తెలుగు వెలుగు 3: ‘కావ్యకంఠ’ గణపతి ముని

0
2

[box type=’note’ fontsize=’16’] ‘నాయన’గా సుప్రసిద్ధులైన శ్రీ కావ్యకంఠ గణపతి ముని గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు విశాలి పేరి. [/box]

మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి, సనాత ధర్మాన్ని సంరక్షించడానికి యుగపురుషులు అవతరిస్తారు. వారి రాకతో పండితులే కాదు పామరులు, సమస్త జీవకోటి తరిస్తారు. అటువంటి వారిలో చెప్పుకోతగినవారు వశిష్ఠ గణపతి ముని లేదా కావ్యకంఠ గణపతి ముని. ఆయన పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త, తపోవేత్త మాత్రమే కాదు కవి, దేశభక్తుడు, సంస్కరణశీలి కూడా!

గణపతి శాస్త్రి విజయనగరం జిల్లాలోని కలవరాయి అగ్రహారంలో అయ్యల సోమయాజుల నరసింహశాస్త్రి, నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా జన్మించారు. ఆయన అసలుపేరు సూర్య గణపతిశాస్త్రి. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన గ్రామాధిపత్యంతో పాటు జ్యోతిష, ఆయుర్వేద, మంత్ర శాస్త్రాలలో నరసింహశాస్త్రి దిట్ట. ఆయనకు వారణాసిలోని డుంఠి గణపతి, భార్యయైన సరసమాంబకు సూర్యుడు ఇష్టదేవతలు. ఆ దంపతులకు మొదట సంతానము “భీమశాస్త్రి”. అతనికి రెండు ఏళ్ళ వయసులో జబ్బు చేయగా, అతను మళ్ళీ మామూలు మనిషి అయితే అరసవల్లి సూర్యనారాయణుడికి మొక్కు చెల్లిస్తామని ఆ దంపతులు మొక్కుకున్నారు. ఆ బాలుడు పూర్ణారోగ్యంతో ఆ జబ్బు నుంచి బయటపడగా, ఆ దంపతులిరువురు ఆ బాలుడితో అరసవల్లి సూర్యనారాయణ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడే ఒక రాత్రి నిద్ర చేశారు. నరసమాంబకు కలలో సూర్యాలయ ప్రాకారము యొక్క వెనుక భాగము నుండి ఒక బంగారు వర్ణముగల స్త్రీ అగ్నిపూర్ణమగు బంగారు కలశమును చేతిలో పట్టుకొని వచ్చి నవ్వుతూ ఇచ్చి అంతర్ధానమైనట్లు కన్పించెను. మరునాడు ఈ కల భర్తకి చెప్పింది నరసమాంబ, అది విని నరసింహశాస్త్రి సంతోషముతో “బహుశా నీకు సూర్య తేజస్సుతో పుత్రుడు కలుగును” అని అన్నాడు.

ఆమె అక్కడి నుండి వచ్చిన తరువాత గర్భవతి అయ్యెను. ఏడవ మాసము రాగానే ఆమెను పుట్టింటికి పంపి నరసింహశాస్త్రి ఇష్ట దేవతానుగ్రహమును సంపాదించుటకు కాశికి పోయెను. అక్కడ ఆయన కార్తీక మాసారంభము నుండి డుంఠి గణపతి ఆలయములో పగలు ఉపవాసము చేస్తూ పాలు మాత్రమే తీసుకుంటూ ఉండెను. ఒకనాడు మధ్యాహ్నమున రెండు గంటలకు “నవాక్షర గణపతి మంత్రం ” జపిస్తూ ఉండగా ఒక శిశువు గణపతి విగ్రహము నుండి వచ్చి అభిముఖముగా అంతర్ధానమైనట్లు ఆయనకు అనిపించెను. ఆ దేవుని అనుగ్రహమున తనకు పుత్రుడు కలిగి ఉంటాడని అనుకొని సంతోషించుచు ఆయన అత్తవారింటికి తిరిగి వచ్చారు. తన వద్దకు ఆ శిశువు వచ్చిన సమయముననే కార్తీక బహుళాష్టమి యందు ఆదివారము 17-11-1878 న పుత్రుడు కలిగాడని తెలిసింది. పుట్టిన బిడ్డ చుట్టూ దివ్యమైన తేజస్సు తనకు గోచరించెనని నరసమాంబ చెప్పెను. తమ యిష్ట దేవతల నామములతో దంపతులు ఆ పిల్లవాడికి ‘సూర్య గణపతి శాస్త్రి’ అని పేరు పెట్టారు.

