరచన పోటీల్లో ఎప్పుడు తనకే బహుమతి.

‘రంగులరాట్నం’ (సెటైర్లు) గిరగిరా తిరుగుతుంటే –

“కథలు- కజ్జికాయలు, సాహిత్య తులాభారం, రీచర్చి కాలర్లు, అష్టవిధ పాఠికలు, పొట్టలో చుక్క, హాశ్చర్యకర పరిణామాలు, ఉత్తరగ్రహణం, వీడ్కోలు సభ, శ్రోతల సరఫరా కేంద్రం, కార్తీకంలో కవిత్వ సమారాధన, పురోహిత పాత్రికేయం, కవి సమ్మేళనానికి దశసూత్ర పథకం, దిండు కింద పేక ముక్క, అద్దె కొంపలో అపరాధ పరిశోధన..” వంటివి చదువుతూ, ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు ఆగి “నా మీదే వేసేసాడ్రోయ్” అని ఉలిక్కిపడక మానరు. కానీ కోపం రాదు, హాయిగా నవ్వేసుకుంటారు. “భలేవాడు. మొత్తానికి నా బాణీ, నా గుట్టూ పట్టేసాడు. ఇంకా ఏమేం రాసాడో” అనేసుకుంటారు. అంత మ్యాజిక్ ఉంది శ్రీరమణ రాతల్లో.

పేరడీలు ప్రముఖ కవులు, రచయితలందరి పైనా విస్తృతంగా రాసి, పుస్తకాలు వేసింది తెలుగులో శ్రీరమణ గారొక్కరే (అవి కంఠతా పట్టేసి కొన్ని పేరడీలు రాసి, ‘పేరడీ పెరేడ్’ అంటూ అచ్చొత్తించిన రచయిత్రిని నేనేనేమో!). తను పేరడీ చేసిన వారందరంటే రమణకి ఇష్టం, అభిమానం, భక్తి, గౌరవమూనూ. అందుకే శ్రద్ధగా చదివి, బహు జాగ్రత్తగా వారి నాడిని పట్టేసి ప్రేమగా రాసారు.

సుప్రసిద్ధుల వచన పచనం, మహానుభావుల పద వల్లరి, నవకవనంలో నానా రకాలు, పీఠికా పాటవం, గులాబీ వర్ణన, ప్రముఖుల ప్రేమలేఖలు.. అంటూ ఎవరెవరు ఎలా రాస్తారో, ఎలా వర్ణిస్తారో తనదైన హాస్యవిన్యాసంతో, అలవోకగా, హ్యూమరసం చిందించారు. ముఖ్యంగా ‘రైలు బండిలో వైతాళికులు’ జనాదరణ పొందిన పేరడీ రచన.

మహాకవులు ప్రయాణిస్తున్న బోగీ లోకి టి.సి. వచ్చి, అప్పర్ బెర్త్ మీద కూచున్న దేవులపల్లి వారిని కిందకు దిగి రమ్మంటే “దిగిరాను దిగిరాను దివి నుంచి భువికి/దింపి వేతురు గాక నాకేటి వెరపు” అనడం, విశ్వనాథ వారిని టిక్కెట్ అడిగితే – “లేదు” క్లుప్తంగా అనేసి, మళ్ళీ “అల నన్నయ్య లేదు తిక్కనకు లేదు..” అనబోతుంటే “వాళ్ళ సంగతి సర్లెండి” అని ఆపి, శ్రీశ్రీని చూసి “ఎవరు మీరు” అన్నాడు టి.సి.

“భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని..” అంటుంటే “తెలుగులో చెప్పండి” అన్నాడు. “నేను శ్రీశ్రీని. ఈ శతాబ్దం నాది!” అన్నారు.

“కావచ్చు. కానీ ఈ రైలు శ్రీ సర్కారు వారిది” అన్నాడు టిసి.

“మొన్నటి దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపింది. ఇప్పుడు దాన్ని నేను నడుపుతున్నాను..” శ్రీశ్రీ.

