[dropcap]సా[/dropcap]హిత్య విప్లవ యోధుడు చలం. 1920 నుంచి 1950 వరకు దాదాపు 30 సంవత్సరాలు అచలంగా నిలిచిన సాహితీవేత్త. తెలుగు సాహిత్య మార్గాన్ని మరల్చి కొత్త దారి చూపిన తెలుగు దివిటి. స్త్రీ స్వేచ్ఛ కోసం అహరహం శ్రమించిన సంచలనాత్మక రచయిత. పురుషులకు ఎంత స్వేచ్ఛ ఉండాలో మహిళలకు కూడా అంతే స్వేచ్ఛనివ్వాలని వాదించిన ఆధునికవాది.
చలం జీవితం:
బుద్ధ పౌర్ణమి నాడు 1894 మే 18 వ తేదీన మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు వెంకట సుబ్బమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా వెంకట చలం జన్మించాడు. తాతయ్య గుడిపాటి వెంకట్రామయ్యకు దత్తుపోవడంతో గుడిపాటి వెంకట చలం అయ్యాడు. వెంకట్రామయ్య కృష్ణా జిల్లాలోని తొట్లవల్లూరులో దివాన్ బహదూర్‌గా పనిచేశాడు. అక్కడి నుండి తెనాలికి వచ్చి స్థిరపడ్డాడు. తెనాలిలో చలం బాల్యం సాగింది. అమ్మమ్మ పురాణాలను చెబుతూఉండేది. చిన్నప్పుడు వాళ్ళ ఆమ్మను ఇల్లరికం వచ్చిన తన తండ్రి పెట్టిన యాతన ఇతనిపై ఎంతో ప్రభావం చూపింది. చిన్నతనంలోనే ఉపనయనమయ్యింది. రోజూ మడి కట్టుకుని సంధ్యావందనం చేసేవాడు. సుందరమ్మ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను చదువు మాన్పించారు. పిఠాపురం మహారాజా కాలేజీలో చదువుతున్న రోజుల్లో కాలేజీ ప్రిన్సిపాల్ రఘుపతి వెంకటరత్నం నాయుడు నడుపుతున్న బ్రహ్మ సమాజం చలాన్ని ప్రభావితుణ్ణి చేసింది.
విభిన్న సాహితీ ప్రక్రియలు:
మొదటి నవల ‘శశిరేఖ’ను 1921లో చలం వ్రాశాడు. అమీనా, దైవమిచ్చిన భార్య, వివాహం మొదలగు నవలలు వ్రాశాడు. వీటిలో మైదానం, భ్రాహ్మణీకం, జీవితార్థం ఎంతో పేరు తెచ్చుకున్నాయి. మంగమ్మ, పురూరవ, జయదేవ, శశాంక మొదలగు నాటకాలు వ్రాశాడు. పాతిక నాటికలు, స్త్రీ, బిడ్డల శిక్షణ వంటి వందకు పైగా వ్యాసాలు వ్రాశాడు. తెలుగులో మొదట మ్యూజింగ్స్‌ని ప్రారంభించాడు. మనసులో ఎలా ఆలోచిస్తే అలాంటి వాటిని రచించి ఆ రచనలకు సరియైన తెలుగు పదం దొరకక ‘మ్యూజింగ్స్’ అని పేరు పెట్టాడు. ఊహా పాత్రతో ప్రేమ లేఖలు వ్రాశాడు. చింతా దీక్షితులు, మండువ జగ్గారావు మొదలగు వారికి వ్రాసిన లేఖలు కూడా చలం సాహిత్యంలో భాగంగా చెప్పవచ్చు. భగవద్గీత, గీతాంజలి, గ్రంథాలను సరళమైన తెలుగులోకి అనువదించాడు. ఏసుక్రీస్తు సువార్తలను తెలుగులో అనువదించాడు. భగవాన్ రమణ మహర్షిపై వచన గేయాలు వ్రాశాడు.
