[box type=’note’ fontsize=’16’] జనవరి 13వ తేదీన సుప్రసిద్ధ నటి అంజలీదేవి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]
[dropcap]1[/dropcap]963 నుండి ఆమె తెలుగువారి సీతమ్మ తల్లి. సాత్వికమైన పాత్రలలో నటించి జీవించి మెప్పించిన ఉత్తమ నటీమణి. కాని స్వర్ణయుగంలో నాటి యువకులకు కలలరాణి.
తొలి చిత్రాలలో వేంప్ ఆర్టిస్ట్‌గా, గడసరి నాయికగా, హాస్యనటీమణిగా, తిరుగులేని మేటి కథానాయికగా వెలుగొందారు. నిర్మాత్రి గాను పేరు పొందారు.
అంజమ్మ – అంజనీకుమారిగా/చివరకు అంజలీదేవిగా మారి స్వర్ణయుగంలో తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను అలరించారు.
అంజలీదేవి 1927 ఆగష్టు 24వ తేదీన నాటి (మదరాసు ప్రెసిడెన్సీ) నేటి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా లోని పెద్దాపురంలో జన్మించారు. తండ్రి నూకయ్య. సంగీత దర్శకులు శ్రీ పి.ఆదినారాయణరావుని వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు.
8 ఏళ్ళ వయసులోనే రంగస్థలం మీద బాలనటిగా నటించారు. ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’ తరఫున ఆడిన నాటకాలలో అంజనీకుమారిగా పేరు పొందారు.
1936వ సంవత్సరంలో భోగి పండగరోజు మద్రాసులో అడుగు పెట్టారు. ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రంలో లోహితాస్యుడి పాత్రలో నటించారు. తరువాత ‘కష్టజీవి’ చిత్రంలోను నటించారు. ‘పల్లెటూరి పిల్ల’లో నాయికగా నటించా రు. ‘బాలరాజు’, ‘గొల్లభామ’ సినిమాలలో మోహిని, కీలుగుఱ్ఱం సినిమాలలో రాత్రి రాక్షసి, సువర్ణసుందరి దేవేంద్రపభ నర్తకి పాత్రలలో తన నటన నాట్యాభినయాలతో ప్రేక్షకులను అలరించారు.
గొల్లభామ, బాలరాజు, సువర్ణసుందరి, సతీ సులోచన, తిలోత్తమ సినిమాలలో దేవేంద్రుని ఎదిరించిన దేవలోకపు అతిలోక సుందరిగా నటించారు. దేవేంద్రుని దూషించేటపుడు వీరి స్వరం భాస్వరమే.
మాయలమారి, భూలోకరంభ, స్వర్ణమంజరి వంటి జానపద చిత్రాలలో అత్యుత్తమ నటనను ప్రదర్శించారు.
‘చెంచులక్ష్మి’ సినిమాలో ఉగ్రనరసింహుని శాంతపరచి, తరువాత ఆయనని ఆటపట్టించే సన్నివేశాలలో వీరి నటన అద్వితీయం.
‘అనార్కలి’ సినిమాలో ప్రేమకోసం తపించిన ప్రేమమయిగా, విఫల ప్రేమికురాలిగా ఆవేదన ప్రదర్శించిన సన్నివేశాలు కంటనీరు తెప్పిస్తాయి.
‘పాండురంగ మహత్మ్యం’ సినిమాలో మొదట్లో గడసరి భార్యగా, తరువాత వేశ్యాలోలుడయిన భర్తతో బాధలు పడిన ఇల్లాలుగా వీరి నటన అనుపమానం.
‘జయభేరి’ సినిమాలో భజన భాగవతుల అమ్మాయిగా అల్లరి వల్లరిని చూపించి, సంగీత ద్రష్ట భార్యగా సాత్విక సతీమణిగా నటనలో జీవించారు.
ఇలవేలుపు, వదిన గారి గాజులు, వారసత్వం, ఋణానుబంధం, సంఘం, చరణదాసి, భలే అమ్మాయిలు వంటి సాంఘిక చిత్రాలలోను అద్వితీయంగా నటించారు.
‘సతీ సక్కుబాయి’ చిత్రంలో అత్త చేత ఆరళ్ళు అనుభవిస్తూనే పాండురంగడిని కొలుస్తూ మోక్షం పొందే పాత్రలో మనం కూడా తాదాత్మ్యం పొందుతాం.
