[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
తెలుగు సొగసులు
“ఒక్క సంగీతమేదో పాడినట్లు భాషించునప్డు విన్పించు భాష..
విస్పష్టముగ నెల్ల విన్పించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష..
రస భావముల సమర్పణ శక్తి యందున నమర భాషకు దీటైన భాష..
జీవులలో నున్న చేవ యంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష..”
~
“భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాషయన నిద్దియని చెప్పబడిన భాష
తనర ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిదీ తెలుగు భాష”
..అన్నారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు భాష వైశిష్ట్యాన్ని వివరిస్తూ.
తోడుకోన్న వారికి తోడుకొన్నంత మాధుర్యం, సౌందర్యం అందించే క్షీరసముద్రం మన తెలుగు భాష. తెలుగుభాష సొబగులను పరిశోధనాత్మకంగా పరిశీలించి వివరించిన ఈ గ్రంథం సాహిత్యాధ్యయనం చేస్తున్న విద్యార్థులకు, సాహిత్యాభిమానులకు ఎంతో ఉపయుక్తమైనది.
“తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతూనే వుంటాయి” అని ఆరుద్ర గారు అన్నట్లు, మన తెలుగుభాషలో సొగసులు సతత హరితాలు. సదా అవధరణీయాలు. భాషలో మౌలికంగా ఉన్న అలాంటి కొన్ని సొగసులను మరచిపోకుండా, ఉన్న సంగతులనే ఈ తరానికి పెన్నిధులుగా అందించుకోవాల్సిన అవసరం వుంది కనుక, తెలుగు భాషా వికాసం మన తెలుగువారందరి కర్తవ్యం కనుక, మన భాష లోని సొగసులను కొన్నిటిని గుర్తు చేసుకోవడానికే ఈ పుస్తకం.
‘జంట పదాలు – భాషకు సిరిసంపదలు’.. అన్న శీర్షికలో మన తెలుగు భాషలో ఉన్న అందచందాలు, ఊరూవాడ, చీకూచింతా వంటి వివిధ రకాలైన జంటపదాలు మన భాషకు ఎనలేని సిరిసంపదలుగా తులతూగుతున్నాయని తెలుసుకోవచ్చు. ‘ఒక్క అక్షరం – లక్ష భావాలు’ అన్న శీర్షిక క్రింద, మన భాషలోని ఏకాక్షరాలను ఉటంకిస్తూ, ఒక్కొక్క ఏకాక్షరంలో ఎంతటి గంభీరమైన భావం దాగి ఉందో, సోదాహరణంగా వివరిస్తారు రచయిత. ఇంకా ‘ప్రత్యయాలతో ప్రసన్నత’, ‘అటొక అర్థం – ఇటొక అర్థం’ వంటి ఆకర్షణీయమైన శీర్షికలతో తెలుగుభాష లోని సొబగులను గురించి చాలా ఆసక్తికరంగా వివరణ ఇవ్వబడింది.
తెలుగు భాషలోని సొగసుల గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం అవశ్య పఠనీయం. ఈ క్రింది link ను ఉపయోగించి ఉచితంగా చదువుకోవచ్చు.
https://archive.org/details/17.telugu-sogasulu-online-book/mode/2up
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.