“అవచ్చు. కానీ ఈ రైళ్ళని ఇండియన్ రైల్వేస్ వారు నడుపుతున్నారు”.. ఇలా సాగిపోతున్న ఈ సంభాషణకి కడుపుబ్బా నవ్వుకోని వారుంటారా!

లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కిన గుడిపాటి వెంకటాచలం అయిదారుగురు స్త్రీలతో ఏదో స్టేషన్‌లో దిగిపోయారనడం, దేవులపల్లి వారు రెండో టిక్కెట్ ఊర్వశి కోసం తీసుకొన్నారనడం ఈ ప్రహసనంలో హైలెట్.

ఆంధ్రజ్యోతిలో వెలువడిన పేరడీలన్నీ పుస్తక రూపంలో తెస్తున్నప్పుడు, పీఠిక రాస్తూ – ఈ పీఠిక మీద కూడా పేరడీ రాస్తాడేమో అని జంకుతూనే రాసి “సెటైరుకి రెడీ రెడీ – స్వతైరుకి ఫెడీ ఫెడీ/ శ్రీరమణ ప్రతీ పేరడీ చిత్రోక్తుల గారడీ” అన్నారు నండూరి రామమోహనరావు గారు.

ఆంధ్రజ్యోతిలో రాస్తున్న శ్రీరమణ లోని స్పార్క్‌ని గుర్తించిన బాపు రమణలు “మేము శ్రీరమణ అభిమానులం” అని ప్రకటించేసి మద్రాసు పట్టుకుపోయారు. వారి సినిమాల్లో ఈయన ఏం చేసారంటే – ఏం చేయలేదూ, అన్నీ తానై, తోడు నీడై నిలబడ్డారు.

పత్రికల్లో రాయడం అనే మత్తులో పడి, ఫీచర్స్ రాసే మోజులో పడి కథలు ఎక్కువ రాయలేదు, కానీ రాసిన గుప్పెడూ ఆణిముత్యాలే కాదూ!

నాలుగో ఎకరం కథలో రైతు జీవితం యథాతథంగా చిత్రించారు. పొలాన్ని దుక్కిదున్నడంలో రైతు పొందే ఆనందం ట్రాక్టర్లు రావడంతో ఎలా పోయిందో, ఎద్దుల్ని ప్రేమగా పెంచుకోవడం, పందాలకి సిద్ధం చేయడం, గెలిచాక వాటికి బహుమతిగా తొడిగే వెండి తోడాలు, రంగు కుచ్చుల చెర్నాకోల, భజన చెక్కలు, గజ్జెల పట్టీలు.. ఇవన్నీ మన సేద్యసంస్కృతి. రేపటి తరానికి ఈ వైభవాన్ని, సంస్కారాన్ని నిండు దోసిళ్ళలో అందించాలి అనిపిస్తారు రాఘవయ్య పాత్ర ద్వారా. ముఖ్యంగా నాగలిని తయారు చేసే విధానాన్ని “నాగలి దుంపను చెక్కడమంటే మాటలా, ఓ దేవుడ్ని చెక్కడమే” అంటూ ఆ ప్రక్రియనంతా పూసగుచ్చినట్టు వర్ణించారు శ్రీరమణ. కానీ వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. రైతులు ఉసూరు మంటున్నారు. గుడికి, దేవుడికి వైభవం తగ్గింది.

