Site icon Sanchika

తెలుగులోంచి ఎలాంటి సాహిత్యం అనువాదం కావాలి?

[dropcap]గ[/dropcap]త ఏడాది కాలంలో నేను తెలుగు నుండి ఆంగ్లంలోకి చిన్న కథలని అనువదించడం మొదలుపెట్టాను.   ఇవి వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆంగ్ల వెబ్ పత్రికలలో వచ్చాయి. నేను అనువాదం చేసేందుకు కథల్ని ఎంచుకునేటప్పుడు అసలు తెలుగునుండి ఎలాంటివి అనువాదంలో రావాలి? అన్న విషయం కొంచెం ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ ఆలోచనలను ఒక పద్ధతిలో రాసుకుందామని ఈ వ్యాసంలో పంచుకుంటున్నాను. నేను కథలు చేస్తున్నాను కనుక అది ఎక్కువగా ప్రస్తావిస్తున్నాను. అయితే ఇతర సాహితీ ప్రక్రియలకి కూడా నేను రాస్తున్నది వర్తిస్తుందనే అనుకుంటున్నాను.

ఇతర భాషల నుండి (ప్రధానంగా ఆంగ్లం నుండి) తెలుగులోకి ఎన్నో అనువాదాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తూంటాయి. ఒక్కోసారి ఒకే రచయితకి చాలామంది అనువాదకులు కూడా ఉంటారు. దీనికి భిన్నంగా, తెలుగు నుండి ఇతర భాషల్లోకి అనువాదం అయ్యేవి చాలా తక్కువ, నాకు తెలిసినంత వరకు. ఇంగ్లీషు కాక మన చుట్టుపక్కలి భాషలు – తమిళం, కన్నడం, కొంత హిందీ లోకి వెళ్ళాయి. దీన్ని “తెలుగు లో మంచి రచనలు లేవు” అనో, “మనకి ఇతర భాషలకి తూగే స్థాయి లేదు” అనో అనుకోవచ్చు. కానీ, నేను బహుశా మనకి తెలుగులోంచి ఇతర భాషలకి చేసే అనువాదకుల కొరత ఉందేమో అనుకుంటున్నాను. కొరత ఎందుకు? అన్నది నాకు తెలియదు. ఇతర భాషల్లో మంచి ప్రావీణ్యం ఉండి, తెలుగులో ప్రావీణ్యం, సాహిత్యాభిరుచి ఉండడం అరుదులాగుంది చూడబోతే.

అది అటు పెడితే, అసలు తెలుగు లోంచి ఎలాంటివి అనువాదం అయితే బాగుంటుంది? అన్న ప్రశ్నకి సమాధానం అనువాదాలు ఎవరి కోసం చేస్తాము? ఎందుకు చేస్తాము? అన్న ప్రశ్నలతో మొదలుపెట్టాల్సి వస్తుంది. “వి ఆర్ ఆల్ ట్రాన్స్లేటర్స్” అని ఒక న్యూస్ లెటర్ ప్రతి వారం వస్తూంటుంది. అందులో ఈ మధ్యనే  ఈ అంశం చర్చకు వచ్చి ఈ క్రింది బొమ్మని పెట్టారు.