దైవాంశ సంభూతుడయుడని చెబుతున్న ఆ బాలుడు దివ్య లీలలను ప్రదర్శింపక పోగా రోగగ్రస్తుడగుట అందరూ ఆ దంపతులను పరిహాసము చేయసాగారు. ఆరేళ్ళు వచ్చినా ఆ బాలుడికి మాటలు రాలేదు. ఎన్నో చికిత్సలను చేసి విసిగి తుదకు నొసటా, ఇతర నాడీ సంబంధమైన ప్రదేశాల్లో కాల్చిన లోహం తాకించి, అగ్నిస్పర్శ చికిత్స చేయించడంతో స్వస్థత చేకూరి, త్వరలోనే మాటలు వచ్చాయి. ఆరేళ్ళకు ఆయనకు అక్షరాభ్యాసం, ఉపనయనం చేశారు. కట్ట తెగిన సెలయేరులా వాక్ప్రవాహం మొదలయింది. ఆ పిల్లవాడు ఏకసంథాగ్రాహి. ఛందో, వ్యాకరణ, అలంకార శాస్త్రాలలో, కావ్య, ఇతిహాసాలలో నిష్ణాతుడయ్యాడు. బాల రామాయణమును, శివ సహస్రమును కంఠస్థముగా వచ్చాయి. పదేళ్ళకే గణితశాస్త్రములో, పంచాంగ గణనములో కూడా ఆశ్చర్యపరచే విద్వత్తు కనపరిచాడు. సిద్ధ జ్యోతిష్యుడని అందరూ అతనికి ప్రశంసించారు. అవధానాలలో కూడా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆ వయసులోనే ఒక్క గంటలో ముప్పై నాలుగు శ్లోకాలతో “పాండవ ధార్తరాష్ట్ర సంభవ” అన్న ఖండిక రాశారు.

గణపతి శాస్త్రికి మరొక తమ్ముడు, చెల్లెలు పుట్టాక, వారి తల్లి మళ్ళీ గర్భవతి అయ్యారు. అప్పుడామె “ఈసారి ఏ బిడ్డ పుడుతుంది?” అని గణపతిని అడుగగా “అమ్మా! ఈ సారి నీకు పుట్టిన శిశువు మృతి చెందుతుంది” అని జవాబిచ్చారు. ఆయన చెప్పినట్టే నరసమాంబకి కవల ఆడ శిశువులు పుట్టి మరణించారు, వారితో పాటే నరసమాంబ కూడా మరణించారు. మనసు వికలం చెంది గణపతి శాస్త్రి మౌన ముద్ర వహించి జడుడిగా మిగిలిపోయారు. అతని వాలకం చూసి ఇంట్లో వారు అతనికి ఎనిమిదేళ్ళు విశాలాక్షినిచ్చి వివాహము చేశారు.అప్పటికి గణపతి వయసు పన్నెండేళ్ళు. గణపతి శాస్త్రి భార్య నుద్దేశించి ‘మేఘ దూతము’ ననుకరించుచు ‘భృంగదూత’ మును రచించెను. కాని కాళిదాసుని కవిత్వమునకు అది చాల తక్కుగా నున్నదని దానిని చించివేశారు.