అదే సమయంలో “సడీ సప్పుడూ లేకుండా పైనించి దిగిన డేగ”లా రియల్ ఎస్టేట్ ఊర్లోకి దిగింది – కార్పొరేట్ కాలేజీలు, హాస్పిటల్, అంతస్తుల భవనాలు కట్టిస్తామంటూ. భూములకు పొలాలకూ ఊహించనంత రేటు పలికింది. అందరితో పాటు సాంబశివరావు సరే నన్నాడు. నాలుగెకరాలకి ఐదుకోట్లు. తండ్రి రాఘవయ్య అన్నాడు – “సాంబా! భూమ్మీద కొచ్చాక కొన్ని బాజ్జతలుంటాయ్. పతోడికీ కొన్ని బాకీలుంటాయ్. ఆట్ని తీర్చాల. ఎగెయ్ కూడదయ్యా. ఎంత సెడ్డా మనం మడుసులం గందా” అన్నాడు. గతంలో మూడెకరాలు తనఖా పెట్టి, అప్పు చేసి, కూతురుకి పెళ్లి చేసి పంపాడు రాఘవయ్య. రాబడి రాక, ఎవరో ఎవరికో అమ్మే బదులు నువ్వే తీసుకో తల్లీ అని మాట ఇచ్చాడు. అది మర్చిపోలేదు కానీ మమతల అడుగున మరుగు పడింది. కానీ ఇప్పుడు వాలిన డేగ కన్ను చాలా సూక్ష్మమైంది. విదేశాల్లో ఉన్న కూతురు, అల్లుడు, మనమరాలికి టిక్కెట్లు కొని మరీ రప్పించింది. ఆ పిల్లకి వోణీల ఫంక్షన్ చేయాలని ముచ్చట పడితే ఆ ఖర్చూ భారీగానే పెట్టుకుంది. మూడెకరాల పాత సంగతిని కూతురు తీసుకు వచ్చిందా, నాలుగో ఎకరం ఎవరిది, ఉలవచారు అంటే రాఘవయ్య కు ఎందుకు కోపం, ఎందుకు చేతులు కాల్చుకున్నాడు, “నీళ్ళ కంటే రకతం చిక్కన, పచ్చనోట్ల రంగులు తేనె కంటే చిక్కన”.. ఎందుకన్నాడు?

ఈ కథలో రాసిన విషయాలు, ‘మానవ సంబంధాలకి రియల్ ఎస్టేట్ ఎంత రేటుని ఎలా కట్టిందో’ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు జనం. ఈ కథ ముగింపు గుండెను తొలిచేస్తుంది. “రచన రజతోత్సవ విహంగ వీక్షణ” సంపుటి కోసం ప్రత్యేకంగా శ్రీరమణ వ్రాసిన ఈ ‘నాలుగో ఎకరం’ వారి చివరి కథ.

శ్రీరమణ కథల్ని విశ్లేషించడానికి ఎన్ని పేజీలు రాసినా సరిపోదు. తనివితీరా చదవాలి. మనసారా అనుభూతించాలి. నవ్వుల ధారతో, దుఃఖపుజీరతో కళ్ళల్లో నీరు తిరగాలి.

బంగారు మురుగు’ కథ లోని బామ్మనీ, ఆమె ప్రేమనీ ఎవరు కోరుకోరు! ఆధ్యాత్మిక గురువుల ఆడంబరాలని, పీఠాధిపతుల ఆచార వ్యవహారాలలోని డొల్లతనాన్ని ధిక్కరించే ధైర్యాన్ని ఎవరు మెచ్చుకోరు! 80 ఏళ్ళ వయసులో పండిపోయిన జీవితానుభవంతో దాంపత్యం గురించి ఆమె చెప్పిన సత్యాలు, జీవిత సూత్రాలు ఎలా మర్చిపోతారు..

“ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. నువ్వు ఆకు వక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి”!

“నాది అనుకుంటే దుఃఖం! కాదు అనుకుంటే సుఖం!” బామ్మ చెప్పిన ఈ బంగారు మాటలో ఎంతో రహస్యం , తత్త్వం, గీతాసారం ఇమిడివుంది.

గుంటూరు జిల్లా తెనాలి దగ్గర వరాహపురం అగ్రహారంలో (21 సెప్టెంబర్ 1952) జన్మించిన శ్రీరమణ పల్లె వాతావరణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ప్రేమానురాగాలు తెలిసినవాడు. ఆచార వ్యవహారాలు పండుగలు పబ్బాలు మాత్రమే కాక వృత్తులు వాటి నైపుణ్యాలు కళ్ళారా చూసినవాడు. తన రాతల్లో మన కళ్ళేదుట చూపించినవాడు. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఆయనకు గుర్తు. మనుషుల్ని కూడా ఎన్నాళ్ళ తర్వాత కలిసినా చూడగానే గుర్తుపట్టేవారు. భేషజం లేకుండా పలకరిస్తారు. మాటా మాటా కలిసిందంటే ఇక ఆ ప్రవాహం అలా సాగిపోతుంది. ఎన్నెన్ని జ్ఞాపకాలో అనుభవాలో చెప్తూ ఉంటే వినేవారికి విసుగు పుట్టదు. మధ్య మధ్యలో ప్రముఖుల మీద వేసే చమక్కులు మరింత అందగించేవి.

