Site icon Sanchika

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-22

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
211.
మనసు తోడుత పెరుగు కోరికల దీర్పగా లోనగున్
మనుజుడు, పలువిధంబుల కుయుక్తులకున్
మనమున కోర్కెలు మరిమరి మొలకెత్తుచునే యుండు
మనోవాంఛలకు తుది యది యేది – మంకుతిమ్మ!

212.
కాలము గడచినంత పాతబడి పోవుచుండు తా
నిలను నరుడు సాధించిన విజయంబులు
అలయ కవ్వాటిని సానబెట్టి నునుపు జేయ
ఫలించుగాదె నరజన్మ సాఫల్యత – మంకుతిమ్మ!

213.
సహజము నాకున్ననన్నియు యవగుణము లేనని యుపేక్ష సేయనగునే,
సహజ గుణముల విడువవవి మృగకీటకోటి,
సహజ యవగుణమ్ముల అసహజములుగ జేసి దిద్దుకొన
సాహసించుటే నరుని మహిమ – మంకుతిమ్మ!

214.
పుట్టుక తోడుత వచ్చినవే – నగ్నత, నఖ, శిఖలును; వలువల్
గట్టుట, సింగారంబులన్ని బహుయుగపు సంస్కారంబులు,
పుట్టుక తోడుత వచ్చినదే యవిద్య – విద్యయది కృతకము
పుట్టినవీ అసహజమ్ములు సహజమ్ముల నుండి – మంకుతిమ్మ!

215.
కలదొక యుత్తమస్థితిలోన, వడయ వచ్చునద్దానిని
అలయక సొలయక శ్రమించినన్, ప్రగతి సాధించవచ్చు; నిగూఢ
కాల్వబుగ్గయది, చిమ్ముచునుండు యన్ని వైపులకున్
ఛల మొక్కటే వలయు సాధింప – మంకుతిమ్మ!

216.
సిరి సంపదల, యధికారంబుల కొఱకు యాడెటి యాటలన్నియున్, యా
పరమేష్ఠి నరుడి చేత యాడించెడి యాటలే ఈ రంగస్థలిన్,
అరయగ నాయక నాయకీ పాత్రధారియు, సూత్రధారియు వాడె,
నరుడొక కీలుబొమ్మ గాదె – మంకుతిమ్మ!

217.
నేలను తాకగ చేసేడి నింగి వంపు: నునుపైన పున్నమి చంద్రుడి సొంపు;
అలల విన్యాసంబులు; కొమ్మ రెమ్మల తీగల నాటవిన్యాసంబులు
బలమైన నీల మేఘంబుల ఛాయలన్నియును – మనంబుల
నలరించెడి సృష్టి చిత్రంబులుగావె – మంకుతిమ్మ!

218.
పరిపరి విధముల, రూపంబున, కాంతియందున, రాగమందున
సరాగంబుల, పలు విధముల రసంబులు, నీ ప్రకృతి మమ్ముల
మరపించి చైతన్యపు రుచిని ప్రేరేపించు గాదె
అరయ నెల్ల రుచులకు గురువు గాదె యయ్యది – మంకుతిమ్మ!

219.
నరుడనుభవించెడి అరకొర చైతన్య యానందమ్ము లన్నియున్
పరిపూర్ణ సుఖ సత్త్వ మొసంగెడి కడలి తరంగంబుల రీతి గాదె; దిన
కరుడు బహుదూరంబున్నను, కిరణంబులు సోకవే మనల!
పరిపూర్ణానందము పొంద, ఇవియ ఋజువు గాదె – మంకుతిమ్మ!

220.
సౌందర్య బాంధవ్యంబులు యసత్యమనిన; నిష్కళంక
న్యూనతా భావ శూన్యంబైన సత్యం బెక్కడ కాననగున్!
అనిలమది పుష్పసువాసలను గొంపోవునట్లు, పరసత్వంబునూ గొనిదెచ్చు
సౌందర్య బాంధవ్యంబుల, సందియము లేదు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version