ఆమెకు యుక్తవయస్సు వచ్చిన తరువాత, కోడలును ఇంటికి తీసుకురావాలని నరసింహశాస్త్రి భావించారు. అయితే కొంతకాలం తపస్సు చేయాలని గణపతి అనుకున్నారు. ఈ విషయమై తండ్రికీ, కొడుకుకూ మధ్య వివాదం జరిగింది. చివరకు తాను ఏడాదిలో ఆరు నెలలు ఇంట్లో ఉంటాననీ, ఆరు నెలలు తపోయాత్రకు వెళ్ళడానికి తండ్రి, భార్య అంగీకరించాలనీ గణపతి షరతు పెట్టి ఒప్పించారు. విశాలాక్షి తనకు ఒకరిద్దరు కొడుకులు కలిగిన తరువాత తాను కూడా తపస్సు చేయుటకు భర్త అంగీకరింపవలయునని కోరినది. అత్తవారింటికి వచ్చి ఆమె భర్తవద్ద ‘మహాగణపతి మంత్రము’ను ‘శ్రీవిద్యాదీక్ష’ను తీసుకొనెను.

తండ్రి ఆశీస్సులతో మొదట ప్రయాగకూ, అక్కడి నుంచి కాశీకీ గణపతిశాస్త్రి వెళ్ళారు. కాశీలో ఉండగానే, దర్భంగా సంస్థాన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకుమార పండితునితో పరిచయం అయింది. గణపతి పాండితీ వైభవానికీ, ప్రజ్ఞాపాటవాలకూ ఆయన ఆకర్షితుడయ్యాడు. బెంగాల్‌లో ప్రసిద్ధ విద్యా కేంద్రమైన నవద్వీపానికి వెళ్ళి, విద్వత్‌ పరీక్షలో పాల్గొనాల్సిందిగా ప్రోత్సహించాడు. ఒక పరిచయ పత్రం, మందస రాజు ఆర్థిక సహాయంతో సహా అన్ని ఏర్పాట్లూ చేశాడు.

అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతి సంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న నవద్వీపం చేరుకొన్నారు. అమరావతి, నలందా, ఉజ్జయిని, నవద్వీపం మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ పేరుగడించిన విద్యాపీఠాలు. సకల శాస్త్రాలు అక్కడ బోధించేవారు. సరస్వతికి నాలుగు ముఖాలైన పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతో ఈ నాలుగు నగరాలు ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉండేవి. కాలక్రమంలో అమరావతి, నలందా, ఉజ్జయిని తమ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ, నవద్వీపం మాత్రం అప్పటికింకా ఉత్తరదేశంలో కాలు నిలదొక్కుకోగలిగింది. అక్కడి హరిసభలో ప్రతి సంవత్సరం పండిత పరీక్ష సభలు జరిగేవి. ఈ పరీక్షలో నెగ్గినవారికి, వారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదునిచ్చి సత్కరించేవారు. అప్పటికి, ఈ సభలకి దక్షిణ దేశం నుంచీ ఎవరూ పెద్దగా వచ్చేవారు కాదు. దక్షిణాది వాళ్ళంటే నవద్వీపవాసులకి కొంచెం చిన్నచూపు కూడా.

తన 22 వ ఏట ఈ పరీక్షకి హాజరయ్యారు గణపతి శాస్త్రి. ‘తికంఠ వాచస్పతి ‘ అనే మహా పండితుడు అప్పుడు సభాపతి. పరీక్షలలో పాల్గొనదలిచేవాళ్ల యోగ్యతలు పరీక్షించి, పరీక్షకి అనుమతి ఇవ్వవలిసిందీ వాచస్పతే. గణపతి కొంత కష్టం మీద వాచస్పతి దర్శనం సంపాదించేడు. తనకి శివకుమారుడిచ్చిన యోగ్యతా పత్రాన్ని వాచస్పతికి వినయంగా చూపించాడు. ఆ ఉత్తరంలో మెదటి వాక్యం – ” దేవాసుర సమీకేషు బహుశోదృష్ట విక్రమః ” అనుంది. ఇది రామాయణంలో హనుమంతుని యుద్ధపరాక్రమము దేవతా ప్రశంసనీయమని కీర్తించే శ్లోకం. అది చూడగానే, వాచస్పతి గణపతినింకేమీ ప్రశ్నలు అడగకుండానే, ప్రత్యేక పరీక్షకి అనుమతినిచ్చారు. మర్నాడు, తనే స్వయంగా గణపతిని సభామంటపానికి తీసుకొని వెళ్ళారు. ఆశుకవిత్వంలోనూ, శాస్త్ర సాహిత్యంలోనూ ఉత్తరదేశంలో తనంతవాడు లేడని కీర్తిగాంచిన అంబికాదత్తుడు పరీక్షాసంఘానికి అధ్యక్షుడు.