వరహాల బావి. వరహాలమ్మ ఒంటరిది. కానీ అందరి మనిషి. ఆమె గురించిన వివరాలు అంతగా తెలీకపోయినా అందరికీ తలలో నాలుకలా ఉండేది. మంత్రసాని పని చేసేది. ఆడపిల్లలకి పూలజడలు వేసేది. గోరింటాకు పెట్టేది. ముఖ్యంగా ఎవరి కంట్లోనైనా నలక పడితే తన నాలుకకి తేనె అద్దుకొని సుతారంగా నాలుక కొనని కంట్లో తిప్పి చులాగ్గా నలక తీసేసేది. ఒకసారి అటుగా వచ్చిన జాగీర్దారు గారి కంట్లో నలక తీసింది. ఆయన ఆమె కాళ్ళకి మొక్కి, బంగారు నాణేలు సంచీ ఇచ్చి వెళ్ళాడు. మసీదు పక్కన రావిచెట్టు దగ్గరే ఆమె చిన్న ఇల్లు. ఆ ఊర్లో హిందువులు, ముస్లింలు కలివిడిగా వరసలు పెట్టి పిలుచుకునేవారే కానీ పూర్తి పేర్లు తెలీవు. అన్ని వృత్తుల వారూ సామరస్యంగా పనులు చేసుకునేవారు. సహాయాలు చేసుకునేవారు. పీర్ల పండుగ, శివరాత్రి అందరిదీ. నీటికొరత మాత్రమే వారి బాధ. కష్టం. ఒకానొక రోజు వరహాలమ్మ రాట్నం చప్పుడు వినబడక లోపలికి వెళ్ళి చూస్తే వరహాలమ్మ చనిపోయి ఉంది. ఊరంతా బావురుమంది. దుఃఖం పెల్లుబికింది. కానీ.. కాసేపటికి బంగారు మొహరీల కోసం వెదుకులాట మొదలైంది. మనుషుల్లోని ఆశల దెయ్యాలు జడలు విప్పాయి. ఆ ప్రాంతంలో తవ్వడం ప్రారంభించారు. కాసేపటికి నిధి దొరికింది. ఇక స్వార్థం పురులు విప్పింది. ఏనాడూ రాని కులాలు, మతాల ప్రస్తావన వచ్చింది. కర్రలు లేచాయి. అంతలో తవ్విన కందకం లోంచి బుస్సున నీరు పొంగింది. కొబ్బరి నీళ్లంత రుచిగా ఉన్నాయి. ఎన్నాళ్ళ నుండో వారిని వేధిస్తున్న నీటి కొరత తీరింది. చక్కగా చెప్టా కట్టారు. ‘వరహాల బావి’ ఆ ఊరి శుభకార్యాలకి నెలవు. ఊరికే ప్రతిష్ఠ. అలా హాయిగా సంతోషంగా గడిచిపోతున్న ఊరి సందడిలో, సంబరంలో మళ్ళీ ఎందుకు తుఫాను వచ్చింది! మళ్లీ ఎందుకు కర్రలు, కత్తులు లేచాయి! చివరికి ఏమైంది! మానవత్వం నిలిచిందా! అన్నది కథ చదివి తెలుసుకోవాలి. కన్నీరు నిండాలి. అద్భుతమైన కరుణ రసాత్మకమైన కథ ఇది.

ఇంకా సోడా నాయుడు, పెళ్లి, ధనలక్ష్మి వంటి కథలు ఉన్నాయి.