దీనిని బట్టే ఎలాంటి కథలు అనువాదం అవ్వాలి? అన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. నాకోసం నేను చేస్కోడం లేదు. ఇతరులు చదివేందుకే చేస్తున్నాను అనుకున్నాక తెలుగు నుండి అనువాదం మనం సాధారణంగా తెలుగు రాని వాళ్ళ కోసమే చేస్తాము. తెలుగు రానివాళ్లెవరూ? ఇతర భాషలు మాట్లాడే భారతీయులు, ఇతర దేశాల వాళ్ళు, ప్రవాసంలో పెరిగి తెలుగు నేర్వని తెలుగు జాతీయులు – ఈ మూడు రకాల వాళ్ళు అనుకోవచ్చు. తెలుగు రాని ఈ అందరికీ తెలుగు సాహిత్యం గురించి ఏమి చెప్పొచ్చు? “ఫలానా రచయిత తెలుగులో ఫేమస్. కనుక ఇంగ్లీషులోకి అనువాదం చేయాలి” – ఇది నా దృష్టిలో అంత మంచి కారణం కాదు. ఆంగ్లంలో ఎలాంటి కథలు రావాలి అంటే “తెలుగులో ఫేమస్ అయినవి” అన్నది నా జవాబు కాదు. తెలుగులో అది మంచి రచనగా అనిపించాలి. గొప్ప రచనగా అనిపించాలి. తెలుగేతరులు కూడా ఇది చదవాలి అనిపించాలి. బహుశా ఇదంతా తప్పనిసరి కావొచ్చు. ఆపైన నాకు రెండు విషయాలు ముఖ్యంగా తోస్తాయి ఆ గొప్ప రచనల మధ్య ఏది అనువాదం కావాలి? అని ఆలోచిస్తే.

కథా వస్తువు: తెలుగు వారి జీవితాలని ప్రతిబింబించే కథలు

రచన పద్ధతి: శైలి, కథనం, శిల్పం వగైరా అంశాలలో ప్రత్యేకంగా కనబడే తెలుగు కథలు

వీటి గురించి కొంచెం వివరంగా చూద్దాము.

కథా వస్తువు:

మన జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఇలాంటివి ఇతరులకి సాహిత్యం ద్వారా పరిచయం చేయవచ్చు. జీవన విధానం అంటే ఏమిటి? సంస్కృతి, సంప్రదాయం అంటే ఎవరివి? సమస్యలు అంటే ఏ ప్రాంతానివి? – అందరివీ అని నా సమాధానం. ఒక బ్రాహ్మణ కుటుంబం గురించిన కథ సంస్కృతిని ప్రతిబించినట్లే ఒక సంచార తెగ వారు పెళ్ళిళ్ళు చేసుకునే పద్ధతిని చూపించే కథ కూడా ప్రతిబింబిస్తుంది. కనుక అన్ని ఒకరే చేయకపోయినా, అన్ని రకాల కథలూ అనువాదం అవొచ్చు అని నా అభిప్రాయం. అలాగే, మనకి స్థానికంగా ఉండే సమస్యలు ఎవడో ఇంకో దేశంలో వాడికి ఎందుకు? అనిపించవచ్చు. కానీ, ఇలా మనం నేరుగా రిలేట్ చేసుకోని అనేక అంశాలు మనం దేశ విదేశాల సాహిత్యంలో చదువుతూనే ఉంటాము. సాహిత్యం ప్రయోజనం కేవలం ప్రపంచ జ్ఞానం పెంపొందించుకోవడమే కాదు కదా. కనుక, “ఇది మరీ స్థానికంగా జరిగే కథ” అన్నది ఒక మంచి రచన అనువాదం చేయడానికి అడ్డు కాకపోవచ్చేమో. అయితే, వేరే ఇతర కారణాల వల్ల ఆ రచన అనువాదానికి అనువుగా ఉండకపోవచ్చు, అది వేరే విషయం.

సార్వజనీనమైన అనుభవాలు గల రచనలే ఎంచుకోవాలా? అన్న ప్రశ్నకి నేను అవసరం లేదంటాను. ఉదాహరణకి నీటి ఎద్దడి ఉన్న ఒక చోట దైనందిన జీవితంలో ఎలాంటి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటారు? అన్నది కథా వస్తువు అనుకుందాము. ఏ జర్మను వాడో ఇది ఆంగ్లానువాదంలో చదివితే వాడికేమర్థవుతుంది? అనిపించవచ్చు. మనం రష్యన్ వాళ్ళ చలికాలపు జీవితాన్ని చదివినట్లే వాళ్ళూ మన జీవితాలని గురించి చదువుతారని నేను అనుకుంటాను. అయితే, సార్వజనీనంగా ఉండే భావోద్వేగాలు కలిగించే కథల అనువాదం పట్ల కొంత సానుకూల దృక్పథం ఉండడంలో తప్పులేదేమో.

