తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-15

0
2

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
141.
అదె సూర్యుడదె చంద్రుడు డదె భూమి యదె నీరు
అదే హిమాచల మదియె గంగ యదియె వంశ చరితము
ఇందేనిని విస్మరించెదవో – యన్నియు సనాతనములే
కాదేనిని విస్మరింప, వాట నూతనత్వము లేదే – మంకుతిమ్మ!

142.
మూల వస్తువొకటి తన లీల కొఱకు నూరారు రూపంబుల దాల్చి
కాలంపు దృష్టికది యనేకమై కన్పించు, నంతియకాని
స్థూలముగ పరికింప నయ్యది ఒక్కటియ కాదె, దీని
దెలిసి నీవు సాగింపు జీవనము – మంకుతిమ్మ!

143.
ధాత్రిని కళ్యాణ మంటపము వోలె సింగారించి
క్షాత్ర తేజమును నరుల హృదయంబుల నింపి
కృత్రిమత్త్వము నెడయెడ సృజించి, నవ్వెడి వగలాడి
చిత్రకారిణి ఈ మాయ – మంకుతిమ్మ!

144.
వాయువు కార్య మెఱింగిన వారమే కాని దాని గాంచిన వారెవరు?
మాయయును యంతియె, యది చేయుపని యగుపించు
రాయని కాన వీలులేక సచివు నర్థించు చందాన
మాయదే పైచేయి యగు – మంకుతిమ్మ!

145.
మాయ, యది జాణ, జాణతనమది లేని నిర్గుణత్వము శూన్యమే
మాయ లేక నూహింప నగునె జగంబును, జీవనంబును
మాయ మహిమ గణుతింప సాధ్యమే, విధాత ఛాయ యయ్యది
మాయయే మాత, నీవామె శిశువు – మంకుతిమ్మ!

146.
ముదిరాజు దశరథుని కీలు బొమ్మగ జేసి
ముదిత కైకేయి కోసలమును పాలించ
లేదె; మాయ యాడించు యా పరబ్రహ్మమునే
గాదు, మనలను గూడ – మంకుతిమ్మ!

147.
మాయ, యతిశయ ప్రేమాభిమానముల కురిపించు,
గాయముల మాన్పి ఇష్టార్థములనిచ్చు; పడ
ద్రోయు పాతాళమున నొక్కొక తఱి; నీ వెరుగలేవు
మాయ యది పూతన పగిది – మంకుతిమ్మ!

148.
ప్రకృతికిన్ విరుద్ధంబుగ నుండు నరుడెవ్వడీ జగాన?
స్వకృతి యనునది తానెద్దియు లేదు ప్రకృతి లేక
సుకృతము నీయది ప్రకృతి నీ వశవర్తి యైన
వికృతికి గురికాబోకు – మంకుతిమ్మ!

149.
దొర కాదొకండు, మన జీవనము నేలువారు మువ్వురు.
నర, కర్మ, దైవంబులు; పొరపాటు లుండుట సాజము
గురిలేని, ఆది, తుది లేని ఈ దర్బారు నందు
సరి యదేదో కానిదేదో – మంకుతిమ్మ!

150.
దొరలు మువ్వురున్న తరి, సరిపోవునే కార్యములవి
పొరపొచ్చములు లేక, హెచ్చు తగ్గులుండుట సాజంబుగాదె
చేరునవన్నియు చేరనిమ్ము, వచ్చున వన్నియు రానిమ్ము
అరయ వగవబనియేమి? – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here