Site icon Sanchika

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-28

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

271.
జీవన మన్న వొట్టి ఆరాటమే ఈ భువిని యని యన
బోవకుము; సంపూర్ణ యవగాహన లేక అర్థము కానిదది,
జీవ, జడరూపంబున నర్తించు యా పరబ్రహ్మతత్వంబు
అవగతంబయిన గాని సంతసంబు గాదు – మంకుతిమ్మ!

272.
ఆ బ్రహ్మయే సంసారంబు గట్టుకొని యానందించు చుండ
ఆ ప్రకృతియు నూరకుండక ప్రతి క్షణము నర్తించు చుండ
వికృతపు మాటలేల? ఈ జన్మము నీసడించి దుఃఖింతు వేల?
సక్రమంబుగ వెదజల్లు నుల్లాసమును – మంకుతిమ్మ!

273.
కోటానుకోట్ల యూపిరులు, కోటానుకోట్ల రసానుభూతులు
కోటానుకోట్ల హృదయంబుల హోహో హాహాకారంబులు
కోటానుకోట్లు కూడియున్నవి యంతరిక్షంబున; నీ పరుగెక్కడ
వాటినిన్ విడచి – మంకుతిమ్మ!

274.
ప్రియతమ మైనది జీవము ఈ సృష్టి యందు; నయముగను
దయ తోడుత, గారవ భక్తి శ్రద్ధలతో కొనసాగింపుము
స్వయమంకురితమది, సకల విశ్వసత్త్వమది యని దెలిసి
భయం బించుకనుండ – మంకుతిమ్మ!

275.
అందరున్ సాధువులె, యందరున్ బోధకులె ఇలన్; మరి
ఎందరీ జీవిత పరీక్ష యందు నిలిచి నెగ్గువారలు! జీవన లోతు
లందెలసిన వారలెవ్వరో! సమస్య లెదురైన తరి, వాడు
యా దేవుడే గతి – మంకుతిమ్మ!

276.
సుందరి సుభద్ర తన కనుల ముందు కానబడని యంతవరకు
ఇంద్రసూనుడున్ సన్యాసియే! అందరున్ జిత మనస్కులే, తన
ఇంద్రజాల మహిమల ‘మాయ’ మన కనుల గప్పనంతవరకు;
ఇంద్రియముల నిగ్రహింపవలె – మంకుతిమ్మ!

277.
ధరణిసుత సీతామాత దృఢమనస్కురాలై నుండె, పర్ణశాల
మారీచుడు హరిణి రూపంబున రాగ నేమాయె!
వారధి లోలోతుల యడగి నిద్రించి యుండు కోరికల
కెరలింతు లెవరో – మంకుతిమ్మ!

278.
కాక, పిపీలిక, మండూక, గజముల కెవ్వడాహార మొసగు?
ఆకలియే గురువు అవ్వాటికి, యయ్యదియే నేర్పించు పాఠము
ఆకలియే గురువు నరునకును, శిష్యుడై వాడు నేర్చు నన్నియును,
సకల అంగాంగంబులును నేర్పించు – మంకుతిమ్మ!

279.
అంతకుడని యమునకేల యపకీర్తి? కరుణామూర్తులే నరులు!
అంతమొందించరే నరులు ఈర్ష్యాద్వేషముల తోడ నితరుల!
అంతమగుచున్నది ఆయువు పరస్పర ఘర్షణల వలన
అంతమొందించు వాడెవడు – మంకుతిమ్మ!

280.
వీడు దోషియని, వాడు పాపియని వేలెత్తి చూపబోకు
వాడు తనకైన యవమానము లెన్ని సహించెనో!
పాడు వాసనా బలంబు లవెన్ని వాని నాకర్షించెనో!
కడు పాశబద్ధుండుగు నరుడు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version