భక్త జయదేవ, భక్త తుకారాం వంటి భక్తులు, వాగ్గేయకారుల భార్యగా వీరి నటన వర్ణనాతీతం. ముఖ్యంగా భక్తతుకారాం చిత్రంలో భక్తిలో మునిగి సంసారం గురించి పట్టించుకోని భర్తమీద కోపం ప్రదర్శించే గడుసరిగా వీరి నటన గొప్పగా పండింది.
‘మహాకవి క్షేత్రయ్య’ చిత్రంలో కవయిత్రి రంగాజమ్మ పాత్రలో నటించారు. అవసరమైన సమయంలో రాజుకు సలహాలిచ్చి, రాజ్య సంరక్షణ బాధ్యతను తీసుకుని నటించిన సన్నివేశాలు చిత్రాన్ని సుసంపన్నం చేశాయి.
‘భీష్మ’ చిత్రంలో కాశీరాజు ప్రియురాలిగా/భీష్ముని పై పంతం పట్టి కోపం ప్రదర్శించి, తపోధనంతో గానీ, పగ సాధించిన అంబగా వీరి నటన పరాకాష్టకు చేరుకుంది.
‘కళ్యాణమంటపం’లో వీరు నటించిన వేశ్య పాత్ర కుమార్తెను ఆ కూటం నుంచి బయటపడేయాలనే తపన కన్నీరు తెప్పిస్తుంది.
మలిదశలో గుణచిత్ర నటిగా వీరు పోషించిన పాత్రలు ఎంతో వైవిధ్యభరితమయినవి. ‘లక్ష్మీ నివాసం’లో దుబారా చేసే ఇల్లాలిగా/ ‘ఆదర్శ కుటుంబం’లో పసిబిడ్డకు విషం పెట్టిన పెద్దమ్మగా/”ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళు గదా!” అని వైరుధ్యం కలిగిన బిడ్డల ఉన్నతిని కాంక్షించే తల్లిగా ‘రంగుల రాట్నం’లో/కొడుకు ఇంట్లోనే పనిమనిషిగా పనిచేసి మానసిక వేదనను అనుభవించిన తల్లిగా ‘తాత – మనవడు’లో/ ‘బాల భారతం’లో కుంతీదేవిగా/పసివాడైన కుమారుడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు పెట్టే బాధలకు తట్టుకోలేక కన్నీరు మున్నీరయిన తల్లి పాత్రలో భక్తప్రహ్లాదలో; జీవనతరంగాలు, కన్నవారిల్లు, తల్లీ కొడుకులు, మంచి రోజులొచ్చాయి వంటి చిత్రాలలో పిల్లల క్షేమం కోసం తపించే అమ్మగా ప్రేక్షకులను కంటతడి పెట్టించే పాత్రలు ఈనాటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
‘బడి పంతులు’ చిత్రంలో పిల్లలను బాధ్యతగా పెంచిన తల్లిగా, చివరకు కొడుకులు తమని పంచుకున్నపుడు భర్త కోసం తపించిన వేదనామూర్తి అయిన భార్యగా ఆమె నటన ప్రేక్షకులను అశ్రుతప్తులను చేస్తుంది.
వీరు భర్త ఆదినారాయణరావు గారితో కలిసి అంజలీ పిక్చర్స్, చిన్ని బ్రదర్స్ బ్యానర్ల మీద అనేక చిత్రాలను నిర్మించారు. వీరి చిత్రాలన్నీ ప్రేమ, భక్తి సమ్మిళితమైనవే! ఈ చిత్రాలు “సంగీత సాహిత్య సమలంకృతే” అన్నట్లు రూపొందాయి. ఈ చిత్రాలలో నాట్యానికి కూడా ముఖ్య పాత్ర లభించింది. వీరి స్వర్ణయుగపు చిత్రాలన్నీ వీరి నటన, నాట్యాభినయాలతో సుసంపన్నమయాయి.
వీరికి వక్కలంక సరళ తొలి రోజుల్లో పాటలు పాడారు. ఆమె అంజలీదేవి గారి ‘స్వప్న సుందరి’ చిత్రం పట్ల మక్కువతో తన కుమార్తెకు స్వప్నసుందరి పేరు పెట్టుకున్నారు. అందుకు ప్రతిగా ఆ నాట్య కళాకారిణి ‘స్వప్న సుందరి’ చేత ‘మహాకవి క్షేత్రయ్య’ సినిమాలో నాట్యం చేయించి కృతజ్ఞత చూపించారు.
‘నడిగర్ తిలగం’ శివాజీ గణేశన్‌కు తను ‘పరదేశి’ చిత్రం ద్వారా తెలుగు చిత్రాలలో అరంగ్రేటం చేయించారు అంజలీదేవి. ఇందుకు కృతజ్ఞతగా ఆయన వీరు నిర్మించిన ‘భక్త తుకారాం’ చిత్రంలో ‘ఛత్రపతి శివాజీ’ పాత్రను ఎటువంటి ప్రతిఫలం తీసుకోకుండా నటించడం ఒక చారిత్రక విశేషం.
