తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-9

0
1

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
81.
మరిచెనా యా బమ్మ; లేదు – మరచినట్లగుపించు
ధరించి జీవాకృతిని, తన్ను తానే
యరయు చున్నాడు; దొరకిన సుఖము
దొరకు వరకు ప్రయాస – మంకుతిమ్మ!

82.
మీరు రానన్నను నే వదల మిము నో బుడుతలార
రారండు ఆడుదము దాగుడుమూతలాటయని
కూరిమి తోడ బిలుచు నాయనమ్మవోలె, యా
విరించి ఆడుచున్నాడు మనతోటి – మంకుతిమ్మ!

83.
మనమున చింత నెలసిన యెడ, తానొంటరినను, నిర్వురవలె
తనుదానె వదరుచు, వాదించుచు, నుడియుచు, కై
సన్నల జేయుచున్, బమ్మ నొక్కడైనను
తానిరువురవోలె భాసించు – మంకుతిమ్మ!

84.
అణు, భూత, భూగోళ, తారాంబరముల
తానె నిర్మించి, బిగించి, కొంత సడలించి
తను నిర్మించిన బంతిలోన వసించి, కన్పించక
మనల నర్తింప జేయుచున్నాడు బ్రహ్మ – మంకుతిమ్మ!

85.
ఎల్ల లెరుగని నభోలోకము రీతినున్నదీ మనము
డోలాయమానమై యూగుచున్నదీ బదుకు రెండింటి నడుము
లీలా మానుషుడొక్కడే తగు నీ గాలిబుడగ నూద
సలిల బుద్బుదంబు గాదె ఈ సృష్టి – మంకుతిమ్మ!

86.
నింగియె నిగనిగ లాడెడి తల వెంట్రుకలై, శశితారలె పూవులై
జగమె శరీరమై, మాయ తన సతియై
నగవు కేరింతల పెడబొబ్బల తాండవ రూపుడే
భగవంతుడు, శివరుద్రరూపుడు – మంకుతిమ్మ!

87.
పెరుగుదల, ప్రకాశన, వికాసన వికారంబులు,
తరుగుదల, కాంతి వేగ౦బుల కాల వృత్యాసంబులు
తిరిగెడి ఈ విశ్వమందు విశ్వసమ్మోహనంబులివి, యా
పరమాత్ముని లీలలే కదా – మంకుతిమ్మ!

88.
మాయా భ్రమణంబులవి విశ్వచలన విస్తారంబులు –
మాయ కాదది పరబ్రహ్మ విస్ఫురణమే యని తెలియు, విచారింప
మాయని మెఱపు వజ్రంబున నైజంబుగ నుండునట్లు
ఆ యజునకు నైజము మెరపు – మంకుతిమ్మ!

89.
అనాది నుండియు వెలసియున్న ఈ జగమునకు
ఎన్నగ ప్రథమ మది యెయ్యదియో
అనువుగ కూర్మమది తన పాదములు చాచి ముడిచిన రీతి
లోనికి నీడ్చుకున్న లయము, చాచిన యదియె సృష్టి – మంకుతిమ్మ!

90.
మొదలేదీ నెలవుకి? సృష్టి పుట్టిన దెప్పుడో!
మొదలేది పడిలేచెడి కడలి తరంగములకు
ఏది పొలిమేర యది గాలి కెరటములకు
ఆది అంతము లేవి?ఈ విశ్వమునకు – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here