యోగ్యతాపత్రం:
శ్రీశ్రీ మహాప్రస్థానానికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో చలం వ్రాసిన ‘ముందుమాట’ కూడా అంత పేరు సంపాదించుకుంది. శ్రీశ్రీ దానికి ‘యోగ్యతాపత్రం’ అని పేరుపెట్టాడు. చలంతో ముఖ పరిచయం లేకపోయినా ‘జరుక్ శాస్త్రి’గా పేరొందిన జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి ద్వారా మహాప్రస్థానానికి ముందుమాట వ్రాయించుకున్నాడు. అందులో ‘కవిత్వాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చెలానికి ఇంపేషన్స్, అనుమానం. శబ్ద సౌందర్యంతో తృప్తిపడి సంతోషించ వలసిందే కాని, చెప్పేదానికి అర్థం వెతకడం అవివేకం అని. కాని నీరసపు కళా చతురులమల్లే అందాన్ని దూరం నుంచి చూసి సంతోషించీ, విచారించీ, తప్పుకోవటం చెలానికి చేతకాదు. తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగానితనాన్నీ, అర్థ అస్పష్టతనీ – ఛందస్సు, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి.’ అని వ్రాశాడు. ఈ పుస్తకాన్ని చదవాలనేవారు ‘రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రచండఘోషం ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ వుంటే ఈ పుస్తకం తెరవండి.’ అని అన్నాడు. ఈ యోగ్యతాపత్రం ఆధునిక సాహిత్యానికి మ్యాగ్నకార్టాగా శ్రీశ్రీ భావించాడు. అందుకే చలాన్ని ఇరవయ్యో శతాబ్ధపు వేమన యోగి అన్నాడు.
మైదానం వర్సెస్ చెలియలికట్ట:
1927లో చలం ‘మైదానం’ వ్రాశాడు. ఇది సృష్టించిన ప్రళయం నుంచి సనాతన సాంప్రదాయాలను కాపాడటం కోసం విశ్వనాథ సత్యనారాయణ 1933లో ‘చెలియలికట్ట’ వ్రాశాడు. మైదానంలో ప్రముఖ పాత్ర రాజేశ్వరి, చెలియలికట్టలో ప్రధాన పాత్ర రత్నావళి. ఇద్దరూ సౌందర్యరాశులే. రాజేశ్వరి ప్లీడరైన భర్తను విడిచిపెట్టి అమీర్‌తో వెళ్ళిపోతుంది. రత్నావళి భర్త లాయరైన సీతారామయ్యను విడిచి పెట్టి రంగారావుతో వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు హాయిగా ఉన్న తరువాత మైదానంలో అమీర్, చెలియలికట్టలో రంగారావు తమ పురుషాహంకారం ప్రదర్శిస్తారు. రాజేశ్వరి మీద అమీర్ మిత్రుడు మీరా మనసుపడతాడు. రత్నావళి మీద రంగారావు మిత్రుడు భరణి మనసుపడతాడు. కొంతకాలం తరువాత మీరాతో సంబంధం తెలుసుకున్న అమీర్ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ నింద తనమీద వేసుకొని రాజేశ్వరి జైలు పాలవుతుంది. చెలియలికట్టలో ముకుందరావు టీచర్ అనే పేరుతో విశ్వనాథ సత్యనారాయణే పరకాయ ప్రవేశం చేసి రత్నావళికి నీతిబోధ చేస్తాడు. రత్నావళి, రంగారావు పశ్చాత్తాపంతో సముద్రగర్భంలో కలిసిపోతారు. కానీ మైదానం లోని రాజేశ్వరిలో ఈ పశ్చాత్తాప భావన కనబడదు. చలం, విశ్వనాథ సృష్టించిన ఈ రెండు పాత్రలూ స్త్రీ స్వేచ్ఛకు సంబంధించినవే. అయితే ఎవరి బాణీ వారిది. విశ్వనాథ చలం గురించి చెబుతూ ‘నేను పెద్దగా వ్రాస్తున్నాను అనుకొనే తెలుగు రచయితల కంటే చలంకు తెలుగు భాష బాగా వచ్చు. తెలుగు నుడికారం చాలా బాగుంటుంది. చిన్న పదాలతో హృదయానికి ఎంతో సూటిగా వ్రాయగలిగిన సత్తా రచయిత’ అని కితాబిచ్చాడు.
