[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
21.
కనకమని నీవు ఎంచిన దానిని ఆ ధాత
కనకము కాదది మట్టియను; ఆతని వరమును నీవు మట్టియందువు
మానుష దైవ తలంపు లిట్లు వైవిధ్యమై యుండ
వినిమయ మెట్లు సాగునో – మంకుతిమ్మ
22.
కృతకమీ జగము, సత్యమెచట దాగియున్నదో!
కర్త యన్నవాడే తానెక్కడో దాగియుండె
చిత్రమీ జగము, గుణస్వభావ మెవరికెరుక?
యాత్రికుడ! జాగరూకుడవగుము – మంకుతిమ్మ
23.
తిరిగి తిరిగి, అలసి తిరుపమెత్తి తినుట
మరచి మైనరచి మెరయుట, మరల తిరుపమెత్తుట
మరల తిరుగుట, వాగుట, ఎగురుట, కూలబడుట
కొరగాని ఈ పనులెందుకో – మంకుతిమ్మ
24.
నరుల కోరికలున్, భయములవి సురల మాతా పితరులా!
నరుల భక్తియార్తనాదములవి సురల అట్టహాసమునకు వెరచియా,
పరస్పరులు తమ బలాబలముల పరికించుచున్న వారలో
ధర్మె మెక్కడ దీనియందు – మంకుతిమ్మ
25.
నావికునకున్, దిశానిర్దేనమునకు దిక్చూచి వోలె
జీవన పయనమునకున్ గావలె నీతి రీతులు
జీవన గతి కాద్యంతములే దెలియకున్న
జీవనంపు గురి ముట్టున దెప్పుడో – మంకుతిమ్మ
26.
సృష్టి ఉద్దేశ్యమది యస్పష్టము, సంక్లిష్టము
ఇష్ట మోహక గుణము లొక వైపు
కష్ట బీభత్స ఘోరము లింకొక వైపు
క్లిష్టతరమైనదీ బ్రహ్మసృష్టి – మంకుతిమ్మ
27.
బదుకన్ననేమో? దాని గురి యేమి? ఫలమేమి?
కుదురు లేనట్టి కుమ్ములాట, త్రిప్పులాటయే;
ఉదర పోషణార్థమై కుమ్ములాడు మృగ ఖగముల తీరు
సాధించునదేమో ఈ నరుడు – మంకుతిమ్మ
28.
కారుణ్య సరస సౌందర్యములే సృష్టికి మూల
కారణమనిపించునో క్షణము; కాదు
క్రౌర్య కార్పణ్యములే మూలమనిపించు మరొక క్షణము
అరయ, నిజమేదియో తెలియదాయె – మంకుతిమ్మ
29.
ఘనమైన శివరుద్ర రెండు రూపంబులున్ తనవే
వేణువొక కరమున్న శంఖమొక కరమున
అనువుగ రెండు వ్రేళ్ళవి కలిసినగాని చిటికె వేయనగునే
తానొక్క వ్రేలితో వేయనగునే – మంకుతిమ్మ
30.
బ్రహ్మ మొక్కటే సత్యము, సృష్టియది మిథ్య యని యనిన
సంబంధమన్నది లేదా ఈ విషయముల యుగ్మములకు
మన కన్నులు, మన మనస్సులే మనకు కల్లలు చెప్పిన
నమ్మునదెవరినో – మంకుతిమ్మ
(ఇంకా ఉంది)