Site icon Sanchika

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-18

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
171.
నేడు పెళ్లివిందు, రేపు వైకుంఠ తిథి
నేడు మృష్టాన్నపు భోజన సుఖము; రేపు భిక్షాన్నము
నేడు ఉపవాసము, రేపు పారణమని ఎటులో
ఒడగూడు యన్నంపు ఋణము – మంకుతిమ్మ!

172.
అరి, మిత్ర, సతి పుత్ర, బాంధవ జనం బెల్ల
కర్మపు యవతారంబులో, ఋణశేషంబులో
గొర్రెం జేసి నిను కాపుకాయుచున్న యీ సంసారంబు, నీ
కురిం బిగించెడు మిత్తికానోపు – మంకుతిమ్మ!

173.
బంధు వర్గమది మారు వేషంబున నున్న ఆ అంతకుని సైన్యమే; వా
రందించు ప్రీతికాన్కలు, పెంచు మన ఋణంబులన్
కుందించు నవి మన మనోబలంబుల; బంధుజన
బంధములకు బలికాబోకు – మంకుతిమ్మ!

174.
అందందు, తండ్రి తనయుల మధ్య వచ్చు చిచ్చుల నీ వెఱుంగవే:
పొందియుందురు, మొక్క మానై పెరుగు వరకు; ఆ పిదపన్
అందనంత ఎత్తెగురగ; తండ్రి ఎవరో, తనయులెవరో, ఆ
బంధమది తెగును గాదె – మంకుతిమ్మ!

175.
ఆశల రేకెత్తింతురు బంధు, సఖులు – యది యుపకారము కొరకొ!
ఆశల రేకెత్తించరే మంత్రగత్తెలు ‘మ్యాక్‌బత్తు’ను అలనాడు
ఆశలు, సఫలమగునో, నిరాశలగునో, వినాశమొందించునొ!
ఆశ, మనవశంబున నుండవలె – మంకుతిమ్మ!

176.
ఇంగిత జ్ఞానము లేని బంధు పరివారము
కించపరచు నిచ్చగించు సతి, సుత, స్నేహిత వర్గము
బంగారపు సూదిమొనన్ నొసట గ్రుచ్చి యది సింగారపు బొట్టందురు
మందబుద్ధి జనులు – మంకుతిమ్మ!

177.
బంధు మిత్రులు భృత్యులందరున్ శత్రువుల వోలె నిను
యాదండధరుని బలగమునకున్ గొనిపోవుదురో
అందమైన యాభరణంబు లవి తమ మొనల ఎదన్ నొప్పింపవే
మందహసిత హత్య యియ్యది – మంకుతిమ్మ!

178.
ద్వేష రోషముల పగిది, నెయ్యము మోహమున్
పాశంబులు కాగలవు నీవు మైమరిచిన తరి, పూర్వంపు
వాసనలవి ఉక్కి, చిత్తంబును యుక్కిరి బిక్కిరిం జేసి
మోసంబున నిను సమయించు – మంకుతిమ్మ!

179.
కర్మ వచ్చి, నీ ఎదటన్ నిల్చి
చిరునవ్వుల, ఓరచూపుల, కొంటె మాటల నిను బిల్చి
కరమనురాగంబున గాఢాలింగనంబుల నిచ్చి
మరి చిచ్చువెట్టు – దీని తంత్ర మరయున దెటులో – మంకుతిమ్మ!

180.
మిత్తి, యంతా మోహిని రూపంబు నీ
చిత్తంబును చెరబట్టి, నెత్తురును పీల్చి
నిత్యంబు నీ యసువుల పీల్చి పిప్పిజేసి, దీర్ఘ
హత్యగావించి హర్షించునో – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version