బాల్య చాపల్యంతో “కోసౌ మహాశయః” అని వాచస్పతిని ప్రశ్నించాడు. ఇంత గంభీరంగా దర్పంగా కనిపిస్తున్న ఎవరీ మహాశయుడు అని ఏమీ యెరగనట్టు అంత సమీపంలో అంబికాదత్తుడికి వినిపించేటట్టుగా అలా గణపతి అడిగేసరికి పాపం వాచస్పతి కాస్త తెల్లబోయాడు. అంబికాదత్తుడు సరసుడు, రసజ్ఞుడు. తొణకకుండా, గంభీరంగా చిర్నవ్వు నవ్వి: “సత్వర కవితా సవితా గౌడోహం కశ్చిదంబికాదత్తః “త్వరగా కవిత్వమును చెప్పగల సమర్ధుడను, గౌడుడను అని అంటూ, తన దేశ, నామ, సామర్థ్యాలు మూడూ గణపతికి చెప్పి, తెలివిగా శ్లోకంలో ఒక్కపాదమే చెప్పి, మీసం మెలివేస్తూ.. చిన్న చిరునవ్వుతో ….ఇక నీ పరిచయమేమిటి అన్నట్టుగా మిగతా సగభాగం చమత్కారంగా విడిచిపెట్టాడు.  

అది గ్రహించిన గణపతి తడుముకోకుండా వెంటనే “గణపతి రితి కవికులపతి రతిదక్షో దాక్షిణాత్యోహం” కవికులపతిని, గణపతి యను నామధేయం కలవాడను మహా ప్రజ్ఞ కలవాడను దాక్షిణాత్యుడను ఈ విధంగా తాను కూడా, తన దేశ, నామ సామర్థ్యాలు ఒక్క పాదంలోనే ఇమిడ్చి, అధ్యక్షుడికంటే తానే అధికుడినన్నట్టుగా “కవికులపతి” అంటూ ఒక చమత్కారబాణం విసిరి, అంతటితో ఊరుకోకుండా– భవాన్ దత్తః, అహంత్వౌరసః (నీవు అంబికకి దత్తుడివి మాత్రమే, కాని నేను సాక్షాత్తు అంబికకు పుత్రుడను) అని అంబికాదత్తుడి అహాన్ని రెచ్చగొట్టాడు కూడా.

సభలోని వారందరూ, వాచస్పతితో సహా – ‘ఎవడీ యువకుడు, సింహం జూలుపట్టి లాగుతున్నాడే, పర్యవసానం ఎరుగుదుడా’ అని నివ్వెరపోయారు. అంబికాదత్తుడు మాత్రం చలించలేదు. ఏమిటి “కవికులపతి” అన్న బిరుదు కాళిదాసాదులంతటి వారికి వర్తిస్తుంది. మీకు మీరే “కవికులపతి” అని సంభోదించుకుంటున్నారు సరే వెంటనే గణపతిని వేదిక మీదకి రమ్మని సంజ్ఞ చేసి, వెనువెంటనే నాలుగు సమస్యలు ఇచ్చి వాటిని పూరించమన్నాడు.

