Site icon Sanchika

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-1

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

‘మంకుతిమ్మన కగ్గ’ గురించి:

[dropcap]శ్రీ [/dropcap]డి.వి.జి.గారు రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ తొలిసారి 1943లో ప్రచురితమైంది. కన్నడ సాహిత్యంలో దీనినొక మాస్టర్‍పీస్‍గా పరిగణిస్తారు. దీనికి ‘కన్నడ భగవద్గీత’ అని కూడా పేరు ఉంది. కగ్గలో 945 పద్యాలున్నాయి. కన్నడ జనసామాన్యంలో ఈ పద్యాలు అత్యంత ప్రసిద్ధికెక్కాయి. నాలుగు పాదాలుండే ఈ పద్యాల సందేశం ‘సమత్వం’.

కగ్గ జీవితపు లోతైన ప్రశ్నలను అన్వేషిస్తుంది, అంతిమ సత్యమంటే ఏమిటని ఆలోచిస్తుంది. సంక్లిష్టమైన, నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో సంతులిత జీవితాన్ని గడపమని సూచిస్తుంది. కగ్గలోని అనేక పద్యాలు హాయిగా పాడుకునేలా ఉంటాయి.

డి.వి.జి పరిచయం:

కన్నడ సాహిత్య రంగంలో డి.వి.జి.గా ప్రసిద్ధులైన శ్రీ దేవనహళ్లి వేంకటరమణయ్య గుండప్ప కోలారు జిల్లా ముళ్ళబాగల అనే ఊరిలో 17.3.1887న జన్మించారు. తండ్రి వెంకటరమణప్ప, తల్లి అలివేలమ్మ. భార్య భాగరతమ్మ. కుమారుడు బి.జి.ఎల్. స్వామి. కుమార్తె ఇందిర. డి.వి.జి.గారు గోఖలే ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ సంస్థాపకులు. 7.10.1975న స్వర్గస్థులయ్యారు.

మెట్రికులేషన్ వరకు చదివిన డి.వి.జి గడిపినది అతి సరళమైన సాధారణ జీవితం. కవిగా, విమర్శకుడుగా బహుగ్రంథకర్తగా వాసికెక్కినారు. వీరు రచించిన కావ్యాలు అనేకం; సంపాదించిన పురస్కారాలు, గౌరవాలు లెక్కకు మిక్కిలి.

వీరు రచించిన పుస్తకాలలో మణిపూసగా చెప్పదగినది, కన్నడిగుల భగవద్గీతగా పేరొందినది ‘మంకుతిమ్మన కగ్గ’. దీనికి అపారమైక ప్రాచుర్యం, ఇతర కన్నడ సాహితీవేత్తల పొగడ్తలు లభించాయి.

వీరి ఇతర రచనలు: వసంత కుసుమాంజలి, అంతఃపుర గీతె, జీవన సౌందర్య, సాహిత్య శక్తి, విద్యారణ్య విజయ, తిలోత్తమ, కనకాలోక, మాక్బెత్ (కన్నడ అనువాదం), దివాన్ రంగాచార్యుల వారి జీవితచరిత్ర (ఆంగ్లంలో), గోపాలకృష్ణ గోఖలే, మైసూరు దివానుల చరిత్ర, పురుష సూక్తం, ఈశోపనిషత్తు మొదలగునవి.

లభించిన గౌరవాలు – పురస్కారాలు:

1969లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి పుశస్తి. 1970లో కర్నాటక ప్రభుత్వం వీరి సాహితీ సేవకు గాను లక్ష రూపాయల నగదు బహుమతి ప్రకటించింది.

1974లో పద్మ భూషణ్ పురసాగ్రం అందుకున్నారు. 1982లో కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1988లో భారత ప్రభుత్వం వీరి సాహితీ సేవలను పురస్కరించుకొని 6 పైసల తపాలా బిళ్లను విడుదల చేసింది. మైసూరు యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

అనువాదకుని మాట:

మొట్టమొదటిగా నేను సంచిక డాట్ కామ్ సంపాదక వర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను తెలుగులోనికి అనువదించిన కన్నడ కథలను 15 రోజులకు ఒకసారి తప్పక వారి అంతర్జాల పత్రికలో ప్రచురిస్తూ వచ్చారు. అటు తరువాత నా అనారోగ్య కారణంగా కొన్ని నెలల పాటు అనువాదకథలని పంపలేకపోయాను. దైవ కృప వల్ల ఆరోగ్యవంతుడనై మరలా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాను.

కొన్ని సంవత్సరాల క్రితమే నేను శ్రీ డి.వి.జి. గారి ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోనికి అనువదించి ఉంటిని. కాని ఏ పత్రికకు పంపనైతిని. ఈసారి సంచిక డాట్ కామ్ వారిని సంప్రదించి వాటిని ప్రచురింప గలరేమోనని, అనువదించిన కొన్నింటిని మాత్రం వారి పరిశీలనకు పంపియుంటిని. “మీరు అనువదించిన వాటిని, డి.వి.జి. గారి సంక్షిప్త జీవిత చరిత్రను వ్రాసి పంపించండి,” అని జవాబు ఇచ్చారు. ఎనలేని సంతోషం కలిగింది. వారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే ఇప్పుడు మీ ముందున్న ఈ అనువాద రచన. సంచిక సంపాదక వర్గానికి మరొక్కసారి కృతజ్ఞతలు.

