Site icon Sanchika

తెలుగు సంబరం

[dropcap]”లా[/dropcap]స్యా”…. పిలిచింది సిస్టర్.

“ఆ మా పాపే…” అంది.. రజని.  పాపను తీసికెళ్ళింది.

“హాయ్ బేబీ” విష్ చేసాడు డాక్టర్ శరత్.

“హాయ్ అంకుల్” అని పలకరించింది. కానీ.. కళ్ళలో ఉత్సాహం లేదు. ఎటో చూస్తూ ఆలోచిస్తోంది.

ఆ అమ్మాయిని నిశితంగా పరిశీలించాడు డాక్టర్.

“యువర్ నేమ్ బేబీ”

“లాస్య”

“విచ్ క్లాస్”

“ఫిఫ్త్ క్లాస్” చెప్పింది లాస్య భయంగా.

“నువ్వు ఎందుకు డల్‌గా ఉన్నావు. అమ్మ నాన్న ఏమైనా అన్నారా” పాప చేతికి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తూ.. డాక్టర్.

“మొన్న ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అన్ని సబ్జెక్టులలో 99% మార్క్స్ వచ్చాయి. కానీ ఇంగ్లీష్‌లో యాభై కూడా రాలేదనీ అమ్మా నాన్న తిట్టారు” చెప్పింది కళ్ళు పెద్దవి చేస్తూ.

“ఓహ్ అలాగా.. మరి మీ స్కూల్లో గేమ్స్, క్రాఫ్ట్, పెయింటింగ్ నేర్పిస్తారా” అడిగాడు డాక్టర్.

“అదేం లేదు. ఎప్పుడూ చదువు చదువు అంటూ స్కూల్లో టీచర్, ఇంట్లో పేరెంట్స్ వేధిస్తున్నారు” చెప్పింది విసుగ్గా లాస్య.

“ఓకే… నీకు ఏ సబ్జెక్టు ఇష్టం”

“నాకు తెలుగు అంటే ఇష్టం. మా ఇంటి పక్కనే ఉన్న ఫ్రెండ్స్ అందరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. తెలుగులోనే మాట్లాడుకుంటూ, పాడుకుంటారు. సాయంత్రం చాలా ఆటలు ఆడుతారు. మా కాన్వెంట్‌లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. పొరపాటున తెలుగు పలికితే పనిష్మెంట్ ఇస్తారు. యూనీఫాం, షూ, టై, ఐడెంటిటీ కార్డు ఏది మరిచిపోయినా ఎండలో నిలబెడతారు. ఇంటికి వచ్చాక కూడా.. అమ్మ ఇంగ్లీష్ లోనే “మమ్మీ” అని పిలవమంటుంది. నా దగ్గర కూర్చుని కథలు చెప్పదు. అమ్మ నాన్న టీవితో, ఫోన్‌లతో బిజీగా ఉంటారు. సండే కూడా నాన్న బయట ఫ్రెండ్స్‌తో ఆడుకోనివ్వడు. ఫస్ట్ ర్యాంక్ రావాలి చదువుకో అని బుక్స్ ఇచ్చి కూర్చోబెడతాడు.

నాన్న ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి స్కూల్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందట. అప్పటినుంచి నన్ను నిద్ర పోనివ్వకుండా రాత్రి పదకొండు గంటల వరకు, తెల్లవారుజామున ఐదు గంటలకు లేపి చదివిస్తున్నారు. స్కూల్‌కి వెళ్ళగానే నిద్ర వచ్చేది. లెసన్స్ వినకుండా నిద్ర పోతున్నాననీ.. టీచర్ గుంజిళ్ళు తీయించింది. ఫీవర్ రావటంతో పరీక్ష రాయలేదు” చెప్పింది అమాయకంగా లాస్య.

డాక్టర్‌కు విషయం పూర్తిగా అర్థం అయింది.

“లాస్యా ‌… నువ్వు అమ్మ దగ్గరకు వెళ్ళి నాన్నను రమ్మని చెప్పు. మందులు రాసిస్తాను” చెప్పారు డాక్టర్.

లాస్య మెల్లగా నడుచుకుంటూ డోర్ తీసుకుని వెళ్ళింది.