అవి:

1. ” స్తనవస్త్రం పరిత్యజ్య వధూః శ్వశుర మిచ్ఛతి ” (కింత్యనవద్యచరితా) (మామ గారిని చూసి నవ వధువు తన స్థన వస్త్రాన్ని విడచిపెట్టినదట)

2. వత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి (సంవత్సరంలో ఒక రోజు పార్వతి దేవి తన భర్త శివుని ముఖమును చూడదట)

3. సూర్య శశాంకేన సమం వినష్టః (నత్వమవాస్యా) (సూర్య చంద్రులు ప్రభావం అగుపించదు అమావాస్య కాదు సుమా)

4. పిపీలికా చుంబతి చంద్రమండలమ్ (చీమలు చంద్రమండలాన్ని చుంబించాయట.)

సమస్య ఇచ్చిన మరుక్షణంలోనే గణపతి, ఆ నాల్గిటిని పూరించి తన ప్రతిభ చాటాడు.

ఆ పూరణలేమిటంటే :

1. ” హిడింబా భీమదయితా నిధాఘే ఘర్మపీడితాస్తనవస్త్రం పరిజ్యత్యా వధూ శ్వశుర మిచ్ఛతి “

భీముని భార్యయగు హిడింబ ఉక్కకోర్వలేక, తన మామగారైన గాలినిచ్చగించి స్తనవస్త్రమును విడిచెను అని అర్థం.

అంబికాదత్తుడు “హిడింబయే ఏల ద్రౌపది కాకూడదా?” అన్న దానికి గణపతిముని “ఇక్కడ ద్రౌపదిని గాక హిడింబని చెప్పటంలో చాలా ఔచిత్యం ఉంది. దీనికి రెండు కారణాలు.. మెదటిది భీముడు వాయుపుత్రుడు అందువలన హిడింబకు వాయు దేవుడొక్కడే మామగారు. ద్రౌపది ఒక్క భీమునికేగాక పాండవులందరికీ ఇల్లాలు. అదీగాక, ద్రౌపది రాచకన్య, కాబట్టి స్తనవస్త్రం పరిత్యజ్య అని ద్రౌపదినుద్దేశించి చెప్పటం అంత ఔచిత్యం కాదు. హిడింబ రాక్షస కన్య తనకు నాగరికత సంబంధ సిగ్గు ఎగ్గులు ఆమెకు తెలియదు ” అని సమాదానమిచ్చాడు.

2. రెండవ సమస్యకు “చతుర్థ్యాం భాద్ర శుక్లస్య చంద్ర దర్శన శంకయావత్సరస్యైకదా గౌరీ పతివక్త్రం న పశ్యతి” అని చెప్పారు.

భాద్రపద శుద్ధ చవితినాడు (వినాయక చవితినాడు), శివుడి తలపైనున్న చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగునేమోనని శంకచే, సంవత్సరమున కొక్కసారి గౌరీదేవి తన పతి ముఖాన్ని చూడదు.

3. మూడో సమస్యకు “రాహుస్త్రీ కోణే చ గురుస్తృతీయేకళత్ర భావే చ ధరా తనూజఃలగ్నే చ కోష్ఠే యది బాలకః స్యాత్సూర్య శశాంకేన సమం వినష్టః ” అని పూర్ణం చెప్పారు.

పంచమ, నవమ స్థానములలో నొకదాని యందు రాహువు, తృతీయమునందు గురువు, కళత్ర స్థానమునందు కుజుడు ఉండగా పుట్టిన బాలునకు లగ్నమందు సూర్యచంద్రులున్ననూ అరిష్టముండును

4. ఇక నాల్గవ సమస్యకు “సతీ వియోగేన విషణ్ణ చేతసఃప్రభో శయానస్య హిమాలయే గిరౌశివస్య చూడా కలితం సుధాశయాపిపీలికా చుంబతి చంద్ర మండలం” అని చెప్పారు…

దక్ష యజ్ఞమందు సతీదేవిని కోల్పోయి, విషణ్ణ చేతస్కుడై, శివుడు హిమవన్నగముపై పడుకొని యుండగా, అతని శిరోభూషణమైన చంద్రుడు భూమికంటియుండెను. అదే సమయమని యెంచి, చంద్రునియందున్న అమృతాన్ని అందుకోవాలనే ఆశతో చీమలు చంద్రమండలమును చుంబించెను.

