Site icon Sanchika

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-10

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
91.
కమల మది తొలిసంధ్య వికసించి, మలిసంధ్య ముకుళించు
సుమ మీరీతి మరి మరి వికసించి ముకుళించు
అమిత వికసిత ముకుళితా వర్తనా
క్రమమే ఈ విశ్వపు చరిత్ర – మంకుతిమ్మ!

92.
ఎచటి నుండియో, కనుచూపు మేరకందని దూరాల నుండి
వీచుచున్నది నిగూఢ యనంత మది తరంగముల రీతి
వీచి విస్తరించు చున్నదది నూతనత్త్వమును
నిచ్చలు ఎడ తెరపి లేక – మంకుతిమ్మ!

93.
జ్వాలా మాలాకుల జగద్రూప తాండవ
లీల యది పరబ్రహ్మ యాడెడి యాట
తాళ లయబద్ధమై యొకసారి, రభసమ్మున నొకసారి తన
లీలల ప్రకటించు నీ పరబ్రహ్మ – మంకుతిమ్మ!

94.
లీలాకేళి మాయ యిది, తలపింప జేయు నర్తనమని
మూల మవగతమైన వానికి, తొలగు మాయా విభ్రాంతి
లోలోతుల నిర్లిప్తుడై, పైపైకి బద్ధుడై యగుపించెడి
లీలా ప్రియుడు కాడె బ్రహ్మ – మంకుతిమ్మ!

95.
శ్యామ సుందరుడు వాడే, చక్రియు, నరహరియు
సోమ శంకరుడు వాడే, భైరవుడూ వాడే
హైమవతియు నామెయే, కాళి, చండియు నామెయే
ప్రేమ ఘోరాలు రెండునూ ఒక్కటే – మంకుతిమ్మ!

96.
సత్యమనగ నేది ఈ బ్రహ్మండ నాటక రంగమున
నృత్యించవే కడలి తరంగాలవి సత్యంబుగాదె
మిథ్య యనునదే మిథ్య – జగన్నాటకమే సత్యము
కృత్యమిది బ్రహ్మది – మంకుతిమ్మ!

97.
ధర్మమన్న నదేమి? కర్మయన్న యదేమి?
బ్రహ్మండపు కథ యదేమి? జీవితమన్న యదేమి?
బ్రహ్మమే మూల మన్నింటికిని – మాయయూ దీని సృష్టియే
బ్రహ్మయే జీవనము – మంకుతిమ్మ!

98.
వక్ర, ఋజుమార్గముల మిశ్రమమే ఈ జగము
స్వర, అపస్వర మిశ్రమములే రాగంబులు; సం
స్కార, కుసంస్కారముల మిళితమే ఈ వ్యవస్థ
సక్రమ మదేదియో తెలిసి నడవ ధర్మమది – మంకుతిమ్మ!

99.
జలనిధి యంచున నిల్చి నిరువైపుల వీక్షింప
యలల చలనాచలన రీతుల యసమానత లగుపించు
కలసి యున్నవీ యసమానతలీ మాయా జగంబున
మిళితములై యుండిననే రుచి – మంకుతిమ్మ!

100.
అవదితాఖండ సత్త్వమపారమది జలధిలోన
భువనంపు ద్వీపము కించిన్మాత్రమే విదితము
పవిత్ర యంతరంగాత్మకు రెండునున్ యొక్కటే
అవగుంఠితుడా బ్రహ్మ – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version