కాసేపటి తర్వాత పాప తండ్రి రమేష్ లోపలికి వచ్చాడు.

“వాట్ డాక్టర్.. అమ్మాయి హెల్త్ ఎలా ఉంది? ఫీవర్ తగ్గితే స్కూల్‌కి తీసుకొని వెళ్తాము. నాలుగు రోజులు నుంచి క్లాస్‌లు మిస్ అయ్యింది. ఎగ్జామ్ రాయలేకపోతే ర్యాంక్ రాదు. తొందరగా క్యూర్ అవటానికి మెడిసిన్ ఇవ్వండి” అంటూ డాక్టర్ ను తొందర పెట్టాడు రమేష్.

“చూడండి రమేష్ గారు… నా దగ్గరకు చాలామంది పేషెంట్లు వస్తారు.. వ్యాధులకే కాదు, సైకలాజికల్ డిజార్డర్‌కు కూడా నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను. మీ పాపకు ఏ ప్రాబ్లం లేదు. అమ్మాయికి తన ఫ్రెండ్స్ చదువుకునే స్కూల్ నచ్చింది. వాళ్ళు మీ ఇంటి పక్కనే ఉంటారట కదా. పైగా తనకు ఇంగ్లీష్ మీడియంపై ఇంట్రెస్ట్ లేదు. కనీసం కాన్వెంట్ లోను, ఇంట్లోను తెలుగు పలికే స్వేచ్ఛ లేదు. అయినా మన పెద్ద వారి నుంచి ,మన తరం వరకు… మనమంతా తెలుగు మీడియంలోనే, ప్రభుత్వ బడి లోనే చదువుకుని.. ఇప్పుడు గొప్ప ఉద్యోగాల్లోనే ఉన్నాం కదా. అందరు పిల్లలు ఒకేలా ఉండరు. కొందరు తల్లి తండ్రుల పోరు పడలేక ప్రైవేటు స్కూల్‌కు వెళుతున్నారు. అలాంటి వారు టెన్త్ క్లాస్ దాటాక మానసికంగా బలహీనమై ర్యాంకుల వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మీ బిడ్డలను పక్కవారితో పోల్చకండి. వారిని వారికి నచ్చిన విధంగా ఎదగనివ్వండి.

ఇంటికి వచ్చాక చందమామ కథలు, దేశభక్తుల కథలు చెప్పండి. తెలుగు భాష గురించి చెప్పండి. అపుడపుడు ఇంగ్లీష్ చెప్పండి. పాపకు ఆడుకోవడం ఇష్టం.

కాసేపు ఆడుకోనివ్వండి. ఆటల వల్ల బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. నేను చెప్పింది కాదని… మీ పాటికి మీరు… ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే పరువు పోతుందనీ.. మరేదో చేస్తే .. అమ్మాయి మెంటల్ హెల్త్ దెబ్బ తింటుంది. లాస్య బాగా చదివి తాను టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. అందుకే నేను వారానికి ఒకసారి స్కూళ్లు, కాలేజీలు వెళ్లి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ఇస్తుంటాను” చెప్పాడు డాక్టర్.

డాక్టర్ గారు చెప్పింది విన్నాక… తమ చిట్టి తల్లి పట్ల… తాము ఎంత తప్పు చేస్తున్నామో తెలుసుకున్నాడు రమేష్.

 “చాలా థాంక్స్ డాక్టర్‌గారు… మీరు చెప్పినట్లు చేస్తాను. ఈరోజే గవర్నమెంట్ బడిలో పాపను చేర్పిస్తాను.. జాగ్రత్తగా చూసుకుంటాను” అని చెప్పి కూతురును, భార్యను తీసుకుని బయలుదేరాడు రమేష్.

 గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఆటో ఆపమని చెప్పాడు రమేష్.

 “అదేమిటండీ… ఇక్కడ ఆపారు. ఇంటికి వెళ్ళకుండా” అడిగింది రజని.

“దిగు… చెపుతాను..”అంటూ లాస్యను ఎత్తుకుని ఆటోవాడికి డబ్బులు ఇచ్చాడు.

గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే, అలంకరించిన పెద్ద షామియానాల కింద ఏదో మీటింగ్ జరుగుతోంది.

రమేష్ అక్కడ ఉన్న ఉపాధ్యాయులను “ఏమి పోగ్రాం జరుగుతుంది” అని అడిగాడు.

“ఈ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.. అందుకే తెలుగు భాష గురించి పాటలు, పద్యాలు ప్రసంగాలు ఉంటాయి. రండి కూర్చోండి” అంటూ రమేష్ దంపతులను అక్కడ ఉన్న కుర్చీలు చూపించాడు ఒక టీచర్.

వేదిక మీద తెల్లటి పంచె, లాల్చీ పైన కండువా వేసుకున్న ఒక పండితుడు తెలుగు భాష గురించి చెపుతూ “తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. తేనె వంటిది కనుక తెనుగు అని పెద్దలు చెబుతారు. క్రీస్తు పూర్వం రెండు వందల నాటి శిథిలాలలో తెలుగు భాష ఉండటం బట్టి ఈ భాష ప్రాచీనత మనకు తెలుస్తుంది. క్రీ.పూ.మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన ‘గాథా సప్తశతి ‘అనే మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు భాషకు తెలుగు, తెనుగు,ఆంధ్రం అనే మూడు పదాలున్నాయి. ఆంధ్రులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు కృష్ణ, గోదావరి ప్రాంతం… తెలుగు దేశమని పిలువబడేదనీ, ఆంధ్రుల పాలన తర్వాత ఆంధ్ర దేశం అయిందనీ చరిత్ర కారుల అభిప్రాయం.

నన్నయ భట్టు కాలం నాటికే తెలుగు, ఆంధ్రం అనే పేర్లు ఉన్నాయనీ నిదర్శనాలు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారతదేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే తొమ్మిది కోట్ల జనాభాలో… ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముతో పాటు… తెలుగు భాషను 2008 అక్టోబర్ 31న భారత ప్రభుత్వం గుర్తించింది. వెనిస్‌కు చెందిన వర్తకుడు నికోలోస్ డా.కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలుగా ఉండటం గమనించి తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా వ్యవహరించారు. కన్నడిగుడైన శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషను “దేశ భాషలందు తెలుగు లెస్స”అని చెప్పారు” వివరించాడు తెలుగు పండితుడు.

మరొక అతిథిగా వచ్చిన తెలుగు ప్రొఫెసర్ మాట్లాడుతూ “అ నుంచి అః వరకు అచ్చులను పలకటం వల్ల ముఖం అంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది. మన తెలుగు భాష గొప్పతనం ముందుగా అక్షరమాల అల్లిక లోనే ఉంది. పూర్వం గురువులు పిల్లలతో అక్షరమాలను పలికించటం వల్ల కంఠం నుండి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది. తెలుగు భాషను అందంగా రాసేవారికి చిత్రకళ సొంతమవుతుందట. ఎందుకంటే మన వర్ణమాలలో అన్ని మెలికలు ఉన్నాయి. మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోనూ వ్రాయలేరు..” అంటూ ముగించాడు ప్రొఫెసర్.

తర్వాత విద్యార్థులు తెలుగు పద్యాలు పాటలు వినిపించారు.

తెలుగు భాష గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న రమేష్… కార్యక్రమం అయిపోగానే… లాస్యను తీసుకుని ఆఫీస్ రూంలో ఉన్న హెడ్ మాస్టర్ దగ్గరకి వెళ్లి స్కూల్ రిజిస్టర్‌లో పాప పేరు రాయించాడు.. తర్వాత లాస్య వైపు తిరిగి “బేబీ… ఇప్పటి నుండి ఇక్కడే చదువుకుందువు గానీ.. నీకు ఇష్టమైన తెలుగు మీడియంలో” చెప్పాడు తల నిమురుతూ రమేష్.

“నిజంగా‌‌‌‌… థాంక్స్ నాన్నా..” అంటూ సంబరపడిపోయింది లాస్య… ఇక నుంచి గుంజిళ్ళు తీయడం, ఎండలో నిలబడటం లాంటివి తప్పించుకున్నందుకు.

Exit mobile version