సమకాలీన రచనలే అనువాదం చేయాలా? ఇక అనువాదం గురించిన అంతర్జాల చర్చలు (తెలుగు వారివి కాదు. ట్విట్టర్లో కనబడే ఆంగ్ల, ఇతర భాషల అనువాదకులవి) చూస్తూంటే అనువాదమంటే సమకాలీన రచనలు, లేదంటే మరీ ఏ వందల ఏళ్ళ నాటివో – వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఏమో అనిపించింది. కానీ, కాలాతీతం అయినా కాకపోయినా, ఆయా కాలాల జీవితాన్ని పట్టి చూపిస్తాయి కదా రచనలు. ఒకోసారి చరిత్ర పునరావృతం అయ్యి అవే కథలు ఇపుడు చాలా రిలవెంట్ అని కూడా అనిపించవచ్చు. ఈమధ్య “ఇదిప్పుడు మన దేశమే” – అట్లూరి పిచ్చేశ్వరరావు కథ (1950s రచన) చదివినపుడు నాకు ఈ భావన కలిగింది. కొన్ని నెలలక్రితం నంబూరి పరిపూర్ణ గారు 1990లలో రాసిన కథ “తిరిగి ప్రవాసానికి” కథానిలయంలో చదివినపుడు కూడా నాకు ఈ కథ ఇప్పుడైనా జరిగేదే. తెలుగు వారికే కాదు, ఇతరులకి కూడా అనుభవమయ్యేదే, ఇలాంటివి మళ్ళీ అందరికీ కనబడాలి అనిపించింది. అందువల్ల, కథలు పాతవైనా ప్రస్తుత కాలానికి అనువాదం లో చదవడం సబబుగా అనిపించవచ్చు.

చివరగావిషాదాంతాలే గొప్ప కథలా అనువాదానికి? అన్న ప్రశ్న నాకు అనువాదాలు, అవార్డులొచ్చిన కథలు, ఇలాంటివి చదువుతూ ఉన్న ప్రతిసారీ కలిగే సందేహం. వ్యక్తిగతంగా నేను కొన్ని జీవితంలోని విషాదాలని ప్రతిబింబించే కథలని ఎంపిక చేసుకున్నా, వీలైనంతవరకు చివరిలో ఒక ఆశ, ఒక స్పూర్తి కలిగించేలా ఉండేవి ఎంచుకుంటాను. ఈ మధ్య కాలంలో ఆంగ్లంలో రాస్తున్న/అనువాదం చేస్తున్న ఇతర రచయితలతో పరిచయం అయ్యాక ఈ విషాదాంతాలు బాగుంటాయన్నది చాలా మంది ప్రిఫరెన్స్, కానీ కథ గొప్పదా, కాదా? అనువాదంలో బాగుంటుందా, లేదా? అన్నది అది నిర్ణయించదు అని అర్థమైంది. కనుక, అన్ని రసాలూ తెలుగు నుండి అనువాదం అయ్యే కథల్లో ప్రతిబింబించాలని అనుకుంటున్నాను.