అనువాదం ఓ క్లిష్టతరమైన ప్రక్రియ. పనస పండును కోసి, చేతికి నూనె రాసుకుని, పనస తొనలను విడిపించే తీరుగా. కొన్ని తొనలు సులభంగా వీడి వస్తాయి, కొన్ని చేతి నుండి జారి ఆవలి వైపున పడతాయి, ఇంకొన్నింటిని అతి కష్టం మీద వేరు చేయాల్సి వస్తుంది. అనువాదకుడికి రెండు భాషలపైన కొంచెం పట్టు ఉండాలి. ఈ అనువాదకుడు పదహారణాల తెలుగువాడు. కన్నడ భాష పైన కొంతమేరకు పట్టు ఉన్నవాడు. అనువాద ప్రక్రియలో అనుసరించిన విధానం స్వేచ్ఛానువాదం. భావమునకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రాస నియమం పాటించబడింది.

కన్నడ భాషలోని అనేకమైన కథలని తెలుగులోనికి అనువదించిన అనుభవం  ఉంది. తెలుగు పత్రికలైన విపుల, ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రదేశ్, సాహితీ కిరణం  లలో ప్రచురితమైనవి. వాటిలో 17 కథలని ‘కన్నడ కుసుమాలు తెలుగు కోమలాలు’ అనే పేరుతో కథా సంకలన పుస్తకాన్ని ముద్రించటం జరిగింది.

అంతేకాక తెలుగు కథలని కన్నడ భాషలోనికి అనువదించి కన్నడ వార పత్రికలైన ‘మంగళ’, ‘ప్రియాంక’ లలో ప్రచురింపజేసితిని. – కల్లూరు జానకిరామరావు.

~

1.
ఆదిదేవుడు, సర్వేశుడు, మాయాలోలుడు
ఆది మూల భూతము, కానుపించని ఆ హరియ
ఆది పురుషుడని నమ్మి జనులు కొనియాడెడి
ఆ దివ్య చరితమూర్తికి దండమిడరా – మంకుతిమ్మ

2.
అదేదో యూహకందని యనూహ్య అవ్యక్త శక్తి తా
నదేదో జీవ జడరూపమై నిండి
నిద్ధరణి నావరించి నడిపించుచున్న
యా దివ్యశక్తికిని దండమిడు – మంకుతిమ్మ

3.
ఉన్నదో, లేదో తెలియని వస్తువొకటి నిజమై
తన మహిమ చేత యది జగమై – జీవమై
యున్నదది: సత్యమై, నిత్యమై, శాశ్వత
మైన, యా రహస్య తత్త్యమునకు శరణు – మంకుతిమ్మ

4.
జీవనంపు యర్థమది యేది? ప్రపంచార్థ మది యేది? ఈ
జీవ ప్రపంచముల సంబంధ మది యేది?
భావ గోచరమైన పదార్థ మది యేది?
భావములు కందని యా జ్ఞాన శక్తి యదేది – మంకుతిమ్మ

5.
దేవుడనగ చీకటి యావరించిన బిలమా?
కాదేని, మన యూహ కందని నామమా
ఆదుకొనెడి వాడు లేడేని ఈ జగమెట్లు నడచు
ఏది చావు పుట్టుకల అంతరార్థము – మంకుతిమ్మ

6.
ఓ పొడుపు కథ ఈ సృష్టి; ఈ జీవనపు అర్థమదేమొ
ఈ పొడుపు కథను అర్థవంతంబుగ విప్పిన దెవ్వరొ?
ఈ పొడుపు జీవనమును సృష్టించిన ఆ చేయి
ఈ పలు విధ జీవన రీతుల సృష్టించిన దెందుకో – మంకుతిమ్మ

7.
కథానాయకు డెవ్వడొ ఈ బ్రతుకు కథకు. ఒక్కడో పెక్కురో
విధియో, పురుష ప్రయత్నమో; ధర్మమో, అంధ బలమో;
కుదురెయ్యది ఈ యస్తవ్యస్తపు జీవనమునకు; న
య్యది, యమో మయమున యుండిపోవునేమో- మంకుతిమ్మ

8.
రీతి నీతులున్నటుల కనుపించవు ఈ సృష్టికి
మతి భ్రమించుచునుండునేమో ఆ సృష్టికర్తకు అపుడు నపుడు
తన సృష్టిపై తనకే ప్రేమానురాగాలు లేవని అనిపించు
లేని యెడ జీవులీ రీతి శ్రమ పడనేలనో – మంకుతిమ్మ

9.
ఏమిటి భైరవ విన్యాసమీ విశ్వభ్రమణము?
ఏమి ఈ భూతాల నర్తనోన్మాదము
ఏమి ఈ అగ్నిగోళాలు; వీటి అంతరార్థ మదేమో
ఏమి విస్మయ మీ సృష్టి – మంకుతిమ్మ

10.
ఏమి ప్రపంచమిది? ఏమీ బాహాబాహి
ఏమి ఈ అద్భుత యపార నిర్ఘాతము; మానవ లక్ష్య
మేమి? విలువ యదేమి? అంత్యమేమి?
ఏమి అంతరార్థమో తెలియరాదు – మంకుతిమ్మ

(ఇంకా ఉంది)

Exit mobile version