తెలుగునాట ఆధునిక సంఘ సంస్కర్తలు

4
2

[dropcap]19[/dropcap]వ శతాబ్ది ముగింపు, 20వ శతాబ్ది ప్రారంభం యావత్ భారతీయ సమాజానికి ఉషోదయం. తెలుగుజాతి చీకట్లను తొలగించిన వెలుగు కిరాణం. ఈ సంధి కాలమే వ్యక్తులు స్వేచ్ఛ కోసం, జాతులు సంఘర్షణ కోసం, దేశాలు స్వాతంత్ర్యం కోసం పరితపించి, ప్రశ్నించి, ప్రతిఘటించే చైతన్యాన్ని అందించింది. పారిశ్రామిక విప్లవం వల్ల భారతీయ జీవన విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యాలయాలు, విశ్వ విద్యాలయాల స్థాపన, రోడ్డు, రైల్ మార్గాల ప్రారంభం, పత్రికలు, ప్రచురణ సంస్థలు, ఆంగ్లవిద్యాబోధన, పాశ్చాత్య సాహిత్యపరిచయం, తంతి తపాలా సౌకర్యాలు మొదలైన అనేక మార్పులు భారతీయ జన జీవితాన్ని ప్రభావితం చేశాయి. అప్పటిదాకా ఉన్న సామాజిక వ్యవస్థ పునాదులు కదిలాయి. నూతన వ్యవస్థ నిర్మాణం ప్రారంభమయింది.

శతాబ్దాలుగా కొనసాగుతున్న అంధవిశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, జీవన విధానం ప్రశ్నించబడింది. సతీసహగమన నిషేధం, విధవా వివాహాల సమర్థన, స్త్రీ స్వాతంత్ర్యం, అస్పృశ్యతా నివారణ, మొదలైన అనేక సామాజిక రుగ్మతలు రూపుమాపటానికి ఎందరో సంఘ సంస్కర్తలు సామాజిక, సాహితి, ధార్మిక క్షేత్రాలలో పనిచేసి కొత్త ప్రగతిశీల భావాలకు దారిదీపాలుగా నిలిచారు. అటువంటి మహానీయులలో కొందరిని ఇవాళ మన ముందుకు తెస్తున్నారు మన బాలముకుందం చిన్నారులు. నిస్వార్ధంగా సమాజం కోసం పనిచేసిన ఆ త్యాగమూర్తులను స్మరించుకుందాం.

ముందుగా తెలుగునాట ధార్మిక రంగంలో విశేష కృషిచేసిన ధీరులను కలుద్దాం.

1.బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడు:

1828వ సం.లో రాజా రామ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మసమాజ సిద్ధాంతాలతో ప్రభావితమై ఆడపిల్లల విద్య కోసం కృషి చేసాను. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాను. కాకినాడలో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాను. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన ‘కులవ్యవస్థ నిర్మూలన’కు మద్యనిషేధంకు శ్రమించాను.

వ్యా: విన్నారా.. నేడు మనం అనుభవిస్తున్న అవకాశాలు,ప్రగతి ఇటువంటి మహనీయుల కృషి ఫలాలే. మరో గొప్ప వ్యక్తి, బ్రహ్మ సమాజ సిద్ధాంతాలతో ప్రభావితుడై సమాజంలోని అంధ విశ్వాసాలను పోగొట్టటానికి కంకణం ధరించినవారు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. వారి మాటలు కూడా విందాం. రండి మహాశయా..

2.కందుకూరి వీరేశలింగం:

దేవుడు నాకు వేగంగా రాసే శక్తిని ఇచ్చాడు.. తెలుగులో మొదటి వచన ప్రబంధము, మొదట తెనిగించిన నాటకం, మొదటి ప్రహసనం, మొదటి ప్రకృతి శాస్త్రము, మొదటి చరిత్ర, స్త్రీలకై మొదటి వచన పుస్తకం రాశాను. నా జాతి వికాసానికి పని చేశాను.

వ్యా: అందరికీ పండ్లు, పూలు ఇచ్చే చెట్లలాంటి వ్యక్తులు వీళ్ళు. వీరేశలింగం క్రాంతదర్శిగా ఎంతో కృషి చేశారు. వారి వల్ల ప్రభావితమైన గురజాడ అప్పారావుగారి కృషి చీర స్మరణీయం.. అరుగో గురజాడవారు వస్తున్నారు. వారి మనసు తెలుసుకుందాము.

3.గురజాడ:

నేను ఆంధ్రప్రాంతంలోని విజయనగరంలో జీవించాను. అప్పుడు సమాజంలో ఉన్న దరాచారాల గురించి అనేక రచనలు చేసి ఆలోచింపజేశాను.

“దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్” అని మనిషికోసం మాట్లాడాను.

వ్యా: నిజమేకదా.. సమాజం అంటే ఎవరండి.. మనుషులే.. అందుకే మనుషులకోసం పని చేసినవాళ్లే మహానీయులైనారు. ప్రజల మనసుల్లో ఉండిపోయారు. మరో అక్షర యోధుడు రాయప్రోలు సుబ్బారావు గారిని గురించి వారినే పిలిచి తెలుసుకుందాము. నమస్కారం కవిగారు..

4.రాయప్రోలు:

తెలుగును తల్లిగా గౌరవించి మొదటిసారి “తెలుగుతల్లి” అన్నాను. వివాహబంధాన్ని గౌరవించాలి. ఆడ, మగ మధ్య స్నేహం చాలా విలువైనది.

“ఏ దేశమేగినా ఎందుకాలిదినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా

పొగడరా మన తల్లిభూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండుగౌరవము.”

వ్యా: స్వతంత్రంకోసం పోరాడుతూనే సమాజంలోని దరాచారాల గురించి రచనలు చేశారు. ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ కవి రాసిన ఒక్కపాట ప్రజలందరినీ కదంతొక్కించి స్వతంత్రం కోసం వీధుల్లోకి నడిపించింది. ఆ సంస్కర్తకవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు.

5.గరిమెళ్ళ సత్యనారాయణ:

శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేను స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ వెంట నడిచాను. దేశం కోసం నన్ను నేను అర్పించుకున్నాను.

“దండాలు దండాలు భరతమాత

ఇవి అందుకుని దీవించు భారతమాత” అని పాడాను.

“కల్లు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్” అంటూ ప్రజలకు పాటగా చెప్పాను.

వ్యా: తెలుగుప్రాంతంలో సమాజంకోసం పనిచేసిన సంస్కర్తలు పురుషులేకాదు. స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. అటువంటివారిలో అపరదుర్గ అయిన దుర్గాబాయి దేశముఖ్ పేరు వినని వాళ్ళు ఉండరు. ఎందరో స్త్రీల ఉపాధి కోసం ఇప్పటికీ పనిచేసే సంస్థలు స్థాపించిన దుర్గాబాయిని తలచుకుంటే చేతులెత్తి నమస్కరించాల్సిందే! రండి అమ్మను పలకరిద్దాం.

6.దుర్గాబాయి దేశముఖ్:

నేను రాజమండ్రిలో జన్మించాను. భారతదేశం నాకు అమ్మ. నేను స్థాపించిన ఆంధ్ర మహిళా సభలు స్త్రీలకు ఆలంబన కావటం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. గాంధీజీని అనుసరిచి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాను. నన్ను ప్రజలు ‘సోషల్ సర్వీస్ మదర్’గా ప్రేమించటం నాకు దక్కిన వరం.

వ్యా: నిజమే కదండి. వాళ్ళు చేసిన త్యాగాలు, సేవలకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం చెప్పండి. ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ.. మన చిన్నారుల రూపాలలో వాళ్ళను మళ్ళీ చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది కదా. ఇప్పుడు తెలుగు ప్రాంతం మారువలేని మరో గొప్పవ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులుగారిని గురించి వారి మాటల్లోనే విందాం.

7.టంగుటూరి ప్రకాశం పంతులు:

ఇప్పటి ప్రకాశం జిల్లాకు చెందిన నేను చాలా బీదరికంలో పుట్టాను. బారిస్టర్ చదివాను. జాతీయోద్యమంలో తిరిగి ఖాదీ కోసం. మత కల్లోలాల నివారణకు, పని చేశాను. పత్రిక నడిపాను. ముఖ్యమంత్రిగా సేవ చేశాను. నన్ను ‘ఆంధ్ర కేసరి’ అని ప్రజలు గౌరవించారు.

వ్యా: మన తెలుగువాళ్ళ మొదటి ముఖ్యమంత్రిగారికి నమస్కరిస్తూ.. సమాజ సేవలో భాషాసేవ కూడా భాగమే కదా. అర్థం కాని గ్రాంథికభాష నుండి తెలుగు వ్యావహారిక భాషకోసం ఉద్యమించిన గిడుగు వెంకట రామ్మూర్తిగారిని తెలుగువాళ్ళు ఎలా మర్చిపోగలరు.