రచన పద్ధతి: మనకి ఉన్న కాసిని ఆంగ్ల అనువాదాల్లో వస్తువే ఎంపికకి మూలకారణం అనిపిస్తుంది. ఆధునిక కథ ప్రక్రియ బయటనుంచి మనకి వచ్చింది కనుక కథా నిర్మాణ విషయంలో మన ప్రయోగాలు ఇతరులకి ఆసక్తికరంగా ఉండేవేముంటాయి? అంతా ఆల్రెడీ వేరే భాషల్లో కూడా ఉండి ఉంటాయి కదా? అనిపించవచ్చు. అయితే, ఈ ఆధునిక పద్ధతి దిగుమతి కాకముందు కూడా మనకీ సంప్రదాయక సాహిత్య పద్ధతులు ఉన్నాయి కనుక, వాటి ప్రభావం, ఆధునిక కథ ప్రభావం కలిసి సాహిత్యంలోని ప్రత్యేకతలు, శిల్పం, శైలి, కథన రీతుల్లో చేసే ప్రయోగాలూ, ఇలాంటివి ఇతర భాషలతో పోలిస్తే కూడా ప్రత్యేకంగా కనిపించవచ్చు. అలాంటి కథలు కూడా నా దృష్టిలో అనువాదానికి మంచి కాండిడేట్లు. ఇటీవలి కాలంలో నాకు అట్లా కథ చెప్పిన విధానం చూసి “ఇలాగ మనవాళ్ళే చెప్పగలరు అనో, లేకపోతే ఇలాంటి కథనం నాకు ఎప్పుడూ ఆంగ్లంలో కనబడలేదు, బాగుంటుంది ఆంగ్లంలో చదవడానికి” అనిపించిన కథలకి ఉదాహరణలు: వేమూరి వెంకటేశ్వర రావు గారి “కించిత్ భోగో భవిష్యతి” (1974), అక్కిరాజు ఉమాకాంతం గారి “ఎదుగని బిడ్డ” (1914), అట్లూరి పిచ్చేశ్వరరావు గారి “వసుంధర” (1960ల నాటి కథ). అందుకే సమకాలీన కథలే అనువాదం చేయాలని లేదు. పాత కథలని కూడా కొత్త చూపు చూడవలసిందే.

ఇటీవలి కాలంలో వచ్చిన ఆంగ్లానువాదాల్లో ఎంపిక విషయంలో నాకు బాగా నచ్చినది దాసు తామ్రపర్ణి, కృష్ణమూర్తి గార్ల అనువాదం (The Greatest Telugu Stories Ever Told, Aleph Books, 2022). కొత్తా, పాతా, వివిధ సాంఘిక నేపథ్యాల నుండి వచ్చిన రచయితల కథలు ఉన్నాయిందులో. నేను తెలుగు కథలు ఆంగ్లంలో ఆట్టే చదవలేదు కానీ, ఇలా కొత్త-పాతల కలయిక నాకు తెలిసినంతలో మరో పుస్తకంలో లేదు. తూలిక.నెట్ లో వందకు పైగా తెలుగు కథల అనువాదాలు ఉన్నాయి. అందులో కూడా మంచి వైవిధ్యం ఉంది కానీ సమకాలీన కథకులు పెద్దగా లేరనిపించింది. పుస్తకాలుగా వచ్చిన ఇతర అనువాదాలు – నాకు తెల్సినంతలో ప్రధానంగా ఒక రచయితో, భావజాలమో ముఖ్యంగా ఫోకస్ అయినవి. ఇలాంటివి రాకూడదు అని కాదు. తప్పక రావాలి. కానీ అవొక్కటే చాలవు.

ఇంగ్లీషు నుండి తెలుగుకి చేయడం వేరు. చాలామంది చేస్తున్నారు, చాలా రచనలు అనువాదంలో వస్తున్నాయి కనుక ఒకే రచయితవి పలు రచనలు వచ్చినా, ఒకే రచనకి పలు అనువాదాలు వచ్చినా, చదివే వాళ్ళు చదువుతారు, లేని వాళ్ళు లేదు. అది అనువాదకుల/పబ్లిషర్ల తలనొప్పి. తెలుగు నుండి ఆంగ్లంలోకి అసలు వెళ్ళేవి చాలా తక్కువ (నా దగ్గర జాబితా ఏం లేదు. తెలుగేతరులతో మాట్లాడిన అనుభవాన్ని బట్టి చెబుతున్నా). కనుక ఒక రచయితవే మళ్ళీ మళ్ళీ చేయడం, ఒక భావజాలమే ఎప్పుడూ హైలైట్ అవడం – ఇలాంటివి ఆంగ్లానువాదాల విషయంలో మేలు కన్నా కీడే చేస్తాయని నా అభిప్రాయం. బహుశా తెలుగు నుండి ఆంగ్లంలోకి విరివిగా ఆనువాదాలు జరుగుతూ, విశ్వ సాహితీ ప్రపంచంలో… లేదా కనీసం భారతీయ సాహితీ లోకంలో తెలుగుకి ఒక ప్రత్యేక స్థానం ఉందని అంతా అంగీకరించే ఒకానొక కాలంలో ఇలాంటి లగ్జరీ మనక్కూడా దొరకొచ్చు. చూద్దాము.