కాసేపు వాగ్వివాదం, వ్యక్తిగత దూషణలను అయిన పిమ్మట సభలో పండితుల ఆజ్ఞ మేరకు సాహిత్య వృత్తాంతములచే వాదముపసంహరించారు ఇరువురు.

అంబికాదత్తుడు “భటోఖిలోట్టో పరివారవధ్వానిపీయ మధ్వారభతే విహారం” భట్టులందరు అనగా దక్షిణాత్యులు మేడలపై వేశ్యలతోగూడి మద్యపానమును చేసి విహరింతురు

గణపతి “అసువ్యయో వాస్తువ్యయో వాప్య మీ న మీన వ్యసనం త్యజంతి”

అనగా ప్రాణము పోయిననూ సరే, డబ్బుపోయిననూ సరే మీ మీన వ్యసనమును మాత్రము విడువరు. గణపతి ఇలా శ్లోకం పూరించగానే, ఆనందం పట్టలేక అంబికాదత్తుడు ఆసనం మీదనుంచి లేచి వచ్చి గణపతిని కౌగలించుకొని, అతని నిరర్గళ కవితాపటుత్వానికి మెచ్చుకొని సంతోషం వెలిబుచ్చాడు.

గణపతి తాను వాదధోరణియందు చూపిన దూషణాపరాధమును మన్నించమని సవినయంగా వేడుకొన్నాడు. దానికి అంబికాదత్తుడు నవ్వుతూ” నీ మీనద్వయమే నీ అపరాధాన్ని తుడిచిపెట్టిందని పరిహసించాడు (మీనద్వయమనగా అ+మీన+మీన అని రెండు మీనములను బహూకరించుట. నిజానికీ పద విభాగం అమీ+న+మీన.. అని ఉంటుంది)

అప్పుడు మిగిలిన పరీక్షావర్గం వారు, గణపతినింకా పరీక్షించగోరి, భారతమందు పదునెనిమిది పర్వముల సారమునూ పర్వమునొక్కొక్క శ్లోకము చొప్పున పదెన్నిమిది శ్లోకములను చే, అపి, హి, తు, చ అను పదములను ప్రయోగించకుండా చెప్పమని అడిగారు. అడిగిన వెంటనే, ఆశువుగా గణపతి పదునెనిమిది శ్లోకములతో భారతకథా సారమంతా మనోహరంగా చెప్పి, పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేడు.

నవద్వీపచరిత్రలో ఒక ఆంధ్రుడు గెలుపొందడం ఆ కాలంలో అదే మొదటిసారి. పరీక్షావర్గం గణపతికి ‘కావ్యకంఠ’ అనే బిరుదుతో పాటుగా ఒక శ్లోకం బహుమానంగా ఇచ్చి సత్కరించారు.

“ప్రాచీనై స్తైః కవికులవరైః కాళిదాసాదిభిర్యాలబ్ధా కీర్తి దను గతా సైవ భూయ దిదానాంసద్భిర్దత్తోయ ఇహ రుచిరః కావ్యకంఠోపహారఃతేవ శ్రీమానిహ భువి భవానుజ్జ్వల శ్చాపి భూయాత్” (ప్రాచీనులగు కాళిదాసాది కవివర్యులెట్టి కీర్తిని పొందిరో, వారి ననుసరించిన నీచే నట్టి కీర్తి యిప్పుడు పొందబడెను. ఇక్కడ సత్పురుషులచే మనోహరమగు కావ్యకంఠ బిరుదమేది యొసగబడెనో, ఆ బిరుదమువలన నీవీ భూలోకమందు శ్రీమంతుడవై ప్రకాశింతువు గాక !)అప్పటినుండి, గణపతి శాస్త్రి ‘కావ్యకంఠ గణపతిముని’గా ప్రసిద్ధి కెక్కారు.

