Site icon Sanchika

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-6

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
51.
బహిరాకర్షణ లవేవో నా యసువుల బిగగట్టి
మోహా పాశంబుల నీడ్చుచున్నవి, నియ్యది
కుహనా క్రీడయో, ఋణంబుల ఈడ్పో, ఇవ్విధి
మోహతంత్రమో, యోచించి చూడు – మంకుతిమ్మ!

52.
ఆకాశపు నీలిరంగు కంటికింపగునట్లు
గ్రుంకు సూర్యుని రంగు అహితమగు నెందుకో.
రక్తపు రంగో, మరి నీలి రంగో
లేక మనసో, మూలమదేదో – మంకుతిమ్మ!

53.
గరికకు ఆ పచ్చదన మెక్కడిదో? వేరుదా? మట్టిదా?
సూర్యచంద్రులదా; నీటిదా, లేక నీ చూపుదా
మరి నీ కనులు చేసికొనిన పుణ్యమా! కారణమదేమి
పరికించి చూడు తేటతెల్లనగును – మంకుతిమ్మ!

54.
కార్యాకారణ వాదములతో పనిలేదు, తత్త్వమది
కర్కశ తర్కములకు లోబడదు
తెరచిన మనసున కలయజూచిన గాని
ఎరుకకు రాదు – అతిసూక్ష్మనుది- మంకుతిమ్మ!

55.
ఇన చంద్ర తాప శైత్యముల ననుభవించినగాని
కానగలడే వాటిని జాత్యంధుడు
అనుభవము చేతనేగాని తెలియలేడు
మనుజుడు పరతత్వ మహిమ – మంకుతిమ్మ!

56.
ఆకసమున నక్షత్రముల జయ ఘోష
కేకలు, పెడబొబ్బలును భూలోకమున, లోన ఎమ్ముల మూల్గులు
మూక వేదన ననుభవించుచున్నదీ ఎడద – ఈ మూడింట
కకావికలమవుతున్నది మనసు – మంకుతిమ్మ!

57.
ఆగుంబె, ద్రోణపర్వత సూర్యోదయ, యస్తమయములు,
త్యాగరాజు గానము, వాల్మీకి కవనము
కల్గించవే రోమాంచనము, పులకింపజేయవే మనము
పొగడ్త కెక్కిన నిజములివి – మంకుతిమ్మ!

58.
కొండకోనల సొబగు – ప్రకృతి వైపరీత్యముల బెడగు
ఎడబాయని చెలుని చెలిమి – ఎడబాసిన సతివియోగము
కడుబలమై ఎడద సుడి లేపి
సడిసేయక నన్ను మూకను జేయు- మంకుతిమ్మ!

59.
మణి మంత్ర తంత్ర సిద్ధుల సాక్ష్యము లేల
గుణాతీత దైవతాద్భుతము ఋజువు చేయ
మనుజులందు కానిపించు మహనీయ గుణములవి చాలవే
కనరాని వాడొకండు కలడని ఋజువు చేయ – మంకుతిమ్మ!

60.
గ్రీసు కావ్యముల పరియింతురు ఢిల్లీవారు
కాశీ శాస్త్రాల – ఆక్స్‌ఫర్డ్ వారు
దేశకాల భేదములవి లేవు మనోరాజ్యమునకు
శ్వాసయది బమ్మది – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

Exit mobile version