[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
121.
తను, మనంబులు రెండును పరమాణు సంధానంబులె
వీని నర్తింప జేయు నో తృతీయ శక్తి
తృణపు హరితము, రిక్కల తళ్కుల గుట్టు
ల, నీవన్వేషింపుము నాయాసపడక – మంకుతిమ్మ!
122
మరల పెంపుజేయు తన కులమున్ ప్రతి జీవియు చావునాశింపక
మరల చిగురించు ఎండి మోడైన తృణము
నరులు మరణింతురు సంతాన మది నిల్చియుండు
తిరంబుగ, నుపశమించదీ సత్త్వమెన్నటికి – మంకుతిమ్మ!
123.
ఇడుములవి ఎన్ని వచ్చినన్, తా తెలిసి తెలిసి ఎంచి
విడువక మరల నాహ్వానించి కడు సాహసించు
వీడడు యూరకుండ నోపడీ నరుడు
వీడని స్వభావమిది – మంకుతిమ్మ!
124.
మౌనంబున, సంభాషణంబున, హాస్యంబున, గానంబున
ప్రణయంబున, వీర విజయ విహార మందున
మనంబున కాహ్లాదంబును కల్పించుకొనుచునుండు
మానవుండు యాతని ఆత్మగుణమది – మంకుతిమ్మ!
125.
సచ్చిదానంబులాత్మ స్వభావంబులు
అచ్చపు మాయ, యది దాని గప్పియుంచు
ఇక్షువోలె జీవంబు, గానుగ వోలె జగన్మాయ
అచ్చపు గానుగ ఇల్లే జగము – మంకుతిమ్మ!
126.
ఎద్దాని సొగసైన దని, ఇంపైనదని జగంబు మెచ్చు న
య్యది క్షణభంగురమే, యయ్యవి సంపూర్ణంబులు గావు, యయ్యా
నంద భరిత సొగసుల పరిపూర్ణాకృతి, యా
విధాతదే గాని వేరేది? మంకుతిమ్మ!
127.
శివ సౌఖ్య సౌందర్య పరిపూర్ణుడు, విరించి యొక్కడే,
భువన జీవంపు జలధి యూర్మికోటిపై ప్రసరించిన యా
శివకరుణ ప్రతిచ్ఛాయ విలసిల్లిన మాత్రన చాలు
జీవంపు మాధుర్య కణంబది చాలదే – మంకుతిమ్మ!
128.
మొదలేది, తుదియేది చలించెడి ఈ సృష్టి చక్రంబున
పదిలముగ నున్నవి యూపిరులు రెండున ఒకటియై, ని
య్యది యోగుల కైనను సమములే కద యెంచి చూడ
కాదే ఈ జవంబు కొలిమితిత్తి కరణి – మంకుతిమ్మ!
129.
నీరమది పైనుండి బడి భువి నీటన గలసి పోవు రీతి
నరుడి ప్రాచీనతకు నూతనత్వము కలసి యొకటై
బరగు చున్నదీ విశ్వజీవన లహరి యనవరత
చిరు ప్రయత్న నూతనమీ జగము – మంకుతిమ్మ!
130.
రామ, భీమసేనుడు నడచిన నేలయు, యూపిరులు –
వ్యోమ మందుండి భగరథుతోడ నడచి వచ్చిన సురనదియు,
సోమునకున్ జనన మిచ్చిన సుదాబ్ధి, యన్నియున్ పురాతనమన్న
నీ మనుజుల దెట్లు నూతనమో – మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)