[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]
~
41.
తలుపులు బిగించుకొని బమ్మగుడిలోనే యుండనిమ్ము;
తాళపు చెవుల నీవల పారవైచిన చాలు; పండితులు తమ
పలు వాగాడంబరముల నిక చాలించి, అసలైన తత్త్వమును
తెలియ జేసిన చాలు – మంకుతిమ్మ!
42.
ఆహా! ఏమీ మోహ, స్నేహరాహంబులు
ఊహింప, ఈ సృష్టిని సహృదయత కఱవై యున్నదని తోచు,
ఓహో, ఆహా! యని నోళ్ళు తెఱచియుంచుటయే తప్ప
నూహింప లోగుట్టు వ్యహారమిది – మంకుతిమ్మ!
43.
పైన, లోన, అన్నివైపుల మూల మూలలయందు
కానరాని యదేదో విద్యుల్లహరి యావరించి
ఇన, చంద్ర, తారల, ధూళికణాల విడువక చలింపజేయు
చున్న శక్తి యది ఏదో- మంకుతిమ్మ!
44.
మనకున్న కంటి చూపది ఆనదు బహుదూరుము; అల్లు
కొనుచున్నవి జీవన పథపు సంజె చీకట్లు
కన్నులు మసక బారినవి – కనుల కందకున్న వేవియు
మన గతి సందేహమే – మంకుతిమ్మ!
45.
రవిశశి కిరణముల వెలుగులు చాలు, మాకు
గవిసిన గన్నుల విస్ఫారింపజేయ, యనుమానపు పొర
లవి గప్పినంత జగంబు నావరించు చీకటి
దివిటీలవి తిమిరంబును దరుమ లేవు – మంకుతిమ్మ!
46.
కనీ కన్పించని పరదాల వెన్క అడగి వుండిననే బాగు జీవరహస్యము
మేన నూలు పోగయినను లేని మతిలేనిదానిని వరించగలడే ఎవ్వడైన!
తానదెంత మరుగున నున్న వంతే మరులు గొలుపు
కనుల సురసుత కౌతుకమది హెచ్చు మంకుతిమ్మ!
47.
మాది, సగము చూపని వాపోవ ఫలమేమి?
ఇద్ధరనున్న వెలుగు సగమేనని వదర సుఖమేమి?
విధి యొసంగిన చూపుతో వెలుగు చూచి
యదియ భాగ్యమని భావింప మేలుగాదె – మంకుతిమ్మ!
48.
సగము చూపని వగవనేల? అందరి
సగపు చూపుల చేత సత్యాంశముల పరికించి; ఆ
సగపు చూపుల కలయిక పరిశీలన చేతనే
సాగ వీలగు ముందుకు – మంకుతిమ్మ!
49.
కల్ల, నిజముల జేర్చి సేతువు గట్టునెడ, నో పండితులార!
తెలిసితిరే మనుజ హృదయలోతుల దాగియున్న
కల్మష కాఠిన్యముల; లేనిచో వ్యర్థంబే కదా, మీ
విలువైన పాండిత్యంబు -మంకుతిమ్మ!
50.
నిలయ మెక్కడ సత్యంబునకు; శృతి తర్కంబులే దాని
నిలయంబులా? యనుభవంబులు కావె సత్యంబునకు
నిలయంబులు, మనుజ హృదయాంగణముల
వెలసి తర్కింపజేయునవి; మంకుతిమ్మ!
(ఇంకా ఉంది)