శ్రీరామాయణం శివధనువు నుండి పట్టాభిరాముడు వరకు 116 విభాగాలుగా, మంచి శీర్షికలుంచుతూ, సరళ భాషలో చిన్నపిల్లలకు అర్ధమయ్యేలా నవ్యలో సీరియల్‌గా రాసారు శ్రీరమణ. వారం వారం చిత్రకారులు పి. చిదంబరం ఆకర్షణీయమైన బొమ్మలు వేసారు. తర్వాత వి.వి.ఐ.టి., నంబూరు వారు 270 పేజీల పుస్తకాన్ని వేసారు.

వెంకట సత్య స్టాలిన్!’ సంగీతం నుండి సైన్స్ వరకు అలుపెరుగకుండా ఎడాపెడా ఉపన్యాసాలిచ్చేస్తూండే పాత్రను సృష్టించి నవ్య వార పత్రికలో రాయసాగారు శ్రీరమణ. జ్ఞానగ్రహంగా చెప్పుకోదగిన సామాన్యుడు. అసామాన్యమైన అతని వైఖరికి సాక్షాత్తు ముళ్ళపూడి వెంకటరమణే మురిసిపోయారు. శ్రీరమణకి ప్రియమిత్రుడైన ఆర్టిస్ట్ మోహన్ అడిగి మరీ, పంతం పట్టి , ఇష్టంగా బొమ్మలు గీసి పెట్టాడు పుస్తకం కోసం. టీకొట్టు ల్లోనో, రైలు పెట్టెల్లోనో, లారీ రిపేరింగ్ కార్ఖానా ల్లోనో, రికామీగా, సిల్క్ లాల్చీతో, ఉంగరాల జుత్తుతో, అదే పనిగా తన వాగ్ధోరణితో వాయిస్తూ ఉండే ఎందరికో ప్రతినిధి ఈ ‘వెంకట సత్య స్టాలిన్’. దీనిని కూడా వి.వి.ఐ.టి., నంబూరు వారే ప్రచురించారు.

ఒకేసారి రెండు మూడు పత్రికల్లో ఫీచర్స్ రాసేవారు శ్రీరమణ . ఈరోజు వార్తగా వచ్చిన సంఘటనని వెంటనే స్పందించి మర్నాడు దాన్ని సెటైరిక్‌గా రాయటం, వేడివేడిగా ఎవరెవరికి ఎంతెంత వడ్డించాలో కాలమ్‌గా రాసేవారు. దానికి గురైన వారు కూడా నవ్వుకునేంత వ్యంగ్యం, భాషాపటిమా శ్రీరమణది. ఆయన వ్యంగాలు, సెటైర్లు ఎక్కు పెట్టిన బాణాలలా ఉండేవి. కానీ ఆ బాణాలు నొప్పింపవు, నవ్విస్తాయి. కానీ అలా రాయడం కత్తి మీద సాము వంటిదని పాఠకుడు ఊహించలేడు. మర్నాడు ఏమి రాస్తారో అని ఎదురు చూస్తాడు. అలాంటి తన రాతలకి అభిమానులైన పాఠకులకు రీచ్ అయ్యేంత రిచ్‌గా ఉండేవి ఆయన రాతలు.

ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, నవ్య వారపత్రికల్లో కాలమ్స్, కథలు రాశారు. ‘పత్రిక’ అనే మాస పత్రికకు కొన్నాళ్లు గౌరవ సంపాదకులుగా నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారి కీర్తి పురస్కారాన్ని 1914లో అందుకున్నారు.