ఇకపోతే అసలు అనువాదానికి ఎలాంటివి ఎంచుకోవాలి? అన్నది ఈ ప్రశ్నకి చేరువగా అనిపించినా వేరే ప్రశ్న. ఎందుకంటే – ఒక్కోసారి అనువాదానికి తగ్గ రచనలే అయినా అనుమతి ఎవర్నడగాలో తెలియదు, లేదా అనుమతి దొరకదు. ఒక్కోసారి ఫలానా రచన అనువాదంలోకి దిగదు అనిపించవచ్చు. ఒకోసారి అసలు అనువాదం చాలా కష్టంగా తోచవచ్చు కూడా. కనుక అది నా దృష్టిలో మరో ప్రశ్న. ఇంకా అనుభవం ఉన్నవారేవరైనా చర్చించవలసిన ప్రశ్న. అలాగే అనువాదం ఎలా చేయాలి? అన్నది మరో పెద్ద ప్రశ్న. మూలాన్ని పట్టుకోవాలి, యాసలు కూడా దిగిపోవాలా? గ్లోబల్ ఆడియన్స్ కి తగ్గట్లు మార్చే స్వేచ్ఛ ఉండాలా? వగైరా ఎన్నో చర్చనీయాంశాలు ఉన్నాయి. అవి కూడా మరింత అనుభవజ్ఞులు చెప్పాల్సినవే.

ఇక్కడితో ఎలాంటి తెలుగు సాహిత్యానికి ఆంగ్లానువాదాలు రావాలన్న ఈ చిరు చర్చ ముగిస్తాను. వీలైనంతవరకు నా సొంత అభిప్రాయాలు రాశాను. అయితే, ఈ అభిప్రాయాలు, ఆలోచనల వెనుక ముగ్గురి ప్రభావం ఉంది, వాళ్ళని అక్నాలెడ్జి చేయక తప్పదు. తెలుగు కథల ఆంగ్లానువాదాలకోసమే ఉన్న తూలిక.నెట్ వ్యవస్థాపకురాలు నిడదవోలు మాలతి గారు, “వి ఆర్ ఆల్ ట్రాన్స్లేటర్స్” నిర్వహకురాలు జెన్నీ భట్, ఆంగ్ల రచయిత, అనువాదకుడు టిం పార్క్స్ – ఈ ముగ్గురి వ్యాసాలు ఈ విషయమై నా ఆలోచనలకి ఒక దిశ ఏర్పడడానికి దోహదపడుతూ ఉంటాయి. అందుకు వారికి ధన్యవాదాలు. ఇదంతా వ్యక్తిగత అభిప్రాయమే. వ్యక్తిగత అనుభవాలను బట్టి ఏర్పరుచుకున్న అభిప్రాయాలే. కనుక ఈ విషయమై అందరూ ఇదే అభిప్రాయానికి రావాలని లేదు. అన్నట్లు నాన్-ఫిక్షన్ – వ్యాసాలు, ఆత్మకథలు ఇలాంటి వాటి అనువాదం విషయం ప్రస్తావించలేదు. అది కూడా అవసరమే.

Exit mobile version