స్త్రీల స్వేచ్ఛ:
స్త్రీలను కట్టుబాట్ల కారాగారాల్లోంచి బయటికి రమ్మన్నాడు. బంధనాలు తెంచుకోమన్నాడు. స్వేచ్ఛగా విహరించమన్నాడు. మీ జీవితాన్ని మీరు అనుకున్నరీతిలో జీవించమన్నాడు. ‘స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి.’ అని అన్నాడు. ఇంటి గుమ్మం దాటి రాని, వంటింట్లో కుందేళ్ళుగా బ్రతికిన స్త్రీలకు ఈ ధోరణి మౌనరాగాలకు బాణీలు కట్టినట్లు అనిపించింది. అందుకే ఆ మాటలు మూగగొంతులకు మాటలు నేర్పాయి. ‘ఆడది భయపడ్డంత సేపే మగవాడి ధైర్యం.’ అని అన్నాడు. కేవలం పిల్లల్నికని వంట చేసి పెట్టే మరబొమ్మగానే స్త్రీని భావించవద్దు’ అని చెప్పిన స్త్రీ స్వేచ్ఛావాది.
విమర్శ:
చలం సాహిత్యం చదివి యువతీయువకులు పాడవుతారని ఛాందసులు భావించారు. ఆనాడు చలం పుస్తకాలను చదవనిచ్చేవారు కాదు. పెద్దలకు తెలియకుండా తలగడ క్రింద పెట్టుకుని విప్లవసాహిత్యం లాగా కొంతమంది యువకులు చదివేవారు. ఆయన సాహిత్యాన్నే కాదు ఆయననూ సంఘం నుంచి బహిష్కరించారు. ఇళ్ళు కూడా అద్దెకు ఇవ్వలేదు. ఊరికి దూరంగా పూరి గుడిసెల్లోనో, నదీతీరంలోనో, కొండల మధ్య ఉండే మైదానంలోనో, ముస్లింలు ఉంటే వీధుల్లోనో, కుటుంబంతో ఉండాల్సి వచ్చేది. ‘స్త్రీకి స్వేచ్ఛ నివ్వండి’ అంటాడు చలం. ‘నీవంటున్నది స్వేచ్ఛకాదు, అది విశృంఖలత్వం’ అన్నారు విమర్శకులు. ‘స్త్రీలలో చైతన్యం తీసుకురావాలనేది నా ప్రయత్నం’ అని చలం అంటే ‘వాళ్ళను తప్పు దారిలో పంపుతున్నావు, వారిని చెడగొడుతున్నావు’ అని విమర్శ చేశారు. ‘మీలా నేను చెప్పేదొకటి చేసేదొకటి కాదు. చెప్పిందే చేస్తాను చేసిందే చెబుతాను’ అని చలం అంటే ‘నీకో స్థిరత్వం లేదు, ఇతరులకు బోధించే హక్కు నీకెక్కడిది?’ అని విమర్శకులు ప్రశ్నించారు.
నిర్భయత్వం:
చలం నిజాన్ని దాచి పెట్టుకోలేదు. తనకు పరిచయం ఉన్న రత్నమ్మ, లీల మొదలగు మహిళల గురించి జీవితకథలో వ్రాస్తూ ‘నేను చేస్తున్నది తప్పని నాకు తెలుసు. కానీ మానుకోలేక పోతున్నాను. ఈ బలహీనత నా చిన్నతనం నుంచే వచ్చింది.’ అని పశ్చాత్తాపబడ్డాడు. రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ అంటూ ధూర్జటి తన మనసును త్రుళ్ళణచవే అని నిర్మోహమాటంగా చెప్పుకున్నాడు. ధూర్జటి తరువాత తన లోపాలను బహిరంగంగా చెప్పుకున్న ధైర్యవంతుడు చలం. అందుకే ఆయనను విమర్శించే వాళ్ళు కూడా ఆయన నిర్భయత్వానికి సలాం కొట్టారు.