మిథునం శ్రీరమణ అని పేరు తెచ్చిపెట్టిన కథ ‘మిథునం’ 1997 నవంబర్‌లో ఆంధ్రభూమి వీక్లీలో నాలుగు వారాల పాటు వచ్చింది. కథని చదివి బాపు తన ఆనందాన్ని వెల్లడించడానికి మరో మార్గం తోచక కథనంతా స్వయంగా తన చేతి రాతతో 28 పేజీలు రాసి పంపారు. దాన్ని బాపుగారే అమెరికాలో ఉన్న మిత్రులు డాక్టర్ జంపాల చౌదరి గారికి పంపారు. ఆయన తన విశ్లేషణతో పాటు నెట్‌లో పెట్టారు. కోరిన వారికి బాపు దస్తూరితో ఉన్న కథ ఫొటోస్టాట్ ఉచితంగా పంపుతానన్నారు. అలా వంద మందికి పైగా చేరింది ఆ కథ. ఆ సంవత్సరం ‘ఢిల్లీ కథ జాతీయ అవార్డు’ మిథునానికి వచ్చింది.

‘రచన’శాయి గారు బాపు దస్తూరితో యధాతథంగా ‘రచన’ 1998 ఫిబ్రవరిలో, బాపు గారు వేసిన నాలుగు బొమ్మలతో ప్రచురించారు – అద్భుతమైన అర్ధనారీశ్వర రూపాన్ని రచన ముఖచిత్రంగా వేసి ‘దస్తూరీ తిలకం’ పేరుతో. మళ్ళీ పాఠకులు చదివి ఆనందించారు. మరోసారి 2000 మే ‘రచన’ సంచిక కేవలం ఒక్క ‘మిథునం’ కథ తోనే వెలువడింది. (5 కాపీలు నాకూ అందించారు శాయి గారు ఆత్మీయంగా).

మిథునం కథ దాదాపు భారతీయ భాషలన్నిటిలోకి అనువదింపబడింది. నాలుగు విదేశీ భాషల్లోకి తర్జుమా అయింది. పుట్టిన రోజు, పెళ్లి రోజు, గృహప్రవేశాలకు, ముఖ్యంగా షష్ట్యబ్ది పూర్తి వేడుకలకు జ్ఞాపికలుగా ఇవ్వడం పరిపాటి అయింది. జ్యోతిచిత్ర సంపాదకులు డా. వివేకానందమూర్తి రచయితని ‘మిథున చక్రవర్తి’ అని సరదాగా బిరుదు లాగా పిలిచారు. ఒకానొక మహానగరంలో రాజమహల్ లాంటి ఇల్లు కట్టుకొని దానికి ‘మిథునం’ అని పేరు పెట్టుకొని, రచయితకి ఒక బంగారు కాసు పంపారు కూడా.

మలయాళంలో సినిమాగా ఎం.టి. వాసుదేవన్ నాయర్ ‘ఒరు చెరు పుంజిరి’ (A Slender Smile) అని తీసారు. ఆ సినిమాకి ఏషియా ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు వచ్చింది. తెలుగులో నాటక ప్రదర్శన జరిగింది. ఆకాశవాణి రేడియో నాటికగా కూడా రూపొందింది. బాపు చేతిరాతతో ఉన్న పుస్తకాన్ని జంపాల చౌదరి గారు 4 లక్షల ప్రతులు వేసి ఉచితంగా పంచారట.

ఇక తెలుగులో తనికెళ్ళ భరణి గారు ఎంతో ఇష్టంతో తన దర్శకత్వంలో తీసిన ‘మిథునం’ చిత్రరాజం ఆబాలగోపాలాన్ని ఆకర్షించింది. పట్టుబట్టి యస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో అప్పాదాసు పాత్ర వేయించి ఇద్దరికీ శాశ్వత కీర్తి దక్కేలా ప్రతి ఫ్రేం లోను శ్రద్ధగా శ్రమించారు. బుచ్చిలక్ష్మి పాత్ర కోసం ఎందరో సీనియర్ నటీమణులను అనుకొన్నారు.

చివరికి లక్ష్మీ ఆ పాత్ర లో పూర్తిగా ఒదిగిపోయారు.

మిథునం కథను ఇక్కడ చెప్పడం కంటే దానిని చదివి ఆనందించాలి అనుకొంటాను. ఆ పని ఎప్పుడో తెలుగువారు చేసారు. చదవలేని వారికి కేవలం రెండు వృద్ధ పాత్రలతో ఒక దృశ్య కావ్యంగా ‘చూపించి’ పుణ్యం కట్టుకున్నారు శ్రీ తనికెళ్ళ భరణి.