8.గిడుగు వెంకట రామ్మూర్తి:

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన నాకు విజయనగరంలో చదువుకున్నప్పుడు గురజాడ అప్పారావు క్లాస్‌మేట్. తెలుగు వ్యావహారికభాష కోసం పనిచేశాము. సవరజాతి భాషకు లిపి, వ్యాకరణం రాశాను. కైజర్ ఏ హింద్, రావు బహుదూర్ బిరుదులు ఇచ్చి నాటి ప్రభుత్వం గౌరవించింది.

వ్యా: వారు అలా చేసి ఉండకపోతే మాట్లాడే తెలుగు పుస్తకాలలోకి వచ్చేది కాదు. ఇన్ని తెలుగులు అనే కన్ఫ్యూషన్ లేకుండా ఎంత మంచి పని చేశారో కదా.. బాపూజీ అడుగుజాడల్లో నడిచి దుర్గాబాయి దేశముఖ్ గారి ప్రేరణతో స్త్రీలకోసం సంస్థను స్థాపించి శ్రమించిన మరో మహిళామణి 19 వ శతాబ్దపు తొలి తెలుగు కవయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ గారిని ఒకసారి గుర్తు చేసుకుందాము.

9. కనుపర్తి వరలక్ష్మమ్మ:

నాటి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాను. కాలం ద్వారా, కార్యాచరణ ద్వారా నా పనిని చేశాను. అనేక రచనలలో మూఢ విశ్వాసాల గురించి, బాల వితంతువుల బాధల గురించి, వరకట్నాల బెడద, పురుషాధిక్యత వంటి సమస్యల గురించి పాఠకులకు చెప్పాను. ఖద్దరు వ్యాప్తికి కృషి చేశాను. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాను. స్త్రీ హితైషిణి మండలి ద్వారా మహిళలకోసం జీవితమంతా పనిచేశాను.

వ్యా: సమాజసేవలో సంస్కరణవాదంలో మహిళలు ఎప్పుడూ ముందుంటారండి. వాళ్ళు తల్లులు కదా. ‘ఆంధ్ర పితామహుడు’గా పేరుగాంచిన మాడపాటి హనుమంత రావు గారిని గురించి ఎప్పుడైనా విన్నారా. వారి జీవితం ఆదర్శవంతం. అరుగో… మాడపాటి విచ్చేస్తున్నారు…

10.మాడపాటి హనుమంతరావు:

కృష్ణాజిల్లాలో పుట్టాను. హైదరాబాద్ నా కార్యస్థానం. నిజాంపాలనకు వ్యతిరేకంగా ‘ఆంధ్ర మహాసభ’ స్థాపించాను. శ్రీ కృష్ణదేవరాయాంధ్రభాషానిలయం, హనుమకొండలో రాజ రాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం నేను సాకారం చేసుకున్న కలలు. తెలంగాణాలో తెలుగు భాషకు ఉన్నత స్థానం కల్పించటంలో పని చేశాను. బాలికల విద్యకోసం కృషి చేశాను.

వ్యా: వీళ్ళంతా చాలా చాలా సేవలు చేశారండి. వాళ్ళు చెప్పుకోరుగానీ ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క మహాగ్రంథం. చదవాలి మీరంతా.. చివరిగా మరో చైతన్యవంతమైన మహిళను పలకరిద్దాం. ఆమె అద్వితీయ సంఘసంస్కర్త. రచయిత్రి. బాపట్ల ఆడపడుచు మల్లాది సుబ్బమ్మగారు. అనేక ఉద్యమాలు, ఉపన్యాసాలు, రచనలు ఆమె జీవితం. విందాం.

11.మల్లాది సుబ్బమ్మ:

అనేక ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొన్నాను. మహిళోద్యమ చరిత్ర రాశాను. మానవ హక్కులన్నీ మహిళల హక్కులే అని చాటాను.. కుల నిర్మూలన, హేతువాదం, సతీ సహగమన వ్యతిరేకత, సారా వ్యతిరేక ఉద్యమం.. ఇలా నా జీవితం ఎన్నో విషయాలతో ముడిపడింది. పిల్లలైన మీ జీవితాలు బాగుండాలని మేము పని చేశాము.

వ్యా: నిజమే.. వీళ్లందరికీ మనం వందలు, వేల నమస్కారాలు చెప్పాలి. మనకు మంచి సమాజం ఇవ్వాలని శ్రమించిన ఈ దారిదీపాల వెలుగులో మన ప్రయాణం చక్కగా జరగాలని ఆశిస్తూ.. పిల్లలూ.. పెద్దలూ.. మీ అందరికీ ఎన్నో ఆశీస్సులు.. ధన్యవాదాలు.

సెలవు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here