Site icon Sanchika

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-31

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

301
ఇచ్చట గాదచ్చట, కాదు కాదు యదిగో యచ్చట నున్నది
పచ్చపచ్చని మేతయనుచు, ఒకచో కాలానక తిరిగి తిరిగి
వచ్చి, డస్సి అరగడుపున నిదురించు లేగదూడ వోలె
మెచ్చని పనులు సేయ సుఖమెుక్కడిది నీకు – మంకుతిమ్మ!

302.
మట్టి రేణువుల నొక్కటొక్కటిగ దెచ్చి చెదచీమలవి
పట్టిన పట్టువీడక ఎట్టకేలకు గట్టిన గూటిని,
రెట్టించి, వాటిందూరి, గట్టి చేసుకొను విషోరగములు,
కష్టములకు ఫలము అంతే మనకు – మంకుతిమ్మ!

303.
‘తిరుగు తిరుగు చెల్లప్పా’ యని దిర్దిరిగి తలతిరిగి పడెనొకడు
మరచె నిజప్రపంచంబు నొకడు స్వప్నలోకాల విహరించి,
సరియేది? కానిదేది యని చింతించుచు కూర్చుండె నొకడు
మరీ మువ్వురలోన నరయగ మూర్ఖుడెవ్వడో – మంకుతిమ్మ!

304.
మేరు పర్వతాగ్రమున నొక ఉరు శిలన్ నుంచదలచె సిసిఫస్ గ్రీకు
దొర యొకండు; మరల మరల దొరల వచ్చెనది మరుక్షణంబున
పురుష ప్రగతియు నంతయె, మరల మరల
దొరలి వచ్చు సులభతరము కాదు పురోగమింప – మంకుతిమ్మ!

305.
లోక చరితంబుల కెయ్యవి కారణంబులు? కాకతాళీయమో
కాక, విమర్శల కందని కార్యకారణ సంబంధములో
ఆకర్షించు నయ్యవి మనల: కాని యయ్యవి ఆచరణీయంబులా!
వ్యాకులత కల్గించునవి – మంకుతిమ్మ!

306.
వాసికెక్కిన క్లియోపాత్రా యందచందములకు
దాసులై పోయిరి, వీరులు శూరులు సీజర్, ఆంటోనీలు
దేశ చరితములకు యంకుశములయ్యె వారి వర్తన
వశవర్తులై పోవరే ఎవ్వరైన మగువ సోయగములకు – మంకుతిమ్మ!

307.
సురసభ నందు నడచిన కౌశిక వశిష్ఠుల కక్ష
ధరలోన హరిశ్చంద్రునకయ్యె శిక్ష
ప్రారబ్ధమది ఎచట నుండియో సంక్రమించు
కర్మగతి దాట వశమె – మంకుతిమ్మ!

308.
అలల తాకిడికి సర్కారు పడవ యటునిటు యూగిసలాడ
నిలువరింప, తెరచాప తెడ్డు వేసెడి వారలు పాన మత్తులై యుండ
గాలి దారి మళ్ళింప, జనులు భీతావహులై తల్లడిల్ల
తలక్రిందులుగాక పడవ ముందుకు సాగుటయే యాశ్చర్యము – మంకుతిమ్మ!

309.
వన్య మృగముల నడుమ గోవొకటి చేరిన నేమగు?
పణ్య వీధిని తాత్త్వికునకేమి పని?
అన్యాయ యున్మత్త కోలాహలపు లోకమిది పుణ్యా
పుణ్యముల నాలోచించునే జగము – మంకుతిమ్మ!

310.
సహజమైన దాని మరచి నింగికి నిచ్చెన వేయు ప్రయత్నమ ద
సహజమైనదాని సత్యమని భ్రమించినట్లె యగు
సహజ సౌభాగ్యాల నాశించి, దౌర్భాగ్యముల వరించినట్టగు
ఇహమున నరునకున్న శాపమిది – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version