ఆధునిక ప్రాచీన సాహిత్యాన్ని గట్టిగా చదువుకున్న వారే కాక జీవితాన్ని చదువుకున్నవారు శ్రీరమణ. తన కథాకాలం నాటికి, ఆ పాత రోజుల్లోకి వెళ్లిపోయి ఆ పాత్రలు అనుభవించిన జీవితాన్ని పరిస్థితుల్ని ‘ఇలా జరిగి ఉంటుంది’ అని తన మనోఫలకంపై చిత్రించుకుని చిత్రిక పట్టి కథలను రూపొందిస్తారు. సరదాగా తీసుకునే వాళ్ళు అందులోని తాత్వికతని అర్థం చేసుకునేవారు లోతైన అనుభవాన్ని అనుబంధాన్ని తమకు తాము ఐడెంటిఫై చేసుకొని ఆనందించేవారు కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా ముగింపులో కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేవారు ఎందరో పాఠకులు అందుకే ఆ కథల విజయవంతంగా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందాయి మిధునం కథ 60 ఏళ్లు జరిగిన కథ వాళ్ళిద్దరూ వేర్వేరుగా కనిపిస్తున్న రూపాలే తప్ప నిజానికి వాళ్ళిద్దరూ ఒక్కటే ప్రాణం అనే అద్వైత దృష్టి దీనికి ప్రాణం అంటారు శ్రీరమణ.

సెలబ్రిటీల సంభాషణల్లో దొర్లిన జోక్స్‌ని ఎన్నింటినో సేకరించి ‘హాస్యజ్యోతి’ పుస్తకం తెచ్చారు. శ్రీకాలమ్, శ్రీఛానల్, చిలకల పందిరి కాలమ్స్ వివిధ పత్రికల్లో నిర్వహించి తన హాస్య వ్యంగ్య చతురతతో అందర్నీ ఆకట్టుకున్నారు.

ఎందరో మెచ్చుకుని తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఐకాన్ అంటూ ప్రశంసించిన ‘మిథునం’ కథని కొందరు (ఈర్ష్యతో) విమర్శించక పోలేదు. వారికి ఆయన ఇచ్చిన సమాధానం – భౌతికంగా ఆయన ఇప్పుడు లేకపోయినా- ఎప్పటికీ నిలిచి వుంటుంది..

“పెళ్లి కాగానే వయస్సు పెట్టిన సరదాలు ఉంటాయి. పెళ్లయిన కొత్తలో ఆనందాలు తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత పిల్లల్ని కనడం, వారిని పెంచడం వంటి బాధ్యతలతో తల మొలకలై ఉంటారు. పిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యాక ఒక వాక్యూం వస్తుంది. అప్పుడు మిగిలేది కంపానియన్‌షిప్. జీవితానికి చరమాంకం సాఫీగా నడవాలంటే గట్టి పునాది ఉండాలి. అన్నిటిని షేర్ చేసుకున్నప్పుడే వారిద్దరి మధ్య అనురాగం ఏర్పడుతుంది. చివరి దశ కంపానియన్‌షిప్ మీదే నడుస్తుంది. శారీరక ఆకర్షణలు పోతాయి. పళ్ళు ఊడిపోతాయి. కళ్ళు కనపడవు. నడవలేరు. మనసు నుంచి మనసు, హృదయాన్నుంచి హృదయానికి మాట్లాడుకోవడమే మిగులుతుంది. మిధునం రాయటానికి అదే కారణం. ఇన్నేళ్ల ప్రయాణంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. చచ్చిపోయే దాకా వాళ్ళకి మిగిలేది స్నేహం, పాత జ్ఞాపకాలు. గతాన్ని తలుచుకుంటూ జీవితాన్ని గడపటమే ఆనందం అప్పుడే ఒక జీవితం సజీవంగా మిగులుతుంది”. ఎంత నిజం!

**

శ్రీరమణ గారికి అశ్రు నివాళులతో.

Exit mobile version