మంత్ర, ధ్యానాలలో స్త్రీ, పురుష, వర్గ భేదాలు అసంబద్ధమనీ, సామాజిక, ఆర్థిక రంగాలలోనే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో సైతం మహిళలకు సమాన హక్కులు ఉండడమే వేద సంప్రదాయమనీ గణపతి శాస్త్రి చెప్పేవారు. దళితులకు మంత్ర దీక్షలు ఇచ్చారు. పరదేశీయుల పాలనలో ఉన్న దేశ విముక్తి కోసం ఆయన ఎంతగానో తపించారు. ‘ఉమాసహస్రం’, ‘ఇంద్రాణీ సప్తశతి’ తదితర స్తోత్ర గ్రంథాలలో సైతం జాతీయ భావాలను చొప్పించిన విలక్షణ దేశభక్తుడాయన. హైదరాబాద్‌లోని ఆది హిందూ సంఘం ప్రతినిధులు ఆయనను మాడపాటి హనుమంతరావు గారి ఇంటి నుంచి పల్లకిలో ఊరేగిస్తూ, వారి హాస్టల్‌కు తీసుకువెళ్ళి, ‘ముని’ అనే బిరుదుతో సత్కరించారు. 1923 డిసెంబరులో కాకినాడలో నిర్వహించిన కాంగ్రెస్‌ మహాసభలలో బులుసు సాంబమూర్తి గారి ఆహ్వానంపై గణపతి ముని పాల్గొని, మహిళల హక్కులపై అద్భుతంగా ప్రసంగించారు. 1924లో మహాత్మా గాంధీ అధ్యక్షతన బెల్గాంలో జరిగిన సభలో, ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్‌ అధ్యక్షుని హోదాలో పాల్గొని, అస్పృశ్యతను తీవ్రంగా ఖండించారు. అది శాస్త్ర సమ్మతం కాదని గణపతి ముని ఇచ్చిన వివరణకు గాంధీ ఎంతో సంతోషించారు. అయితే, సంస్కృతాన్ని జాతీయ భాషగా చెయ్యాలని కోరుతూ గణపతి తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలిసి, గాంధీ ఆయనను వారించారట. రాజకీయాలతో జోక్యం పెట్టుకోవద్దని చెప్పారట.

తపస్సే గణపతి ముని ప్రధాన లక్ష్యం. దానికోసం వివిధ క్షేత్రాలను సందర్శించడం మొదలుపెట్టారు. ఆ యాత్రల్లో భాగంగా తమిళనాడులోని తిరువన్నామలై (అరుణాచలం) చేరుకున్నారు. అక్కడ తన సమవయస్కుడొకరు ‘బ్రాహ్మణ స్వామి’గా మన్ననలు అందుకోవడం గమనించారు. 1907 నవంబరు 18వ తేదీన, విరుపాక్ష గుహ బయట ఒక రాతి మీద కూర్చొని ఉన్న బ్రాహ్మణ స్వామిని కలుసుకొని, నమస్కరించారు. “నా సాధనలో ఏదో లోపం ఉందనిపిస్తోంది. జప, తప, సాధనలు ఎన్ని చేసినా తపస్సు స్వరూపం నాకు తెలియడం లేదు. దయచేసి మీరు చెప్పాలి” అని ప్రార్థించారు.

” ‘నేను’ అనే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తోందో విచారిస్తే, మనసు అందులో అణిగిపోతుంది. అదే తపస్సు, మంత్ర, శబ్దోత్పత్తి ఎక్కడ జరుగుతోందో గమనిస్తే మనసు అందులో లీనం అవుతుంది. అదే తపస్సు!” అని బ్రాహ్మణ స్వామి వివరించారు. తన సుదీర్ఘ అన్వేషణ ఆనాటితో సమాప్తం అయిందని గణపతిశాస్త్రి భావించారు. బ్రాహ్మణ స్వామి అరుణాచలం చేరినప్పటి నుంచీ (1896 సెప్టెంబరు 1) మౌనంగానే ఉండేవారు. మొదటిసారిగా మౌనం వీడి మాట్లాడింది గణపతిశాస్త్రితోనే!