కీలుగుఱ్ఱంలో రాక్షసి పాత్ర నటించడానికి విముఖత చూపారు. అయితే నాటి అగ్ర కథానాయిక, మీర్జాపురం రాణి, నిర్మాత సి.కృష్ణవేణి తనకు పాటలు పాడాలని పట్టుబట్టారు.
అంజలీదేవి నటన కోసం కృష్ణవేణి గారు పాటలను ఆలపించడం కూడా స్వర్ణయుగపు చిత్రాలలో ఒక విశేషం. చాల చిత్రాలు విజయవంతమయినాయి. వీరు నిర్మించిన హిందీ సినిమా నిర్మాణంలో నష్టం వచ్చి ఆస్తులను పోగొట్టుకున్నారు. నమ్మకద్రోహాల వల్ల నష్టపోయారు. ఇన్‌కం టాక్స్ బాధింపులు అధికమయాయి. అయినా వాటిని ధైర్యంతో ఎదుర్కొని గుణచిత్ర నటిగా విజయం సాధించి జీవితంలో నిలదొక్కుకున్నారు.
తమిళ, తెలుగు కథానాయకులు టి.ఆర్.మహాలింగం, యం.జి.రామచంద్రన్, శివాజీ గణేషన్, జెమినీ గణేషన్, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఈలపాట రఘురామయ్య మొదలగు వారి సరసన నాయికగా రాణించారు. వారి నటనను అధిగమించారు కూడా!
50వ దశకంలో వీరికి వరసగా మద్రాస్ ఫిలిమ్ ఫాన్స్ అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి. రఘుపతి వెంకయ్య అవార్డు (1994), ‘లవకుశ’ చిత్రానికి రాష్ట్రపతి అవార్డు (1963), తమిళనాడు ప్రభుత్వ అంగ్నార్ అన్నా (2000), భారతీయ విద్యాభవన్, బెంగుళూరు (2010), అక్కినేని అవార్డు (2008), పద్మభూషణ్, బి.సరోజాదేవి జాతీయ అవార్డులు వీరిని వరించాయి.
1943లో నాటి మదరాసు గవర్నర్ సర్ ఆర్థర్ సూప్ వీరు నటించిన ‘స్ట్రీట్ సింగర్స్’ నాటికను చూసి మెచ్చుకున్నారు. బంగారు పతకాన్ని బహుమతిగా అందించారు.
వీరు దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్‍గా, నాదిగర్ సంఘం అధ్యక్షులుగా, ఆంధ్రపదేశ్ ఫిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు.
సి.పుల్లయ్య గారు వీరితో నిర్మించిన మూడు చిత్రాలలోని పాత్రలు చాల ప్రత్యేకమయినవి. వీరికి మంచి పేరు తెచ్చిన తొలి చిత్రం ‘గొల్లభామ’లో వేంప్, ‘పక్కింటి అమ్మాయి’లో హాస్యపాత్ర పేరు పొందాయి. ఇక మూడవ చిత్రం ‘లవకుశ’ ‘తెలుగువారింట సీతమ్మ తల్లి’గా గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత గ్రామాల ప్రజలు ‘సీతమ్మ తల్లీ’ అంటూ పాదాభివందనాలు చేస్తుంటే ఆనందం – ఆశ్చర్యం కలిగేవని స్వయంగా ‘అంజలీదేవే’ చెప్పుకున్నారు.
రాజేంద్రప్రసాద్, రమ్యకృష్ణలు నటించిన ‘బృందావనం’ చిత్రంలో అమ్మమ్మగా అంజలీదేవి నటన ఎంత బావుంటుందంటే…! అటువంటి అమ్మమ్మ మనకి ఉంటే బాగుండనిపిస్తుంది.
వీరి జీవితంలో ఒక విచిత్రమైన విషయం సంభవించింది. 1936వ సంవత్సరంలో జనవరి నెలలో భోగి పండుగ రోజున చెన్నపట్టణంలో అడుగు పెట్టిన అంజనీకుమారి 2014వ సంవత్సరంలో జనవరి నెల (13వ తేదీన) అదే భోగి పండుగ రోజున చెన్నైలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వారి శరీరాన్ని ‘రామచంద్ర వైద్య కళాశాల’కు అవయవ దానంగా అందించారు.
వారి వర్థంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Source: Internet