‘భగవాన్‌ శ్రీ రమణ మహర్షి’ అనే మకుటంతో అయిదు శ్లోకాలతో ‘శ్రీ రమణ పంచకా’న్ని గణపతి శాస్త్రి రచించి, గురు దక్షిణగా బ్రాహ్మణస్వామికి సమర్పిస్తే, ఆయన “సరే నాయనా!” అని అన్నారు. అప్పటి నుంచి బ్రాహ్మణస్వామి ‘శ్రీరమణ మహర్షి’గా, గణపతిశాస్త్రి ‘నాయన’గా ప్రసిద్ధులయ్యారు. తనకు అంతటి గొప్ప గురువును ప్రసాదించినందుకు కృతజ్ఞతగా నాయన ‘ఉమాసహస్రం’ రాసి అమ్మవారికి సమర్పించారు. ఆరుణాచలంలో ఉన్నప్పుడే నాయనకు కపాల భేదన సిద్ధి కలిగింది. అప్పుడు ఆయనకు కలిగిన తాపాన్ని శ్రీరమణులే ఉపశమింపజేశారు.

కావ్యకంఠ గణపతి ముని అనేక గ్రంథాలను రచించారు. “పరీక్ష” అనే పరిశోధన గ్రంథం, సంస్కృతంలో ‘పూర్ణ’ అనే నవల, ‘దశ మహావిద్యలు’, ‘ఉమాసహస్రం’, ‘ఇంద్రాణీ సప్తశతి’, ‘రేణుకా స్తోత్రం’, ‘అంబికా స్తోత్రం’, ‘శ్రీ రమణగీత’, ‘భారత చరిత్ర’, ‘ఋగ్వేద సంహిత’ (అసంపూర్ణం), మొదలైనవి రచించారు. “వేదాలు పౌరుషేయాలే! అంటే అతీంద్రీయ ద్రష్ఠలైన మహర్షులు రచించిన గ్రంథాలు వేదాలు!” అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.

అది 1935 వినాయకచవితి. ఆ రోజున అనూహ్యమైన అపశ్రుతి చోటు చేసుకుంది. గణపతి విగ్రహానికి కాకుండా గణపతిశాస్త్రికి పూజ చేస్తామని, దానికి అంగీకరించాలనీ భక్తులు గణపతి మునిని వేడుకున్నారు. అయిష్టంగానే ఆయన దానికి అంగీకరించారు. పూజ చక్కగా జరిగింది. కానీ అలవాటు చొప్పున పురోహితుడు ఉద్వాసన మంత్రం కూడా చెప్పేశాడు. అది గమనించి ఆయన నవ్వుకున్నారట. 1936 జూలై 25న శిష్యులు ఎప్పటిలాగానే శనివార హోమానికి వచ్చారు. నాయన కూడా హోమంలో పాల్గొన్నారు. తరువాత శిష్యులను పంపేసి, మంచం మీద పడుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం రెండున్నర గంటలకు అనాయాసంగా శరీరాన్ని వదిలి, అనామయ లోకానికి వెళ్ళిపోయారు.

‘నాయన’ దేహ పరిత్యాగం గురించి విన్న శ్రీ రమణులు గద్గద స్వరంతో “అటువంటి వారు మనకెక్కడినుంచి వస్తారు” అన్నారు.

అపారమైన పాండిత్యం, దేశ విముక్తి కోసం ఆరాటం, సంఘసంస్కరణాభిలాష, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం తపన… ఇవన్నీ కలగలసిన విశిష్టమైన వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని. శ్రీరమణ మహర్షికి సన్నిహిత శిష్యునిగా, బహు గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధుడు. శ్రీ రమణ మహర్షిని మొదట ఆ పేరుతో పిలిచినవాడు, మౌనాన్ని ఆశ్రయించిన ఆయనతో మాట్లాడించినవాడు, ‘నాయన’గా ప్రసిద్ధి కెక్కినవాడు… శ్రీ కావ్యకంఠ గణపతి ముని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here